Wednesday, October 5, 2011

నిలువు చెంబు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి





విశాలాంధ్ర లో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే అనుకోకుండా నా చేయి తాకి ఓ పెద్దాయన క్రింద పడి పోయాడు.  అయ్యో క్షమించండీ అంటూ లేపి నా మానాన నేను పోదామని , ఎందుకైనా మంచిదని ఎవరా అని చూశా...శ్రీపాద వారు. పెద్దాయన కదా వీరితో మనకెందుకులే అని ఓ నమస్కారం పెట్టుకొన్నా. శ్రీపాద వారి గురించి విన్నవి , చదివినవి ఓ సారి మనసులో మెదిలాయి. వారి కథల నేపద్యం "గోదావరీ తీరం", పాత్రలు ఎక్కువగా శ్రోత్రీయ బ్రాహ్మణులూ అదే కాకుండా ఎక్కువగా వితంతు వివాహాలు , మూడాచార   నిరసనలు, సాంసారిక జీవితంలో మాధుర్యం, స్త్రీ స్వాతంత్రం, అంటరాని తనం మొదలగు కథా వస్తువులతో కథలు రాశాడని, భాష విషయంలో వ్యావహారిక భాషను, నుడికారానికి పట్టాభి షేకం చేసిన మహానుభావుడని అన్నీ గుర్తొచ్చాయి. ఇంత పెద్దాయన కదా ఓ సారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయ భాగ్యం చేసుకుంటే ఎలా ఉంటుంది.  మనకు కొరుకుడు పడతారా లేదా అనే  అనుమానం తో ధైర్యం చేసి వారి ని తీసుకొని వారి " నిలువు చెంబు" నా చేత పట్టుకొని ఇంటికి చేరా. ఇంటికెళ్ళగానే ఆ " నిలువు చెంబులో " ఏముందో అని చూశా.  నీళ్ళు అనుకున్నా కాదు...తేనే..అమృతం   ఆ అమృతం లోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మీకు కూడా కొంత పంచుదామని ఈ చిన్న ప్రయత్నం....ఆస్వాదించండి మరి. ఈ నిలువు చెంబు లో మొత్తం 8 కథలున్నాయి.

ప్రణయ తపస్సు: వితంతు వివాహం గురించి సాగే కథ. ఓ బైరాగి నలబై  ఏళ్ల కు పైగా , తను పెళ్లి చేసుకుందామని అనుకున్న  బాల వితంతువు అనుకోని పరిణామాల వల్ల  చనిపోతే ఆమె తండ్రి ఆమెకు కట్టించిన సమాధి  మండపం పై చేసే ప్రణయ తపస్సు ఈ కథ. నలభై ఏళ్ల క్రింద జరిగిన విషయాలు ఆ బైరాగి మనకు చెప్పడమే ఈ కథ. 

కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
ప్రణయ భంగము: ఇది కూడ ఒక బ్రాహ్మణ బాల వితంతువు కథ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త ను తల్లిని కూడా పోగొట్టుకొన్న యువతి కథ. దుక్కమే   తోడూ , నీడ, జీవం, ధైర్యం,సకలం అలా రూపొందిన  దుక్కమై పోతుంది. తండ్రి వితంతువైనా సరే లోకాన్ని ఎదిరించి పెళ్లి చేస్తా అంటాడు. తనూ సంతోషించి ఎదురింట్లో  ఉన్న బ్రాహ్మన్ని కోరుకుంటుంది. అతడు భార్య చని పోయి ఒక భోగం దాని ని  ఉంచుకుంటాడు. నా శరీరం చెడిపోయింది అని ఒప్పుకోడు. తర్వాత ఈమె తండ్రి అనుమతితో అతనికి సేవ చేస్తుండగా అనుకోని పరిస్తితులలో పరిస్థితి విషమించి అతడు చనిపోతాడు. ఇంతజరిగాక సంసారం లో ఏముందని ఆ జగన్మాతని ఆశ్రయించడం ఈ కథా  సారాంశం.

వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి  మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా  మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.

నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.

ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో   సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.

అశ్వ  హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత. 

బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం  అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.

శ్రీపాద గారు మొదటి కథ లో అన్నట్లు " అప్పటి రుచులు వెఱూ , ఇప్పటి రుచులు వెఱూను?  అప్పటి ధర్మాలు వెఱూ ఇప్పటి ధర్మాలు వెఱూను.అప్పటి యువకుల సంకల్పాలు వెఱూ ఇప్పటి వారి సంకల్పాలు వెఱూను. అప్పటికీ ఇప్పటికి ఏతాం పట్టంత తేడ వుంది. అప్పటి కథలు అర్థం చేసుకోవాలంటే ముందు హృదయాన్ని  అప్పటి కాలంలో ప్రవేశ పెట్టాలి. లేకపోతె విన్నా లాభం లేదు".