Sunday, September 2, 2012

చొలీ కే పీచే


భారత దేశం లోని అగ్ర శ్రేణి రచయిత  లలో ఒకరయిన మహా శ్వేతా దేవి రాసిన కథా సంకలనమే ఈ "చొలీ కే పీచే  ". ఇందులో మొత్తం మూడు కథలు, చోలీకే పీచే, పాల తల్లి, ద్రౌపది ఉన్నయి. ఈ కథలన్నింటిలో కనపడే  సాధారనాంశం , కథా వస్తువు రొమ్ములు. రచయిత్రి రొమ్ములను కథాంశంగా తీసుకొని , విభిన్న కథలలో  కలవర పెట్టే భయానక దృశ్యాలను ఈ కథల్లో రచయిత్రి చిత్రిస్తుంది. వీటిలో రొమ్ములు కేవలం ప్రతీకలు మాత్రమె కావు. దోపిడీ, సామాజిక వ్యవస్థ కర్కశమయిన  అత్యాచారాలను అవి బట్ట బయలు చేస్తాయి.

మొదటి కథ " చొలీ కే పీచే   " లో ఉసిన్ ఒక ఫోటో గ్రాఫర్ ,వలస కూలీ గా వచ్చిన గంగోర్ అనే యువతి ఆచ్చాదన లేని అందమయిన రొమ్ములు ఒక పోటో గ్రాఫర్ గా అతన్ని ఆకర్షిస్తాయి.కూలీ నుంచి ఒళ్ళు అమ్ముకొనే యువతి గా గంగోర్ మారడం...చివరకు ఏ  రొమ్ములయితే ఉసిన్ ని ఆకర్షిస్తాయో,వాటి స్తానంలో రెండు ఎండి పోయిన మచ్చలు, ముడతలు పడిన చర్మం, రెండు అగ్ని పర్వతాలు పేలుతూ విరజిమ్మిన లావాలా, చూసి పారిపోతూ రైలు కింద పది పోయి ఉసిన్ చనిపోవడం కథాంశం.  సామూహిక అత్యాచారం, కొరకడం, కోరడం,సామూహిక అత్యాచారం , పోలీసులు, కోర్టు కేసు....మళ్ళీ లాకప్ లో సామూహిక అత్యాచారం... అలా వలస కూలీ నుంచి ఒక వొళ్ళు అమ్ముకొనే యువతిగా గంగోర్ మారడం వెనుక సమాజం ఆమె ఫై చేసిన అత్యాచారం రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. రచయిత్రి చెప్పదల్చుకున్నది  రవికె మాటున ఉన్నది అప్రాదాన మయిన అంశం కాదు, చోలీకే...పీచే...రవికె వెనక ఉన్నది ప్రజలపై సామూహిక అత్యాచారం , అలా గంగోర్ నుండి పారిపోతూ రైలు ప్రమాదం లో ఉసిన్ చనిపోవడంతో కథ విషాదంగా ముగుస్తుంది.

రెండవ కథ "పాల తల్లి, " ప్రమాదం లో కాలు పోయిన భర్త, విధి లేని పరిస్తితుల్లో, కిరాయికి పాలిచ్చే తల్లి గా వృత్తి స్వీకరించిన యశోద కథే ఈ పాల తల్లి కథ.ఎవరివల్ల  అయితే కారు ప్రమాదం అవుతుందో వాళ్ళ ఇంట్లో కిరాయికి పాలిచ్చే తల్లిగా  పాలివ్వడం ఒక వృత్తి గా స్వీకరించి, మరి ఎప్పుడూ పాలివ్వాలంటే తను కూడా ఎప్పుడూ కడుపులో బిడ్డతో ఉండాలన్న  భర్త ఆలోచనను గౌరవించి ఇరవై బిడ్డలకు తల్లి అయి, యజమాని ఇంట్లో ఇంకో ముప్పయి మందికి పాలిచ్చి, యశోద వృత్తి తల్లి అవుతుంది. అమ్మ తనం ఆమె జీవన విధానం అవుతుంది. కాలం ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండదు కదా, యజమానురాలు చనిపోవడం, కుటుబం చెల్లా చెదురు కావడం, ఇప్పుడు పాలు ఇవ్వలేని, యశోద భారమయి చివరికి భర్త తో కూడా పోట్లాడి, వంట మినిషి గా మారుతుంది. ఎ రొమ్ములయితే ఆమె జీవనాదారంయ్యయో  అదే రొమ్ము క్యాన్సర్ తో ఆమె చనిపోవడం  తో కథ ముగుస్తుంది. ఏళ్ల తరబడి తను పాలిచ్చి తను సాకిన కొడుకులు, చివరికి తన  అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు ఆమెకు విద్రోహం చేస్తాయి. చివరి క్షణాల్లో యశోద పరిస్తితిని రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. ఒక కిరాయి కి పాలిచ్చే తల్లి వృత్తిని చేపట్టి, ఏళ్ల తరబడి ఎంతో మందికి పాలిచ్చి చివరికి తన కడుపున పుట్టిన బిడ్డలు, భర్త, పాలిచ్చి సాకిన  కొడుకులు, అందరూ కాదనుకొని, చివరకు తన అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు కూడా ద్రోహం చేసి(క్యాన్సర్ బారిన పడి) యశోద ఒంటరిగా హృదయ విదారకంగా చనిపోవడం తో కథ ముగుస్తుంది.

మూడవ కథ "ద్రౌపది".ద్రౌపది కథలో ప్రధాన పాత్ర  దోపది. ఒక ఆదివాసీ విప్లవ కారిణి. భర్త చనిపోయి న తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. పోలీసు కస్టడీ లో ఆమెను చిత్ర హింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడతారు.చివరికి తెగించిన ఆమె, పచ్చిగా కొరకబడ్డ, నెత్తురోడుతున్న వికృతంగా కోసేసిన రొమ్ములతో  , చీలికలైన చను మొనలతో, బట్టలు తొడగానివ్వకుండా, మొండి పట్టుదల నిండిన పెను అట్ట హాసంతో  ఆమె ఊగి పోతూ ముందుకు నడుస్తుంటే నిరాయుదురాలయిన ఆమె  ముందు నిలబడడానికి సాయుదులయిన శత్రువులు వణికి పోతారు. ఈ కథలో గాయపడ్డ రొమ్ములను రచయిత్రి  శత్రువును వణికించే ఆయుధాలుగా చిత్రీకరిస్తుంది. కథలో అంశంగా ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీ, దాన్ని ఎదుర్కోవడానికి ఆదివాసీలు సాయుధులుగా మారడం, వాళ్ళ పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు తెల్పుతుంది. 

పుస్తకం: చోలీకే పీచే
రచయిత: మహా శ్వేతా దేవి
పబ్లిషర్స్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
వెల:కేవలం రూ.13
అనువాదం: కలేకూరి ప్రసాద్, సహవాసి 

Friday, March 23, 2012

సలాం హైదరాబాద్


హైదరాబాద్ నగర నిర్మాణం ప్రేమమీద ఆధారపడి ఉంది. కులీ కుతుబ్షా ప్రేయసి బాగమతి కులీకుతుబ్షా జనానా లో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.అప్పటి ప్రధాని గుజ్రాల్ "నేను చూసిన అందమయిన హైదరాబాద్ ఏమయ్యింది. ఇప్పుడున్నది సిమెంట్ కాంక్రీట్ భవనాల అరణ్యమే" అని అన్నాడట. ఇంకెవరో అన్నారు "హైదరాబాద్ కీ ఆంగాన్ గాయబ్" అని. మరి ఆ అందమయిన హైదరాబాద్ ని చూడాలని ఉందా. హైదరాబాద్  పాత నగరం గల్లీ గల్లీ తిరగాలని ఉందా...ఈ నవలలో రచయిత మనల్ని తనతో ఆ పాత నగరపు , ఆ చార్ సౌ సాల్ పురానా షహర్  గల్లీ గల్లీ తిప్పి ఆ నగర అందాలను, మనకి కళ్ళకు కట్టినట్టు చూయిస్తాడు.

డిల్లీ , లక్నో నగరాల చరిత్ర సాహిత్యం లాగా హైదరాబాద్ గురించి ఎందుకు లేదు అన్న ఆలోచన , తపన లోనుంచి పుట్టిందే ఈ  "సలాం హైదరాబాద్ ". ఇది రాయటందుకు నా అర్హత ఏమిటంటే " నేను పైదాయిషీ  హైదరాబాదీ" నని ఒకింత గర్వంతో అంటాడు." పాత నగరం గల్లీలలో కళ్ళు తెరిచి ఈ భూమి మీద పడి పాత నగరం పొత్తిళ్ళలో, గండిపేట నీళ్ళతో పెరిగి ఈ గూటి పక్షిగా ఇక్కడి పాటనే పాడి ఇంకా " జీనా యహా , మర్నా యహా, చివరాకరికి పురానాపూల్ చితి మంటల చిటపటలలో నుండి ఫీనిక్స్ మాదిరి లేచి చార్ సౌ సాల్ పురానా షహర్ గల్లీ లలో రెపరెపలాడుతూ మళ్ళీ విహరిస్తాను, మళ్ళీ మళ్ళీ జీవిస్తాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.తానూ పుట్టింది పెరిగింది పల్లెటూరు అయినా పట్టణమైనా దాని మట్టిని, మట్టివాసనని , ఆ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళను, మనిషి అయిన వాడు మనసు నిండా ప్రేమిస్తాడు. అలా హైదరాబాద్ మీద తన ప్రేమను ఇలా చూపిస్తాడు మనకు రచయిత.

ఈ నవల లో ప్రధాన పాత్ర స్వామి అనే యువకుడు , అతని ఆత్మ కథ. ఆ నేపధ్యంలో   మనకు హైదరాబాద్ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు, నగర జీవితం, ఈ నగరం నేల మీద నడిచిన రాజకీయాలు, ఉద్యమాలు అన్నిటినీ రచయిత మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు.

కథలోకి వస్తే  కథా కాలం 1969 . 17 ఏళ్ళ స్వామి కాలేజీ జీవితంతో మొదలవుతుంది.ఉండేది శాలిబండ. చిన్న వయసులో హటాత్తుగా చూసిన చార్మినార్ ఆ చిన్నారి హృదయంపై చెరగని ముద్ర వేస్తుంది.చార్మినార్ పెహ్లీ నజర్, పహలా ప్యార్ అయ్యింది. చార్మినార్ ఎదురుగా ఉన్న ఇక్బాల్ హోటల్లో కూర్చొని  జిగ్రీ దోస్త్ చార్మినార్ తోటి ఎడ తెగని ఏకాంత నిశ్శబ్ద మౌన రాగాల సంభాషణ....లంగోటీ యార్ దోస్తాన... మనిషికి ముక్కెట్ల   అందమిస్తదో , హైదరాబాద్ కి చార్మినార్ అట్లా అందమిస్తాది అంటడు.ఇంకా హైదరాబాద్ నగర సుందరి ముక్కుపుడకల తళుక్కున మెరిసే మేలిమి ముత్యమే చార్మినార్ అంటాడు.హైదరాబాద్ కీ షాన్ అఉర్ శౌరత్ చార్మినార్ అంటడు. స్వామి మిత్రులతో 1969  తెలంగాణా ఉద్యమంలో పాల్గొనటం అతని జీవిత నేపద్యం లో హైదరాబాద్ మూలాలు, సంస్కృతి , సంప్రదాయాలు, చరిత్ర,, నిజాం కాలేజీ లో మొదలయ్యి, రక్త సిక్తమయిన మలుపులకు, ఎవ్వరూ ఊహించని దారులకు తరలిన ప్రత్యెక తెలంగాణా ఉద్యమం గురించి, ఉద్యమ వేదిక గా ఉస్మానియా యూనివర్సిటీ  క్యాంపస్ కేంద్రంగా ఎలా మారింది, ఎలా ఉవ్వెత్తున ఎగిసి, రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయి చివరికి ఉద్యమం ఎలా అణగ దొక్క బడిందో, ఎలా చల్లారి పోయిందో మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు. 

మనం ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటె స్వామి తో పాటు హైదరాబాద్ నగర వీదుల్లో , గల్లీ గల్లీ లో ఆ పాత నగరాల అందాలను చవిచూస్తూ , ఉద్యమంలో మనమూ పాలు పంచుకొని, ఇరానీ కేఫ్ లలో బోలో సాబ్! క్యా హుకుం హై అంటూ వొంగి వొంగి సలాములు చేసే సర్వర్లూ, మనమూ  దో మే చార్  చాయలు తాగుతూ,  కమ్మటి బిర్యానీ వాసనలు, గుబాళించే సమోసా వాసనలు ఆస్వాదిస్తూ , మధ్య మద్యలో అతని  పురా స్మృతుల్లో పెటిల్లున తెరుచుకొనే "పండోర బాక్స్" ఆ పందోరా బాక్స్ లోకి స్వామి తో పాటు మనమూ నగర చరిత్ర పుటల్లోకి ప్రయాణించి, అక్కడ కులీ కుతుబ్షా , నిజాం లను కలిసి ,కైరునీసా ప్రేమ విషాద  గాధలలో మునిగి తేలి, తుర్రెబాజ్ ఖాన్ జ్ఞ్యాపకాల విషాదాల్ని పంచుకుంటూ, ఒక్కసారిగా స్వామి చిన్నతనం లోకి వెళ్లి అలా బొంగరం లా  చరిత్రలోకి , స్వామి చిన్న తనం  లోకి, గతం నుంచి వర్తమానం లోకి , వర్త మానం లోనునుంచి గతం లోకి  మనల్ని తిప్పుతూ సాగిపోతుంది. పాత్రలతో మమేకమయి ఒక సజీవ దృశ్యం మన కళ్ళ ముందు చూస్తున్న అనుభూతి కల్గిస్తుంది.  కైరున్నీసా కండ్ల  పొంట ఒలికిన ఒక కన్నీటి చుక్క ఆమె చెక్కిలి మీద ఘనీభవిస్తే, అది రెసిడెన్సీ గా రూపొంది అదే ఇప్పుడు కోటీ వుమెన్స్ కాలేజీ గా మారిన వైనం, రెండు  మతాల మధ్య, రెండు ఖండాల మధ్య ప్రేమ, ఆ విషాద ప్రేమ గాధ కళ్ళకు కట్టినట్లు మన ఎదురుగా చూస్తున్న అనుభూతి.హైదరాబా పురాతన మూలాల్లోనుంచి ఇప్పుడున్న నగరం లోకి జరిగిన ట్రాన్స్ ఫార్మేషన్ రచయిత ఎంతో చక్కగా మనం ఒక ద్ర్యష్య కావ్యం చూస్తున్నట్లు చూయిస్తాడు. 


ఒక్కో పుట చదువుతూ పోతూ ఉంటె ఎన్నో మన జ్ఞ్యాపకాలు, మనం చూసినవి , మనం అనుభవిన్చినవీ  మనం కాల గర్భంలో మరిచి పోయినవీ, ఎన్నో ఎన్నెన్నో....పాన్దాన్లు,  బగల్దాన్లు , బావిల పడ్డ బొక్కేన్లు తీసే  వెయ్యి కాళ్ళ జేర్రోలె, వంద చేతుల ఆక్టోపస్ వలె ఉండే పాతాళ గరిగలు, నయా పైసలు, ఎర్ర మన్ను తో ఇల్లలకడం, పీరీల పండగ , బొగ్గులు రాజేసి చా పెట్టడం, ఎర్రటి మట్టి పొయ్యిల మండే బొగ్గు కనికల స్మృతులు మనల్ని గతంలోకి లాక్కేలతాయి.అమ్మపెట్టిన ఉప్పుడు పిండిల శర్కర కలుపుకొని తినడం, బాపూ అన్న పదం లో ఆప్యాయత (మా అక్క మా తాతయ్య ని మా అమ్మ తో పాటు బాపూ అంటుంది ) ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పొతే ఒక్క సారి కాదు పదే పదే మనల్ని పురా స్మృతుల్లోకి తీసుకపోతుంటాడు. హైదరాబాద్ ఇరానీ కేఫ్ ల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇరానీ కేఫ్ ల అందాలు ,  ఒక అతి పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ లో కూర్చొని ఎంతకూ ముగింపు లేని సుదీర్గ జన జీవన నాటకాన్ని చూస్తున్నట్లుండే ఇరానీ కేఫ్ లు అంటాడు. నిజంగా వరంగల్ లో జవహర్ కేఫ్ లో కూర్చొని దో మే చార్ చాయ్ అనగానే ఆ సర్వర్ నాలుగు గ్లాసుల్లో వేళ్ళు పెట్టి ఒక్క సారి మన ముందు శబ్దం చేస్తూ పెట్టి, ఘుమ ఘుమ లాడే ఇరానీ చాయ్ తెచ్చిన జ్ఞ్యాపకాలు ...ఎలా మరిచి పోగలం..

1969 లో జరిగిన  తెలంగాణా ఉద్యమ చరిత్ర చదువుతుంటే , మళ్ళీ 2010 /11 ల జరిగిన్ ఉద్యమం  కండ్లల్ల మెదులుతుంది.అప్పటికీ, ఇప్పటికీ , 42  సం. గడిచినా పరిస్తితులలో గానీ , ఉద్యమంలో గానీ ఎటువంటి మార్పు లేదు, మన బతుకుల్లాగే. అప్పటిలాగే ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారి పోయింది ఇప్పుడు కూడా.
రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్న చని పోయిన  స్వామి స్నేహితుడు జోసెఫ్ జెఫ్రీ కళ్ళలా...నిరీక్షిస్తున్న ఎన్నో కళ్ళు......చల్తే చలో చల్తే చలో చల్తే చలో. ఎ వక్త్ కీ ఆవాజ్ హై చల్తే చలో. సలాం హైదరాబాద్.. ముగింపు లేని కథ...అలా సాగుతోంది.
రచన:  సలాం హైదరాబాద్ 
రచయిత : లోకేశ్వర్ 

Monday, March 19, 2012

ముళ్ళపూడి వెంకట రమణ తొలి రచన


"అమ్మ మాట వినక పొతే"....1945  లో "బాల" పత్రికలో  రమణ గారి తొలి రచన


"నాకూ వుంది ఒక కల" (I TOO HAD A DREAM)




ఈ ఆదివారం చాల రోజుల తర్వాత ఒకే రోజు పూర్తిగా చదివిన పుస్తకం, "నాకూ వుంది ఒక కల" (I TOO HAD A DREAM) రచయితః వర్గీస్ కురియన్.
ప్రపంచంలోనే అతి పెద్ద పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న "పాల వెల్లువ " రూప శిల్పి డా.వర్గీస్ కురియన్ కృషి వల్ల భారత దేశం ప్రపంచం లోనే అతి పెద్ద పాల ఉత్పత్తి దేశం అయ్యింది.గుజరాత్ లోని ఆనంద్ లోని కొద్దిమంది రైతులు వాళ్ళ పాలని అమ్ముకోవటానికి ఏర్పాటు చేసుకున్న కైరా జిల్లా పాల ఉత్పత్తి దార్ల సహకార సంఘం కురియన్ కొన్ని కారణాల వల్ల వెళ్ళడం, వాళ్ళ నాయకుడయిన త్రిబువన్ దాస్ పటేల్ వ్యక్తిత్వం నచ్చి వాళ్ళతో కలిసి దాన్ని అమూల్ గా అభివృద్ధి చేయడం లో అతని అనుభవాలు చదవి తీరాల్సిందే.
ఈ ఆనంద్ తరహా సహకార సంస్తలు ఎంత అభివృద్ధి చెందాయంటే భారత ప్రభుత్వం కురియన్ చేత నేషనల్ డైరీ డెవెలప్మెంట్ బోర్డ్ ని స్తాపించడం జరిగింది." నీ లక్ష్యమే నిన్ను నడిపిస్తుంది" అనే ఆయన జ్ఞ్యాపకాలలో తన జీవిత గాథ ని పాడి పరిశ్రమని ఏ విధంగా అభివృద్ధి లోకి తెచ్చిందీ లాంటి అనేక విషయాల్ని ఎంతో వివరంగా చెప్పారు. ఎంతో ఉత్తేజాన్ని కలిగించే ఆయన జ్ఞ్యాపకాలు మనం తెలుసు కోవచ్చు.
 టెలీ కమ్యునికేషన్ లో నిష్ణాతుడు రాజీవ్ గాంధీ సలహాదారు అయిన "శాం పిట్రోడా" కురియన్ గురించి మాట్లాడుతూ.."కాస్త పిచ్చి వున్నా ఈయన ఒక కలతో వచ్చారు.ఈరోజు ఆయన దూరద్రుష్టి ఆయన భావాల వల్ల వచ్చిన ఫలాలు మనందరం అనుభవిస్తున్నాం.ఆయనతో ప్రతి విషయంలోనూ మనం ఏకీభవించం .ఆయన చేసిన ప్రతి చిన్న విషయాన్నీ మనం అభిమానించం.కానీ ఆయన ఏదయితే సృష్టించారో అది ఒక కల.దాన్ని మనందరం  పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం.ఇది నిజం.మన ప్రజల కోసం ఎక్కువ కలల్ని సృష్టించడానికి ఆయన లాంటి వాళ్ళు చాలా  చాలా మంది మనకు అవసరం" అంటాడు. ఆయన కలని సార్ధకత చేసుకోవడంలో  లో అతను  ఎదుర్కొన్న ప్రతికూల పరిస్తితులు,సవాళ్లు, విజయాలు, అసంతృప్తులు  వాటిన అధిగమించిన విధానం నిజంగా మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.కురియన్ ఒక క్రాంతి దర్శి. ఆయన అనేక సంస్తల్ని స్తాపించి భారతదేశాన్ని ప్రపంచం లోనే అతి పెద్ద పాల ఉత్పత్తి దేశంగా తీర్చి దిద్దారు. పాల ఉత్పత్తి సరఫరాలో ఓ పంథాని అభివృద్ధి చేసి ఆరోగ్యకరమయిన పోషక విలువలున్న పాలని లక్షలాది మందికి అందించారు. అమూల్ ని ఒక బ్రాండ్ గా మలచడంలో అతని తాపత్రయం, కష్టం మన కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. రతన్ టాటా ముందు మాటలో అన్నట్టు " ఈయనకున్నలాంటి దూరదృస్టి, నిబద్దత, అంకితభావం, జాతీయస్పూర్తి తో వేలాది కురియన్లు ఉన్నట్టయితే మనదేశం ఇంకెంత పురోభివృద్ది సాదించేదో "
రచయిత : వర్గీస్ కురియన్
అనువాదం: తుమ్మల పద్మిని, అత్తలూరి నరసింహారావు
పబ్లిషర్ : అలకానంద
వెల: 125 /-