Sunday, October 4, 2015

అప్పుడు మరణం


సారంగ సాహిత్య పత్రికలో  నా కవిత  "అప్పుడు మరణం "

జీవించడం
నేను నా అనుభూతులూ, నా స్పందనలూ, నా అనుభవాలూ
ఆరాటాలు , పోరాటాలూ, ప్రేమలూ, ద్వేషాలూ, సుఖాలూ, దుఖాలూ సమస్త జ్ఞాపకాలూ !
ఇదేగా జీవితం…జీవించడం-
మరణం
మనకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం
శాశ్వతమని మనం తలపోసే వాటికి దూరంగా
రెప్పపాటులో  ఎక్కడికో తెలియని లోకాల్లోకి పయనం-
చేతనలో…..అచేతనలో
మరణమన్న  భయాన్ని ముక్కలు  చేస్తే
లోలోన….
అచేతన జారీ చేస్తున్న ఆజ్ఞలను
పక్కకి నెట్టేసి
బ్రతుకు భయం..చావు భయం
ఈ ఆరాటాలూ, పోరాటాలూ, సంఘర్షణలూ
అన్నీ మాయమయ్యి
అన్నీ శాశ్వతంగా కొనసాగాలనే ఆలోచన ఆపి వేసిన మనస్సు
ఖాళీ కుండలా
జీవించటం, మరణించటం ఒక్కటయినా  ఆ అనుభూతి
అద్బుతమయిన ఆ క్షణం
అజేయమయినది నా ఉనికి లోకి వచ్చిన ఆ క్షణం
అప్పుడు మరణం
ఒక అద్బుతమయిన ఘడియ !
ప్రాణంతో ఉండటమంత  శక్తివంతమయినది!!

Sunday, December 15, 2013

తిరుప్పావై....ధనుర్మాస వ్రతం


తిరు అంటే శ్రీ,  పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం. అన్ని  సంపదలను ఇచ్చేది సిరి నోము దీనినే ధనుర్మాస వ్రతం అంటాం.చాంద్ర  మానం ని బట్టి మార్గశీర్శమైతె సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. "మాసానాం మార్గశీర్షోహం" , మాసములలో ఉత్తమమైన మార్గాశీర్శమును నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశిరం లో ప్రారంభమయ్యే ధనుర్మాసమంటే ఇష్టమట. 

మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు, మలిపున్నామి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు, ఇదే మన  జీవితం! ఎప్పుడూ భగవంతునితో కలిసి వుంది, ఇహ పరములలో  మనకు కావలిసినన్నీ పొందడానికి ఈ సిరినోము చెయ్యాలట.

ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లె లో గోపికలు కృష్ణున్ని పొందాలని కోరి కాత్యాయిని వ్రతం గా చేశారు. తర్వాత కలియుగం లో శ్రీవిల్లిపుత్తూర్ లో  గోదా దేవి అచటి అర్చామూర్తి శ్రీ వటపత్రశాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా. వారి ఆలయాన్ని నందగోప భవనంగా, తన తోటి చెలికత్తేలన్దరినీ గోపికలుగా, తనూ ఒక గోపికగా త్రికరణ శుద్దిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది. శ్రీ రంగ నాథున్ని పొందింది.

శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల వారికి, పుబ్బ నక్షత్రం లో తులసి వనం లో లభించింది. శ్రీ విష్ణు చిత్తులు (పెరియాళ్వార్) ఆ బాలిక ను అల్లారుముద్దుగా పెంచిరి. వటపత్రశాయికి నిత్యమూ పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమయిన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమెకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. ఆమె  తండ్రి తో బాటే మాలలు కట్టి, అవి తానూ  ముందు ధరించి తరువాత స్వామికి ఇచ్చేది.తండ్రి అపచారమని మన్దలించినా, స్వామి ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలలే నాకు ఇష్టం అని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను "ఆముక్త మాల్యద" అని తమిళంలో "శూడి కొడుథ్థ నాచ్చియార్"అని అంటారు. పాశురములను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి " పాడి కొడుత్త నాచ్చియార్" అని కూడా అంటారు. "తిరుప్పావై" ప్రబందమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాళ్. అండాళ్ అనగా కాపాడే తల్లి , రక్షకురాలు. ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ఆ రంగ నాథున్నికొలిచినది . రంగనాథ స్వామి కి విరుల సౌరభాల కన్నా, గోదాదేవి కురుల పరిమళమె నచ్చింది. విష్ణు చిత్తుడి కి కలలో కనిపించి గోదా కల్యాణానికి ఆనతిచ్చాడు.ఆండాళమ్మ  ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమై పోయింది . పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్!. 

భక్తులు సూర్యోదయానికి ముందే ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తిచేసుకుంటారు. గోదా దేవి పాడు కున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు.వయో లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు అంటారు.ఓ వైపు వణికించే చలి, వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఆ మత్తును జయించి, తెల్లవారుజామునే మేల్కొనాలి.ఆహార మియమాల్ని పాటించాలి. మిత భాషణ, ప్రియ భాషణ కూడా అవసరమే.దాన ధర్మాలకు ప్రాదాన్యం ఇవ్వాలి.భోగాలకు దూరంగా ఉండాలి.ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం.

ఆ బ్రహ్మాండ నాయకుని చేరిన ఆండాళ్ కోరిన కోరిక ఇది "సర్వ విధముల నీకే చెంది, నీదే అయిన ఈ ఆత్మ అనర్థము నందకుండా కాపాడుము. ఈ ఆత్మ స్వరూపమునకు తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యము చేయు భాగ్యమ్ము నిమ్ము.  ఈ ఆత్మ ఉన్నంత కాలము నీ సేవ చేయునట్లు అనుగ్రహింపుము"...ఇదే తిరుప్పావై సారం.

జై శ్ర్రేమన్నారాయణ!                        జై శ్రీమన్నారాయణ!                          జై శ్రీమన్నారాయణ!           

Tuesday, October 8, 2013

ఎర్ర జాబిళ్ళ ఎరీన


పాటిబండ్ల రజని గారి "ఎర్ర జాబిళ్ళ ఎరీన"..కవితా సంకలనం లో కొన్ని కవితల గురించి
..మొదటి కవితే కదిలించేది గా వుంది."అబార్షన్ స్టేట్మెంట్". ఈ కవితలో తన అజాగ్రత్త వల్ల జరిగిందని రాస్తూ 
"భద్రతా వలయాన్ని ఎగతాళి చేసి//అక్రమంగా సరిహద్దును దాటే ఆకతాయల్లె//ఆ పద్నాలుగో రోజుకు అటో ఇటో//వద్దు వద్దు అనుకుంటూనే//అజాగ్రత్తగా //నేననుమతించిన అసమ్మతి కణాలతో//మరో సగభాగమై నువ్వెందులు కలిసావురా కన్నా?
 కానీ తానూ ఎందుకు వద్దనుకుందో రాస్తూ....పంచేందుకు రక్తం లేకే కదా//పెంచేందుకు తీరిక లేకే కదా// , తల్లడిల్లుతూనే , తప్పొప్పుల మధ్య తడబడుతూనే చేసుకొన్న అబార్షన్!, ఇక్కడ ఒక్కటి అర్థం కాలేదు. తాను వద్దనుకుని చేసుకున్న అబార్షన్ విదానాన్ని విమర్శిస్తూ "ఇంత సుఖంగా నిన్ను చంపుకొనే మార్గం కనిపెట్టిన వీళ్ళ ముఖాలపై //ఉమ్మ నీళ్ళ తో ఉమ్మేయ్యలని వెర్రి ఆవేశంగానూ// అంటుంది. తన   కడుపులో ఉన్న ఆ పిండానికి జన్మ నివ్వవద్దు అనుకొని , తన ఇష్టంగా చేసుకొనే ఈ అబార్షన్ ని విమర్శించడం అర్థం కాలే? చివరి పదాలు చూడండి " అయ్యో! //పాలింకి పొవాడానికి కున్నట్లు //మనసింకి పోవడానికీ మాత్రలుంటే ఎంత బావున్ను//

చోళీ కీ పీచె అన్న కవిత లో శరీరాదారంగా జరుగుతున్నా కుట్ర  ఎలా అవాంచనీయ కనజాలంగా పెరిగి పెరిగి క్యాన్సర్ గడ్డ గా మారిందో, దానికి రేడియో తెరపీ కి త్వర పడాల్సి వుంది అంటూంది. చోలీలు ఓణీ లు లేనప్పుడు //హృదయం వెన్నెలారబోసినంత పారదర్శకమై వుండేదేమో// జోడీలంతా వెన్ను విరుచుకొనే తిరిగే చోట//తన హృదయం విలాస వస్తువి చోళీలో కుంచిన్చుకోవలసి// అంటూంది. బడి పిల్ల నుంచి మొదలు కొని బామ్మగారి వరకు ఎంత వేదనో రాస్తూ బడిపిల్ల సర్డుకోక తప్పని యునిఫారం వెనుకా//పసితననుండీ పాపిట నేరిసిన్దాకా పాతివ్రత్యాన్నే నమ్మిన బామ్మ గారూ// కప్పుకోక తప్పని రవిక వెనుకా//ఉమ్మడి భాద్యతల కావడి కుండలూ,పాల సలుపులూ// అని ఎంత వేదన అనుభవిస్తున్నారో రాస్తుంది.

 ఉద్యోగిని ఆదివారం అనే కవితలో వ్యాపార ప్రకటనల్లో ఆదర్శంగా తీసుకోమనే గృహిణి వెనుక ఆమె పడే కష్టం ఎంతో హృద్యంగా వర్ణిస్తుంది. అందరికీ ఆదివారం , మరి తన ఆదివారం ఎలా ఉంటుందో ఈ కవితలో చెప్తుంది.పొంగిన పాలూ వలికిన చారు మరకలతో వంటిల్లు అందించే వారాంతపు రిపోర్ట్.తెగిన ఖాజాలు, ఊడిన గుండీలతో చింపిరి గంపి ఝాడిపించే  బట్టల స్టాండ్, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ కవితలో చివరికి ఇద్దరి జీతాలని ఈర్ష పడే వారెవరూ గృహిణి కి వుండే రెండు భాద్యతల పట్ల జాలి చూపరంటూంది. అన్ని భాద్యతల్నీ సమానంగా పంచుకునే మనం//మన బరువు దించేందుకు చేయి అందించారేమని నిలదీయాలి అని అంటుంది. ఇంకా మన పిల్లల నుంచైనా// ఇంటి పనంటే  ఇంతులది కాదని నేర్పాలి// అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చెయ్యాలి అని ముగిస్తుంది.

రెప్ప కాటేసిన పాప కథ అన్న కవితలో విద్యార్తినులపై లైంగిక వేదింపులు చేసే ఉపాద్యాయుల గురించి రాస్తూ. అయ్య వారికి చాలట అమ్మాయిల మానాలు//ఆడ పిల్లల కిపుడు కొత్త పాటాలు//భారత దేశం మన పితృ భూమి//భారతీయులందరూ మన బావ మరుదులు//గురు బ్రహ్మ// బ్రహ్మ కైనా తప్పదు రిమ్మ తెగులు// అంటూంది.చివరికి సిల్లబాస్ సవరించండి అంటూ కప్పల్ని కబళించే పాముల్ని గురించే కాక//కను "పాప"ల్నే కాటేసే రెప్పల విపరీతాన్ని కూడా ఒప్పులకుప్ప వయసున్నప్పటి నుంచే హెచ్చరించండి //అంటూ హెచ్చరిస్తుంది.

ఎర్ర జాబిళ్ళ ఎరీన అన్న కవితలో బాల వేశ్యల సంఖ్యలో రెండవ స్తానంలో ఉన్న దేశ దౌర్బగ్యాన్ని కేవలం బాల వేశ్యల కోసమే మన దేశానికి వచ్చే విదేశీ వింత పశువుల గురించి వాళ్ళ విక్రుతానందం  గురించి రాస్తుంది. గంగా తీరే రాక్షస రాతి సుఖ సారే//యమునా తీరే యమకూప విహారే//తాజాగా తల్లిపేగు తెంచిన తడిబొడ్లను తట్టలతో పేర్చం// మీ సెక్సీ బాత్ కోసం మా గోవా బీచ్//తడి దేరని పసి తనువుల ఇసుక పర్రలతో తయారుగా పక్క పరచి ఉంచింది//మీ దొరసాన్ల పాపలు// ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని//మురిసే ఆ పొద్దుకే వేళ//ఈ పాపసానులు//అయామ్ యువర్ నైట్మేర్ అంటూ// అధిరోహనకు అంగ చాస్తాయ్//కేవలం పర్యాటక మారకం చెల్లించి నంతనే దక్కే // పసి గాయాల ఫలహారాలు//ఇంకెక్కడైనా మీకు చిక్కెన ? అయ్యా అందుకే ఇది ఎర్ర జాబిళ్ళ ఎరీనా అంటుంది.కొన్ని కవితలు కదిలించేవిగా కొన్ని ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.

Monday, July 29, 2013

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు....
ఓ మెరుపులా తటిల్లున మెరుస్తూ
ఆకాశంలో  రంగు రంగుల గాలిపటాల్లా
వినీలాకాశం లో విచ్చుకున్న మెరిసే నక్షత్రాల్లా
ఎన్నో...ఎన్నెన్నో,

అకస్మాత్తుగా
చిరుజల్లులా హృదయాన్ని తడిపేవి
తుఫానులా మున్చేత్తేవి
చూరు నుంచి కారే ఒక్కొక్క బొట్టులా
మెరుస్తూ...ఒక్కొక్కటే
పాయలుగా ..కాల్వలై..అలలు అలలుగా
ఎగిసిపడుతూ
ఎన్నో...ఎన్నెన్నో ,

ఒక నవ్వు
ఒక దుఖం
ఒక స్నేహం
ఒక బాధ 
ఒక అందం
ఒక చిరు స్పర్శ
ఒక హృదయం
ఎన్నో...ఎన్నెన్నో
జ్ఞాపకాలు ..అలల్లా ఎగిసి పడుతూ





Sunday, July 28, 2013

ఒంటరిగా




 పడమటి చెరువులోకి ఇంకుతున్న పగటి జ్ఞాపకాలు
మలి సంధ్య రాత్రి లోకి కరిగిపోతుంటే
రాలిపోయిన ఉల్కలా నువ్వు ఈ విశాల విశ్వంలో కలిసిపోయి ...
నీలాకాశంలో పురివిప్పుకున నక్షత్రాల్లా కోరికలు
ప్రేమ లేని వాంఛ
వాంఛ లేని ప్రేమ 
ఆ రెంటిఅపూర్వ  కలయికలను దోసిళ్ళతో త్రాగిన ఆ మధుర స్మృతులు
నన్ను గతం లోకి నేట్టేస్తుంటే
మనస్సులోని ప్రేమ
శరీరం లో జనించే కోర్కెలు
నిశ్శబ్దంగా నిశీధి లో కరిగిపోతుంటే
ఈ నిశి రాత్రిలో నిన్ను వెతికి వేసారి
ఒంటరిగా...
నిరాశా నిస్పృహలతో
తొలిసంధ్య వెచ్చని కిరణాల్లోకి
మళ్ళీ ఇంకో రోజులోకి నా పయనం నువ్వు లేకుండా




ఒంటరిగా...

Sunday, April 7, 2013

ఓ బొంత సృష్టించిన తుఫాను




ఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది. పాత్రలన్నీ చాలా కాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అని అంటారు. కథలు ఉర్దూ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి సత్యవతి గారి అనువాదం చక్కగా తెలుగు రచన లాగే ఉండడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి.
ఈ సంకలనం లో “లిహాఫ్” మొదలుకొని మొత్తం 15 కథలున్నాయి. ఇక్కడ “లిహాఫ్” అనే వివాదాస్పద కథ గురించి మీతో పంచుకుంటా. లిహాఫ్ అంటే రజాయి. దూదితో బాగా దళసరిగా కుట్టిన బొంత-బాగా చలిరోజుల్లో కప్పుకుంటారు. ఈ కథ ఓ స్త్రీ చిన్ననాటి స్మృతుల రూపం లో మనకి చెబుతూ ఉంటుంది. ఆమె స్మృతుల్లో రజాయి లో వెచ్చగా పడుకున్నప్పుడల్లా దాని నీడ గోడ మీద ఒక ఏనుగులా కదులుతూ ఆమెను గత స్మృతుల్లోకి లాక్కెళుతుంటాయి.
 సారంగ వెబ్ వార పత్రిక లో నా కథా పరిచయం పూర్తిగా ఇక్కడ చదవండి

Sunday, March 17, 2013

ఒకే ఆత్మగా .......


ఒకే ఆత్మగా .......


మత్తుగా నిద్దరలోంచి
కళ్ళు తెరచి చూసి
ప్రక్కన నిన్ను వెతుక్కుంటే నీవు లేవు కాని
గది నిండా నీ జ్ఞాపకాలు, నీ పరిమళాలు
నాతో గుసగుసలాడుతున్నాయి

రాత్రంతా
నా ఆర్ద్ర నేత్రాల్లో జలకాలాడిన నీవు

కిటికీ వద్ద అప్పుడే తల స్నానం చేసి తడిసిన వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ నువ్వు
మంచులో తడిసి ముద్దయిన ప్రక్రుతి ని  చూసినట్టు
అన్ని రంగులు కలబోసుకున్న హరి విల్లు లా
ఎవరో చిత్రకారుడు గీసిన అస్పష్ట చిత్రంలా...


ఎందుకో ఒక్కసారి గా
మనస్సు గతం పుటల్లోకి వెళ్ళింది
మన తొలి పరిచయం
మనస్సు తో స్ప్రుశించుకున్న మధుర భావనలు
కళ్ళతో కౌగిలించుకొన్న ఆ క్షణాలు
ఎన్నాళ్లయినా ఇంకా తాజాగా!

పదిలంగా దాచుకున్న నా
హృదయాన్ని దోచుకున్నావు
నాది అన్నది ఏమీ లేదు
నువ్వే నేనయి....
నేనే నువ్వై..
ఇద్దరం ఒకటై....ఒకే ఆత్మగా

(17.3.2013)

Sunday, February 17, 2013

వాకిలి లో నా కవిత ..నిశ్శబ్దంగా






నిశ్శబ్దంగా
ఈ ప్రపంచమంతా నిదుర పోతున్న వేళ..

.పూర్తిగా వాకిలి లో 

నా కవిత ప్రచురించిన వాకిలి పత్రిక వారికి కృతజ్ఞతలతో ......



Monday, February 11, 2013

నీ జ్ఞాపకాలు


ఉదయం తలుపు తెరవగానే
బాల్కనీ లో నన్ను తాకిన ఓ చిరుజల్లు 
నువ్వు నన్ను ఆత్రుత తో
నా ముఖాన్ని నీ దోసిట్లోకి తీసుకొని ముద్దాడినట్లు
నీ దేహ పరిమళం లో నేను ఉక్కిరి బిక్కిరి అవుతుంటే
నన్ను చూసి

తల ఊపుతూ కిలకిలమని
నిన్ను తలపిస్తూ నువ్వు పెంచిన గులాబీలు
దగ్గరికి వెళ్ళా!
మృదువుగా నన్ను తాకింది  ఓ గులాబి
నీ చెక్కిలి ఎమో అని అనుకున్నా
మళ్ళీ ఒక్కసారి పక్కున నవ్వింది
పరిహాసంగా

గులాబీ రెమ్మలపై చిరుజల్లు నీటి తుంపరలు
అప్పుడే స్నానించిన నీ దేహం పై  పరుచుకున్న
నీటి ముత్యాల్లా మెరిసిపోతూ

అన్నీ కలిసి నువ్వై
నువ్వు నా నుంచి దూరంగా ఉన్నా
నీ సాన్నిధ్యాన్ని తలపిస్తూనే ఉన్నాయి








Saturday, January 19, 2013

ఒక కవిత నిదురిస్తుంది నా ఎదలో.....జమీలా నిషాత్



(అలజడి మా జీవితం  , మౌఖిక కార్య శాలలో మహిళలు చెప్పిన ఆత్మ కథల సంకలనం నుంచి ....అనువాదం రెంటాల కల్పన)

ఆడ పిల్లలు నాట్యం చెయ్య కూడదు అంటే నాట్యం వదిలేసి, పెయింటింగ్ లోకి మళ్ళి రహస్యంగా, అదీ ఆగి పోయి , అణిచివేత లోనుంచి కవిత్వం లోకి మళ్ళి ,  ఆ కవిత్వం కూడా తన కోసం కాకుండా నిషాత్ అనే స్నేహితురాలికోసం , ఆమెతో కలిసే స్వేచ్చ లేక....నిషాత్ అంటే సంతోష మట  కాని ఆ సంతోషం తో కలయిక ఎప్పుడూ స్వప్నమే ..  ఆ బాధ , దిగులు ఇవన్నీ తన రక్తం లోనుంచి కవిత్వం లోకి ప్రవహించి కవిత్వంగా....

                 "రక్తం లో ఆలోచనల కెరటం ఉబుకుతుంది

                   నా కలం నుంచి
                   రక్తం పడటం మొదలవుతుంది"

తెరల మాటున వుండి, తండ్రి సాహిత్య చర్చల్లో పాల్గొనలేక  నిరాశ తో " నన్ను ప్రతీ రంగులోన ముంచెత్తావు  నువ్వు. కావీ ఇవన్నీ  రంగులే: నేను కాదు" అని రాసుకున్న జమీల....ఛందస్సులో లయలో రాసే కవిత్వం త్రుప్తినివ్వక వచన కవిత్వం లోకి వచ్చి.....పెళ్ళయి, ఆ తర్వాత మృత్యువు కి చేరువయిన తండ్రి తో....మృత్యువుని  చూసినట్టే, ఆ మరణం తర్వాత మారిన తన జీవితం...రాయటమే విముక్తి అనుకోని తిరిగి రాయటం మొదలుపెట్టిన జమీల.గత కొన్నేళ్లుగా ముస్లిం ఉనికికి సంబంధించిన వివిధ అంశాల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీల...స్త్రీల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీలా...స్త్రీల కష్టాలు అణిచివేత చూసి తనకున్న అనుభవంతో ముస్లిం బాలికలల్లో కొత్త చైతన్యం.. ఓ కొత్త ఆత్మ విశ్వాసం మొలకేత్తటానికి జమీల కృషి చేస్తున్నారు. ఒక భాష గా ఉర్దూ ఎప్పటికీ సజీవంగా ఉండాలని ఆకాంక్షించే జమీలా మొదిఅతి నుంచి  ఉర్దూ లోనే కవిత్వం రాస్తున్నారు.ఆమె కవిత్వం లోంచి కొన్ని.....

పొద్దు వాలింది/అన్నివైపులా/ఒక దుఖ్హం కమ్ముకొస్తుంది/కారు చీకటి నీడ పాకింది/సాయంత్రపు కళ్ళు కూడా మూత పడ్డాయి/

ఎర్రెర్రని  వస్త్రాలలో చుట్టి / నీ ఇంటి అందానివిగా నన్ను అలంకరించావు/...అప్పుడు నాకేం తెలుసనీ/తలాక్, తలాక్,తలాక్ అంటూ పిడచ కట్టుకుపోయిన నాలుకతో నీ గొంతు నన్ను రోడ్డున పడేస్తుందని/

కన్రెప్పల తీగల్ని మీటుతున్న/ఈ వాయిద్యం పేరేమిటి/ఈ తెరపైన  వెలుగుతూ, చెదిరిపోతున్న/ఆ దృశ్యం ఏమిటి?/మదిపైన  మబ్బుల్లా కమ్ముకొస్తున్న ఈ నీడ ఏమిటి?/నీకు తెలుసా, నేను నీడల్ని ప్రేమిస్తాను/కాని నీడ నా పైన రెక్కలు చాచినప్పుడల్లా/ ఆలోచనల వెల్లువ/రక్తంలో పోటేక్కుతుంది/అప్పుడిక కలంలోంచి/నెత్తురే  కారుతూ వుంటుంది/

ఏకాంత సముద్రంలోంచి బయటపడి/జీవితం/జన సముద్రంలో మునిగిపోతుంది/

నువ్వూ నేనూ/కలిసి పంచుకున్న ఆ క్షణం.../ఎంత అద్బుతమో/.....అదొక్క క్షణమే/ఒక ఉన్మాద క్షణం/ ప్రేమో కామమో/ఏదో తెలియదు/అదొక ఉద్వేగం/బిందువు/బిందువుగా/రాలిన ఉద్వేగం/

నేనొక బిందువుని/విశ్వానికి కేంద్రాన్ని/వలయవలయాలుగా నువ్వు నీ చుట్టూ నువ్వు/నా లోపల పరిబ్రమిస్తున్టావు/నేను యోనిని/జీవన దారని/నేను వేరుని/ఈ లింగారన్యమన్తా/ నా చుట్టూరా పుట్టుకొచ్చిందే/

నా లోపల/హృది లోపల/నిద్రిస్తోందొక కవిత/ఓ మసక అద్దం/దాన్ని ప్రతిబిబించాలన్న కోరిక కొద్ది/ఓ గజల్/ఓ రేఖ/ఓ మాట/ఒకలా అవునో/కదూ/రాత్రీ పగలు/తనవైపు లాక్కుంటుంది నన్ను/సంగీతం లేదు/ఒక్క ధ్వనీ లేదు/

కాగితానికీ కాలానికీ మధ్య యుద్ధం చెలరేగింది/అక్షరాలూ రక్తం లో స్నానించాయి/కాగితం రెండు ముక్కలైంది/ఒకటి నువ్వు ఇంకోటి నేను రెండు ముక్కలు/గదిలో రెండు మూలల్లో ఇంతలో తపన దేవతలా దిగి వచ్చింది కిటికీ లోంచి/కాగితంముక్కల్ని ఎరుకోచ్చింది మంచంమీద ఉంచింది/ఆత్మీయత పవిత్ర జలాల్ని కురిపించింది/అప్పుడు పుట్టింది ఓ కవిత// చివరికి నిశ్శబ్దం కూడా నన్ను ఊరు కొనివ్వదు / ఈ కవిత పేరేమిటి?నాలోపల నిద్రపోతూ నన్ను నిద్రపోనివ్వని ఈ కవిత ఏమిటి?/





Sunday, September 2, 2012

చొలీ కే పీచే


భారత దేశం లోని అగ్ర శ్రేణి రచయిత  లలో ఒకరయిన మహా శ్వేతా దేవి రాసిన కథా సంకలనమే ఈ "చొలీ కే పీచే  ". ఇందులో మొత్తం మూడు కథలు, చోలీకే పీచే, పాల తల్లి, ద్రౌపది ఉన్నయి. ఈ కథలన్నింటిలో కనపడే  సాధారనాంశం , కథా వస్తువు రొమ్ములు. రచయిత్రి రొమ్ములను కథాంశంగా తీసుకొని , విభిన్న కథలలో  కలవర పెట్టే భయానక దృశ్యాలను ఈ కథల్లో రచయిత్రి చిత్రిస్తుంది. వీటిలో రొమ్ములు కేవలం ప్రతీకలు మాత్రమె కావు. దోపిడీ, సామాజిక వ్యవస్థ కర్కశమయిన  అత్యాచారాలను అవి బట్ట బయలు చేస్తాయి.

మొదటి కథ " చొలీ కే పీచే   " లో ఉసిన్ ఒక ఫోటో గ్రాఫర్ ,వలస కూలీ గా వచ్చిన గంగోర్ అనే యువతి ఆచ్చాదన లేని అందమయిన రొమ్ములు ఒక పోటో గ్రాఫర్ గా అతన్ని ఆకర్షిస్తాయి.కూలీ నుంచి ఒళ్ళు అమ్ముకొనే యువతి గా గంగోర్ మారడం...చివరకు ఏ  రొమ్ములయితే ఉసిన్ ని ఆకర్షిస్తాయో,వాటి స్తానంలో రెండు ఎండి పోయిన మచ్చలు, ముడతలు పడిన చర్మం, రెండు అగ్ని పర్వతాలు పేలుతూ విరజిమ్మిన లావాలా, చూసి పారిపోతూ రైలు కింద పది పోయి ఉసిన్ చనిపోవడం కథాంశం.  సామూహిక అత్యాచారం, కొరకడం, కోరడం,సామూహిక అత్యాచారం , పోలీసులు, కోర్టు కేసు....మళ్ళీ లాకప్ లో సామూహిక అత్యాచారం... అలా వలస కూలీ నుంచి ఒక వొళ్ళు అమ్ముకొనే యువతిగా గంగోర్ మారడం వెనుక సమాజం ఆమె ఫై చేసిన అత్యాచారం రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. రచయిత్రి చెప్పదల్చుకున్నది  రవికె మాటున ఉన్నది అప్రాదాన మయిన అంశం కాదు, చోలీకే...పీచే...రవికె వెనక ఉన్నది ప్రజలపై సామూహిక అత్యాచారం , అలా గంగోర్ నుండి పారిపోతూ రైలు ప్రమాదం లో ఉసిన్ చనిపోవడంతో కథ విషాదంగా ముగుస్తుంది.

రెండవ కథ "పాల తల్లి, " ప్రమాదం లో కాలు పోయిన భర్త, విధి లేని పరిస్తితుల్లో, కిరాయికి పాలిచ్చే తల్లి గా వృత్తి స్వీకరించిన యశోద కథే ఈ పాల తల్లి కథ.ఎవరివల్ల  అయితే కారు ప్రమాదం అవుతుందో వాళ్ళ ఇంట్లో కిరాయికి పాలిచ్చే తల్లిగా  పాలివ్వడం ఒక వృత్తి గా స్వీకరించి, మరి ఎప్పుడూ పాలివ్వాలంటే తను కూడా ఎప్పుడూ కడుపులో బిడ్డతో ఉండాలన్న  భర్త ఆలోచనను గౌరవించి ఇరవై బిడ్డలకు తల్లి అయి, యజమాని ఇంట్లో ఇంకో ముప్పయి మందికి పాలిచ్చి, యశోద వృత్తి తల్లి అవుతుంది. అమ్మ తనం ఆమె జీవన విధానం అవుతుంది. కాలం ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండదు కదా, యజమానురాలు చనిపోవడం, కుటుబం చెల్లా చెదురు కావడం, ఇప్పుడు పాలు ఇవ్వలేని, యశోద భారమయి చివరికి భర్త తో కూడా పోట్లాడి, వంట మినిషి గా మారుతుంది. ఎ రొమ్ములయితే ఆమె జీవనాదారంయ్యయో  అదే రొమ్ము క్యాన్సర్ తో ఆమె చనిపోవడం  తో కథ ముగుస్తుంది. ఏళ్ల తరబడి తను పాలిచ్చి తను సాకిన కొడుకులు, చివరికి తన  అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు ఆమెకు విద్రోహం చేస్తాయి. చివరి క్షణాల్లో యశోద పరిస్తితిని రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. ఒక కిరాయి కి పాలిచ్చే తల్లి వృత్తిని చేపట్టి, ఏళ్ల తరబడి ఎంతో మందికి పాలిచ్చి చివరికి తన కడుపున పుట్టిన బిడ్డలు, భర్త, పాలిచ్చి సాకిన  కొడుకులు, అందరూ కాదనుకొని, చివరకు తన అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు కూడా ద్రోహం చేసి(క్యాన్సర్ బారిన పడి) యశోద ఒంటరిగా హృదయ విదారకంగా చనిపోవడం తో కథ ముగుస్తుంది.

మూడవ కథ "ద్రౌపది".ద్రౌపది కథలో ప్రధాన పాత్ర  దోపది. ఒక ఆదివాసీ విప్లవ కారిణి. భర్త చనిపోయి న తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. పోలీసు కస్టడీ లో ఆమెను చిత్ర హింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడతారు.చివరికి తెగించిన ఆమె, పచ్చిగా కొరకబడ్డ, నెత్తురోడుతున్న వికృతంగా కోసేసిన రొమ్ములతో  , చీలికలైన చను మొనలతో, బట్టలు తొడగానివ్వకుండా, మొండి పట్టుదల నిండిన పెను అట్ట హాసంతో  ఆమె ఊగి పోతూ ముందుకు నడుస్తుంటే నిరాయుదురాలయిన ఆమె  ముందు నిలబడడానికి సాయుదులయిన శత్రువులు వణికి పోతారు. ఈ కథలో గాయపడ్డ రొమ్ములను రచయిత్రి  శత్రువును వణికించే ఆయుధాలుగా చిత్రీకరిస్తుంది. కథలో అంశంగా ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీ, దాన్ని ఎదుర్కోవడానికి ఆదివాసీలు సాయుధులుగా మారడం, వాళ్ళ పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు తెల్పుతుంది. 

పుస్తకం: చోలీకే పీచే
రచయిత: మహా శ్వేతా దేవి
పబ్లిషర్స్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
వెల:కేవలం రూ.13
అనువాదం: కలేకూరి ప్రసాద్, సహవాసి 

Friday, March 23, 2012

సలాం హైదరాబాద్


హైదరాబాద్ నగర నిర్మాణం ప్రేమమీద ఆధారపడి ఉంది. కులీ కుతుబ్షా ప్రేయసి బాగమతి కులీకుతుబ్షా జనానా లో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.అప్పటి ప్రధాని గుజ్రాల్ "నేను చూసిన అందమయిన హైదరాబాద్ ఏమయ్యింది. ఇప్పుడున్నది సిమెంట్ కాంక్రీట్ భవనాల అరణ్యమే" అని అన్నాడట. ఇంకెవరో అన్నారు "హైదరాబాద్ కీ ఆంగాన్ గాయబ్" అని. మరి ఆ అందమయిన హైదరాబాద్ ని చూడాలని ఉందా. హైదరాబాద్  పాత నగరం గల్లీ గల్లీ తిరగాలని ఉందా...ఈ నవలలో రచయిత మనల్ని తనతో ఆ పాత నగరపు , ఆ చార్ సౌ సాల్ పురానా షహర్  గల్లీ గల్లీ తిప్పి ఆ నగర అందాలను, మనకి కళ్ళకు కట్టినట్టు చూయిస్తాడు.

డిల్లీ , లక్నో నగరాల చరిత్ర సాహిత్యం లాగా హైదరాబాద్ గురించి ఎందుకు లేదు అన్న ఆలోచన , తపన లోనుంచి పుట్టిందే ఈ  "సలాం హైదరాబాద్ ". ఇది రాయటందుకు నా అర్హత ఏమిటంటే " నేను పైదాయిషీ  హైదరాబాదీ" నని ఒకింత గర్వంతో అంటాడు." పాత నగరం గల్లీలలో కళ్ళు తెరిచి ఈ భూమి మీద పడి పాత నగరం పొత్తిళ్ళలో, గండిపేట నీళ్ళతో పెరిగి ఈ గూటి పక్షిగా ఇక్కడి పాటనే పాడి ఇంకా " జీనా యహా , మర్నా యహా, చివరాకరికి పురానాపూల్ చితి మంటల చిటపటలలో నుండి ఫీనిక్స్ మాదిరి లేచి చార్ సౌ సాల్ పురానా షహర్ గల్లీ లలో రెపరెపలాడుతూ మళ్ళీ విహరిస్తాను, మళ్ళీ మళ్ళీ జీవిస్తాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.తానూ పుట్టింది పెరిగింది పల్లెటూరు అయినా పట్టణమైనా దాని మట్టిని, మట్టివాసనని , ఆ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళను, మనిషి అయిన వాడు మనసు నిండా ప్రేమిస్తాడు. అలా హైదరాబాద్ మీద తన ప్రేమను ఇలా చూపిస్తాడు మనకు రచయిత.

ఈ నవల లో ప్రధాన పాత్ర స్వామి అనే యువకుడు , అతని ఆత్మ కథ. ఆ నేపధ్యంలో   మనకు హైదరాబాద్ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు, నగర జీవితం, ఈ నగరం నేల మీద నడిచిన రాజకీయాలు, ఉద్యమాలు అన్నిటినీ రచయిత మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు.

కథలోకి వస్తే  కథా కాలం 1969 . 17 ఏళ్ళ స్వామి కాలేజీ జీవితంతో మొదలవుతుంది.ఉండేది శాలిబండ. చిన్న వయసులో హటాత్తుగా చూసిన చార్మినార్ ఆ చిన్నారి హృదయంపై చెరగని ముద్ర వేస్తుంది.చార్మినార్ పెహ్లీ నజర్, పహలా ప్యార్ అయ్యింది. చార్మినార్ ఎదురుగా ఉన్న ఇక్బాల్ హోటల్లో కూర్చొని  జిగ్రీ దోస్త్ చార్మినార్ తోటి ఎడ తెగని ఏకాంత నిశ్శబ్ద మౌన రాగాల సంభాషణ....లంగోటీ యార్ దోస్తాన... మనిషికి ముక్కెట్ల   అందమిస్తదో , హైదరాబాద్ కి చార్మినార్ అట్లా అందమిస్తాది అంటడు.ఇంకా హైదరాబాద్ నగర సుందరి ముక్కుపుడకల తళుక్కున మెరిసే మేలిమి ముత్యమే చార్మినార్ అంటాడు.హైదరాబాద్ కీ షాన్ అఉర్ శౌరత్ చార్మినార్ అంటడు. స్వామి మిత్రులతో 1969  తెలంగాణా ఉద్యమంలో పాల్గొనటం అతని జీవిత నేపద్యం లో హైదరాబాద్ మూలాలు, సంస్కృతి , సంప్రదాయాలు, చరిత్ర,, నిజాం కాలేజీ లో మొదలయ్యి, రక్త సిక్తమయిన మలుపులకు, ఎవ్వరూ ఊహించని దారులకు తరలిన ప్రత్యెక తెలంగాణా ఉద్యమం గురించి, ఉద్యమ వేదిక గా ఉస్మానియా యూనివర్సిటీ  క్యాంపస్ కేంద్రంగా ఎలా మారింది, ఎలా ఉవ్వెత్తున ఎగిసి, రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయి చివరికి ఉద్యమం ఎలా అణగ దొక్క బడిందో, ఎలా చల్లారి పోయిందో మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు. 

మనం ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటె స్వామి తో పాటు హైదరాబాద్ నగర వీదుల్లో , గల్లీ గల్లీ లో ఆ పాత నగరాల అందాలను చవిచూస్తూ , ఉద్యమంలో మనమూ పాలు పంచుకొని, ఇరానీ కేఫ్ లలో బోలో సాబ్! క్యా హుకుం హై అంటూ వొంగి వొంగి సలాములు చేసే సర్వర్లూ, మనమూ  దో మే చార్  చాయలు తాగుతూ,  కమ్మటి బిర్యానీ వాసనలు, గుబాళించే సమోసా వాసనలు ఆస్వాదిస్తూ , మధ్య మద్యలో అతని  పురా స్మృతుల్లో పెటిల్లున తెరుచుకొనే "పండోర బాక్స్" ఆ పందోరా బాక్స్ లోకి స్వామి తో పాటు మనమూ నగర చరిత్ర పుటల్లోకి ప్రయాణించి, అక్కడ కులీ కుతుబ్షా , నిజాం లను కలిసి ,కైరునీసా ప్రేమ విషాద  గాధలలో మునిగి తేలి, తుర్రెబాజ్ ఖాన్ జ్ఞ్యాపకాల విషాదాల్ని పంచుకుంటూ, ఒక్కసారిగా స్వామి చిన్నతనం లోకి వెళ్లి అలా బొంగరం లా  చరిత్రలోకి , స్వామి చిన్న తనం  లోకి, గతం నుంచి వర్తమానం లోకి , వర్త మానం లోనునుంచి గతం లోకి  మనల్ని తిప్పుతూ సాగిపోతుంది. పాత్రలతో మమేకమయి ఒక సజీవ దృశ్యం మన కళ్ళ ముందు చూస్తున్న అనుభూతి కల్గిస్తుంది.  కైరున్నీసా కండ్ల  పొంట ఒలికిన ఒక కన్నీటి చుక్క ఆమె చెక్కిలి మీద ఘనీభవిస్తే, అది రెసిడెన్సీ గా రూపొంది అదే ఇప్పుడు కోటీ వుమెన్స్ కాలేజీ గా మారిన వైనం, రెండు  మతాల మధ్య, రెండు ఖండాల మధ్య ప్రేమ, ఆ విషాద ప్రేమ గాధ కళ్ళకు కట్టినట్లు మన ఎదురుగా చూస్తున్న అనుభూతి.హైదరాబా పురాతన మూలాల్లోనుంచి ఇప్పుడున్న నగరం లోకి జరిగిన ట్రాన్స్ ఫార్మేషన్ రచయిత ఎంతో చక్కగా మనం ఒక ద్ర్యష్య కావ్యం చూస్తున్నట్లు చూయిస్తాడు. 


ఒక్కో పుట చదువుతూ పోతూ ఉంటె ఎన్నో మన జ్ఞ్యాపకాలు, మనం చూసినవి , మనం అనుభవిన్చినవీ  మనం కాల గర్భంలో మరిచి పోయినవీ, ఎన్నో ఎన్నెన్నో....పాన్దాన్లు,  బగల్దాన్లు , బావిల పడ్డ బొక్కేన్లు తీసే  వెయ్యి కాళ్ళ జేర్రోలె, వంద చేతుల ఆక్టోపస్ వలె ఉండే పాతాళ గరిగలు, నయా పైసలు, ఎర్ర మన్ను తో ఇల్లలకడం, పీరీల పండగ , బొగ్గులు రాజేసి చా పెట్టడం, ఎర్రటి మట్టి పొయ్యిల మండే బొగ్గు కనికల స్మృతులు మనల్ని గతంలోకి లాక్కేలతాయి.అమ్మపెట్టిన ఉప్పుడు పిండిల శర్కర కలుపుకొని తినడం, బాపూ అన్న పదం లో ఆప్యాయత (మా అక్క మా తాతయ్య ని మా అమ్మ తో పాటు బాపూ అంటుంది ) ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పొతే ఒక్క సారి కాదు పదే పదే మనల్ని పురా స్మృతుల్లోకి తీసుకపోతుంటాడు. హైదరాబాద్ ఇరానీ కేఫ్ ల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇరానీ కేఫ్ ల అందాలు ,  ఒక అతి పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ లో కూర్చొని ఎంతకూ ముగింపు లేని సుదీర్గ జన జీవన నాటకాన్ని చూస్తున్నట్లుండే ఇరానీ కేఫ్ లు అంటాడు. నిజంగా వరంగల్ లో జవహర్ కేఫ్ లో కూర్చొని దో మే చార్ చాయ్ అనగానే ఆ సర్వర్ నాలుగు గ్లాసుల్లో వేళ్ళు పెట్టి ఒక్క సారి మన ముందు శబ్దం చేస్తూ పెట్టి, ఘుమ ఘుమ లాడే ఇరానీ చాయ్ తెచ్చిన జ్ఞ్యాపకాలు ...ఎలా మరిచి పోగలం..

1969 లో జరిగిన  తెలంగాణా ఉద్యమ చరిత్ర చదువుతుంటే , మళ్ళీ 2010 /11 ల జరిగిన్ ఉద్యమం  కండ్లల్ల మెదులుతుంది.అప్పటికీ, ఇప్పటికీ , 42  సం. గడిచినా పరిస్తితులలో గానీ , ఉద్యమంలో గానీ ఎటువంటి మార్పు లేదు, మన బతుకుల్లాగే. అప్పటిలాగే ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారి పోయింది ఇప్పుడు కూడా.
రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్న చని పోయిన  స్వామి స్నేహితుడు జోసెఫ్ జెఫ్రీ కళ్ళలా...నిరీక్షిస్తున్న ఎన్నో కళ్ళు......చల్తే చలో చల్తే చలో చల్తే చలో. ఎ వక్త్ కీ ఆవాజ్ హై చల్తే చలో. సలాం హైదరాబాద్.. ముగింపు లేని కథ...అలా సాగుతోంది.
రచన:  సలాం హైదరాబాద్ 
రచయిత : లోకేశ్వర్ 

Monday, March 19, 2012

ముళ్ళపూడి వెంకట రమణ తొలి రచన


"అమ్మ మాట వినక పొతే"....1945  లో "బాల" పత్రికలో  రమణ గారి తొలి రచన


"నాకూ వుంది ఒక కల" (I TOO HAD A DREAM)




ఈ ఆదివారం చాల రోజుల తర్వాత ఒకే రోజు పూర్తిగా చదివిన పుస్తకం, "నాకూ వుంది ఒక కల" (I TOO HAD A DREAM) రచయితః వర్గీస్ కురియన్.
ప్రపంచంలోనే అతి పెద్ద పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న "పాల వెల్లువ " రూప శిల్పి డా.వర్గీస్ కురియన్ కృషి వల్ల భారత దేశం ప్రపంచం లోనే అతి పెద్ద పాల ఉత్పత్తి దేశం అయ్యింది.గుజరాత్ లోని ఆనంద్ లోని కొద్దిమంది రైతులు వాళ్ళ పాలని అమ్ముకోవటానికి ఏర్పాటు చేసుకున్న కైరా జిల్లా పాల ఉత్పత్తి దార్ల సహకార సంఘం కురియన్ కొన్ని కారణాల వల్ల వెళ్ళడం, వాళ్ళ నాయకుడయిన త్రిబువన్ దాస్ పటేల్ వ్యక్తిత్వం నచ్చి వాళ్ళతో కలిసి దాన్ని అమూల్ గా అభివృద్ధి చేయడం లో అతని అనుభవాలు చదవి తీరాల్సిందే.
ఈ ఆనంద్ తరహా సహకార సంస్తలు ఎంత అభివృద్ధి చెందాయంటే భారత ప్రభుత్వం కురియన్ చేత నేషనల్ డైరీ డెవెలప్మెంట్ బోర్డ్ ని స్తాపించడం జరిగింది." నీ లక్ష్యమే నిన్ను నడిపిస్తుంది" అనే ఆయన జ్ఞ్యాపకాలలో తన జీవిత గాథ ని పాడి పరిశ్రమని ఏ విధంగా అభివృద్ధి లోకి తెచ్చిందీ లాంటి అనేక విషయాల్ని ఎంతో వివరంగా చెప్పారు. ఎంతో ఉత్తేజాన్ని కలిగించే ఆయన జ్ఞ్యాపకాలు మనం తెలుసు కోవచ్చు.
 టెలీ కమ్యునికేషన్ లో నిష్ణాతుడు రాజీవ్ గాంధీ సలహాదారు అయిన "శాం పిట్రోడా" కురియన్ గురించి మాట్లాడుతూ.."కాస్త పిచ్చి వున్నా ఈయన ఒక కలతో వచ్చారు.ఈరోజు ఆయన దూరద్రుష్టి ఆయన భావాల వల్ల వచ్చిన ఫలాలు మనందరం అనుభవిస్తున్నాం.ఆయనతో ప్రతి విషయంలోనూ మనం ఏకీభవించం .ఆయన చేసిన ప్రతి చిన్న విషయాన్నీ మనం అభిమానించం.కానీ ఆయన ఏదయితే సృష్టించారో అది ఒక కల.దాన్ని మనందరం  పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం.ఇది నిజం.మన ప్రజల కోసం ఎక్కువ కలల్ని సృష్టించడానికి ఆయన లాంటి వాళ్ళు చాలా  చాలా మంది మనకు అవసరం" అంటాడు. ఆయన కలని సార్ధకత చేసుకోవడంలో  లో అతను  ఎదుర్కొన్న ప్రతికూల పరిస్తితులు,సవాళ్లు, విజయాలు, అసంతృప్తులు  వాటిన అధిగమించిన విధానం నిజంగా మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.కురియన్ ఒక క్రాంతి దర్శి. ఆయన అనేక సంస్తల్ని స్తాపించి భారతదేశాన్ని ప్రపంచం లోనే అతి పెద్ద పాల ఉత్పత్తి దేశంగా తీర్చి దిద్దారు. పాల ఉత్పత్తి సరఫరాలో ఓ పంథాని అభివృద్ధి చేసి ఆరోగ్యకరమయిన పోషక విలువలున్న పాలని లక్షలాది మందికి అందించారు. అమూల్ ని ఒక బ్రాండ్ గా మలచడంలో అతని తాపత్రయం, కష్టం మన కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. రతన్ టాటా ముందు మాటలో అన్నట్టు " ఈయనకున్నలాంటి దూరదృస్టి, నిబద్దత, అంకితభావం, జాతీయస్పూర్తి తో వేలాది కురియన్లు ఉన్నట్టయితే మనదేశం ఇంకెంత పురోభివృద్ది సాదించేదో "
రచయిత : వర్గీస్ కురియన్
అనువాదం: తుమ్మల పద్మిని, అత్తలూరి నరసింహారావు
పబ్లిషర్ : అలకానంద
వెల: 125 /- 

Tuesday, December 6, 2011

బాపు మొదటి బొమ్మ



1945 లో "బాల" పత్రికలో అచ్చయిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ (అయిదోఫారం) మొదటి బొమ్మ.



Sunday, December 4, 2011

దిగంతం


ఏ రోజుకి ఆ రోజు జీవితమైపోతుంది...
ఉదయం పుట్టుక...!
రాత్రి మరణం....!
ఒక రోజు
ఒక జీవితం....!

ఏ రోజు కారోజు ఒక జీవితాన్ని గడిపినట్టు గడిపెయదమేనా..? నేను జీవించలేక మరణించిన రోజులేన్ని..?మూసేసిన ఫ్యాక్టరీ నుంచి... ఓ  పబ్లిషర్స్ లో సేల్స్మెన్ కం గుమస్తా, కం నౌఖర్  కం ఎవ్రీతిన్గాన్నై....నూటాదేబ్బై రూపాయల అద్దెతో , కుంటి మూగి ముసలి తల్లి తో  మురికి కూపంలో....చావలేక..కాబట్టి చచ్చే వరకూ బ్రతకాలి కాబట్టి బ్రతుకు వెళ్ళ తీస్తూ....అవసరం అన్నిటినీ అధిగమిస్తుంది   అంటాడు.


అయిదున్నర అడుగుల ఎత్తు ,చామన ఛాయా,మొటిమల కుచ్చుల మొఖం, పొడగాటి  ముక్కు, ఈ బాహ్య సౌందర్యం చూసి ఎవరోస్తారని....పెళ్ళంటే......



బెస్టియాల్  ఇన్స్టింక్ట్ టు రిప్రోడ్యుస్ ....ప్రత్యుత్పత్తి అనంతరం  పిల్లల పెంపకం సోషల్ ఆబ్లిగేషన్ (రెస్పాన్సిబిలిటీ అని సభ సాన్ఘీకులు   మేధావులు అంటారు)...ఫ్యాకరీ లాకౌట్ ..అందర్నీ మేపాలంటే,  ఎలా...అని పెళ్లి అనే దాన్ని తన నిఘంటువు లోనుంచి తీసేసి....."నేను నా ముఖాన్ని ఎక్కడో పారేసుకున్నాను, అప్పటినించి పారేసుకున్న నా ముఖాన్ని నేనే వెదుక్కుంటూ ఫేస్ లెస్ ఫేస్ తో సంచరిస్తూ....ముందు పరిగెత్తే నేను...వెనక తరిమే మరో నేనూ...నా నేనులు వేటాడేది  వెంటాడ్తోన్నదీ, గాలిస్తున్నదీ .....ఎక్కడో కోర్కెల దొమ్మీలో...ఏవో ఆశల తొక్కిసలాటలో...పారేసుకున్న ముఖాన్నే...మనిషి ముఖాన్నే..ఎంతకీ దొరకదా ముఖం...ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా....మెరిసే రైలు పట్టాలని చూస్తూ వాటి వెంబడే చూపుల్ని పరిగేట్టిస్తూ అలా  చీకట్లోకి ....ఊరి  చివర మినుకు మినుకు మంటూ దీపాలు చుక్కలు చుక్కలుగా ..అటునున్చింకా  దీర్గంగా మలుపు తిరుగుతూ రైలుపట్టాలు అనంతంగా దిగంతం లోకి....ది..గం....తం.ఎదురుగా ఆకాశం లోకి భూమి అంతమయ్యే చోటికి పట్టాలు మలుపు తిరుగుతూ..! ఎదురుగా...దిగంతం...నా కోసమే...అందులోనే  నా అంతం..నేనే ఓ దిక్కుని ..అదే..దిగంతం అంటూ ఆ దిగంతం గురించి ఆలోచనలు.

 రోజూ అతని ఆలోచనల్లో , అతని చుట్టూ కనిపించే అవిటి ముసలి తల్లి, ఇంటి ముందు పాయిఖానా పరిమళం, సాయిబాబా బంకు, నానా గందరగోలంగా వినిపించే అయ్యప్ప భక్తీ గీతాల రోద,పక్క వీధి లోనుంచి పాల కొరకు వచ్చే మాక్సీ  యువతీ, మధ మధ్య లో అతని ఆలోచనల్లో వచ్చే మీనన్ అనే అతని ఏకయిక స్నేహితుడు,  తనతో పాటు పనిచేసీ దేవక్రుపామని,అప్పుడప్పుడూ గుర్తొచ్చే తను కోల్పోయిన  తన ముఖం , పెళ్లి వద్దనుకున్నా  కలిగే లోపలి కోరికా దాన్ని తీర్చే నాగమణి, రైల్వే స్టేషన్ ఆమ్లెట్ బండి దుర్గ, రైల్వే క్వార్టర్స్ లో కనిపించే ఓ మాక్సీ , పోయిన్నెల చూపించే క్యాలెండర్, చూరు మీద సామన్లనుంచి  కనిపించే ఓ సైకిల్ ట్యూబ్...ఇలా అతని ఆలోచనలు నిరంతరం వీటి చుట్టూ పరిబ్రమిస్తూ...ఇందులో కథ ఎక్కువగా కనిపించదు.. కథానాయకుడు ,అతడు కేంద్రంగా    అతని చుట్టూ కనపడే జీవితం గురించి  అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం.ఈ ఆలోచనల్లో ఎక్కువగా తారసపడే పాత్రలు అతని తల్లి,  నాగరత్న అనే వేశ్య.

జబ్బు పడి చనిపోయిన నాగరత్నం..అతని కోరికలకి రూపం  ..ఆమె కి నేనేమైతానని ...చని పోయిన  నాగరత్నం స్తానంలో ఇంకో నాగరత్నం..పేరు పుష్ప ..అస్సలు నేనెవర్ని అని తన్ని తానూ వెతుక్కుంటాడు అస్సలు ఎవ్వరికి  ఎవరు అని ప్రశ్నించుకుంటూ...ఏది భ్రమ ...ఏది నిజం..భూమి  ఆకాశం కలవడం..నిజమయిన అబద్దం..! మనిషీ మనిషీ కలయిక కూడా అంతే...అది దిగంత సత్యం....ప్రతీ సంబంధం  పైకి కలిసినట్టు భ్రమ కలిగించేదే..! ఈ ప్రపంచం యావత్తూ ఓ నిరంతర భ్రమ..దిగంతం  లాగున...! అంటాడు. 


ఆతను ప్రేమించే ఆరాధించే ఏకయిక భావ చిత్రం అతని తల్లి.  భావరహితంగా ఉండే ఆమెకళ్ళు, ఆ కళ్ళల్లో శూన్యం, వెరసి ఆమె అతనికి ఆమె ఒక నిశ్శబ్ద చిత్రం..నిశ్శబ్ద ప్రాకృత చిత్రం. ఏదో తెలీని గుర్తించలేని ప్రాచీనత కల్గి...విశ్వ రహస్య సూత్రాల్ని తన ముఖం ముదతల్లో దాచుకున్న ఓ మహాద్బుత చిత్రం... ఎప్పుడూ ఆమె ముఖంలో నవ్వు చూడని అతనికి ఆమె ముఖంలో నవ్వు చూడాలని ఆతను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత , ఆమె  ముఖంలో  నిర్మలమై...అరిటాకు పొట్లం లో ముద్దా  గులాబీ లాగ అమ్మ పెదవులు విచ్చుకునే ఉంటాయి . శాశ్వత హాస రేఖ అయి....పై పెదవి ఆకాశం...కింది పెదవి భూతలం...! విచ్చుకున్న విశ్వాన్తరాల  కాంతులై చిరునవ్వు...! అమ్మ చిరునవ్వు...చూడలేనను కున్న చిరునవ్వు ..ఆమె పెదవుల మధ్య కుంచించుక పోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం.  దిగంతం చీలింది.

బాధ నన్ను బాధపెట్టడం మానేస్తున్దేమోనని ఆఖరికి కొన్నాళ్ళకి, నిజమే ...బాధ కూడా నిరంతరం కొనసాగితే మొనాటనస్ గా అయిపోయి నిర్వికారంగా   .....


ఇది రోజూ వచ్చే రాతిరే...ఇది నిన్నటి రేయి...రేపు కూడా వచ్చునోయీ...ఇది నిత్య నూతన యామిని...మరి సౌదామిని? అస్సలు వచ్చునా అని?

 నేను , జీవితం  రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికి కలవని పాత్రల ద్వారా నాయకుడి జీవితపు బండి దొర్లిపోతుంది. ఈ నవల ద్వారా రచయితా చెప్పదల్చుకున్నది "నేను" ప్రధానం, తతిమ్మ సంబందాలన్నీ మన జీవితపు బండి నడవడానికుపకరించేవే.


ఆలోచన పుట్టినప్పుడే నాకీ లోకం పుట్టింది. ఈ లోకం తోటే జీవితం  పుట్టింది, జీవితమే నేను అంటే ఆలోచనే నేనన్నమాట. అంటే ఈ యవత్ప్రపంచామూ, దాంతోటి జీవితమూ,అందులో నేనూ...అన్నీ..అన్నీ కలిపి ఈ బుర్ర్రలో  ఉన్నాయన్నమాట.దేన్నించి ఎవర్నించి పారిపొయినా ఆలోచన్నించీ మనిషి పారిపోలేదు కదా..! ఆలోచనంటే తనే...! తననించి తానూ పారిపోవటం సాధ్యం కాక మనిషి మల్లగుల్లాలు పది సంఘం అనబడే గుంపై, అన్నిటినీ వ్యవస్తీకరించుకున్నదేమో.




ఇలా ఎన్నో ...ఎన్నెన్నో... ఆలోచనల స్రవంతి...అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం. మొదలుపెట్టిన దగ్గర్నించి  చివరి పేజీ వరకు మనల్ని ఆపకుండా  చదివించే  కాశిబట్ల వేణుగోపాల్ నవల " దిగంతం"

Wednesday, October 5, 2011

నిలువు చెంబు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి





విశాలాంధ్ర లో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే అనుకోకుండా నా చేయి తాకి ఓ పెద్దాయన క్రింద పడి పోయాడు.  అయ్యో క్షమించండీ అంటూ లేపి నా మానాన నేను పోదామని , ఎందుకైనా మంచిదని ఎవరా అని చూశా...శ్రీపాద వారు. పెద్దాయన కదా వీరితో మనకెందుకులే అని ఓ నమస్కారం పెట్టుకొన్నా. శ్రీపాద వారి గురించి విన్నవి , చదివినవి ఓ సారి మనసులో మెదిలాయి. వారి కథల నేపద్యం "గోదావరీ తీరం", పాత్రలు ఎక్కువగా శ్రోత్రీయ బ్రాహ్మణులూ అదే కాకుండా ఎక్కువగా వితంతు వివాహాలు , మూడాచార   నిరసనలు, సాంసారిక జీవితంలో మాధుర్యం, స్త్రీ స్వాతంత్రం, అంటరాని తనం మొదలగు కథా వస్తువులతో కథలు రాశాడని, భాష విషయంలో వ్యావహారిక భాషను, నుడికారానికి పట్టాభి షేకం చేసిన మహానుభావుడని అన్నీ గుర్తొచ్చాయి. ఇంత పెద్దాయన కదా ఓ సారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయ భాగ్యం చేసుకుంటే ఎలా ఉంటుంది.  మనకు కొరుకుడు పడతారా లేదా అనే  అనుమానం తో ధైర్యం చేసి వారి ని తీసుకొని వారి " నిలువు చెంబు" నా చేత పట్టుకొని ఇంటికి చేరా. ఇంటికెళ్ళగానే ఆ " నిలువు చెంబులో " ఏముందో అని చూశా.  నీళ్ళు అనుకున్నా కాదు...తేనే..అమృతం   ఆ అమృతం లోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మీకు కూడా కొంత పంచుదామని ఈ చిన్న ప్రయత్నం....ఆస్వాదించండి మరి. ఈ నిలువు చెంబు లో మొత్తం 8 కథలున్నాయి.

ప్రణయ తపస్సు: వితంతు వివాహం గురించి సాగే కథ. ఓ బైరాగి నలబై  ఏళ్ల కు పైగా , తను పెళ్లి చేసుకుందామని అనుకున్న  బాల వితంతువు అనుకోని పరిణామాల వల్ల  చనిపోతే ఆమె తండ్రి ఆమెకు కట్టించిన సమాధి  మండపం పై చేసే ప్రణయ తపస్సు ఈ కథ. నలభై ఏళ్ల క్రింద జరిగిన విషయాలు ఆ బైరాగి మనకు చెప్పడమే ఈ కథ. 

కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
ప్రణయ భంగము: ఇది కూడ ఒక బ్రాహ్మణ బాల వితంతువు కథ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త ను తల్లిని కూడా పోగొట్టుకొన్న యువతి కథ. దుక్కమే   తోడూ , నీడ, జీవం, ధైర్యం,సకలం అలా రూపొందిన  దుక్కమై పోతుంది. తండ్రి వితంతువైనా సరే లోకాన్ని ఎదిరించి పెళ్లి చేస్తా అంటాడు. తనూ సంతోషించి ఎదురింట్లో  ఉన్న బ్రాహ్మన్ని కోరుకుంటుంది. అతడు భార్య చని పోయి ఒక భోగం దాని ని  ఉంచుకుంటాడు. నా శరీరం చెడిపోయింది అని ఒప్పుకోడు. తర్వాత ఈమె తండ్రి అనుమతితో అతనికి సేవ చేస్తుండగా అనుకోని పరిస్తితులలో పరిస్థితి విషమించి అతడు చనిపోతాడు. ఇంతజరిగాక సంసారం లో ఏముందని ఆ జగన్మాతని ఆశ్రయించడం ఈ కథా  సారాంశం.

వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి  మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా  మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.

నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.

ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో   సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.

అశ్వ  హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత. 

బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం  అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.

శ్రీపాద గారు మొదటి కథ లో అన్నట్లు " అప్పటి రుచులు వెఱూ , ఇప్పటి రుచులు వెఱూను?  అప్పటి ధర్మాలు వెఱూ ఇప్పటి ధర్మాలు వెఱూను.అప్పటి యువకుల సంకల్పాలు వెఱూ ఇప్పటి వారి సంకల్పాలు వెఱూను. అప్పటికీ ఇప్పటికి ఏతాం పట్టంత తేడ వుంది. అప్పటి కథలు అర్థం చేసుకోవాలంటే ముందు హృదయాన్ని  అప్పటి కాలంలో ప్రవేశ పెట్టాలి. లేకపోతె విన్నా లాభం లేదు".


Sunday, September 4, 2011

అక్షర యాత్ర - నండూరి కి నివాళి



నండూరి రాం మోహన్ రావు గారి మరణం వార్త వినగానే, నేను చదివిన నండూరి వారి "అక్షర యాత్ర" గుర్తొచ్చింది. వారి గురించి రాసేంత వాణ్ని కాదు కానీ. నేను  చదివిన ఆ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ పుస్తకం 70  వ్యాసాల సంపుటి. వారి మాటల్లో చెప్పాలంటే " ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువ భాగం నేను అభిమానించే సాహితీ మూర్తులు, మిగిలిన శాతం నా అభిమాన గాయకులు , చిత్ర కారులూ, నటులు మొదలయిన వారు,  ...అన్నీ కలిపి ఈ సంకలనం ఒక పెద్ద కలగూర గంప. రక రకాల రంగు రంగుల పూల కదంబం." ఇందులోని వన్నీ పత్రిక రచనలే. " ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు, నిలువుటద్దం  లాంటి సంకలనం అన్న నండూరి మాటలు గమనార్హం. ఈ వ్యాసాల్లో ఎన్నో రకాల వ్యక్తులు. కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నంతగా  విభిన్న వస్తువులపై వ్యాసాలు రాశారు.ఇందులోని వ్యాసాలను వివిధ రకాలుగా వర్గీకరించారు, అవేంటంటే " స్మృతిపథం", "ప్రతిభా పరిమళాలు", మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూర తీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞ్యాపకాల నీడలు

స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17  ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ  శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12  వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై  5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10  వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.

పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నట్లు నండూరి వారు వ్యాసాలకు పేరు పెట్టడం లోనే ఎంతో  శ్రద్ధ , నైపుణ్యం కనపరిచారు.

వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు  చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు..  శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ?  శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23  ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం  కాకుండా ఉంటాడా.

ఇలా కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నట్లున్న ఈ వ్యాస సంపుటి మళ్ళీ ఒక సారి చదువుతూ నండూరి కి నివాళి అర్పిస్తున్నాను.




Friday, September 2, 2011

తెలుగుకు వెలుగు


తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం  పొందడం ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది.  ఈ సభ్యత్వం  తో ఇంటర్నెట్ తెలుగు లిపి లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లిపిని రూపొందిస్తారు.  కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు  రూపొందిస్తారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో  తెలుగు సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే  కాకుండా తప్పులు దొర్లితే వెంటనే పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.  తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం మనందరికీ శుభవార్త.

Monday, August 15, 2011

హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!



(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)

గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!

పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో

'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ  లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్ 
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!

పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !