Sunday, September 4, 2011

అక్షర యాత్ర - నండూరి కి నివాళి



నండూరి రాం మోహన్ రావు గారి మరణం వార్త వినగానే, నేను చదివిన నండూరి వారి "అక్షర యాత్ర" గుర్తొచ్చింది. వారి గురించి రాసేంత వాణ్ని కాదు కానీ. నేను  చదివిన ఆ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ పుస్తకం 70  వ్యాసాల సంపుటి. వారి మాటల్లో చెప్పాలంటే " ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువ భాగం నేను అభిమానించే సాహితీ మూర్తులు, మిగిలిన శాతం నా అభిమాన గాయకులు , చిత్ర కారులూ, నటులు మొదలయిన వారు,  ...అన్నీ కలిపి ఈ సంకలనం ఒక పెద్ద కలగూర గంప. రక రకాల రంగు రంగుల పూల కదంబం." ఇందులోని వన్నీ పత్రిక రచనలే. " ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు, నిలువుటద్దం  లాంటి సంకలనం అన్న నండూరి మాటలు గమనార్హం. ఈ వ్యాసాల్లో ఎన్నో రకాల వ్యక్తులు. కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నంతగా  విభిన్న వస్తువులపై వ్యాసాలు రాశారు.ఇందులోని వ్యాసాలను వివిధ రకాలుగా వర్గీకరించారు, అవేంటంటే " స్మృతిపథం", "ప్రతిభా పరిమళాలు", మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూర తీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞ్యాపకాల నీడలు

స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17  ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ  శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12  వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై  5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10  వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.

పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నట్లు నండూరి వారు వ్యాసాలకు పేరు పెట్టడం లోనే ఎంతో  శ్రద్ధ , నైపుణ్యం కనపరిచారు.

వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు  చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు..  శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ?  శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23  ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం  కాకుండా ఉంటాడా.

ఇలా కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నట్లున్న ఈ వ్యాస సంపుటి మళ్ళీ ఒక సారి చదువుతూ నండూరి కి నివాళి అర్పిస్తున్నాను.




Friday, September 2, 2011

తెలుగుకు వెలుగు


తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం  పొందడం ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది.  ఈ సభ్యత్వం  తో ఇంటర్నెట్ తెలుగు లిపి లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లిపిని రూపొందిస్తారు.  కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు  రూపొందిస్తారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో  తెలుగు సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే  కాకుండా తప్పులు దొర్లితే వెంటనే పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.  తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం మనందరికీ శుభవార్త.