Sunday, January 30, 2011

పుస్తకం లో " అమీనా " పుస్తక పరిచయం



అమీనా.....మహ్మద్ ఉమర్ రాసిన నవల పై "పుస్తకం.నెట్ " లో నేను రాసిన పరిచయం :


ఆఫ్రికా స్త్రీ వాద రచయిత " మహ్మద్ ఉమర్" రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో  అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల  మనసుకు హత్తుకు పోయేలా రచించబడ్డ ఒక మంచి నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది అంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించ వచ్చు. ఇది రచయిత మొదటి నవల. సరళమయిన అనువాదంతో మొత్తం ఏక బిగిన చదివించిన నవల.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

Wednesday, January 19, 2011

మా టివి లో వంశీ మా పసలపూడి కథలు .."నల్లమిల్లి పెదభామి రెడ్డి గారి తీర్పు"

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వంశీ " మా పసలపూడి కథలు" మొన్నే 17 నుంచి మా టివిలో మొదలయ్యాయి. చూడాలి, చూడాలి అనుకొని, అనుకోకుండా పనుల వత్తిళ్ళ వాళ్ళ , హైదరాబాద్ పోవడం వల్ల రెండు రోజులు మిస్ అయ్యా. ఈ రోజు యు ట్యూబ్ లో మొదటి ఎపిసోడ్ చూశా.  వంశీ సంగీతం లో మా పసలపూడి  కథలండీ అంటూ సాగే టైటిల్ సాంగ్ అద్భుతంగా వంశీ స్టైల్లో చిత్రీకరించబడింది. కోన సీమ అందాలు, గోదావరి. కాలువగట్లూ. కొబ్బరి చెట్లూ బాపూ బొమ్మలతో పాట వింటూ ఉంటె ఆ కొబ్బరిచెట్ల మధ్య కూర్చొని  ఆ గోదారి మీదినుంచి వచ్చే గాలి ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది.  


 మొదటి కథ " నల్లమిల్లి పెదభామిరెడ్డి  గారి తీర్పు" మొదటి భాగం బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నా కాని  ఆ కొబ్బరి చెట్లు అడుగడుగునా పచ్చదనం వంశీ స్టైల్లో పాత్రలు ,దర్శకుడు శంకు అద్బుతంగా తీశాడు. నటుల నటన కూడా ఈ మధ్య వచ్చే సీరియల్స్  లో కాకుండా చక్కగా పాత్రల్లో ఒదిగి పోయి నటించారు. ముందు ముందు ఎలా ఉంటుందో కాని మొదటి భాగం మాత్రం మనల్ని మిగత భాగాలు మిస్ కాకూడదు అని   టివి ముందు కూర్చోనేట్లు చేసింది. మీరూ చూడండి.

Wednesday, January 12, 2011

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్...జయంతి, వర్ధంతి

ఈ రోజు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి. ఈ సందర్భంగా " ఆంద్ర జ్యోతి" అలిశెట్టి కి అర్పించిన అక్షర నివాళి
  

  "అతడు మసకబారిన అక్షర సూరీడు. జగిత్యాల జైత్ర యాత్ర పాద ధూళిని తన పెన్ను  గన్ను తో గర్జించి పాటల తూటాల్ని, సాహితి గాయాన్ని రేపిన అక్షర సైనికుడు.ఊపిరితిత్తులలోని క్షయ ఉక్కిరిబిక్కిరి చేసినా, ఊపిరాడకుండా చేసినా ఉవ్వెత్తున ఎగిసిన ఎర్రెర్ర జెండా.  అతడు జన్మించింది, మరణించింది ఒకే తేదీ కావడం యాదృచ్చికం... "మరణం నా చివరి చరణం కాదు" అని ప్రకటించిన అక్షర వీరుడితడు. అతడే  ప్రభాకర్. జగిత్యాలలో 1956 జనవరి 12  న  పుట్టి, బతికి ఉండగానే మనిషి గుండెల్లో "స్ట్రా" పెట్టి రక్తం పీల్చే క్షయ బారిన పడి 1993 జనవరి 12  న  అస్తమించాడు.

     జగిత్యాలలోని అంగడి బజార్ ప్రాంతం లో జన్మించిన అలిశెట్టికి  ఏడుగురు అక్కా చెల్లెళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. కాగ ప్రభాకర్ ఐదో వాడు. తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో కుటుంబ పోషణ భాద్యతలు స్వీకరించాడు. సిరిసిల్లలో రాం ఫోటో స్టుడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు.  1978  జగిత్యాల జైత్ర యాత్ర రగిల్చిన నిప్పు సెగ, ప్రభాకర్ అంతరంగం లోని కవినీ, చిత్రకారున్నీ నిద్ర లేపింది. పెత్తందారు వ్యవస్థ మీద పేదోళ్ళు జరుపుతున్న పోరు ప్రభాకర్ లోని అక్షర సూర్యున్ని ప్రజ్వలిమ్పజేసింది.  ఆ కవిత జ్వలనం తుది శ్వాస విడిచే వరకూ కొన సాగింది..... తనువు పుండై... తాను పండై...తాను శవమై...వేరొకరి వశమై...తను ఎడారై  ... ఎందరికో.. ఒయాసిస్సై.... అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గతుల గురించి రాసిన కవితలు ఇప్పటికీ జనం గుండెల్లో నాటుకున్నాయి. అలిశెట్టి కవిత్వంలో ఆదర్శాలకు అనుగుణంగా పేద రాలయిన 'భాగ్యం' ను పెళ్లి చేసుకొని జీవితం లో సగ భాగం ఇచ్చాడు. భార్య కూడా అలిశెట్టి ఆదర్శాలలో ఇమిడి పోయి తుది శ్వాస వరకు పతి సేవ చేసింది. అందుకే తెగిన తీగల్ని సవరిన్చాడానికన్నట్లు తెల్లవార్లు పరిచర్యలు చేసినా నా భాగ్యమే నాకన్నీళ్ళను తూచే " హృదయ త్రాసు  " గా భార్యకు అక్షర సత్కారం చేశాడు.
 
     18 ఏళ్ల వయస్సులోనే బూర్జువాలపై కవితలు రాసిన  అలిశెట్టి కి 21 ఏళ్ల వయస్సులో " ఎర్ర పావురాలు" కవిత సంకలనంతో ప్రారంబించి , 1979  లో "మంటల జెండాలు", 1981  లో "చురకలు" వెలువరించాడు. 1982  లో హైదరాబాద్ లో స్థిర పడ్డ ఆయన " రక్త రేఖ" " సంక్షోభ గీతాలు" కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అలిశెట్టి నిర్వహించిన " సిటీలైఫ్" కాలం వేలాది మంది యువ హృదయాల్లో ఆయన్ని హీరో చేసింది."

     జనవరి 12  అలిశెట్టి జయంతి, వర్దంతి.......వివేకానందుని జయంతి.......ఇంకా మా బాబు పుట్టిన రోజు....వాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. "A Birthday is a Million Moments, Each holding A promise of Fulfillment of Your Dreams & Accomplishments of Some Special Plans. Wish You A Very Happy Birthday."

Sunday, January 9, 2011

సరదాగా.....మాలికలో శీర్చికలను కలిపితే

సరదాగా మాలిక లోని పక్కపక్కనే ప్రచురితమయిన శీర్షికలను కలిపితే.....

మహేష్ బాబు కి సర్ ప్రైజ్ ....కొత్త పాళీ రంగుటద్దాల కిటికీ చదివాను.

పగిలిని పాదాలు వేధిస్తుంటే...బాబూ నీ భవిష్యత్తేమిటి.

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్ లో నిల్వ ఉంచినట్లయితే..ప్రభుదేవా, నయనతారల వివాహ వేదిక?

ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ డైరెక్టర్....శ్రీ కృష్ణ కమిటీ నెరవేర్చిన ప్రయోజనమేమిటి.

బిగ్ బాస్ గా ఈ అమ్మాయా, కోటి రూపాయల బహుమతా....ఓ ప్రాక్టికల్ జోకు

try this tongue twister....మీరెందుకురా చావడం...?


ఐష్ ని కొరుక్క తినవచ్చు....అందుకే దీనిని ప్రేమకు ప్రతిరూపంగా చూపిస్తారు.


శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ పై దిక్కుమాలిన చర్చలెందుకు...... ఔరా హేచేమ్టివి రామచంద్రమూర్తీ ఎంత మోసమెంత
మోసం!!


భక్త తుకారం....1973 .....సమస్య "కలహంసల తప్పుగాక కాకుల తప్పా" ?


చరిత్రహీన్ చదువుతారా.....వలస పాలకులార క్రూరత్వామంటే ఇది కాదా


సంక్రాంతి సమయం లో నువ్వుల వాయనం తీసుకోవచ్చా...నా ప్రశ్నలకు బదులిచ్చే  దెవరు  

మాల్యా ముందే సిద్దార్థ్ కి కిస్ ఇచ్చిన దీపికా పాడుకొనే!..  అదంతా మాకు తెల్వద్ మాకు తెలంగాణా ఇయ్యల్సిందే.


చదువు నేర్వని శాస్త్రవేత్త..   ఆర్తి అగర్వాల్ ఖరీదు రూ.600


మీకు దమ్ముంటే ఈ పదాలను గబా గబా పలకండి....మార్జాల కిషోర న్యాయం  - మర్కట  కిషోర న్యాయం 

రవీంద్రుని కబుర్లు


హింస వీడని బౌద్దాభిమాని :


విధుశేకర్  శాస్త్రి గారు బౌద్దధర్మ నిష్ణాతులు. ఒకరోజు గురుదేవులు వారితో మాట్లాడుతూ   కూర్చున్నారు. అప్పుడు ఇతరులు కూడా ఉన్నారు. అకస్మాత్తుగా గురుదేవులు, శాస్త్రిగారూ మీరిన్ని రోజులు బౌద్ద శాస్త్రాలను చదివినా హింసా ప్రవృత్తి ని మాత్రం విడనాడలేదు అని అన్నారు.
దాంతో శాస్త్రే గాక అందరూ ఆశ్చర్యపోయారు. శాస్త్రి గారు ఎవరి మనసును కూడా నొప్పించే రకం కాదు. దాంతో మళ్ళీ గురుదేవులే తన తెల్లని గడ్డాన్ని నిమురుకుంటూ " దీన్ని పెంచండి, బాగా పెరగనివ్వండి, దీన్ని హింసించకండి" అని అన్నారు. దాంతో అక్కడున్న వారంతా రోజూ చక్కగా గడ్డం చేసుకునే శాస్త్రి గారి మొహం వైపు చూస్తూ హాయిగా నవ్వుకున్నారట.

పాదుకా పురాణం :


ఓ సాహిత్య గోష్టి కి శరత్ బాబు, రబీంద్ర నాథ్ టాగూర్ హాజరయ్యారు. శరత్ బాబు కి ఇల్లాంటి చోట్ల చెప్పులు పోతాయని భయం. అందువల్ల ఆయన చెప్పుల్ని ఒక సంచిలో చక్కగా చుట్టి , దాన్ని తనతోపాటే పట్టుకుని కూర్చున్నాడు. రవీంద్రుడు సభానంతరం వెనుతిరిగేటప్పుడు, శరత్ బాబు తో " మీ చంకలో ఏదో ప్యాకేట్టున్నట్టునదే" అన్నారు. శరత్ బాబు ఉలికిపాటు తో " అబ్బే ఎం లేదండీ " అని నెమ్మదిగా అన్నారు. ఆయన్ని అంతటి తో వదలక, రవీంద్రుడు మళ్ళీ " ఏదో పుస్తకం అనుకుంటా?" అన్నారు.
శరత్ బాబు  అస్సలు విషయమెక్కడ బయట పడుతుందోనని గాభరాగా " అవును పుస్తకమే" అన్నారు. అంతటితో నన్నా ఆ విషయం వదులుతారేమోనని.   కానీ రవీంద్రుడు   మళ్ళీ శరత్ తో " ఎం పుస్తకమడీ" అన్నారు. పాపం! శరత్బాబు ఈ సారి ప్రమాదంలో పడి పోయారు. ఎం చెబుదామా అనే సందిగ్దంలో పడ్డారు. దాంతో రవీంద్రుడు  పకపకా నవ్వుతూ " శరత్! పాదుకా పురాణం కదూ అది? అది లేకుండా ఎవరికీ పని జరగదు లేవయ్యా! అని అన్నారు.

మామిడి పళ్ళ కో నమస్కారం:


గురుదేవులకి మామిడి పళ్ళు అంటే అమిత ప్రీతి. చైనా లో వారున్నప్పుడు ఫిలిప్పీన్స్ నుండి వారికో టెలిగ్రాం వచ్చింది. " మీకు  ఫిలిప్ఫీన్స్ మామిడి పండ్లు పంపిస్తున్నాం" అని. మామిడి పండ్లు వచ్చాయి. పండ్లలో పీచు  అధికంగా ఉంది. వాటిని కోసి తినడం కష్టమయి పోయింది. మామిడి పళ్ళ ముందు కూర్చుని వాటికి నమస్కరించారు  గురుదేవులు.
పళ్లకు ఎందుకు నమస్కరించారు అని అడిగాడట ఓ మిత్రుడు. " వాటి పీచు నా గడ్డపు వెంట్రుకలకంటే పొడుగ్గా ఉంది. నిజానికి అవి పండ్లు కావు నా పెద్దన్నల వంటివి" అని అన్నాడట గురుదేవులు 

Saturday, January 8, 2011

తీరని కోరిక


తెల్లవారు ఝామున లేచి ఆరు బయటకు వచ్చా. ఒక్క   సారిగా చల్లటి గాలి రివ్వున ముఖాన్ని ఉక్కిరి బిక్కిరి  చేసింది. చల్లగా చలి వణికిస్తుంది.  ఇష్టం అయ్యింది ఏదీ కష్టం కాదనుకుంటా! కొద్దిసేపటి తర్వాత అది వణికిస్తున్నట్లు  లేదు. నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు....ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆప్త మిత్రుణ్ణి కౌగిలించుకున్నట్లు, తాదాత్మ్యతతో ....పక్కింటి లో నుంచి అలా గాల్లో తేలూతూ వస్తున్న నైట్ క్వీన్ల పరిమళాలు, ఇంటి ఎదురుగా గన్నేరు చెట్టు కిల కిల నవ్వులతో ,విరబూసిన గన్నేరు పూమొగ్గల పలకరింపులు....అప్ప్దప్పుడే తొలిగి పోతున్న  మంచు దుప్పటి......



                                           ప్రతి కుసుమముకుళ మ్మొక రక్త కణము 
                                           కోమలీ రాగ రంజితాంగులిక  వోలె

అని గాలిబ్ గుర్తొచ్చాడు. ప్రతీ పూల మొగ్గ, రక్త కణంగా  కనిపిస్తున్నదట, ఎర్రగా కనపడుతున్న  ప్రతీ కుసుమ ముకుళం ప్రియురాలి రాగ రంజితమయిన  వ్రేలి వలె ఉందిట. పూమొగ్గలు ఎరుపు రంగద్దిన కోమలమయిన అంగులికతో పోల్చిన గాలిబ్....... 

అల  మెట్లెక్కి , దాబాపైకెక్కి అక్కడే కూర్చున్నా..ఒక్క క్షణం కళ్ళు మూసుకొని , గట్టిగా ఒక్కసారి  ఊపిరి పీల్చుకుంటే ,   చల్లగా కడుపు నిండిన అనుభూతి. వర్ణించలేని అనుభూతి అంతేనేమో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా కనిపిస్తాయేమో. దూరంగా ఎక్కడో ఎవరో చలి కాగుతున్నారు. ఒక్కసారిగా జ్ఞాపకాలు  వెనక్కి....సంవత్సరాల వెనక్కి....

ధనుర్మాసం... తెల్లవారుఝామున  లేచి రాత్రి కప్పుకున్న చద్దరు వేడిగా అలాగే చుట్టుకొని, ఇంటిముందుకు వస్తే, నెగడు కాగుతున్న జీతగాళ్ళు, తాతయ్య, వాళ్లతో జత కల్సి వేడి వేడి గా చలి కాగుతూ.. ఓ పక్క నించి తాతయ్య వేపపుల్ల చేతికందిస్తే, నోట్లో వేపపుల్లతో, ఎదురుగా వేడి వేడి గా చలిమంట, దూరంగా గుడిలోనుండి వినపడుతున్న సుప్రభాతం,....పనివాళ్ళ నోట్లో నుండి వినపడుతున్న పల్లె పదాల మాధుర్యం......ఇంట్లో నుంచి అమ్మమ్మ మడితో  ఆ గోదా దేవి కి శ్రద్దగా పూజ చేస్తూ iశ్రావ్యంగా చదువుతున్న పాశురాలు ఓ పక్క చెవులకు ఇంపుగా వినపడుతుంటే....ఈ లోపల నేనున్నానంటూ సూర్య భగవానుడు తన లేలేత ,నును వెచ్చని కిరణాలతో మనల్ని, బాగున్నావా... ఎలా ఉన్నావ్ మిత్రమా అంటూ అందంగా పలకరిస్తుంటే......అద్వితీయమయిన  అనుభూతి.

ఒక్క సారిగా పక్షుల కిలా కిలా రావాలతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచా....పక్షుల కిలా కిలా రావాలు..అప్పుడే ఎర్రగా పైకి వస్తున్న భాల భానుడు, లేలేత కిరణాల నును వెచ్చదనం దేహాన్ని తాకుతుంటే...."భానోదయాన చంద్రోదయాలు" ఎవరో మన సినీ కవి అన్నాడు. విచిత్రం గా ఉంది కదా! సూర్యుడు కూడా గాల్లో దీపమంట...  వేర్లలోనించి  పుట్టుకొచ్చిన కొమ్మల్లా, నిశ్శబ్దంలో నించి అన్ని శబ్దాలు పుడతాయట...అలా నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి  ఒక్కసారిగా శబ్దం లోకి....ఓ పక్క నించి రజనీగంధ..లిల్లీ , వాటినుండి వెలువడే కమ్మని వాసన, రజనీ గంధ అంటే రాత్రికే సౌగంధమట.   "  సాస్ తేరే మదిర్ మదిర్, జైసే రజనీగందా//ప్యార్ తేరా మధుర్ మధుర్, చాందినీ కే గంగా " నీరజ్ అనుకుంటా ఎక్కడో చదివిన జ్ఞాపకం చుట్టుముట్టింది. అలా కళ్ళు మూసుకొని ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో మెదులుతుంటే, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ అనుభవించాలని  ఓ వెర్రి కోరిక....రోజూ అందులో తాదాత్మ్యత చెందాలన్న ఓ తీరని కోరిక......అంతే మన జీవితాలు, యాంత్రికత కి అలవాటుపడ్డ జీవితాలు....అలా వెళ్ళ దీస్తున్నాం అంతే కదా..

అన్నీ కృత్రిమ ఉదయాలే....సెల్ ఫోన్ మోతలతో కళ్ళు నులుముకొని  , ఎవరు చేశారో , ఆ నిద్ర మత్తులో సరిగా కనపడక హలో..హలో అంటూ పలకరింపులతో ప్రారంభమయి  ..  పడక పయినే వార్తా పత్రికల శోధన, టి.వి. లో నిన్నేమయ్యింది, ఈ రోజున ఎం జరుగుతుందో.. బ్రేక్ న్యూస్ ల పరంపర, జీవితమే ఓ బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఎన్నో అనుభూతుల్ని కోల్పోతున్నాం ఈ యాంత్రిక ప్రపంచం లో పడి.  అందుకే ఆ వెచ్చటి ఉషోదయాలు. ఆ తెల్ల వారుఝామున అందాలు , ఆ రజనీ గంధ సౌరభాలు రోజూ ఆస్వాదించాలని,  ఓ వెర్రి కోరిక.. ఓ  తీరని  కోరిక. 

Friday, January 7, 2011

నా ఎలుక గీసిన చిత్రం

ఎలుకేంటి ..చిత్రమేంటి అని బుర్ర గోక్కున్టున్నార:). అవునండీ ఈ   ఎలుక నా పెంపుడు ఎలుక. రోజూ ఇంటికి వొచ్చి కంప్యుటర్ ముందు కూర్చోగానే ఎంచక్కా వచ్చి చేతిలో ఒదిగి పోతుంది. నేను ఉన్నంత సేపూ నాతొ ఉంటుంది ఎం చెప్తే అది చేస్తుంది.  ఇక్కడి వరకు బాగానే ఉంది, మొన్నేం  జరిగిందంటే.... చెబ్తా.. చెబ్తా. అక్కడికే వస్తున్నా.  
మనకు పూర్వాశ్రమంలో అంటే ఎప్పుడో చాలా రోజుల ...ఆహా... ఏళ్ల క్రింద బొమ్మలు గీసే అలవాటు ఉండేది. దీనికేలా తెలిసిందో కాని గత రెండు, మూడు రోజులుగా నా ప్రాణం తింటుంది. నాకూ బొమ్మలు గీయడం నేర్పమని. నేను మర్చిపోయాలెమ్మని చెప్పా తప్పించుకుందామని.ఉహూ వినలేదు, బతిమిలాడా అస్సలు వినలేదు.  ఇలా కాదని నాకు బొమ్మలు గీయడం రాదు నీకెవరో అబద్దం చెప్పారు అన్నా:). నీ పని ఇలా ఉందా అని మొరాయిన్చేసింది.  సరే ఇక తప్పేట్టు లేదనుకొని సరే రా నేర్పుతా  అని పిలిచా. చెంగున చేతిలో కొచ్చి గురూ గారూ నేను రెడీ అని గారాలు పోయింది, సరే అని ఓ చెవ్వు  గట్టిగా పట్టా.  అమ్మో అని అరిచింది. మరి బొమ్మలు  గీయడం నేర్చుకోవాలంటే తప్పదంటూ ఆ చెవ్వు అలానే గట్టిగా పట్టుకొని మెల్లగా నేర్పటం మొదలెట్టా.  పాపం మంచిగానే చెప్పినట్టు విన్నది కాని మొదటిసారి కదా అక్కడక్కడా మొరాయించింది. సరే మొదటి సారి కదా అని నేనూ ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఎలాగోలా గీసిన్దనుకోండి .
 హమ్మయ్య అయిపొయింది అనుకోని లేద్దామని అనుకొనే సరికి , గురూ గారూ అని  పిలిచింది. ఏమిటి అన్నాను. నాతొ బొమ్మ గీయించారు బానే ఉంది. అది మీ సిస్టం లో దాచుకుంటే నాకేంటి లాభం అంది. మరేం చెయ్యాలి. మీరు గీసిన బొమ్మయితే అలా హాల్లో అందరూ చూసేలా పెట్టుకున్నారు, ఎలుక గీసింది కదా అని అంత చిన్న చూపా అంది. ఏంచెయ్యాలి అని అడిగా, నాదో చిన్న కోరిక అంది. చెప్పు  అన్నాను. మీకు ఏదో ఆలోచన రాగానే ఈ అంతర్జాలం లో మీ బ్లాగ్మిత్రులతో పంచుకుంటారు కదా అని అంది. అవును దానికి దీనికి సంబంధమేమిటి అని ఓ ప్రశ్నార్ధకం గుర్తెశా! మరేమో...మరేమో ...నాన్చకుండా  తొందరగా  చెప్పు  అవతల అస్సలే కృష్ణ  కమిటీ రిపోర్ట్ వచ్చింది, ఎం జరుగుతుందో , నేను వెళ్ళాలి, అని కొద్దిగా కోపంగా అన్నా. మరేమో నేను గీసిన బొమ్మ మీ బ్లాగ్లో పెట్టి మీ బ్లాగ్మిత్రులకు చూపించండి అంది. అమ్మ ఎలుకా:) ఎన్ని కోరికలే అనుకోని తప్పుతుందా ఎంతయినా  "పెంపుడు ఎలుక" కదా అని ఒప్పేసుకున్న.  ఇంకో కోరిక అంది, మల్లేంటి అన్నా. ఏంలేదు గురూ గారూ , అదే చేత్తో వాళ్లకి ఏమి చెప్తారంటే నా బొమ్మెల ఉందొ కామేన్టమని   చెప్పండి, బాగుంటే ఇంకా వెయ్యొచ్చు కదా, అంది. అమ్మ నీ తెలివి తెల్లార  అనుకోని సరే రాస్తాలే అని ఒప్పేసుకున్న. అదండీ నా ఎలుక  అది గీసిన చిత్రం కథ. అది ఎలా గీసిందో మరి, ఇక దానిష్టం మీ ఇష్టం. ఎలా భరిస్తారో నాకేమి సంబంధం లేదు:) . 
మళ్ళీ పిలిచింది. మల్లెంటే అని  విసుగ్గా అన్నా. అప్పటి నుంచి చూస్తున్న నన్ను ఎలుక ..ఎలుక అని పది మందిలో నన్ను అవమానిస్తున్నారు అంది. మరేమనాలంటావు అని అడిగా. ఎంచక్కా నాకు ఇంగ్లీష్ లో పేరు పెట్టారు గా  " మౌస్" అని నన్ను ఆ పేరుతొ పిలవండీ అంది. సరేలే రేపటినుంచి అలానే పిలుస్తలే అని వదిలించుకున్న. ఇంతకీ అది గీసిన చిత్రం చూపించలేదు కదూ. క్రింద చూడండి. ఎలా ఉందొ దానికి చెప్పండి. మొదటిసారి కదా, ఎలా ఉన్న పాపం కాస్త అడ్జస్ట్ కండీ:) పోతుంటే , పోతుంటే అదే మంచిగా నేర్చుకుంటుంది లెండి. పాపం చిన్న ప్రాణి కదా కాస్త బాగుందని అంటే సంబర పడిపోతుంది, అల్పసంతోషి లెండి మా ఎలుక...సారీ అదే మా మౌస్.


Thursday, January 6, 2011

విందైన వంటకంబు- హ..హ...హ్హా..మనమే ముందు

మన తెలుగు వంటల ఘుమగుమల గురించి " శ్రీ రమణ " గారు వండి వడ్డించిన  ఓ మంచి వంటకం నా జిహ్వ  కు నచ్చి దానిలోని కొన్ని విషయాలు మీకూ వడ్డిద్దామని...మరి మీరు ఆస్వాదించండి ఈ షద్రసోపెతమయిన భోజనం.
" ఎవరి జాతి గొప్ప వారు చెప్పుకోవడం సహజమే. అది మంచి సంప్రదాయం కూడా. " పొగడరా నీ జాతి నిండు గౌరవము.. ఎ దేశమేగినా ఎందుకాలిడినా" అన్నాడు  కదా మహాకవి. కాని తెలుగువాడి జిహ్వ చాపల్యం వేరెక్కడా కనం వినం చవిచూడం. . వంటకాలలో ఎంత వైవిధ్యం ! తెలుగు విందులో వడ్డించిన విస్తరి అమ్మవారి మెడలోని నవరత్నహారపు పతకంలా ఉంటుందట . ఎన్ని రకాలు వడ్డించినా తెలుగువాడి కన్ను ఇంకా దేనికోసమో వెదుకుతూనే ఉంటుందట . తెలుగుజాతి జిహ్వని తృప్తి పరచడం తరమే బ్రహ్మకైన అంటాడు.
" అస్సలీ వంటా వార్పూ అనేది పురుష కళ కాలక్రమంలో అది స్త్రీల చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది ఇద్దరి చేతుల్లోనించి పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది  అంటాడు. నిజాం నవాబ్  సింహాసనం కోల్పోయినప్పుడు దాదాపు అయిదు వేల మంది వంట వాళ్ళు గరిటెలు భుజాన  వేసుకొని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారట. దాంతో   మన హైదరాబాదీ స్పెషల్స్ దేశమంతా వ్యాపించాయత . హైదరాబాది బిర్యాని, బావార్చి బిర్యాని ఎప్పుడయినా తిన్నార..అబ్బో విదేశాలకు కూడా ఈ బావార్చి బిర్యాని ఎగుమతి చేస్తారట ఓ సారి చదివాను.
 ఇగ మన కవుల బోజన ప్రియత్వం గురించి చెబ్తూ ముంగండ అగ్రహారీకుడు పండితరాయలు తెలుగు వంటల ఘుమఘుమల్ని డిల్లీ దాకా విస్తరిమ్పచేశాడట . శ్రీనాథుడు భోజన రాసిక్యత తెలిసిన ప్రౌఢ కవి. ఆవటేనని, ఇంగువ హంగులని అస్వాదిన్చినవాడు. పోతన సాత్వికాహారంతో, భక్తిప్రపత్తులతో భాగవత రచన చేశారు. అన్నమయ్య వైష్ణవ  ప్రసాదాలలో మునిగి తేలినవాడు.  "పాలకూడు" తియ్యందనాలు, పచ్చకర్పూరపు పరిమళాలు అనుభవించినవాడు.
తెలుగు అతిధికి కూర, వేపుడు, పప్పు...ఇలా పది రాకాలు వడ్డించండి. ఇంకా దేనికోసమో ఆ కళ్ళు విస్తరి వేడుకుతాయి. . "మన" అని కాదు గాని, నిజంగానే ఇంత వైవిధ్యం ఎక్కడా లేదు. అవును నిజంగా తెలుగు వారిది షడ్ర సోపెతమయిన భోజనమే!  .మంచి సాహిత్యాన్ని, మధుర సంగీతాన్ని, మహత్తరమయిన భోజనాన్ని సారూప్యత గల మిత్రులతో  తో కలిసి అస్వాదిన్చినపుడు వాటి రుచులు ఇనుమదిస్తాయని కాళిదాసు అభివర్నిన్చాదట . అరవై నాలుగు రకాల వరిధన్యాలు తెలుగు రైతు పండించగలడు. ఆ బియ్యాన్ని వండుకు తిని అరాయిన్చుకోగలదు. ఓ మహా పండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వం తో " హిమాలయాలు అన్నపు రాశుల్ల  ఉన్నాయన్నాడట"  తెలుగు వాడు వంటల మీద చేసిన రిసర్చి ఖగోళం మీద చేసుంటే ఈ పాటికి నవగ్రహాల జాతకాలని   బట్టబయలు చేసి వుండే వాడట.  తెలుగు వారి వంటల వైవిధ్యం గురించి చెబ్తూ కారం తో కారాన్ని మిళాయించి కొత్త రుచి తెస్తారట, పులుపులో పులుపు , షడ్రుచులలో రెండు వందల నలభై ఆరు షేడ్స్ తీసుక రాగల శిల్పం తెలుగుజాతి సొంతం అట.

వెలగ పండు గురించి చెబుతూ ఇది పప్పులో కమ్మగా మిలితమవుతుంది, ఇంకా వెలగపండు కుమ్ములో పెట్టి, ఆనక ఆ గుజ్జు తో ఏమి చేసినా ఇహలోక సౌఖ్యాలు అబ్బుతాయత. ఆహా ఏమి రుచి అనుకోకుండా ఉండ లేక పోతున్నారు కదూ. తెలుగు వాడి చల్ల పుసులుసు సెంటిమెంటు కు ఓ చక్కని ఉదాహరణ చెబ్తూ ఆస్తిపంపకాల్లో అన్న తమ్ములు ఇంట్లో ఉన్న పెద్ద రాచిప్పకొరకు   కొట్లాడుతూ  దాంట్లో ఇకడు  అంటాడట " అందులో అమ్మ పెట్టిన మజ్జిగ పులుసుతో ఈ శరీరం పెరిగింది. బచ్చలి కాడలె  వేసిందో , ఆనపకాయ ముక్కలే వేసిందో పెసర పునుకులే వేసిందో నాకనవసరం, నా పాతికేళ్ళ మజ్జిగపులుసు మధురస్మృతులు ఆ రాచిప్పని అంటి పెట్టుకుని వున్నాయి" అంటాడట.   ఇగాపోతే సినారె గారంటారు  శనగపిండి   తో చేసిన వంటకం ప్రియురాలు అట  , ఇడ్లీ ఏమో ఇల్లాలు లాంటిదట.
తిరుపతి వెంకట కవులు పకోడీ ఎట్లా చెయ్యాలో ఒక అవధానంలో చెప్పారట. ఓ గోదావరి తీర విద్వత్కవి అన్నాడట" నాయనా, పప్పు కలుపుకో, కూర నంచుకో, పప్పు కలుపుకో పచ్చడి కలుపుకో, పప్పు కలుపుకో ముక్కల  పులుసు వంచుకో అని పప్పులో శివుడున్నాడురా ..ఆహా పప్పు గురించి ఎంత బాగా చెప్పాడు. నిజంగా వేడి వేడి అన్నం పప్పు అందులోకి నెయ్యి పక్కన ఆవకాయ నంచుకొని తింటే ఇంకేం కావలి.
ముప్పయి ఏళ్ళ క్రితం వేటూరి వారికి ఓ కోరిక కలిగిందట. ఆయన పుట్టినరోజున సన్నిహితులందరికి అచ్చ తెలుగు భోజనం పెట్టాలనీ అదీ మద్రాసులో, ఓ పెద్ద స్టార్ హోటల్లో , పులిహోర, బొబ్బట్లు, గుత్తొంకాయ కూర తో భోజనం ఏర్పాటు చేయించారట. ఎంత భోజన ప్రియులు కాకపోతే "మాగాయ మహత్తరి లాంటి " పద బంధాలు వస్త్తాయి చెప్పండి.
విశ్వనాథ గారి జిహ్వా చాపల్యం గురించి రాస్తూ విశ్వనాథ గారి తమ్ముడు ఓ రోజు పొద్దున్నే ఓ సంచీ నిండా కూరగాయలు తీసుకొని మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి ప్రెస్ ముందునుంచి పోతుంటే మల్లాది గారు ఆయనను ఆపి, సంచిలో ఉన్న చేమ దుంపలు , వంకాయలు, దోసకాయలు పైన ఉన్న పొడవాటి పోట్లకాయలు, ములక్కాడలు చూసి వాటిని పరామర్శించి " అయితే మీ అన్నయ్య ఇవి తినే రామాయణం రాస్తున్నాడ? రాముడు సుక్షత్రియుడు ఈ చప్పిడి కూరలు తింటున్నాడ... ఎం రాస్తాడో ఏమో? అని పెదవి విరిచాడట!
ఇక సినిమా నటీమణుల విషయానికి వస్తే సూర్యకాంతం, షావుకారు జానకి గురించి మీకు చెప్పక్కర్లేదు,  తెలుగు జాతికి శాకాహారంలో ఎంత రేంజ్ ఉందొ మాంసాహారంలో అంతకు మించిన పరిది ఉందంటాడు. గుడ్లు, వాటి తల్లులు తండ్రులు మామూలే. ఇంకా ఎన్నెన్నో  పోలసల  పులుసు, రొయ్యపోట్టు, బొచ్చెల ఇగురు, రొయ్యల వేపుడు ఎన్నని, చింతచిగురు చిన్నచేప గొప్ప కాంబినేషన్ అట.  పోటాని  పచ్చిపులుసు కనుమర్గైయింది , మాగాయ పెసరప్పదము వేల్లిపోయిన్దేల్లిపోయిందని వాపోయారట జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. అందుకే మనమంతా నడుం కట్టి జాషువా పద్యంలా, చలం గద్యంలా, కృష్ణ శాస్త్రి గేయంలా, ఘంటసాల గానంలా మన జాతికే సాధ్యమయిన వేలాది తెలుగు  రుచుల్ని పదిలపర్చుకున్దామంటాడు. 
త్యాగరాయ స్వామికి వర్తకొలంబు అంటే చాలా ఇష్టమట. పుస్తికాయల వోరుగుతో చేసే పులుసు . ఆయన ఒక వస్త్రం మీద పుస్తికాయల్ని ఎండబెట్టుకొని  కృతిని మనసులో అల్లుకుంటూ కాపలాగా కూర్చున్నాడట. ఇంతలో ఓ పక్కింటి పిల్ల వాడు ఏదో ఆడుతూ వస్తే, అబ్బాయి కాలు తగిలి వొరుగులు చెల్లా చేదురైనాయత. త్యాగయ్యకు కోపం వచ్చి ఒక్కటి అన్తిచ్చాదట . కాసేపటికి ఆ పిల్లవాడి తల్లి తండ్రులు వస్తే ఈ పుస్తికాయల ఆసామి షరతులు లేని క్షమాపనలకు సిద్దపడ్డాడట. ఆ తల్లి తండ్రులు స్వామికి నమస్కరించి " అయ్యా! మావాడు ఏమిసుకృతం  చేశాడో తమరి చేత దెబ్బతిన్నాడు. జాతకుడు మాకా అదృష్టం లేదు కదా!" అంటూ త్యాగయ్య పాదాలంటి వెళ్లిపోయారట. ఇదంతా ఎందుకంటే " ఎంతవారలైన జిహ్వ దాసులేనని అనడానికి! 

ఇదండీ  మన తెలుగు వంటల ఘుమ ఘుమలు. అందరి జీవితాలు ఈ నూతన సంవత్సరంలో వడ్డించిన విస్తల్లుగా వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ,  మరి మీ ఘుమ గుమలాడే తెలుగు వంటల, రకరకాల కూరల, పచ్చళ్ళ, రక రకాల రుచుల కామెంట్లు వడ్డిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీఅందరికి  ఘుమఘుమలాడే నూతన సంవత్సర శుభాకాంక్షలు.