Saturday, January 19, 2013

ఒక కవిత నిదురిస్తుంది నా ఎదలో.....జమీలా నిషాత్



(అలజడి మా జీవితం  , మౌఖిక కార్య శాలలో మహిళలు చెప్పిన ఆత్మ కథల సంకలనం నుంచి ....అనువాదం రెంటాల కల్పన)

ఆడ పిల్లలు నాట్యం చెయ్య కూడదు అంటే నాట్యం వదిలేసి, పెయింటింగ్ లోకి మళ్ళి రహస్యంగా, అదీ ఆగి పోయి , అణిచివేత లోనుంచి కవిత్వం లోకి మళ్ళి ,  ఆ కవిత్వం కూడా తన కోసం కాకుండా నిషాత్ అనే స్నేహితురాలికోసం , ఆమెతో కలిసే స్వేచ్చ లేక....నిషాత్ అంటే సంతోష మట  కాని ఆ సంతోషం తో కలయిక ఎప్పుడూ స్వప్నమే ..  ఆ బాధ , దిగులు ఇవన్నీ తన రక్తం లోనుంచి కవిత్వం లోకి ప్రవహించి కవిత్వంగా....

                 "రక్తం లో ఆలోచనల కెరటం ఉబుకుతుంది

                   నా కలం నుంచి
                   రక్తం పడటం మొదలవుతుంది"

తెరల మాటున వుండి, తండ్రి సాహిత్య చర్చల్లో పాల్గొనలేక  నిరాశ తో " నన్ను ప్రతీ రంగులోన ముంచెత్తావు  నువ్వు. కావీ ఇవన్నీ  రంగులే: నేను కాదు" అని రాసుకున్న జమీల....ఛందస్సులో లయలో రాసే కవిత్వం త్రుప్తినివ్వక వచన కవిత్వం లోకి వచ్చి.....పెళ్ళయి, ఆ తర్వాత మృత్యువు కి చేరువయిన తండ్రి తో....మృత్యువుని  చూసినట్టే, ఆ మరణం తర్వాత మారిన తన జీవితం...రాయటమే విముక్తి అనుకోని తిరిగి రాయటం మొదలుపెట్టిన జమీల.గత కొన్నేళ్లుగా ముస్లిం ఉనికికి సంబంధించిన వివిధ అంశాల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీల...స్త్రీల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీలా...స్త్రీల కష్టాలు అణిచివేత చూసి తనకున్న అనుభవంతో ముస్లిం బాలికలల్లో కొత్త చైతన్యం.. ఓ కొత్త ఆత్మ విశ్వాసం మొలకేత్తటానికి జమీల కృషి చేస్తున్నారు. ఒక భాష గా ఉర్దూ ఎప్పటికీ సజీవంగా ఉండాలని ఆకాంక్షించే జమీలా మొదిఅతి నుంచి  ఉర్దూ లోనే కవిత్వం రాస్తున్నారు.ఆమె కవిత్వం లోంచి కొన్ని.....

పొద్దు వాలింది/అన్నివైపులా/ఒక దుఖ్హం కమ్ముకొస్తుంది/కారు చీకటి నీడ పాకింది/సాయంత్రపు కళ్ళు కూడా మూత పడ్డాయి/

ఎర్రెర్రని  వస్త్రాలలో చుట్టి / నీ ఇంటి అందానివిగా నన్ను అలంకరించావు/...అప్పుడు నాకేం తెలుసనీ/తలాక్, తలాక్,తలాక్ అంటూ పిడచ కట్టుకుపోయిన నాలుకతో నీ గొంతు నన్ను రోడ్డున పడేస్తుందని/

కన్రెప్పల తీగల్ని మీటుతున్న/ఈ వాయిద్యం పేరేమిటి/ఈ తెరపైన  వెలుగుతూ, చెదిరిపోతున్న/ఆ దృశ్యం ఏమిటి?/మదిపైన  మబ్బుల్లా కమ్ముకొస్తున్న ఈ నీడ ఏమిటి?/నీకు తెలుసా, నేను నీడల్ని ప్రేమిస్తాను/కాని నీడ నా పైన రెక్కలు చాచినప్పుడల్లా/ ఆలోచనల వెల్లువ/రక్తంలో పోటేక్కుతుంది/అప్పుడిక కలంలోంచి/నెత్తురే  కారుతూ వుంటుంది/

ఏకాంత సముద్రంలోంచి బయటపడి/జీవితం/జన సముద్రంలో మునిగిపోతుంది/

నువ్వూ నేనూ/కలిసి పంచుకున్న ఆ క్షణం.../ఎంత అద్బుతమో/.....అదొక్క క్షణమే/ఒక ఉన్మాద క్షణం/ ప్రేమో కామమో/ఏదో తెలియదు/అదొక ఉద్వేగం/బిందువు/బిందువుగా/రాలిన ఉద్వేగం/

నేనొక బిందువుని/విశ్వానికి కేంద్రాన్ని/వలయవలయాలుగా నువ్వు నీ చుట్టూ నువ్వు/నా లోపల పరిబ్రమిస్తున్టావు/నేను యోనిని/జీవన దారని/నేను వేరుని/ఈ లింగారన్యమన్తా/ నా చుట్టూరా పుట్టుకొచ్చిందే/

నా లోపల/హృది లోపల/నిద్రిస్తోందొక కవిత/ఓ మసక అద్దం/దాన్ని ప్రతిబిబించాలన్న కోరిక కొద్ది/ఓ గజల్/ఓ రేఖ/ఓ మాట/ఒకలా అవునో/కదూ/రాత్రీ పగలు/తనవైపు లాక్కుంటుంది నన్ను/సంగీతం లేదు/ఒక్క ధ్వనీ లేదు/

కాగితానికీ కాలానికీ మధ్య యుద్ధం చెలరేగింది/అక్షరాలూ రక్తం లో స్నానించాయి/కాగితం రెండు ముక్కలైంది/ఒకటి నువ్వు ఇంకోటి నేను రెండు ముక్కలు/గదిలో రెండు మూలల్లో ఇంతలో తపన దేవతలా దిగి వచ్చింది కిటికీ లోంచి/కాగితంముక్కల్ని ఎరుకోచ్చింది మంచంమీద ఉంచింది/ఆత్మీయత పవిత్ర జలాల్ని కురిపించింది/అప్పుడు పుట్టింది ఓ కవిత// చివరికి నిశ్శబ్దం కూడా నన్ను ఊరు కొనివ్వదు / ఈ కవిత పేరేమిటి?నాలోపల నిద్రపోతూ నన్ను నిద్రపోనివ్వని ఈ కవిత ఏమిటి?/