Showing posts with label పుస్తకాలు. Show all posts
Showing posts with label పుస్తకాలు. Show all posts

Friday, March 23, 2012

సలాం హైదరాబాద్


హైదరాబాద్ నగర నిర్మాణం ప్రేమమీద ఆధారపడి ఉంది. కులీ కుతుబ్షా ప్రేయసి బాగమతి కులీకుతుబ్షా జనానా లో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.అప్పటి ప్రధాని గుజ్రాల్ "నేను చూసిన అందమయిన హైదరాబాద్ ఏమయ్యింది. ఇప్పుడున్నది సిమెంట్ కాంక్రీట్ భవనాల అరణ్యమే" అని అన్నాడట. ఇంకెవరో అన్నారు "హైదరాబాద్ కీ ఆంగాన్ గాయబ్" అని. మరి ఆ అందమయిన హైదరాబాద్ ని చూడాలని ఉందా. హైదరాబాద్  పాత నగరం గల్లీ గల్లీ తిరగాలని ఉందా...ఈ నవలలో రచయిత మనల్ని తనతో ఆ పాత నగరపు , ఆ చార్ సౌ సాల్ పురానా షహర్  గల్లీ గల్లీ తిప్పి ఆ నగర అందాలను, మనకి కళ్ళకు కట్టినట్టు చూయిస్తాడు.

డిల్లీ , లక్నో నగరాల చరిత్ర సాహిత్యం లాగా హైదరాబాద్ గురించి ఎందుకు లేదు అన్న ఆలోచన , తపన లోనుంచి పుట్టిందే ఈ  "సలాం హైదరాబాద్ ". ఇది రాయటందుకు నా అర్హత ఏమిటంటే " నేను పైదాయిషీ  హైదరాబాదీ" నని ఒకింత గర్వంతో అంటాడు." పాత నగరం గల్లీలలో కళ్ళు తెరిచి ఈ భూమి మీద పడి పాత నగరం పొత్తిళ్ళలో, గండిపేట నీళ్ళతో పెరిగి ఈ గూటి పక్షిగా ఇక్కడి పాటనే పాడి ఇంకా " జీనా యహా , మర్నా యహా, చివరాకరికి పురానాపూల్ చితి మంటల చిటపటలలో నుండి ఫీనిక్స్ మాదిరి లేచి చార్ సౌ సాల్ పురానా షహర్ గల్లీ లలో రెపరెపలాడుతూ మళ్ళీ విహరిస్తాను, మళ్ళీ మళ్ళీ జీవిస్తాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.తానూ పుట్టింది పెరిగింది పల్లెటూరు అయినా పట్టణమైనా దాని మట్టిని, మట్టివాసనని , ఆ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళను, మనిషి అయిన వాడు మనసు నిండా ప్రేమిస్తాడు. అలా హైదరాబాద్ మీద తన ప్రేమను ఇలా చూపిస్తాడు మనకు రచయిత.

ఈ నవల లో ప్రధాన పాత్ర స్వామి అనే యువకుడు , అతని ఆత్మ కథ. ఆ నేపధ్యంలో   మనకు హైదరాబాద్ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు, నగర జీవితం, ఈ నగరం నేల మీద నడిచిన రాజకీయాలు, ఉద్యమాలు అన్నిటినీ రచయిత మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు.

కథలోకి వస్తే  కథా కాలం 1969 . 17 ఏళ్ళ స్వామి కాలేజీ జీవితంతో మొదలవుతుంది.ఉండేది శాలిబండ. చిన్న వయసులో హటాత్తుగా చూసిన చార్మినార్ ఆ చిన్నారి హృదయంపై చెరగని ముద్ర వేస్తుంది.చార్మినార్ పెహ్లీ నజర్, పహలా ప్యార్ అయ్యింది. చార్మినార్ ఎదురుగా ఉన్న ఇక్బాల్ హోటల్లో కూర్చొని  జిగ్రీ దోస్త్ చార్మినార్ తోటి ఎడ తెగని ఏకాంత నిశ్శబ్ద మౌన రాగాల సంభాషణ....లంగోటీ యార్ దోస్తాన... మనిషికి ముక్కెట్ల   అందమిస్తదో , హైదరాబాద్ కి చార్మినార్ అట్లా అందమిస్తాది అంటడు.ఇంకా హైదరాబాద్ నగర సుందరి ముక్కుపుడకల తళుక్కున మెరిసే మేలిమి ముత్యమే చార్మినార్ అంటాడు.హైదరాబాద్ కీ షాన్ అఉర్ శౌరత్ చార్మినార్ అంటడు. స్వామి మిత్రులతో 1969  తెలంగాణా ఉద్యమంలో పాల్గొనటం అతని జీవిత నేపద్యం లో హైదరాబాద్ మూలాలు, సంస్కృతి , సంప్రదాయాలు, చరిత్ర,, నిజాం కాలేజీ లో మొదలయ్యి, రక్త సిక్తమయిన మలుపులకు, ఎవ్వరూ ఊహించని దారులకు తరలిన ప్రత్యెక తెలంగాణా ఉద్యమం గురించి, ఉద్యమ వేదిక గా ఉస్మానియా యూనివర్సిటీ  క్యాంపస్ కేంద్రంగా ఎలా మారింది, ఎలా ఉవ్వెత్తున ఎగిసి, రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయి చివరికి ఉద్యమం ఎలా అణగ దొక్క బడిందో, ఎలా చల్లారి పోయిందో మన కళ్ళకి కట్టినట్టు చూయిస్తాడు. 

మనం ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటె స్వామి తో పాటు హైదరాబాద్ నగర వీదుల్లో , గల్లీ గల్లీ లో ఆ పాత నగరాల అందాలను చవిచూస్తూ , ఉద్యమంలో మనమూ పాలు పంచుకొని, ఇరానీ కేఫ్ లలో బోలో సాబ్! క్యా హుకుం హై అంటూ వొంగి వొంగి సలాములు చేసే సర్వర్లూ, మనమూ  దో మే చార్  చాయలు తాగుతూ,  కమ్మటి బిర్యానీ వాసనలు, గుబాళించే సమోసా వాసనలు ఆస్వాదిస్తూ , మధ్య మద్యలో అతని  పురా స్మృతుల్లో పెటిల్లున తెరుచుకొనే "పండోర బాక్స్" ఆ పందోరా బాక్స్ లోకి స్వామి తో పాటు మనమూ నగర చరిత్ర పుటల్లోకి ప్రయాణించి, అక్కడ కులీ కుతుబ్షా , నిజాం లను కలిసి ,కైరునీసా ప్రేమ విషాద  గాధలలో మునిగి తేలి, తుర్రెబాజ్ ఖాన్ జ్ఞ్యాపకాల విషాదాల్ని పంచుకుంటూ, ఒక్కసారిగా స్వామి చిన్నతనం లోకి వెళ్లి అలా బొంగరం లా  చరిత్రలోకి , స్వామి చిన్న తనం  లోకి, గతం నుంచి వర్తమానం లోకి , వర్త మానం లోనునుంచి గతం లోకి  మనల్ని తిప్పుతూ సాగిపోతుంది. పాత్రలతో మమేకమయి ఒక సజీవ దృశ్యం మన కళ్ళ ముందు చూస్తున్న అనుభూతి కల్గిస్తుంది.  కైరున్నీసా కండ్ల  పొంట ఒలికిన ఒక కన్నీటి చుక్క ఆమె చెక్కిలి మీద ఘనీభవిస్తే, అది రెసిడెన్సీ గా రూపొంది అదే ఇప్పుడు కోటీ వుమెన్స్ కాలేజీ గా మారిన వైనం, రెండు  మతాల మధ్య, రెండు ఖండాల మధ్య ప్రేమ, ఆ విషాద ప్రేమ గాధ కళ్ళకు కట్టినట్లు మన ఎదురుగా చూస్తున్న అనుభూతి.హైదరాబా పురాతన మూలాల్లోనుంచి ఇప్పుడున్న నగరం లోకి జరిగిన ట్రాన్స్ ఫార్మేషన్ రచయిత ఎంతో చక్కగా మనం ఒక ద్ర్యష్య కావ్యం చూస్తున్నట్లు చూయిస్తాడు. 


ఒక్కో పుట చదువుతూ పోతూ ఉంటె ఎన్నో మన జ్ఞ్యాపకాలు, మనం చూసినవి , మనం అనుభవిన్చినవీ  మనం కాల గర్భంలో మరిచి పోయినవీ, ఎన్నో ఎన్నెన్నో....పాన్దాన్లు,  బగల్దాన్లు , బావిల పడ్డ బొక్కేన్లు తీసే  వెయ్యి కాళ్ళ జేర్రోలె, వంద చేతుల ఆక్టోపస్ వలె ఉండే పాతాళ గరిగలు, నయా పైసలు, ఎర్ర మన్ను తో ఇల్లలకడం, పీరీల పండగ , బొగ్గులు రాజేసి చా పెట్టడం, ఎర్రటి మట్టి పొయ్యిల మండే బొగ్గు కనికల స్మృతులు మనల్ని గతంలోకి లాక్కేలతాయి.అమ్మపెట్టిన ఉప్పుడు పిండిల శర్కర కలుపుకొని తినడం, బాపూ అన్న పదం లో ఆప్యాయత (మా అక్క మా తాతయ్య ని మా అమ్మ తో పాటు బాపూ అంటుంది ) ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పొతే ఒక్క సారి కాదు పదే పదే మనల్ని పురా స్మృతుల్లోకి తీసుకపోతుంటాడు. హైదరాబాద్ ఇరానీ కేఫ్ ల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇరానీ కేఫ్ ల అందాలు ,  ఒక అతి పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ లో కూర్చొని ఎంతకూ ముగింపు లేని సుదీర్గ జన జీవన నాటకాన్ని చూస్తున్నట్లుండే ఇరానీ కేఫ్ లు అంటాడు. నిజంగా వరంగల్ లో జవహర్ కేఫ్ లో కూర్చొని దో మే చార్ చాయ్ అనగానే ఆ సర్వర్ నాలుగు గ్లాసుల్లో వేళ్ళు పెట్టి ఒక్క సారి మన ముందు శబ్దం చేస్తూ పెట్టి, ఘుమ ఘుమ లాడే ఇరానీ చాయ్ తెచ్చిన జ్ఞ్యాపకాలు ...ఎలా మరిచి పోగలం..

1969 లో జరిగిన  తెలంగాణా ఉద్యమ చరిత్ర చదువుతుంటే , మళ్ళీ 2010 /11 ల జరిగిన్ ఉద్యమం  కండ్లల్ల మెదులుతుంది.అప్పటికీ, ఇప్పటికీ , 42  సం. గడిచినా పరిస్తితులలో గానీ , ఉద్యమంలో గానీ ఎటువంటి మార్పు లేదు, మన బతుకుల్లాగే. అప్పటిలాగే ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారి పోయింది ఇప్పుడు కూడా.
రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్న చని పోయిన  స్వామి స్నేహితుడు జోసెఫ్ జెఫ్రీ కళ్ళలా...నిరీక్షిస్తున్న ఎన్నో కళ్ళు......చల్తే చలో చల్తే చలో చల్తే చలో. ఎ వక్త్ కీ ఆవాజ్ హై చల్తే చలో. సలాం హైదరాబాద్.. ముగింపు లేని కథ...అలా సాగుతోంది.
రచన:  సలాం హైదరాబాద్ 
రచయిత : లోకేశ్వర్ 

Sunday, July 24, 2011

నాదయిన సమస్యలు (శారద మనోగతం)


ఆలూరి భుజంగ రావ్ రాసిన "సాహిత్య బాటసారి - శారద "  లో   నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదని ఎంతో వేదన తో రాసిన శారద  మనోగతం మీ కోసం ...

"నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని, కాని హోటల్ చాకిరీ తప్పదు, చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు. పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను. అదీ సాధ్యం కావటం లేదు. తెలుగు మాత్రు భాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ, రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపికా లేదు. ఏ పున్యాత్ముడయిన  ఇస్తాడనుకుందాం. కోరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పని వాళ్లకి తెనాలి లో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన వచ్చిందో తెలియదు గానీ, నాతొ సహా నూటికి తొంబయి అయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణం లో చదువెక్కడ, రాత ఎక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తుంది కానీ, అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు లేబర్ ఆఫీస్ ఉంది. ఓ లేబర్ ఆఫీసరూ ఉన్నాడు.

హోటల్ సర్వరు కి చదువు ఎందుకు అనే పెద్దమనుషులూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరయిన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరుగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ  ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పయిగా ఈ ఉద్యోగం ఊడిపోవటం, రోజుల తరబడి పస్తులున్డటం జరిగింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుంది అనడంలో సంశయమేమి లేనప్పుడు మిగిలి ఉన్న జీవిత కాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తుంది. స్వతంత్రం వచ్చాక  ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం నా జీవిత ప్రయాణం వెనకటికన్న నూటికి ఇరవై పాల్లన్నా పెరుగుతున్దనుకున్నాను.

పత్రికల వారు  కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్చల రోగాన్ని నయం చేసుకోవడానికన్న సరిపోతాయేమో అని సంతోషించాను. అదీ వట్టిదయిపోయింది. ఈ పద్దతిలో  నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ  లేదనుకుంటాను.
( ఇది :తెలుగు స్వతంత్ర లో ఫిబ్రవరి 18 , 1949 లో ప్రచురితమయ్యింది)

సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)


ఎక్కడో తమిళ దేశం లో జన్మించి, చిన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం తెనాలి వచ్చి పొట్ట నింపుకోవడానికి హోటల్ సర్వర్ గా పని చేస్తూ, తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసి ౩౦ సం.ల చిన్న వయస్సులో ఫిట్స్ వ్యాధి తో మృత్యు వాత పడిన " శారద"  జీవితం గురించి ఎన్నో విషయాలు ఆనాటి తెనాలి లో శారద తో సన్నిహితంగా ఉన్న సహచరుడయిన శ్రీ ఆలూరి భుజంగ రావ్ గారు "సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)" స్మృతి శకలాలు పేరిట మనకందించారు.ఎందరో తమ కీర్తి, తమ రచనకు ప్రాచుర్యమూ కలగాలన్న కోరికతో శారద జీవితానికి చిలువలు, పలువలూ కల్పిస్తారన్న భయం కల్గి , ఆనాటి జీవిత పరిస్తితుల్ని వ్రాసి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రచన చేసినట్టుగా భుజంగ రావ్ గారు తన ముందు మాటలో తెలిపారు.



1937  లో మద్రాసులో బతకలేక వ్రుద్దుడయిన తన తండ్రి ని తీసుకొని నటరాజన్ తన పన్నెండేళ్ళ వయసులో ఆంధ్రా ప్యారిస్ తెనాలి లో అడుగు పెట్టి తన బావ అయిన భీమారావ్ హోటల్లో పనికి కుదిరి ప్రతిపలంగా ఇచ్చే పావులో-ఆర్తో సంపాదనతో ఓ చిన్న వూరింటిని అద్దెకు తీసుకొని తెనాలి లో తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికి అతనికి తమిళ సాహిత్యంతో పరిచయముంది. ఇక్కడ తెనాలి తో తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్తితి వచ్చి తెలుగు నేర్చుకొన్నాడు.రోజుకు పదహారు గంటలు అతి దుర్భరమయిన హోటల్ చాకిరీ చేస్తూ సాహిత్యం వైపు ఆకర్షితులయినాడు. 1946 లో ప్రజాశక్తి లో "ఎస్.నటరాజన్ " పేరిట " ప్రపంచానికి జబ్బు చేసింది" అన్న ఓ వ్యంగ్య రచన ప్రచురితమయ్యింది. ఇదే అతడి అచ్చయిన మొదటి రచన. మిత్రులతో కలిసి "ప్రజావాణి" అనే రాత పత్రిక ను ప్రారంభించాడు. 1946 -47 లలో  నటరాజన్ తన సాహిత్య పరిజ్ఞ్యానాన్ని విషయ పరిజ్ఞ్యానాన్ని పెంచుకొన్నాడు. అదే రోజుల్లో ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరి తెనాలి లో "జ్యోతి" అనే పక్ష పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక కారణంగా తెనాలి ఓ సాహిత్య కేంద్రంగా వెలసిన్దంటారు.అంతక్రితమే చక్రపాణి "యువ" కూడా తెనాలి నుంచే ప్రారంభించారు.1948  సం.జనవరి ౩౦ వ తారీకు జ్యోతి పత్రికలో " గొప్పవాడి భార్య" అనే ఒక వ్యంగ్య రచన శారద పేరున అచ్చయ్యింది, శారద పేరున అచ్చయిన మొదటి రచన ఇదే. నటరాజన్ సహజంగా సౌందర్యోపాసట అందుకే "శారద" అన్న మూడక్షరాల స్త్రీ నామం తనకు నచ్చి దాన్నే కలం పేరుగా పెట్టుకొన్నాడట. అక్కడి నించి శారద శర పరంపరలుగా రచించాడు. తను చూచిన ఎందరో అభాగ్యజీవుల్ని , దురాశాపరుల్నీ తన సాహిత్యంలో చిరస్మరనీయంగా చిత్రించాడు. ఇలా  సుమారు ఓ వంద కథలూ, కొన్ని నవలలూ రాశాడు. అతని కథలు విరివిగా ప్రచురితమయ్యి  పేరు సంపాదించే రోజుల్లో కూడా పొట్ట పోసుకోవతందుకు బస్ స్టాండ్లో పాత పుస్తకాలూ , చల్లని మజ్జిగా అమ్మే వాడు.ఇలా చివరి క్షణం వరకూ కష్టపడే బ్రతికాడు. కస్టపడి బ్రతికే మానవుల జీవితాల్ని తన రచనల్లో చిత్రించాడు.

 కథ గురించి శారద ఎం చెప్పాడట అంటే " కథకుడు ఎ చిత్రాన్నయినా సమగ్రంగా చిత్రించాలి, కథ చెప్పడంకూడదు, కథని కెమెరా సినిమాని చూపించినట్లు  చూపించాలనేవాడు.కథ చెప్పడం నాయనమ్మ పని అని , రచయిత తన ఆదర్శాన్ని ఊక దంపుడు ఉపన్యాసంగా చెప్పడాన్ని అంగీకరించేవాడు కాదు.కథలలో గానీ, నవలలో గానీ మనం చెప్పదలచుకున్న ఆదర్శం పూసలలో దారంలా ఉండాలంటాడు . కథ సాంతం చదివేసరికి పాటకుడు మన ఆదర్శాన్ని అంగీకరించే స్థితి కి రావాలంటాడు.ఆదర్శాన్ని విడిగా చెప్పడం అతడికి నచ్చదు. కథాకతనంలోనే తానూ చెప్పదల్చుకున్నది ఇమిడి ఉండాలి , ఆదర్శామూ రావాలి అనేవాడట.  

ఇలా  తెనాలి లో అడుగుపెట్టి హోటల్ వర్కర్ గా పనిచేస్తూ పర భాష అయిన తెలుగు నేర్చుకొని ఆకలి, దారిద్ర్యం ,కన్నీళ్ళ గురించి  తన కలం నుంచి ఎన్నో రచనలు చేస్తూ  , తండ్రి మరణంతో వచ్చిన మూర్చ వ్యాధి జీవితాంతం వెన్నంటి చివరికి ఆ మూర్చ తోనే జీవితం ముగించిన శారద జీవితం గురించి ఎన్నో విషయాలు, శారద వ్యక్తిత్వం గురించి , రచయిత ఈ రచనలో మనతో పంచుకుంటారు. శారద జీవితం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.

రచయిత: ఆలూరి భుజంగ రావు.
ప్రచురణ: చైతన్య వేదిక- తెనాలి
వెల      : రూ. ౩౦.౦౦ 

Friday, February 18, 2011

జీవించు - నేర్చుకో- అందించు ....తుమ్మేటి రఘోత్తం రెడ్డి




ఆంగ్లంలో కొటేషన్ల పై అనేక పుస్తకాలు వచ్చాయి . అలాగే తెలుగులో కూడా వున్నాయి .కానీ ఒక తరంలో ప్రోది చేయబడ్డ జీవన జ్ఞానాన్ని  సాహితి సృజనలో పాల్గొన్న వ్యక్తి తన జీవిత అనుభవాల సారాన్ని, క్లుప్తంగా రాసిన వాక్యాల్లో , ముందు తరాలకు అందించాలన్న దృక్పధంతో రాసినది "జీవించు-నేర్చుకో- అందించు (యువతకోసం) " అన్న ఈ చిన్ని పుస్తకం.  తన తరువాత తరంకోసం,  మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, తన కెదురైన జీవిత అనుభవం లోనుంచి  అలాగే కొన్నివేరెవరో  చెప్పినవి, తన ద్రుక్పదానికి అనుగుణ మయిన మార్పులు చేర్పులతో రచయిత మనకు అందించారు.

ప్యాకెట్ సైజులో సుమారు 20 అంశాలపై అంటే జననం నుండి మరణం వరకు అనేక అంశాలపై చాల చక్కటి వాక్యాలు క్లుప్తంగా రాసారు. వరుసగా చదవాల్సిన అవసరం లేదు.ఎ పేజి అయిన తెరిచి ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు.ఎక్కడైనా ఆపవచ్చు.కాలక్షేపానికి అనుకొండి  లేదా మనసు బాగోలేనప్పుడు ఓ సారి  అలా  ఏదోఒక పేజీ  తెరిచి ఆ వాక్యాలు చదివితే ఏదో ఒక ఇన్స్పిరేషన్ , మన మనసులో ఏదో మార్పు కలగక మానదు .దీన్ని "టీ పాయ్ " బుక్ అనవచ్చు. మనకు తోచనప్పుడల్లా ఓ  పేజి తెరిచి చదవచ్చు.ఎన్ని  సార్లు  చదివినా సమయాన్ని బట్టి ఓ కొత్త ఆలోచన,  కొత్త భావం కలిగిస్తాయి

గత ౩౦ ఏళ్లుగా తెలంగాణా జీవితాన్ని,పోరాటాల్ని,విభిన్న ద్రుక్పధం తో తన అనుభవాలతో  మనకు కధలుగా అందించిన రఘోత్తం గారు , నేనేవరికోసం రాయాలి అని సూటిగా ప్రశ్నించుకొని, కొడుకు తిలక్ కోసం ఈ తరం యువత కోసం , తన అనుభవాలతో  తన సాహితి జ్ఞానంలోనుంచి  ముందు తరానికి పుస్తకరూపంలో ఇచ్చిన సలహాల కూర్పు ఈ పుస్తకం. "నేనేరిగినంత మేర  జీవితం గురించి సూక్షంగా , నాఅనుభవం లోనుంచి  నేను రూపొందిన్చుకొన్న అభిప్రాయాలు" అంటారు చివర్లో రచయిత .

పాటశాల విజ్ఞానాన్ని  నేర్పితే, సాహిత్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది  అంటారు, ఈ పుస్తకంలో రఘోత్తం  గారు ఒకచోట, నిజమే ఈపుస్తకం మన జీవితం పై  మనకు కొంత అవగాహన, మరియు  జ్ఞానం  ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మనకు జ్ఞానాన్నే   కాదు అక్కడక్కడ కొన్ని చురకలు కూడా అంటిస్తారు. అందరు తప్పకుండ చదివి దగ్గర ఉంచుకోవాల్సింది ,ఈ చిన్న అమూల్యమైన  పుస్తకం.

Tuesday, February 1, 2011

మంచుపూవు....కాశీభట్ల వేణుగోపాల్



నేనే..హంతో భారత్ నారీ హై...ఈజింటిట్ రీమాజీ..? యాంటి కాలంలో ఆంటీ కామెంట్లు..డే..డే..శోభాడే..భాడే..బాదుడే..ఒక్కో కాలంకెంతిస్తారో...కుశ్వన్తసింహ  పేరు కంటేనా? బూతెక్కువైతే అంకెలెక్కువైతాయి...అంకెలు సంకెళ్ళు..బందీ..భవానీ విడుదలౌతాడా ! భవానీ ఎరుపా? ఎర్ర మల్లెలు ..మల్లెలు..మల్లెలు..మళ్ళీ మల్లిక ఈ రోజు కనిపించిందా  ? ....రామదాసూ ...అయామ్సారీ...నువ్వా జైల్లో..మేమీ జైల్లో..లో..లోహలో..లోయలో...లోయలో జైలుందా...ఎత్తైన ఎతాసుకొండ కిన్దుంది  జైలు శ్రీ శ్రీ మోహబ్బత్ ఖాన్ కథ లోని రాజుగారి శాసనం అక్కడ అమల్లో వుంది... బాగోతుల తిక్క శంకర శాస్త్రి కేం తెల్సూ..శ్రీ రంగాన్ని ఛీ అంటం తప్పా..? ఛీ ఛీ కోటి లాఫ్టింగ్ హ్యుగ్ డూలిట్టిల్...ఛీ ఛీ డ్యాబ్ డ్యాబ్ , గబ్ గబ్,పుష్మీ పుల్యూ...ముందు వెనక తలలే అయితే ఎలా?...నిజంగా జంతువులన్నీ మాట్లాడితే ఎలా వుంటుందో....నే మాట్లాడుతున్నాగా...? ష్..ష్...ష్.....

చైతన్య స్రవంతి...  స్ట్రీం ఆఫ్ కాన్షియస్ ... ఆధునికత లో భాగంగా కాల్పనిక నవలా రచనలో ఇదొక ముఖ్య ప్రయోగంగా విమర్శకులు గుర్తించారు. ఈ తరహా సాహిత్యం అంటే .. ఒక పాత్ర మనసులో వచ్చే ఆలోచనా స్రవంతి, అది ఎలా వస్తే  అలాగా ఒక ప్రవాహంలా చిత్రించే రచనా పద్ధతి . మనిషి మెదడులో మెదిలే ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాల దొంతరలు, అడ్డూ అదుపు లేని అక్షరాల ప్రవాహం. మనసుకు ఏది తోస్తే అది , ఏది గుర్తుకు వస్తే అది, ఇలా ఒక లెక్చరర్ పాత్ర చెప్పే కథే ఈ మంచుపూలు నవల. కాశీభట్ల  రాసిన ,ఒక విలక్షణ  శైలితో సాగిన ఈ నవల  నేను చదివాననడం కంటే చదివించింది అంటే సబబేమో..  ఇంకా చెప్పాలంటే ఆ మనసుతో,  ఆ పాత్రతో,  ఆ పాత్ర ఆలోచనలతో,  ఆ అక్షర ప్రవాహంలో కొట్టుకొని,  ఆ ఝరిలో మనమూ పరుగెడ్తూ, అలసి సొలసి ఊపిరి తీసుకోకుండా నవల చివర అక్షరం వద్ద మాత్రమె ఆగుతాం. ఎప్పుడో కొన్ని సంవత్చరాల క్రింద ఇండియా టుడే లో కాశీభట్ల గారి కథ ఒకటి చదివా. పేరు , కథ ఏది గుర్తు లేదు, గుర్తున్నదల్ల ఆ శైలి. అప్పడు అది చైతన్య స్రవంతి తరహా అని తెలీదు. ఆ తర్వాత నవీన్ అంపశయ్య చదివాక దాని గొప్పదనం తెలిసింది. ఆ తరహా శైలి లో రాసిన మంచుపూవు నవల గురించి నా ఈ పరిచయం. కథ ఉత్తమ పురుషలో కొనసాగుతుంది.  ఇక ఈ రచన గొప్పతనమేంటంటే నవల మొదలు పెట్టాక అది ముగించేదాకా మనం లేవం.

  మన కథానాయకుడు ( ఎక్కడా అతని పేరు లేదు) భార్య కావేరి ఏడేళ్ళ క్రింద చనిపోతుంది. అప్పడు అతనికి ఒక కూతురు ప్రియ వయస్సు అయిదేళ్ళు. కథ ప్రారంభమయ్యే సమయానికి ఆ అమ్మాయి వయస్సు పన్నెండేళ్ళు. ఆ పాప లో అతనికి భార్య పోలికలు, భార్య అలవాట్లు అనుక్షణం కనపడుతూ వుంటాయి. అమ్మాయి రజస్వల అయి బాల్యం లో నుండి యవ్వనపు చాయలు సంతరించుకుంటుంటే ఇతనికి ఆ పాప ఒక మినిఏచర్  కావేరి లా కనిపించి అతని ఆలోచనల్లో విశృంఖలత, ఒక వాంఛ, అతన్ని అతలాకుతలం చేసి అతన్ని డిస్ట్రబ్ చేస్తుంటాయి. కావేరి చని పోయాక అతను పెళ్లి చేసుకోడు. ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కూతురు భార్య పోలికలతో ఎదురుగా కనపడి అనుక్షణం  కావేరి ని గుర్తు చేస్తూ చివరికి తనకు తెలీకుండానే ఆమెపై వాంఛ కల్గుతుంటుంది. చివరికి తన ఆలోచనల పట్ల తనకే రోత పుట్టి, ఒక తోడు కావాలని, ఎన్నో రోజులుగా మనసులో ఉన్న ప్రియ టీచర్, మల్లికని  పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరడంతో కథ ముగుస్తుంది.

మనిషి కుండే చేతన, అచేతన స్తితి ల గురించి, ఇవి సముద్రం మీద తేలుతూ వుండే ఐసు బెర్గ్ తో పోల్చి చెబుతారు. ఐస్ బెర్గ్ సముద్రం లో తేలుతూ వున్నప్పుడు పదింట ఒక వంతు మాత్రమె పైకి కనపడుతుంది. మిగతా తొమ్మిది వంతులు కనపడకుండా నీటిలో వుంటుంది. ఆ విధంగా చేతన (conscious) ను బట్టి మనకు తెలిసేది మనిషి మనస్తత్వంలో అతి స్వల్పభాగం మాత్రమె. మిగిలిన చాలా భాగం అచేతనలో ఉండి పోయి మనిషికి అంతు చిక్కకుండా ఉండి పోతుంది.చేతన లో ఉండేవి హేతువాదానికి, సామాజిక కట్టుబాట్లకి సంబంధించిన భావాలు. వీటికి అచేతనకి సంబంధం లేదు.అందులో వుండే కోర్కెలు హేతు వాదానికి గాని , సామాజిక నీతులకు గానీ సంబంధించినవి కావు. మనిషి యొక్క ఆదిమ కాలం నాటి వాంఛలన్నీ అందులో చోటు చేసుకుంటాయట  . ఇదంతా ఎందుకంటీ దీనిలో మన కథా నాయకుడి మనసులో కలిగే ఆలోచనలు అలాంటివే అనుకుంటా. ఎందుకంటే వావి వరసలు మరిచి పోయి ఒక తండ్రి కూతుర్ని వాన్చిచడం జరుగుతుందా?  అస్సలు ఇదీ ఒక రచనేనా అంటే మనం రోజూ నిత్యం పత్రికల్లో చూస్తుంటాం. కూతుర్ని రేప్ చేసిన తండ్రి.  ఇలాంటివి ఎన్నో.  ఇలా మనసులో ఉన్నమనకే తెలీని  చీకటి కోణాలని   బయట పెట్టటమే రచయిత ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఇది మంచా చెడా దీన్ని మనం ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అన్నది  మీకే వదిలేస్తున్న.  ఈ నవలపై నేను ఎలాంటి అభిప్రాయం చెప్పబోవట్లేదు.  ముందు మాటలో గుడిపాటి గారు చెప్పినట్లు " మనిషి లోపలి ఇలాంటి పార్శాల్ని గురించి రాయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తారేమో. ఈ నవల అంతర్, బహిర్ ప్రపంచాల్లోని అలజడిని , సంక్షోభాన్ని,సంక్లిష్టతలని    చిత్రించింది.వీటిలోని వైరుధ్యాలున్నాయి, అన్నిటిని ఆమోదించలెం    , అన్నిటిని తిరస్కరించలెం  .కానీ మనం చూడడానికి ఇష్టపడని, అస్సలు మాట్లాడడానికి ఇచ్చగించని  వాస్తవాల్ని చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితపు చీకటి కోణాలపై ప్రసరించిన టార్చిలైట్ "మంచుపూవు". ఆ చీకటి కోణాలని దర్శించే తెగువ ఉన్నవారు మాత్రమె ఈ నవల లోకి వెళ్ళడం మంచిది.



Sunday, January 30, 2011

పుస్తకం లో " అమీనా " పుస్తక పరిచయం



అమీనా.....మహ్మద్ ఉమర్ రాసిన నవల పై "పుస్తకం.నెట్ " లో నేను రాసిన పరిచయం :


ఆఫ్రికా స్త్రీ వాద రచయిత " మహ్మద్ ఉమర్" రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో  అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల  మనసుకు హత్తుకు పోయేలా రచించబడ్డ ఒక మంచి నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది అంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించ వచ్చు. ఇది రచయిత మొదటి నవల. సరళమయిన అనువాదంతో మొత్తం ఏక బిగిన చదివించిన నవల.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.