Tuesday, December 6, 2011

బాపు మొదటి బొమ్మ



1945 లో "బాల" పత్రికలో అచ్చయిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ (అయిదోఫారం) మొదటి బొమ్మ.



Sunday, December 4, 2011

దిగంతం


ఏ రోజుకి ఆ రోజు జీవితమైపోతుంది...
ఉదయం పుట్టుక...!
రాత్రి మరణం....!
ఒక రోజు
ఒక జీవితం....!

ఏ రోజు కారోజు ఒక జీవితాన్ని గడిపినట్టు గడిపెయదమేనా..? నేను జీవించలేక మరణించిన రోజులేన్ని..?మూసేసిన ఫ్యాక్టరీ నుంచి... ఓ  పబ్లిషర్స్ లో సేల్స్మెన్ కం గుమస్తా, కం నౌఖర్  కం ఎవ్రీతిన్గాన్నై....నూటాదేబ్బై రూపాయల అద్దెతో , కుంటి మూగి ముసలి తల్లి తో  మురికి కూపంలో....చావలేక..కాబట్టి చచ్చే వరకూ బ్రతకాలి కాబట్టి బ్రతుకు వెళ్ళ తీస్తూ....అవసరం అన్నిటినీ అధిగమిస్తుంది   అంటాడు.


అయిదున్నర అడుగుల ఎత్తు ,చామన ఛాయా,మొటిమల కుచ్చుల మొఖం, పొడగాటి  ముక్కు, ఈ బాహ్య సౌందర్యం చూసి ఎవరోస్తారని....పెళ్ళంటే......



బెస్టియాల్  ఇన్స్టింక్ట్ టు రిప్రోడ్యుస్ ....ప్రత్యుత్పత్తి అనంతరం  పిల్లల పెంపకం సోషల్ ఆబ్లిగేషన్ (రెస్పాన్సిబిలిటీ అని సభ సాన్ఘీకులు   మేధావులు అంటారు)...ఫ్యాకరీ లాకౌట్ ..అందర్నీ మేపాలంటే,  ఎలా...అని పెళ్లి అనే దాన్ని తన నిఘంటువు లోనుంచి తీసేసి....."నేను నా ముఖాన్ని ఎక్కడో పారేసుకున్నాను, అప్పటినించి పారేసుకున్న నా ముఖాన్ని నేనే వెదుక్కుంటూ ఫేస్ లెస్ ఫేస్ తో సంచరిస్తూ....ముందు పరిగెత్తే నేను...వెనక తరిమే మరో నేనూ...నా నేనులు వేటాడేది  వెంటాడ్తోన్నదీ, గాలిస్తున్నదీ .....ఎక్కడో కోర్కెల దొమ్మీలో...ఏవో ఆశల తొక్కిసలాటలో...పారేసుకున్న ముఖాన్నే...మనిషి ముఖాన్నే..ఎంతకీ దొరకదా ముఖం...ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా....మెరిసే రైలు పట్టాలని చూస్తూ వాటి వెంబడే చూపుల్ని పరిగేట్టిస్తూ అలా  చీకట్లోకి ....ఊరి  చివర మినుకు మినుకు మంటూ దీపాలు చుక్కలు చుక్కలుగా ..అటునున్చింకా  దీర్గంగా మలుపు తిరుగుతూ రైలుపట్టాలు అనంతంగా దిగంతం లోకి....ది..గం....తం.ఎదురుగా ఆకాశం లోకి భూమి అంతమయ్యే చోటికి పట్టాలు మలుపు తిరుగుతూ..! ఎదురుగా...దిగంతం...నా కోసమే...అందులోనే  నా అంతం..నేనే ఓ దిక్కుని ..అదే..దిగంతం అంటూ ఆ దిగంతం గురించి ఆలోచనలు.

 రోజూ అతని ఆలోచనల్లో , అతని చుట్టూ కనిపించే అవిటి ముసలి తల్లి, ఇంటి ముందు పాయిఖానా పరిమళం, సాయిబాబా బంకు, నానా గందరగోలంగా వినిపించే అయ్యప్ప భక్తీ గీతాల రోద,పక్క వీధి లోనుంచి పాల కొరకు వచ్చే మాక్సీ  యువతీ, మధ మధ్య లో అతని ఆలోచనల్లో వచ్చే మీనన్ అనే అతని ఏకయిక స్నేహితుడు,  తనతో పాటు పనిచేసీ దేవక్రుపామని,అప్పుడప్పుడూ గుర్తొచ్చే తను కోల్పోయిన  తన ముఖం , పెళ్లి వద్దనుకున్నా  కలిగే లోపలి కోరికా దాన్ని తీర్చే నాగమణి, రైల్వే స్టేషన్ ఆమ్లెట్ బండి దుర్గ, రైల్వే క్వార్టర్స్ లో కనిపించే ఓ మాక్సీ , పోయిన్నెల చూపించే క్యాలెండర్, చూరు మీద సామన్లనుంచి  కనిపించే ఓ సైకిల్ ట్యూబ్...ఇలా అతని ఆలోచనలు నిరంతరం వీటి చుట్టూ పరిబ్రమిస్తూ...ఇందులో కథ ఎక్కువగా కనిపించదు.. కథానాయకుడు ,అతడు కేంద్రంగా    అతని చుట్టూ కనపడే జీవితం గురించి  అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం.ఈ ఆలోచనల్లో ఎక్కువగా తారసపడే పాత్రలు అతని తల్లి,  నాగరత్న అనే వేశ్య.

జబ్బు పడి చనిపోయిన నాగరత్నం..అతని కోరికలకి రూపం  ..ఆమె కి నేనేమైతానని ...చని పోయిన  నాగరత్నం స్తానంలో ఇంకో నాగరత్నం..పేరు పుష్ప ..అస్సలు నేనెవర్ని అని తన్ని తానూ వెతుక్కుంటాడు అస్సలు ఎవ్వరికి  ఎవరు అని ప్రశ్నించుకుంటూ...ఏది భ్రమ ...ఏది నిజం..భూమి  ఆకాశం కలవడం..నిజమయిన అబద్దం..! మనిషీ మనిషీ కలయిక కూడా అంతే...అది దిగంత సత్యం....ప్రతీ సంబంధం  పైకి కలిసినట్టు భ్రమ కలిగించేదే..! ఈ ప్రపంచం యావత్తూ ఓ నిరంతర భ్రమ..దిగంతం  లాగున...! అంటాడు. 


ఆతను ప్రేమించే ఆరాధించే ఏకయిక భావ చిత్రం అతని తల్లి.  భావరహితంగా ఉండే ఆమెకళ్ళు, ఆ కళ్ళల్లో శూన్యం, వెరసి ఆమె అతనికి ఆమె ఒక నిశ్శబ్ద చిత్రం..నిశ్శబ్ద ప్రాకృత చిత్రం. ఏదో తెలీని గుర్తించలేని ప్రాచీనత కల్గి...విశ్వ రహస్య సూత్రాల్ని తన ముఖం ముదతల్లో దాచుకున్న ఓ మహాద్బుత చిత్రం... ఎప్పుడూ ఆమె ముఖంలో నవ్వు చూడని అతనికి ఆమె ముఖంలో నవ్వు చూడాలని ఆతను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత , ఆమె  ముఖంలో  నిర్మలమై...అరిటాకు పొట్లం లో ముద్దా  గులాబీ లాగ అమ్మ పెదవులు విచ్చుకునే ఉంటాయి . శాశ్వత హాస రేఖ అయి....పై పెదవి ఆకాశం...కింది పెదవి భూతలం...! విచ్చుకున్న విశ్వాన్తరాల  కాంతులై చిరునవ్వు...! అమ్మ చిరునవ్వు...చూడలేనను కున్న చిరునవ్వు ..ఆమె పెదవుల మధ్య కుంచించుక పోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం.  దిగంతం చీలింది.

బాధ నన్ను బాధపెట్టడం మానేస్తున్దేమోనని ఆఖరికి కొన్నాళ్ళకి, నిజమే ...బాధ కూడా నిరంతరం కొనసాగితే మొనాటనస్ గా అయిపోయి నిర్వికారంగా   .....


ఇది రోజూ వచ్చే రాతిరే...ఇది నిన్నటి రేయి...రేపు కూడా వచ్చునోయీ...ఇది నిత్య నూతన యామిని...మరి సౌదామిని? అస్సలు వచ్చునా అని?

 నేను , జీవితం  రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికి కలవని పాత్రల ద్వారా నాయకుడి జీవితపు బండి దొర్లిపోతుంది. ఈ నవల ద్వారా రచయితా చెప్పదల్చుకున్నది "నేను" ప్రధానం, తతిమ్మ సంబందాలన్నీ మన జీవితపు బండి నడవడానికుపకరించేవే.


ఆలోచన పుట్టినప్పుడే నాకీ లోకం పుట్టింది. ఈ లోకం తోటే జీవితం  పుట్టింది, జీవితమే నేను అంటే ఆలోచనే నేనన్నమాట. అంటే ఈ యవత్ప్రపంచామూ, దాంతోటి జీవితమూ,అందులో నేనూ...అన్నీ..అన్నీ కలిపి ఈ బుర్ర్రలో  ఉన్నాయన్నమాట.దేన్నించి ఎవర్నించి పారిపొయినా ఆలోచన్నించీ మనిషి పారిపోలేదు కదా..! ఆలోచనంటే తనే...! తననించి తానూ పారిపోవటం సాధ్యం కాక మనిషి మల్లగుల్లాలు పది సంఘం అనబడే గుంపై, అన్నిటినీ వ్యవస్తీకరించుకున్నదేమో.




ఇలా ఎన్నో ...ఎన్నెన్నో... ఆలోచనల స్రవంతి...అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం. మొదలుపెట్టిన దగ్గర్నించి  చివరి పేజీ వరకు మనల్ని ఆపకుండా  చదివించే  కాశిబట్ల వేణుగోపాల్ నవల " దిగంతం"

Wednesday, October 5, 2011

నిలువు చెంబు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి





విశాలాంధ్ర లో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే అనుకోకుండా నా చేయి తాకి ఓ పెద్దాయన క్రింద పడి పోయాడు.  అయ్యో క్షమించండీ అంటూ లేపి నా మానాన నేను పోదామని , ఎందుకైనా మంచిదని ఎవరా అని చూశా...శ్రీపాద వారు. పెద్దాయన కదా వీరితో మనకెందుకులే అని ఓ నమస్కారం పెట్టుకొన్నా. శ్రీపాద వారి గురించి విన్నవి , చదివినవి ఓ సారి మనసులో మెదిలాయి. వారి కథల నేపద్యం "గోదావరీ తీరం", పాత్రలు ఎక్కువగా శ్రోత్రీయ బ్రాహ్మణులూ అదే కాకుండా ఎక్కువగా వితంతు వివాహాలు , మూడాచార   నిరసనలు, సాంసారిక జీవితంలో మాధుర్యం, స్త్రీ స్వాతంత్రం, అంటరాని తనం మొదలగు కథా వస్తువులతో కథలు రాశాడని, భాష విషయంలో వ్యావహారిక భాషను, నుడికారానికి పట్టాభి షేకం చేసిన మహానుభావుడని అన్నీ గుర్తొచ్చాయి. ఇంత పెద్దాయన కదా ఓ సారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయ భాగ్యం చేసుకుంటే ఎలా ఉంటుంది.  మనకు కొరుకుడు పడతారా లేదా అనే  అనుమానం తో ధైర్యం చేసి వారి ని తీసుకొని వారి " నిలువు చెంబు" నా చేత పట్టుకొని ఇంటికి చేరా. ఇంటికెళ్ళగానే ఆ " నిలువు చెంబులో " ఏముందో అని చూశా.  నీళ్ళు అనుకున్నా కాదు...తేనే..అమృతం   ఆ అమృతం లోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మీకు కూడా కొంత పంచుదామని ఈ చిన్న ప్రయత్నం....ఆస్వాదించండి మరి. ఈ నిలువు చెంబు లో మొత్తం 8 కథలున్నాయి.

ప్రణయ తపస్సు: వితంతు వివాహం గురించి సాగే కథ. ఓ బైరాగి నలబై  ఏళ్ల కు పైగా , తను పెళ్లి చేసుకుందామని అనుకున్న  బాల వితంతువు అనుకోని పరిణామాల వల్ల  చనిపోతే ఆమె తండ్రి ఆమెకు కట్టించిన సమాధి  మండపం పై చేసే ప్రణయ తపస్సు ఈ కథ. నలభై ఏళ్ల క్రింద జరిగిన విషయాలు ఆ బైరాగి మనకు చెప్పడమే ఈ కథ. 

కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
ప్రణయ భంగము: ఇది కూడ ఒక బ్రాహ్మణ బాల వితంతువు కథ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త ను తల్లిని కూడా పోగొట్టుకొన్న యువతి కథ. దుక్కమే   తోడూ , నీడ, జీవం, ధైర్యం,సకలం అలా రూపొందిన  దుక్కమై పోతుంది. తండ్రి వితంతువైనా సరే లోకాన్ని ఎదిరించి పెళ్లి చేస్తా అంటాడు. తనూ సంతోషించి ఎదురింట్లో  ఉన్న బ్రాహ్మన్ని కోరుకుంటుంది. అతడు భార్య చని పోయి ఒక భోగం దాని ని  ఉంచుకుంటాడు. నా శరీరం చెడిపోయింది అని ఒప్పుకోడు. తర్వాత ఈమె తండ్రి అనుమతితో అతనికి సేవ చేస్తుండగా అనుకోని పరిస్తితులలో పరిస్థితి విషమించి అతడు చనిపోతాడు. ఇంతజరిగాక సంసారం లో ఏముందని ఆ జగన్మాతని ఆశ్రయించడం ఈ కథా  సారాంశం.

వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి  మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా  మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.

నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.

ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో   సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.

అశ్వ  హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత. 

బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం  అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.

శ్రీపాద గారు మొదటి కథ లో అన్నట్లు " అప్పటి రుచులు వెఱూ , ఇప్పటి రుచులు వెఱూను?  అప్పటి ధర్మాలు వెఱూ ఇప్పటి ధర్మాలు వెఱూను.అప్పటి యువకుల సంకల్పాలు వెఱూ ఇప్పటి వారి సంకల్పాలు వెఱూను. అప్పటికీ ఇప్పటికి ఏతాం పట్టంత తేడ వుంది. అప్పటి కథలు అర్థం చేసుకోవాలంటే ముందు హృదయాన్ని  అప్పటి కాలంలో ప్రవేశ పెట్టాలి. లేకపోతె విన్నా లాభం లేదు".


Sunday, September 4, 2011

అక్షర యాత్ర - నండూరి కి నివాళి



నండూరి రాం మోహన్ రావు గారి మరణం వార్త వినగానే, నేను చదివిన నండూరి వారి "అక్షర యాత్ర" గుర్తొచ్చింది. వారి గురించి రాసేంత వాణ్ని కాదు కానీ. నేను  చదివిన ఆ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ పుస్తకం 70  వ్యాసాల సంపుటి. వారి మాటల్లో చెప్పాలంటే " ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువ భాగం నేను అభిమానించే సాహితీ మూర్తులు, మిగిలిన శాతం నా అభిమాన గాయకులు , చిత్ర కారులూ, నటులు మొదలయిన వారు,  ...అన్నీ కలిపి ఈ సంకలనం ఒక పెద్ద కలగూర గంప. రక రకాల రంగు రంగుల పూల కదంబం." ఇందులోని వన్నీ పత్రిక రచనలే. " ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు, నిలువుటద్దం  లాంటి సంకలనం అన్న నండూరి మాటలు గమనార్హం. ఈ వ్యాసాల్లో ఎన్నో రకాల వ్యక్తులు. కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నంతగా  విభిన్న వస్తువులపై వ్యాసాలు రాశారు.ఇందులోని వ్యాసాలను వివిధ రకాలుగా వర్గీకరించారు, అవేంటంటే " స్మృతిపథం", "ప్రతిభా పరిమళాలు", మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూర తీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞ్యాపకాల నీడలు

స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17  ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ  శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12  వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై  5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10  వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.

పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నట్లు నండూరి వారు వ్యాసాలకు పేరు పెట్టడం లోనే ఎంతో  శ్రద్ధ , నైపుణ్యం కనపరిచారు.

వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు  చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు..  శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ?  శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23  ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం  కాకుండా ఉంటాడా.

ఇలా కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నట్లున్న ఈ వ్యాస సంపుటి మళ్ళీ ఒక సారి చదువుతూ నండూరి కి నివాళి అర్పిస్తున్నాను.




Friday, September 2, 2011

తెలుగుకు వెలుగు


తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం  పొందడం ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది.  ఈ సభ్యత్వం  తో ఇంటర్నెట్ తెలుగు లిపి లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లిపిని రూపొందిస్తారు.  కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు  రూపొందిస్తారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో  తెలుగు సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే  కాకుండా తప్పులు దొర్లితే వెంటనే పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.  తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం మనందరికీ శుభవార్త.

Monday, August 15, 2011

హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!



(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)

గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!

పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో

'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ  లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్ 
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!

పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !
 





Monday, August 8, 2011

వంశీ కవితలు



నెట్లో ఏదో వెదుకుతుంటే కనపడ్డ వంశీ కవితలు......






Sunday, July 24, 2011

నాదయిన సమస్యలు (శారద మనోగతం)


ఆలూరి భుజంగ రావ్ రాసిన "సాహిత్య బాటసారి - శారద "  లో   నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదని ఎంతో వేదన తో రాసిన శారద  మనోగతం మీ కోసం ...

"నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని, కాని హోటల్ చాకిరీ తప్పదు, చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు. పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను. అదీ సాధ్యం కావటం లేదు. తెలుగు మాత్రు భాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ, రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపికా లేదు. ఏ పున్యాత్ముడయిన  ఇస్తాడనుకుందాం. కోరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పని వాళ్లకి తెనాలి లో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన వచ్చిందో తెలియదు గానీ, నాతొ సహా నూటికి తొంబయి అయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణం లో చదువెక్కడ, రాత ఎక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తుంది కానీ, అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు లేబర్ ఆఫీస్ ఉంది. ఓ లేబర్ ఆఫీసరూ ఉన్నాడు.

హోటల్ సర్వరు కి చదువు ఎందుకు అనే పెద్దమనుషులూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరయిన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరుగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ  ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పయిగా ఈ ఉద్యోగం ఊడిపోవటం, రోజుల తరబడి పస్తులున్డటం జరిగింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుంది అనడంలో సంశయమేమి లేనప్పుడు మిగిలి ఉన్న జీవిత కాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తుంది. స్వతంత్రం వచ్చాక  ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం నా జీవిత ప్రయాణం వెనకటికన్న నూటికి ఇరవై పాల్లన్నా పెరుగుతున్దనుకున్నాను.

పత్రికల వారు  కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్చల రోగాన్ని నయం చేసుకోవడానికన్న సరిపోతాయేమో అని సంతోషించాను. అదీ వట్టిదయిపోయింది. ఈ పద్దతిలో  నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ  లేదనుకుంటాను.
( ఇది :తెలుగు స్వతంత్ర లో ఫిబ్రవరి 18 , 1949 లో ప్రచురితమయ్యింది)

సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)


ఎక్కడో తమిళ దేశం లో జన్మించి, చిన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం తెనాలి వచ్చి పొట్ట నింపుకోవడానికి హోటల్ సర్వర్ గా పని చేస్తూ, తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసి ౩౦ సం.ల చిన్న వయస్సులో ఫిట్స్ వ్యాధి తో మృత్యు వాత పడిన " శారద"  జీవితం గురించి ఎన్నో విషయాలు ఆనాటి తెనాలి లో శారద తో సన్నిహితంగా ఉన్న సహచరుడయిన శ్రీ ఆలూరి భుజంగ రావ్ గారు "సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)" స్మృతి శకలాలు పేరిట మనకందించారు.ఎందరో తమ కీర్తి, తమ రచనకు ప్రాచుర్యమూ కలగాలన్న కోరికతో శారద జీవితానికి చిలువలు, పలువలూ కల్పిస్తారన్న భయం కల్గి , ఆనాటి జీవిత పరిస్తితుల్ని వ్రాసి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రచన చేసినట్టుగా భుజంగ రావ్ గారు తన ముందు మాటలో తెలిపారు.



1937  లో మద్రాసులో బతకలేక వ్రుద్దుడయిన తన తండ్రి ని తీసుకొని నటరాజన్ తన పన్నెండేళ్ళ వయసులో ఆంధ్రా ప్యారిస్ తెనాలి లో అడుగు పెట్టి తన బావ అయిన భీమారావ్ హోటల్లో పనికి కుదిరి ప్రతిపలంగా ఇచ్చే పావులో-ఆర్తో సంపాదనతో ఓ చిన్న వూరింటిని అద్దెకు తీసుకొని తెనాలి లో తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికి అతనికి తమిళ సాహిత్యంతో పరిచయముంది. ఇక్కడ తెనాలి తో తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్తితి వచ్చి తెలుగు నేర్చుకొన్నాడు.రోజుకు పదహారు గంటలు అతి దుర్భరమయిన హోటల్ చాకిరీ చేస్తూ సాహిత్యం వైపు ఆకర్షితులయినాడు. 1946 లో ప్రజాశక్తి లో "ఎస్.నటరాజన్ " పేరిట " ప్రపంచానికి జబ్బు చేసింది" అన్న ఓ వ్యంగ్య రచన ప్రచురితమయ్యింది. ఇదే అతడి అచ్చయిన మొదటి రచన. మిత్రులతో కలిసి "ప్రజావాణి" అనే రాత పత్రిక ను ప్రారంభించాడు. 1946 -47 లలో  నటరాజన్ తన సాహిత్య పరిజ్ఞ్యానాన్ని విషయ పరిజ్ఞ్యానాన్ని పెంచుకొన్నాడు. అదే రోజుల్లో ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరి తెనాలి లో "జ్యోతి" అనే పక్ష పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక కారణంగా తెనాలి ఓ సాహిత్య కేంద్రంగా వెలసిన్దంటారు.అంతక్రితమే చక్రపాణి "యువ" కూడా తెనాలి నుంచే ప్రారంభించారు.1948  సం.జనవరి ౩౦ వ తారీకు జ్యోతి పత్రికలో " గొప్పవాడి భార్య" అనే ఒక వ్యంగ్య రచన శారద పేరున అచ్చయ్యింది, శారద పేరున అచ్చయిన మొదటి రచన ఇదే. నటరాజన్ సహజంగా సౌందర్యోపాసట అందుకే "శారద" అన్న మూడక్షరాల స్త్రీ నామం తనకు నచ్చి దాన్నే కలం పేరుగా పెట్టుకొన్నాడట. అక్కడి నించి శారద శర పరంపరలుగా రచించాడు. తను చూచిన ఎందరో అభాగ్యజీవుల్ని , దురాశాపరుల్నీ తన సాహిత్యంలో చిరస్మరనీయంగా చిత్రించాడు. ఇలా  సుమారు ఓ వంద కథలూ, కొన్ని నవలలూ రాశాడు. అతని కథలు విరివిగా ప్రచురితమయ్యి  పేరు సంపాదించే రోజుల్లో కూడా పొట్ట పోసుకోవతందుకు బస్ స్టాండ్లో పాత పుస్తకాలూ , చల్లని మజ్జిగా అమ్మే వాడు.ఇలా చివరి క్షణం వరకూ కష్టపడే బ్రతికాడు. కస్టపడి బ్రతికే మానవుల జీవితాల్ని తన రచనల్లో చిత్రించాడు.

 కథ గురించి శారద ఎం చెప్పాడట అంటే " కథకుడు ఎ చిత్రాన్నయినా సమగ్రంగా చిత్రించాలి, కథ చెప్పడంకూడదు, కథని కెమెరా సినిమాని చూపించినట్లు  చూపించాలనేవాడు.కథ చెప్పడం నాయనమ్మ పని అని , రచయిత తన ఆదర్శాన్ని ఊక దంపుడు ఉపన్యాసంగా చెప్పడాన్ని అంగీకరించేవాడు కాదు.కథలలో గానీ, నవలలో గానీ మనం చెప్పదలచుకున్న ఆదర్శం పూసలలో దారంలా ఉండాలంటాడు . కథ సాంతం చదివేసరికి పాటకుడు మన ఆదర్శాన్ని అంగీకరించే స్థితి కి రావాలంటాడు.ఆదర్శాన్ని విడిగా చెప్పడం అతడికి నచ్చదు. కథాకతనంలోనే తానూ చెప్పదల్చుకున్నది ఇమిడి ఉండాలి , ఆదర్శామూ రావాలి అనేవాడట.  

ఇలా  తెనాలి లో అడుగుపెట్టి హోటల్ వర్కర్ గా పనిచేస్తూ పర భాష అయిన తెలుగు నేర్చుకొని ఆకలి, దారిద్ర్యం ,కన్నీళ్ళ గురించి  తన కలం నుంచి ఎన్నో రచనలు చేస్తూ  , తండ్రి మరణంతో వచ్చిన మూర్చ వ్యాధి జీవితాంతం వెన్నంటి చివరికి ఆ మూర్చ తోనే జీవితం ముగించిన శారద జీవితం గురించి ఎన్నో విషయాలు, శారద వ్యక్తిత్వం గురించి , రచయిత ఈ రచనలో మనతో పంచుకుంటారు. శారద జీవితం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.

రచయిత: ఆలూరి భుజంగ రావు.
ప్రచురణ: చైతన్య వేదిక- తెనాలి
వెల      : రూ. ౩౦.౦౦ 

Tuesday, May 31, 2011

ఈ సమస్యకి పరష్కారం ఏంటి?




ఓ నాల్గు రోజులక్రింద నా ముందు నా సీట్లో పనిచేసిన నా ప్రేడిసెస్సర్ నుండి నాకి ఫోన్ కాల్.  సారాంశమేమిటంటే అతనిక్కడ ఉన్నప్పుడు ఇక్కడే మా వద్ద పని జేసే ఓ ఉద్యోగి తన లేడి కొలీగ్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ భార్యని , ఇంటిని పట్టిచ్చుకోవట్లేదు, న్యాయం చెయ్యండి అని ఆ ఉద్యోగి భార్య వచ్చింది , అని అయితే ఇది వ్యక్తిగతమయిన గొడవ, మేమేమి చెయ్యలేమమ్మ అంటే మీరలా అంటే ఈ ఆఫ్ఫిస్ ముందే నేను చచ్చిపోతాను అందట. అప్పుడు ఇదే  విషయం మెన్షన్ చేస్తూ ఓ పోలీసు కంప్లేంట్ ఇచ్చారట. ఇక్కడేమన్న చేసుకుంటే మనం జవాబుదారి కావాల్సి వస్తుంది, చెప్పినా ఏమి పట్టిచ్చుకోలేదు  అంటారు అనే ఉద్దేశం తో.  పోలీసు వాళ్ళుపిలిపించి కౌన్సెలింగ్ చేద్దమనుకుంటే, బయట ఏమయ్యిందో ఏమో తెలియదు కాని, అప్పటికి ఆ సమస్య అక్కడితో ఆగి పోయింది. చివరికి చెప్పిందేమిటంటే ఆమె మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఏమి చెప్తుందో వినండి  అని.  నేనన్నాను మీరన్నట్టు ఇది వ్యక్తిగతమయిన గొడవ, దీంట్లో మనమెలా కల్పించుకుంటాం. అప్పుడు ఆయన, నిజమే, మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆమె ఇంతకుముందు అన్నట్లు ఆమె మన ఆఫీసు లో గాని లేదా ఆఫీసు ముందు గాని ఎమన్నా చేసుకుంటే మనకే సమస్య కదా, ఆమె  మనకేమన్న ఫిర్యాదు చేస్తే అతని పై చర్య తీసుకుంటాం అని చెప్పండి, ఉద్యోగం పోతుందేమో అని  సరిగా ఉంటాడని వాళ్ళ ఉద్దేశం,  అంటే సరే రమ్మనండి , మాట్లాడతాను అని అన్నాను. తెల్ల వారి నేను ఆఫీసు లో ఉండగా ఆమె వచ్చింది. రాగానే    ఏడుస్తూ వేగంగా వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని వదల కుండా ఏడుస్తూ మీరే నాకు న్యాయం చెయ్యాలి అంటూంటే, నేను కంగారు పడి చివరికి ఆమెను కూర్చోపెట్టి , ఓ గ్లాసు మంచినీళ్ళు  తాగించి, కొంత స్తిమితపడ్డాక, చెప్పమ్మా , నీ సమస్య ఏంటి అన్నాను. ఆమె సమస్య ఆమె మాటల్లో.......................

భార్య మాటల్లో.........

మా వివాహం అయి  పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది. మాకు ఇద్దరు మొగ పిల్లలు. ఇద్దరూ హాస్టల్లో ఉంటారు. అతను నన్ను సరిగా చూసుకోవట్లేదు. నన్ను నా పిల్లల్ని  పట్టిచ్చుకోవట్లేదు. ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదు. ఓ ఏడెనిమిది నెల్ల క్రింద నుండి, ఆఫీసు లో ఉండే రమ (పేరు మార్చాను) తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏందని అడిగితె తాగి వచ్చి నన్ను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నాడు. చివరికి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది, నా ఆరోగ్యం చెడి పోతుంది. సెలవు రోజు పొద్దున్నే బయటికి పోతాడు. ఎలా ఉన్నదాన్ని ఎలా అయ్యానో చూడండి ( అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పాతది చూయించింది) ,ఇంట్లో టిఫిన్ కూడా చెయ్యడు, అన్నం తినడు ,ఎక్కడికి అంటే ఇప్పుడే వస్తాను అని వెళ్లి ఓ రాత్రి వరకు రాడు. రోజూ కూడా ఎ అర్ద రాత్రో వస్తాడు. నాతొ మాట్లాడడు . ఎందుకిలా అంటే కొడతాడు. ఈ మధ్య ఫ్రెండ్స్ తో శ్రీశైలం పోతున్న అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ని తెలుసుకుంటే అవును అన్నాడు. సరేలే ఫ్రెండ్స్ తో కదా అనుకున్న. అక్కడ ఉండగా ఫోన్ చేస్తే, ఫోన్లో ఆడవాళ్ళ గొంతులు, పిల్లల గొంతులు వినపడ్డాయి. ఇక్కడ విచారిస్తే అందరూ కుటుంబాల తో వెళ్లారు. అని. అది కూడా లీవ్ పెట్టింది, అంటే ఈనే దాని తో వెళ్ళాడు. వచ్చాక అడిగితె, నా ఇష్టం నువ్వేమన్నా సంపాయించు తున్నావ, ఉద్యోగం చేస్తున్నావా  అని మళ్ళీ కొట్టాడు. ఇంకోసారి ఇంటికి ఇంకా రాలేదని వెళ్లి ఆ రాత్రి విచారిస్తే , దానింట్లో ఇద్దరూ నగ్నంగా దొరికారు. గొడవ చేసి వచ్చా. ఆ తర్వాత రూం ఖాళీ చేసి ఇంకో చోట ఉంటుందట.  అది భర్త చనిపోతే , అది కూడా ఈ అక్రమ సంబందాల వల్లే , భర్త ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేస్తూ ఇలా వెలగ పెడ్తూంది. ఇతనితో కాక ఇంకో ఇద్దరి ముగ్గురితో కూడా సంబంధం ఉంది అని తెలిసింది. ఈయనేమో నా ఇష్టం అంటాడు.  

నా అన్నలు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నాకు దగ్గరి వాళ్ళు ఎవ్వరూ లేరు. మా మామయ్యా కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నీ కొడుకిలా చేస్తున్నాడు అని చెబ్తే, వాడు మగాడు, వాడిష్టం, పడి ఉండాలి అన్నాడు. నాకు  ఎవ్వరూ లేరు. ఆఫీస్ లో తెలిసిన పెద్ద మనుషులు చెప్పినా వినట్లేదు. ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఎంత సేపూ దాని చుట్టూ తిరుగుతున్నాడు. నేను గొడవ పెట్టి వచ్చిన తర్వాత , అది తల్లిని తీసుకొని నా ఇంటి మీదకు వచ్చింది. నా ఇల్లు ఖాళీ చేయించావు, నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి , ఇక్కడే ఉంటాను అని గొడవ పెట్టింది. అప్పుడు ఈయన ఇంట్లోనే ఉన్నాడు. నేను ధైర్యం చేసి బాగానే గొడవ పెట్టుకున్నాను. నీ మొగుడు  నా దగ్గరికి వస్తే నన్నేం చేయమంటావ్, నీకు దమ్ముంటే వాణ్ని రాకుండా ఆపుకో, నా ఇష్టం, అని గొడవ పడింది, బాగా గొడవ పెట్టి మొత్తానికి దాన్ని వెల్లగోట్టాను. అది పోయిన తర్వాత నన్ను బాగా కొట్టాడు.

 మీకంటే ముందు ఉన్న సార్ దగ్గరికి వచ్చి చెబ్తే, పోలిస్ కంప్లేంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు రమ్మన్నారు.కౌన్సెలింగ్  చేయటందుకు, అందరూ అన్నారు,   అతని ఉద్యోగం పోతుంది రోడ్డున పడతాడు అని, ఉన్న ఉద్యోగం పొతే పిల్లలు, కుటుంబం ఎట్లా అని ఆలోచించి, దగ్గరి పెద్ద వాళ్ళు చెప్పినట్లు, అతను మంచిగా ఉంటానంటే అక్కడికి వెళ్లలే. నా భర్త ఏమి చేశాడో ఏమో గాని, చివరికి వాళ్ళు నన్నే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా  అన్నావు అని కేస్ పెడతాం అని బెదిరించారు. భయపడి మంచిగా ఉంటానన్నాడు కదా అని అప్పుడు ఊరుకున్న. నా కొడుకు నవోదయలో చదువుతాడు, వాడి మార్కుల ను బట్టి హర్యానా లో సీట్ వచ్చింది, పంపియ్యాలంటే బయమవుతుంది, ఇక్కడ నాకు ఎమన్నా అయితే ఎలా అని. ఇప్పుడు అతనిలో ఏమీ మార్పు లేదు. ఇప్పటికి అలానే ఉన్నాడు. నాకు న్యాయం చెయ్యండి, మీరే ఏదయినా చేయండి, లేకపోతె నేను బ్రతకను, చచ్చిపోతాను.నా పిల్లలు అన్యాయమైపోతారు. మీరు  పిలిపించి మాట్లాడండీ. ఉద్యోగం పోతుందని చెప్పండి. మీరే నాకు దిక్కు , ఏదయినా చెయ్యండి. అతనిపై కేస్ పెడదామంటే  ఉద్యోగం పోతుంది, రోడ్డున పడతాం, పిల్లలు అన్యాయమైపోతారు,  ఉద్యోగం పొతే బ్రతకడం ఎలాగా, ఎలా అయినా అతన్ని మార్చండి. 

భర్త చెప్పింది  తర్వాతి టపాలో.........

Thursday, May 26, 2011

వర్గల్ - శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయము




అందరికి సరస్వతి దేవాలయం అనగానే " బాసర" గుర్తొస్తుంది. మీకిప్పుడు ఇంకో సరస్వతి దేవాలయం గురించి పరిచయం చేస్తాను. ఇదే "శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయము ".  ఇది హైదరాబాద్ నకు సుమారు 45  కి.మీ. దూరములో రాజీవ్ రాహదారి పై , కరీంనగర్ వెళ్ళు దారిలో , మెదక్ జిల్లా నందు వర్గల్ అను ఊళ్ళో (మండలం) కలదు.  రాజీవ్ రహదారి పై వర్గల్ x  రోడ్ నుండి ఈ  ఆలయం సుమారు ౩ కి.మీ. దూరం లో ఓ చిన్న గుట్టపై ఉంది. గుట్టపై చాలా ప్రశాంత మయిన వాతావరణంలో నిర్మిపబడిన ఆలయం కనులకు విందుగా ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయం కాకుండా, లక్ష్మీ  సమేత గణపతి ఆలయం, శని దేవాలయం కూడా ఒకే ప్రాంగణం లో కలవు. హైదరాబాద్ కి దగ్గరగా ఉండుట వల్ల  , సెలవు రోజులలో ,ముఖ్యంగా ఆదివారాలు ఇక్కడ రద్దీగా ఉంటుందట. మిగతా రోజుల్లో అంతగా రద్దీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నట్లు ఇక్కడ బస చేయాలనుకునే  వాళ్ళ కొరకు వసతి గదులు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం గురించి , అక్కడ ఉద్యోగులను విచారించగా, శ్రీ చంద్ర శేకర శర్మ అనబడే సిద్దాంతి ( ఇతను రైల్వే లో ఉద్యోగ విరమణ చేశారట) గారి కల్లో కి అమ్మవారు వచ్చి ఈ ప్రదేశం లో ఆలయం నిర్మింప జేయమని చెప్పారట. అప్పుడు వారు 1992  లో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని దీన్ని అభివృద్ధి చేశారట. ఈ ఆలయం ఇప్పుడు కంచి కామకోటి పీటం వారి ఆధ్యర్యంలో ఉంది. ఇంకా ఆలయ పూజారులు తెలియజేసిన ప్రకారం, గత నాలుగేళ్ళుగా ఈ ఆలయం  గురించి జనం  లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే భక్తులు ఎక్కువయ్యారట. ఇక్కడ అక్షరాభ్యాసం, ఇంకా అనేక రకాల పూజలు చేస్తారు.  ముఖ్యంగా రాత్రి ఆలయం మూసివేసే ముందు అమ్మవారికి అయిదు హారతులతో చేసే హారతి చూడవలసిందే, మాటల్లో చెప్పలేము. ఇది తప్పకుండా దర్శించవలసిన ఆలయం.  మీ కొరకు ఆలయ చిత్రాలు చూడండి. ఈ ఆలయం వెబ్సైట్ " www.srivargalvidyasaraswathi.org" . మెయిల్ అడ్రస్ " info@srivargalvidyasaraswathi.org".











Monday, May 23, 2011

రక్త దానం


నిన్న ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీ ఆఫీస్ లో చూసిన ఈ పోస్టర్ ఎందుకో నా మనసుకు నచ్చింది.  అమాయకంగా ఆ అబ్బాయి " Some one donated blood..That saved my life..Was it  you " అని అడుగుతున్నట్లున్న ఆ పోస్టర్ ఎందుకనో మనసుకు అలా హత్తుకుపోయింది. మీరూ చూడండి. ఈ రోజుల్లో రక్తదానం కూడా వ్యాపారం అయ్యింది. ఎప్పుడయినా , ఎక్కడయినా అవకాశమొస్తే వెంబడే  ఆలోచించకుండా రక్తదానం చేద్దాం. ఒక ప్రాణం రక్షించిన వాళ్ళల్లో మనమూ ఒకళ్లమవుదాం. ఏమంటారు!


Friday, April 8, 2011

అడోనిస్ - వీనస్



లైలా-మజ్నూ, దేవదాసు-పార్వతి, ఇలా ఎన్నో జంట పేర్లు. అవి నిర్మలమైన ప్రేమను అజరామరం చేశాయి. మన దేశంలోనే కాదు, విదేశాలలో సైతం ఇటువంటి జంట పేర్లు అనేకం. రోమన్ ఇతిహాసంలో ఇటువంటి ప్రేమ కథ ఒకటుంది. అది  "అడోనిస్-వీనస్". వీనస్ శృంగార దేవత. ఆమె ప్రియుడైన అడోనిస్ వేటగాడు. అతడొకనాడు వేటకు వెళ్లి మరణిస్తాడు. అతను వేటకు వెళ్లక ముందే వీనస్ మనస్సు కీడును శంకిస్తుంది. వేటకు వెళ్ళవద్దని అతన్ని పదే పదే వేడుకుంటుంది. అతని మరణానంతరం వీనస్ ప్రేమను మెచ్చిన దేవుడు అడోనిస్ ను సంవత్సరానికి ఆరు నెలలపాటు జీవించి ఉండేలా అనుగ్రహిస్తాడు. సగం విషాదం, సగం సుఖాంతమైన ఈ కథ పాశ్చాత్య సాహిత్యంలో, కళలో ప్రముఖ స్థానం వహించింది. పాశ్చాత్య క్లాసికల్ సిద్దాంత ధోరణిలో ఎంతో మంది తమ చిత్రాలలో ఈ అమర ప్రేమను చిత్రించి, ఆ ప్రేమజంటకు అమరత్వం సిద్ధింప జేసినారు. ఈ కథా వస్తువు ఆధారంగా  ఆంటానియో కనోవా శిల్పించిన చిత్రమిది. ఈ ప్రేమ కథను మలుపు తిప్పిన సంఘటనలో ఎంతో నాటకీయత ఉన్నా, దాన్ని సున్నితంగా మలచిన తీరు రసమయంగా ఉంటుంది. వీనస్ తన ప్రియున్ని గోముగా వేటకు వెళ్ళవద్దని అభ్యర్తిస్తుంది. అతను అంటే ప్రేమతో ఆమె అభ్యర్థనను నిరాకరించడం కనోవా లాలిత్యం తో మలిచాడు. సున్నితమైన భావప్రకటన కనోవా ప్రత్యేకత. ఇదీ అతనిని శిల్పిగా మైఖలాన్జిలో తరువాత స్థానంలో నిలబెట్టింది.

ఆంటానియో కనోవా ఇటలీ దేశంలోని పోసాగ్నో అన్నచోట 1757  వ సంవత్సరంలో జన్మించాడు. 1768  వ సంవత్సరం నాటికి పదేళ్ళు నిండి, శరీర ధారుడ్యం సంతరిన్చుకున్తున్నప్పుడే కష్ట సాధ్యమైన శిల్ప నిర్మాణంపై ఆసక్తి పెంచుకొని, దానిని వెనిస్ నగరంలో అధ్యయనం చేశాడు. ప్రప్రథమంగా తన పదిహేడవ ఏట (1744 ) తన తొలి శిల్పం "పండ్ల బుట్ట"ను ప్రదర్శించి ప్రపంచాన్ని అబ్బుర పరచాడు. ఆ విజయం అతన్ని వెనిస్ నగరాన్ని వదలి నేపుల్స్, రోం నగరాలకు తరలేలా చేసింది.
( మిసిమి మాస పత్రిక సౌజన్యం తో )

Thursday, April 7, 2011

" చేరా ! ఆత్మీకృత సుస్మేరా"




ఆచార్య చేకూరి రామా రావు గారు సుప్రసిద్ధ పండితులు, భాషా శాస్త్రవేత్తలు. వీరు చేరా  అని ఆధునిక తెలుగు సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. చేరా గారు మరియు కోవెల సంపత్కుమారాచార్య గారు గొప్ప స్నేహితులు. చేరా రచించిన కొన్ని వ్యాసాల్ని " రించోళి" పేరుతొ ఒక సంకలనంగా వెలువరిస్తూ సంపత్కుమరాచార్యను ముందు మాట రాయమన్నారట. ఎలా రాయాలా అని ఆలోచిస్తున్న సమయంలో సంపత్కుమార మదిలో " చేరా ! ఆత్మీకృత సుస్మేరా" అన్న ఒక చరణం పదే పదే ధ్వనిన్చిందట - అంతే ఆయన గొంతు లోంచి " చేరా ! ఆత్మీకృత సుస్మేరా" అన్న కంద పద్యం అప్రయత్నంగా వెలువడిందట. అప్పుడాయనకు " చేరా" అన్నమాటను మకుటం చేసుకొని ఓ వంద పద్యాలను రాసి చేరాకు ఆయన 70  వ జన్మదినం సందర్భంగా కానుకగా సమర్పించాలన్న భావం కల్గిందట - వెంటనే ఆయన

                 " చేరా! ఆత్మీకృత సుస్మేరా
                    మైత్రీ విచిత్ర మ్రుదుతాదారా
                    వారిత దురహంకార విచారా!
                    బందురవచో విసారా! చేరా!      
  

 అన్న పద్యంతో మొదలెట్టి 120  పద్యాల్ని రాసేసి " చేరాకు ఒక శతమానం" అన్న పేరుతొ వాటిని పుస్తంకంగా ప్రచురించి చేరాకు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా కానుకగా సమర్పించారట. సంపత్కుమారాచార్య  గారు " చేరా" అన్న సంక్షిప్త నామం లాగే తెలుగు సాహిత్యంలోని కొందరు లబ్ద ప్రతిష్టుల పేర్లను మొదటి రెండక్షరాలతో చిత్రంగా సంక్షిప్తం చేసి రాసిన పద్యం చూడండి. 

                    " రారా, కారా, బూరా
                      సేరా, బేరా, తిరా, వసీరా, నారా
                      కోరా, తారా, కేరా
                      ఈ రాంతులతో వేగుటేట్లా చేరా"


ఈ పద్యం లోని "రారా" అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి అని, "కారా" అంటే కాశీపట్నం రామారావు అని, "బూరా" అంటే బూదరాజు రాధాకృష్ణ అనీ, "సీరా" అంటే పొట్లపల్లి సీతారావనీ, "బేరా" అంటే బేతవోలు రామబ్రహ్మం అనీ, "తిరా"  అంటే తిరుమల రామచంద్ర అనీ, " వసీరా" అంటే వక్కలంక సీతా  రామారావనీ  , "నారా" అంటే వెల్చేరు నారాయణ రావనీ, "కోరా" అంటే కోదాడ రామకృష్ణయ్య అనీ, "తారా" అంటే తాళ్ళూరి రామానుజస్వామి అనీ, "కేరా" అంటే కే. రామలక్ష్మి అనీ ఈ పద్యం కింద సంపత్కుమార  వివరణ కూడా ఇచ్చారట.

చేరా ఒక పత్రికలో చేరాతలు అని ఒక కాలం రాసేవారు. కొన్ని విమర్శలతో కొంత కాలం తర్వాత చేరాతల్ని ఆపాల్సి వచ్చిందట. ఈ ఉదంతాన్ని గూర్చి సంపత్కుమారాచార్య చెప్పిన ఈ పద్యాన్ని చూడండి.

                     " చేరాతలంతగా రాసీ రాసీ
                        ఏమి లబ్ది చేకురెను, మీవారు, మావారు
                        సాంబారులు చిమ్ముటలు తప్ప
                        మధుమతి చేరా! "                              

మీవారు, మావారు అంటే మీ లెఫ్టిస్టులు, మా రైతిస్టులు అనీ సాంబారులు  చిమ్ముకోవటం అంటే బురద చిమ్ముకోవటం అని అర్థమట. ఇక  పద్య ప్రేమికుడైన చేరా గారంటే సంపత్కుమార గారికి అమితమయిన ప్రేమట. ఇంకా  " శతకం" అన్నా శతక సాహిత్యం అన్నా చేరా గారికి ఎక్కడలేని అభిమానం. పైగా పద్యం అన్న ప్రక్రియ ఎంత కాలం ఉంటుందో అంతకాలం శతకం మనగలుగుతుంది అన్నదే చేరా గారి గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చెబుతూ  ఆచార్యులవారు ఒక పద్యం ఇలా వ్రాశారు.

                   "ఎందాక పద్యముండునో
                    అందాక శతకముండునంటివి కాదా
                    ఎందాక కవిత యుండునో
                    అందాకను పద్యముండునందును  చేరా! " 

చేరాగారి ఆలోచనకు తన ఆలోచన ను జోడించి పద్యం ఎప్పటికి నిలిచి ఉండే ప్రక్రియగా భావించి చెప్పాడు. చేరాకు  ఒక శతకం అనకుండా శతమానం అని ఎందుకన్నారో సంపత్కుమార గారు " చేరాకు ఒక శతమానం" గురించి చెప్పిన విషయాలు మరొక టపాలో!  అప్పటివరకు సెలవ్.

Friday, March 18, 2011

హోలీ ...రంగుల పండగ




రేపే హోలీ.  మొన్నెప్పుడో దారిలో ఓ మోదుగ పూల చెట్టు విరగబూసి,  చెట్టు మీద ఒక్క ఆకు లేకుండా  కనిపించింది. అది చూశాక చిన్నప్పటి హోలీ జ్ఞాపకాలు మదిలో ముసురుకున్నాయి.  అప్పుడు ఏమీ  తెలియని వయస్సు, హోలీ  అంటే రంగులు తయారు చేసుకోవడం,  స్నేహితులంతా కలిసి ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వూళ్ళో ఆడుకోవడం. ముందు  రోజే ఎర్రటి మోదుగు పూలచెట్లను  తోటల్లో , రోడ్ల పక్కన వెతికి పట్టుకొని పూలన్నీ తెమ్పుకొని, ఆ రోజు సాయంత్రం ఓ కుండలో నీళ్ళు పోసి ఆ పూలను ఉడికిస్తే ఎర్రటి రంగు ద్రావణం తయారయ్యేది.  అదే మాకు హోలీ రంగు. దీంతో పాటు కుంకుమ, ఒక్కోసారి అత్యుత్సాహం గల కొందరు మిత్రులు వాడే ఎడ్ల బండ్ల ఇర్సులులకు వాడే నల్లటి రంగు. కొంత మంది కోడి గుడ్లను కూడా ఉపయోగించే వాళ్ళు.  ఇంకా ఉత్సాహం పెరిగితే ఇంటి ముందు గోలెం లో ఉండే కుడితి లో ముచే వాళ్ళు. తెల్లవారి పొద్దున్నే లేచి రంగులు సీసాల్లో నింపుకొని, వూళ్ళో తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం, రంగులు పోయడం. కొందరు బయపడి పోయి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అనుకోండి. అలా మద్యహ్న్నం వరకు ఆడి అందరం కల్సి చెరువుకో, పక్కనున్న కాల్వకో పోయి స్నానం చేసి వచ్చేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఇప్పుడో  రంగు పూసుకోవాలంటే భయం , కళ్ళల్లో పడితే ఏమవుతుందో, నోట్లో కి వెళ్తే ఏమవుతుందో అని.  ఆ  ఎర్రటి మోదుగ పూల రంగు ముందు ఇవన్నీ  దిగదుడుపే. 

Friday, March 11, 2011

మూడు ఉత్తరాలు



రేడియో  డైరక్టర్ గా వున్న రజనీకాంత రావు గారు ఓ మాట అనేవారట. " కవులూ కథకులూ, రచయితలూ....వీల్లున్నారే...వీళ్ళకి మేం సాయం చేయటం లేదు. వాళ్లే మాకు సాయం చేస్తున్నారు, మా నిర్వహణకు మంచి పేరు రావాలంటే సమర్థులయిన రచయితలూ, వారి రచనలూ...మాకు లభించాలి. అప్పుడే నార్లకు మంచి ఎడిటర్ అని, రజనీకాంత రావుకి మంచి రేడియో స్టేషన్ డైరెక్టర్ అనీ పేరు వస్తుంది.అందుకే ఎక్కడ మంచి రచయిత ఉన్నాడా?  అని ఎప్పుడూ వెతుకుతూనే వుంటాం. మా చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళతో సరిపెట్టుకోం... "   అని.  అద్బుతమయిన ప్రతిభ పాటవాలున్న రచయితలూ పత్రికాఫీసుల చుట్టూ.. రేడియో, టి.వి. స్టేషన్ల చుట్టూ తిరగరు. కనుక వారిని వెతికి పట్టుకోవాలి.   ఈ రోజుల్లో ఆ పరిస్తితులున్నాయా?  ఈ శ్రద్ద కూడా రాను రాను తగ్గిపోయింది. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారికి ,  " భారతి" ఆఫీస్  నుండి వచ్చిన మూడు ఉత్తరాలు చూడండి.  రాను రాను రచయితల పట్ల ఆదరణ ఎలా తగ్గుతూ వచ్చిందో స్పష్టంగా అర్థం అవుతుంది.

మొదటి ఉత్తరం 1940  లో నాగేశ్వర రావు పంతులు రాసింది...." హనుమచ్చాస్త్రి గారూ! నమస్కారం...దయచేసి మీకు వీలయినప్పుడు  మంచి కథ గాని, కవిత గాని 'భారతి' కి పంపండి. పారితోషికం ముందుగా ఈ జాబు తో పంపుతున్నాను."

రెండవది 1955  లో శంబూ ప్రసాద్ గారు రాసింది- " శాస్త్రి గారూ! మాకు అప్పుడప్పుడూ ఏదయినా రచన  పంపుతూ ఉండండి."

మూడవది 1966  లో రాధాకృష్ణ గారు రాసింది- " అయ్యా ! మీరెప్పుడయినా రచన పంపిస్తే పరిశీలిస్తాం."

Sunday, February 27, 2011

వేరే లోకపు బాలలం...మనోచైతన్య


వేరే లోకపు బాలలం అంటూ ఆ పిల్లలు చేసే నృత్యాలు, వాళ్ళ ఆటలు, పాటలు నిజంగా చూస్తుంటే ముచ్చటేస్తుంది. వీళ్ళంతా మానసిక వికలాంగులు. వాళ్ళను చూస్తె అలా అనిపించలేదు. మామూలు పిల్లల్లాగే కనిపించారు.  వాళ్ళ ముందు అన్నీ సరిగ్గా ఉన్న మనం వికలాన్గుల్లా    అనిపించింది.  ఎప్పటి నుంచో ఈ వికలాంగుల పాటశాల వెళ్లాలని మనసులో ఉన్నా , ఆ కోరిక చివరికి ఈ మధ్య ఆ పాటశాల వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ కుమార్ గారు పిలవగానే సంతోషంతో వెళ్ళా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కృష్ణకుమార్ గారు " మనోచైతన్య " పేరుతొ కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో ఏర్పాటు చేసి, మానసిక వికలాన్గులయిన  ఈ పిల్లలకు చేస్తున్న సేవ శ్లాఘనీయం.

 మానసికంగా  ఏదో ఒక లోపంతో వయసు ఎదిగినా, మనసు ఎదగక  చిన్న పిల్లలవలె తల్లి తండ్రులకు కూడా భారంగా ఉండే ఈ పిల్లలను  ఒక్క దగ్గర చేర్చి వారి మానసిక ఎదుగుదల కు తోడ్పడుతున్న కృష్ణ కుమార్ గారు అబినందనీయులు.   ఇక్కడ ఈ విద్యార్థులకు చదువే కాక, ఆట పాటలు , శాస్త్రీయ నృత్యాలు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు , ఇవే కాకుండా ఈ పిల్లలకు  శిక్షణ ఇవ్వగా ఇప్పుడు వాళ్ళు లాంగ్  నోట్ బుక్స్, కవర్స్, ఫైల్ ప్యాడ్స్, క్లిప్ ఫైల్స్ , స్వీట్ బాక్స్ లు, మొదలగునవి  ఎన్నో వీళ్ళ చేతుల్లో తయారవుతున్నాయి. వీటిని తయారు చెయ్యటమే కాదు, డబ్బు రూపంలో దానికి దగ్గ ప్రతిఫలం కూడా పొందుతున్నారు.  మనో చైతన్యం అంటే స్తబ్దతగా  నున్న మనస్సును చైతన్యం చెయ్యడం.  స్తబ్దత తో  ఉన్న వీళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో  మార్పు తీసుక వచ్చి ఇలా చెయ్యడం నిజంగా నిర్వాహకులను మెచ్చుకోదగ్గ విషయం. " మనో చైతన్య"  గురించి ఈ వీడియో లు చూడండి. వివరాలకు http://www.manochaitanya.in/ సందర్శించండి.





Thursday, February 24, 2011

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

ఓ పాపా లాలి చిత్రంలో బాలు పాడిన "breath less song" మీరూ మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చెయ్యండి. బాలు మరియు ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఓ చక్కని అందమయిన పాట ఇది.నాకు తెలిసి తెలుగు లో వచ్చిన breath less సాంగ్ ఇది ఒక్కటే అనుకుంటా.




మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా (2)

వెన్నెలల్లె పూలు విరిసి తేనేలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు


చిత్రం : ఓ పాప లాలి
గానం : ఎస్ పి బాలు 
సంగీతం : ఇళయరాజా 




Saturday, February 19, 2011

కళ జమునాయె.....కళ నిజమాయె

రచన మాస పత్రికలో " పిల్ల కోతి కిచ కిచలు" అని ఈ నెల మాస పత్రిక నుంచి " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచిక విశేషాలు పంచుకుంటున్నారు. మహా మహుల్లాంటి సంపాదక వర్గం తో తీర్చి దిద్దిన "జ్యోతి" కుర్ర కారునే కాక ఇంటిల్లిపాదిని ఆ రోజుల్లో ఆకట్టుకుందట. రచన "శాయి" గారు జ్యోతి రుచులను ఒక సంచికలో  కాకుండా  " పిల్ల కోతి కిచ కిచలు" అనే శీర్షికన ధారా వాహిక గా ప్రచురిస్తున్నారు. మంచి సాహిత్యం పట్ల జిహ్వ చాపల్యం ఉన్న వారందరినీ ఈ షడ్రుచులు తనివితీరా అలరిస్తాయని శాయి గారు తెలియ  జేస్తున్నారు. మరి మీరు ఆస్వాదించండి. 1963 లో ఆవిర్భవించిన " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితమయిన " కళ జమునాయె....కళ నిజమాయె" అన్న ఫోటో ఫీచర్ ఇక్కడ మీకోసం.. మీరూ చూసి ఆనందించండి.  చిత్రంలో ఉన్నది కూడా బాపు గారనుకుంటా.

                     ( రచన మాస పత్రిక సౌజన్యం తో మరియు శాయి గారికి ధన్యవాదాలతో )
















 


Friday, February 18, 2011

పడమటి కోయిల పల్లవి...యండమూరి



ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్, షెల్లీ , కీట్స్, కొలరిద్జ్  లాంటి  ఆంగ్ల మహా కవుల కవితల్ని తెలుగు లోకి అనువదించి మనకందించిన కవితా సంకలనం ఈ  " పడమటి  కోయిల పల్లవి " . ఇందులో యండమూరి అనువదించినవే కాకుండా " తీయ తెనుగు అనుపల్లవి" పేరున కొన్ని ఔత్సాహిక రచయితలూ రాసిన కవితలు కూడా " ప్రేమ" ముఖ్యాంశంగా ఉన్నవి చివర్లో అందించారు. ముందు మాట లో యండమూరి " ఈ కవితల్ని కళ్ళతో చదవకండి, మనసుతో చదవండి. కొన్ని  వాక్యాలు మనల్ని నిలబెట్టేస్తాయి..  ఆ కవులు ఎంత మథనపడి , ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్థమవుతుంది. వీటిని ఒంటరిగా ఉన్నప్పుడే చదవండి"  అని అంటారు. చదువుతుంటే అన్నీ  అల మనసుకు హత్తుకు పోయేవే. మచ్చుకి అందులోనుంచి కొన్ని మీకోసం.

" హేమంతాగమనానికి క్షీర సాగర మద్యాన శ్రీ హరి చలికి వణుకుతుంటే - శ్రీ కుచంబులు అభయమిచ్చాయట
 ఇక్కడ..
పూల మకరందం నీ పెదాల నడిష్టించి ఆ పీయూష దారాల్ని దోచుక పోతున్నాయి."// రెండాకుల మధ్య చినుకు పుట్టినట్లు//పరుచుకునే పెదాలపై నీ పల్చటి చిరునవ్వు// ముద్దు వద్దనే అబద్దానికి ఓ ఆకాశాన// ఆపై జరిగేది నీ బిదియంతో నా ఆవేశం  సంఘర్షణ//( వద్దనకు ఈ ముద్దు)

నిజమయిన ప్రేమ రగులుకునే జ్వాలైతే
హృదయ స్పందనను తర్జుమా చేసి
మనోగతాన్ని ప్రతిఫలిమ్పజేసే అగ్నికీల తృష్ణ  (పునాది)


భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవడమే ఆనందమైతే
జీవితం గతాన్ని పొగుడుతున్దేమి !
నా కంటే ముందు మేల్కొని నా తరువాత నిదురపోయే జ్ఞాపకం
నిత్యం నా ఆలోచనలతో ఆడుకుంటూనే వుంటుంది   (జ్ఞాపకమే ఆనందమా)

అద్బుతమయిన అందాలను చిందించే పర్వతపు అంచులలో
ఎర్రని జ్వాలలా.......
అమ్మ నుదుట మెరిసే కుంకుమ లా......
చెల్లి జడలోని గులాబి పువ్వులా
అలవోకగా విశ్రమిస్తుంది
సంధ్య    (సంధ్య)


రాటు తేలిన నీ కంటం // ప్రమాదం ఏమి లేదుగా అంటుంది// నెలని రెండు గా చీల్చటంలో అనుభవమున్న నేను //లేదు అని జవాబిస్తాను
రోజులు తమదైన పంథాలో దొర్లిపోతూ వుంటాయి//రోజులు కేవలం రోజులే // అవి దేనిని ఆశించవు//రుదిరాభిషేకంతో నిత్యం//పరిశుద్దమయ్యే వాహిక గుండా//
పవిత్రంగా పరుగెడుతూ గర్భ గుడి చేరాలని//..మనం చింపే దుప్పట్లు....చీరెలో// ఉయ్యాలలుగా మారాలని ,//వాటిలో తాము నివసిన్చాలనీ//ఉత్శాహించే నా సజీవాక్రుతుల్ని//నీరు కార్చేస్తూ మనం చెలరేగిపోతాం//రోజులు తమవైన పంథాలో దొర్లిపోతుంటాయి//అవి దేనిని ఆశిన్చావు// మనం మాత్రం మళ్ళీ//
నెలను రెండుగా చీల్చటం  కోసం// ఆవేశం తో ఉద్యమిస్తూ ఉంటాం  ( సేఫ్ పీరియడ్)

అతనిని లొంగ దీసుకోవదమేలాగో// ఆమె నేర్చేసుకుంది// అసంకల్పితంగానైన అసంగాతంగానైన // జీవితాంతమూ ఆమె దగ్గర ఏడుస్తూ అతను// (ఈవ్)

హృదయాన్ని  రాగ రంజితం చేసే స్వరాలాపన మరణించినా//జ్ఞాపకాల్లో అది కంపిస్తూనే వుంటుంది.//మొగలి పూలు వడలిపోయినా//
గుండెల నిండుగా ఆ సౌరభాలను పీల్చుకున్న// అనుభూతి నిత్యం ఓ పారిజాత పుష్పమై వికసిస్తూనే వుంటుంది//
మరణించిన గులాబీ పూల రేకులు కూడా//ప్రేమికుల పానువులుగా అమరుకున్తున్నాయి// నీవు నశించినా నీ ఆలోచనలు
నా ప్రేమకు పీటాన్ని వేసి కూర్చో బెడుతున్నాయి//  (అజరామరం)

 ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువ్వు లేనప్పుడు  నవ్వుని
నువ్వున్నప్పుడు కాలాన్నీ
పారేసుకోవటం   ( అంటే కదా మరి)

ఒక తల్లి చెంపమీద
జీవనదిలా ప్రవహించే కన్నీటిని
గాలి తెమ్మెర సుతారంగా స్పర్శించి అన్నది
ఎందుకమ్మా ఈ దుక్కం
పదేళ్ళ కరటం ఊపిరి పోసుకున్న కొడుకు కోసమేగా
అతనికేం స్వర్గంలో రారాజులా ఉన్నదే అని
అప్పుడా కన్నీరంది
" ఓ పిచ్చి తెమ్మెర! ఈమె
దుక్కం పదేళ్ళ క్రితం ఊపిరి పోసుకున్న కొడుకు గురించి కాదు,
అదే సమయాన పుట్టిన ఒక తల్లి గురిచి అని  


అందరి మధ్యా వున్నప్పుడు
అకస్మాత్తుగా నువ్వు గుర్తొచ్చినప్పుడు
మరీ మరీ గుర్తొచ్చినప్పుడు
గుర్తొచ్చి దిగులేసినప్పుడు
ఆ దిగులుకి కారణం
వాళ్లకి చెప్పటం కోసం
వెతుక్కోవటం ఎంత కష్టం  (నీ కేం తెలుసు)
 

జీవించు - నేర్చుకో- అందించు ....తుమ్మేటి రఘోత్తం రెడ్డి




ఆంగ్లంలో కొటేషన్ల పై అనేక పుస్తకాలు వచ్చాయి . అలాగే తెలుగులో కూడా వున్నాయి .కానీ ఒక తరంలో ప్రోది చేయబడ్డ జీవన జ్ఞానాన్ని  సాహితి సృజనలో పాల్గొన్న వ్యక్తి తన జీవిత అనుభవాల సారాన్ని, క్లుప్తంగా రాసిన వాక్యాల్లో , ముందు తరాలకు అందించాలన్న దృక్పధంతో రాసినది "జీవించు-నేర్చుకో- అందించు (యువతకోసం) " అన్న ఈ చిన్ని పుస్తకం.  తన తరువాత తరంకోసం,  మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, తన కెదురైన జీవిత అనుభవం లోనుంచి  అలాగే కొన్నివేరెవరో  చెప్పినవి, తన ద్రుక్పదానికి అనుగుణ మయిన మార్పులు చేర్పులతో రచయిత మనకు అందించారు.

ప్యాకెట్ సైజులో సుమారు 20 అంశాలపై అంటే జననం నుండి మరణం వరకు అనేక అంశాలపై చాల చక్కటి వాక్యాలు క్లుప్తంగా రాసారు. వరుసగా చదవాల్సిన అవసరం లేదు.ఎ పేజి అయిన తెరిచి ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు.ఎక్కడైనా ఆపవచ్చు.కాలక్షేపానికి అనుకొండి  లేదా మనసు బాగోలేనప్పుడు ఓ సారి  అలా  ఏదోఒక పేజీ  తెరిచి ఆ వాక్యాలు చదివితే ఏదో ఒక ఇన్స్పిరేషన్ , మన మనసులో ఏదో మార్పు కలగక మానదు .దీన్ని "టీ పాయ్ " బుక్ అనవచ్చు. మనకు తోచనప్పుడల్లా ఓ  పేజి తెరిచి చదవచ్చు.ఎన్ని  సార్లు  చదివినా సమయాన్ని బట్టి ఓ కొత్త ఆలోచన,  కొత్త భావం కలిగిస్తాయి

గత ౩౦ ఏళ్లుగా తెలంగాణా జీవితాన్ని,పోరాటాల్ని,విభిన్న ద్రుక్పధం తో తన అనుభవాలతో  మనకు కధలుగా అందించిన రఘోత్తం గారు , నేనేవరికోసం రాయాలి అని సూటిగా ప్రశ్నించుకొని, కొడుకు తిలక్ కోసం ఈ తరం యువత కోసం , తన అనుభవాలతో  తన సాహితి జ్ఞానంలోనుంచి  ముందు తరానికి పుస్తకరూపంలో ఇచ్చిన సలహాల కూర్పు ఈ పుస్తకం. "నేనేరిగినంత మేర  జీవితం గురించి సూక్షంగా , నాఅనుభవం లోనుంచి  నేను రూపొందిన్చుకొన్న అభిప్రాయాలు" అంటారు చివర్లో రచయిత .

పాటశాల విజ్ఞానాన్ని  నేర్పితే, సాహిత్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది  అంటారు, ఈ పుస్తకంలో రఘోత్తం  గారు ఒకచోట, నిజమే ఈపుస్తకం మన జీవితం పై  మనకు కొంత అవగాహన, మరియు  జ్ఞానం  ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మనకు జ్ఞానాన్నే   కాదు అక్కడక్కడ కొన్ని చురకలు కూడా అంటిస్తారు. అందరు తప్పకుండ చదివి దగ్గర ఉంచుకోవాల్సింది ,ఈ చిన్న అమూల్యమైన  పుస్తకం.