Friday, December 31, 2010

నయీ సాల్ ముభారక్

నమస్తే అన్నలూ  ..అక్కలూ  ...చేల్లెమ్మలూ. తమ్ముళ్ళూ    అందరికి పెడతాండ....దండం.  అందరు బాగున్నారే.  చూత్తాంటే చూత్తాంటే  పాత సంవత్చరం ఖతం అయిపొయింది. కొత్త ఏడాది వత్తాండే.  ఇప్పుడే గీడ కూసోని సొంచాయించిన,  గీ ఏడాదిల    ల మనం ఎం గొప్ప పని జేసినం అని..ప్చ్ ఎం కానోస్తలే. ఏదో దినాలు, నెలలు, అయిపోతాండే. ఏడ యేసిన గొంగళి గాడనే ఉన్నట్లు మనం ఏడ ఉన్నమో ఆడనే ఉన్నాం. సంవత్చరం అయిపోవచ్చే. గప్పుడు కే.సి.ఆర్. చచ్చుడో, తెలంగాణా వచ్చుడో అని ఆయన అన్నం గిన్నం  ఎం తినకుంటే అదేంది" ఆమరణ నిరాహార దీక్ష "శురూ జేసే. చూత్తాంటే ఈడ జేసిన్ద్రని ఆడ , ఆడ జేసిన్ద్రని ఈడ లొల్లి మీద లొల్లి, బస్సులు  తగులబెట్టిరి. ఆఖరికి  పాపం అభం శుభం తెల్వని పోరగాండ్లు వాళ్ళను వాళ్ళు  తగలబెట్టుకోనిరి. గట్ల చూత్తాంటే కొత్త సంవంత్చారం జై తెలంగాణా , జై ఆంధ్రా అంటూ మొదలాయే. ఆడికి మన చిదంబరం ఏదో మంత్రమేసి కృష్ణ కమిటీ ఎసి ఆడికి ఆ ముచ్చట ఖతం జేసిండు గదా. నాకు జర్ర గబ్రాయించింది లే ఎందుకంటే  అరె గీ లోల్లిల మన పోరగాండ్ల చదువులు ఏడ ఖరాబ్ అయితఎమోనని. ఏదో మొత్తానికి మనకి టైం కల్సి వచ్చి ఆ గండం గట్టెక్కింది. 

నడిమిట్ల ఏమయ్యిందంటే.....ఏమయ్యిందే.  ఆ నేనయితే గీ తెలుగులా బలాగ్గింగ్ శురూ జేసినా. ఏదో అట్లా నడిపిస్తాన. ఆడ ఒకళ్ళు  ఈడ ఒకళ్ళు  దోస్తులయ్యిండ్రు. మొన్న గాడ పట్నం ల ఈ-తెల్గు అని పెడ్తే  ఆడికి గుడక పోయోచ్చిన. చిన్నంగ చిన్నంగ ఏదో ఈ బ్లాగ్గింగ్ చ్జేస్తాన. ఆ ఇదేమ గొప్పతనం లే. 

కోసకోచ్చేసర్కి కృష్ణ కమిటీ రిపోర్ట్ గోర్మేంట్ కి పాయె ఇంకా ఆరు రోజులట ఎమొస్తాదో ఏమో, మల్ల గీ కొత్త సంవత్చరం లోల్లులు, గడ్బడ్లు, బందులు ధర్నాలతో శురూ అయేటట్టు కన్పద్తాంది, మల్ల పోరగాండ్ల చదువులు అటుకేక్కేతట్టుంది గాదె.  మా కాడ ఏమంటారంటే "రెడ్డొచ్చె మొదలాడే" అని గట్లుంది కథ మళ్ళీ మొదలాయే.  ఎం జేస్తం మనం చూస్కుంట కూసున్డుదేనాయే. కాని ఇదే మా తాతగారి జాగీర్..ఇది మా అయ్య  సొమ్ము...ఇది మా తల్లిగారిల్లు...ఇది మా ఇలాకా.. మాది మాక్కావాలి అంటే తప్పెందే. ఏడికి పోతం. ఈడనే ఉంటాం . సరే ముచ్చట ఏడికో పోతాంది. అది ఒగ్గెయ్యి.  యాది మరిచిన.  అస్సలు గీ కొత్త ఏడాదిల ఎమన్నా జేద్దమంటే  ఎంత సొంచాయిన్చినా ఎం మనసులకి రాట్లే. ఎవురన్న ఎమన్నా కొత్త ఇవిడియాలు ఇస్తారా మరి.  సరే మరి గీడకి ఇగ ఆపేస్త గాని...  అందరకి  ఈ కొత్త సంవత్చరం మంచిగుండాలె , అందరికి నయీ సాల్ కీ ముభారాక్ చెబ్తాండా.    మీరంతా గా సమ్మక్క సారలమ్మ దీవెనలతో చల్లగుండాలే.   మరి నాతొ ఉంటె ఎట్లనే. పోయి ఎంజాయ్ చేయార. మల్లోక్కసారి అందరికి నయీ సాల్ ముభారాక్..  ఇగ ఉంటానే మరి.

Thursday, December 30, 2010

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ , మగధీర లోని ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట. ఈ సినిమా వచ్చాక ఏ  ఇంట్లో చూసిన, ఏ  సెల్ ఫోన్ రింగ్ విన్న  ఇదే పాట అంటే అతిశయోక్తి కాదేమో.  కొన్ని వేల సెల్ ఫోన్లలో ఉండి ఉండవచ్చు.  మంచి  మెలోడీ  తో , మంచి సాహిత్యం తో ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది.  హీరో హీరోయిన్ను పంచదార బొమ్మ..నన్ను ముట్టుకోవద్దంటే ఎట్లా, నీ కోసమే పుట్ట నేను ,నువ్వు అందకపోతే ఈ జన్మ వృధా ,  నీకొరకు వరదయిన వరమని వరిస్తా, మునక కూడా నీ కోసం సుఖంగా భరిస్తానని అంటాడు.  ఈ పాట లో నాకు నచ్చిన చరణాలు, చూడండి.  

 గాలి నిన్ను తాకింది.. నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పేంది అని అతడు అడిగితె, ఆమేమో గాలి నాకు ఊపిరి అయ్యింది, నేలేమో నన్ను నడిపించింది మరి నీలోని  గోప్పెంటి అని అడుగుతుంది. అయినా అతడు ఊరుకోకుండా వెలుగు నిన్ను తాకింది, చివరికి చినుకు కూడా తాకింది, నేనేం చేశాను, నా మీద ఎందుకు  ఇంత  పక్షపాతము అంది అడిగితె, ఆమె ఏమంటుందో చూడండి. వెలుగేమో నాకు దారి చూపింది , చినుకేమో నాకు లాల పోసింది, వీటితోటి నీకేం పోలిక అని అడుగుతుంది. దీనికి అతడు ఎంత అందంగా, ఎంత బాగా చెప్తాడో చూడండి...." అవి బ్రతికున్నప్పుడే తోడున్టాయమ్మ....నీ చితిలో నే తోడయి నేనోస్తానమ్మ...." జీవితంలో నువ్వు అనుకోనేవన్నీ అంటే గాలి, నేల, వెలుగు, చినుకు ఇవన్నీ నువ్వు బ్రతికున్నంత వరకే నీ తోడుంటాయి, కాని నేను మాత్రం చివరికి నీ చితిలో కూడా అంటే నీ మరణం లో కూడా నీతో ఉంటా.. దీన్నేమనాలి మాటల్లో....ఎంత అందమయిన భావన, ఆమెకు అంతకన్నా ఇంకేం కావాలి.  మరణంలో కూడా నీ తోడుంటా అంటే అతడికి ఆమెపై ఎంత ప్రేమ ఉండాలి...ఆ ప్రేమను వ్యక్త పరచటానికి ఇంతకన్నా  గొప్ప మాటలు లేవేమో..ఇది రాసింది చంద్రబోసు అనుకుంటా..  అనూప్ గొంతులో  ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది. .

పంచదార బొమ్మ బొమ్మా .. పట్టుకొవద్దనకమ్మా..మంచుపూల కొమ్మ కొమ్మా .. ముట్టుకొవద్దనకమ్మా ..
చేతినే తాకొద్దంటే .. చెంతకే రావద్దంటే .. ఏమవుతానమ్మా
 ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
పువ్వు పైన చెయ్యిస్తే .. కసిరి నన్ను తిట్టిందే .. పసడి పువ్వు నువ్వని పంపిందే ..నువ్వు రాకు నా వెంటయే .. ఈ పువ్వు చుట్టు ముళ్ళంట .. అంటుకుంటే వళ్ళంతా మంటేనంట ..
తీగ పైన చెయ్యిస్తే .. తిట్టి నన్ను నెట్టిందే .. మెరుపు తీగ నువ్వని పంపిందే ..మెరుపు వెంట ఉరుమంట .. ఉరుము వెంట వరదంట .. నే వరద లాగ మారితే ముప్పంట ..
వరదైన వరమని వరిస్తానమ్మా ..అ ఆ .. మునకైన సుఖమని ముడేస్తానమ్మా .. అ ఆ ..నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
ఆ అ ఆ అ అ అ …
గాలి నిన్ను తాకింది .. నేల నిన్ను తాకింది .. నేను నిన్ను తాకితే తప్పా ..గాలి ఊపిరి అయ్యింది .. నేల నన్ను నడిపింది .. ఏమిటంట నీలోని గొప్ప ..
వెలుగు  నిన్ను తాకింది .. చినుకు కూడా తాకింది .. పక్షపాతమెందుకు నాపైన ..
వెలుగు దారి చూపింది .. చినుకు లాల పోసింది .. వాటితోటి పొలిక నీకెలా …
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ .. నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

Thursday, December 23, 2010

వంశీ అండ్ గోదారి గట్టు...వంశీ అభిమానులకు శుభ వార్త..మా టీవీ లో మా పసలపూడి కథలు



వంశీ అంటే గోదావరి, గోదావరి అంటే వంశీ, వంశీ కథలు చదివే వారికి, వంశీ సినిమాలు చూసేవారికి, వంశీ తెలిసిన వాళ్లకి వేరే చెపాల్సిన అవసరం లేదనుకుంట. "వంశీ.. మధుర కథల కంచీ...మధుర భావాల  విపంచీ...కథ సుధా విరించీ"  అన్నారు బాపు- రమణ గార్లు. ఎప్పుడో సితార సినిమా , చిరంజీవి ,సుహాసిని ల మంచుపల్లకీ చూసినప్పటినించి   వంశీ అభిమానినైపోయా .  ఇది అంతకుముందు మహల్లో కోకిల అని సీరియల్ గా వచ్చినట్లు జ్ఞాపకం. సినిమాల్లో గోదావరి నేపధ్యం లో పాటల చిత్రీకరణ, భారీ సెట్టింగ్ లు లేకుండా దృశ్యాల చిత్రీకరరణకు వంశీకి ఎవరూ సాటి రారు. "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" చూడండి. ఎంత అందంగా తీశాడు.నలుపు తెలుపులను కూడా రంగుల్లో చూపించడం వంశీ ప్రత్యేకత. 

వంశీకి గోదావరి అంటే ఒక అక్క, అమ్మ, చెల్లి, స్నేహితురాలు, ప్రియురాలు, పక్కింటి అమ్మాయి సర్వం గోదావరే అన్నట్లుగా ఉంటుంది. ప్రతీ సినిమా లోనూ అలా మన చెయ్యి పట్టుకొని గోదారి గట్టు వెంట నడిపిస్తూ, పక్కనున్న పల్లెటూళ్ళు చూపిస్తూ, సందులు, గొందులు, తిప్పుతూ,బల్ల కట్టు మీద కాలువలు దాటిస్తూ, పడవ ప్రయాణం చేయిస్తూ, మనల్ని ఆ గోదావరి అందాలలో లీనమయ్యేలా చేయడం వంశీ ప్రత్యేకత. వంశీ కథల్లో పాత్రలు ఎక్కడో ఊహల్లో నించి పుట్టుక రావు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో నుంచి పుట్టినవే, అందుకే అవి చూస్తుంటే, మనం ఇదివరకే ఎక్కడో కలిసినట్టు , మనం మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళంతా మన కళ్ళ ముందు తిరిగేవాల్లె అనిపిస్తుంది.  ఇక వంశీ సినిమాల్లో, కథల్లో హాస్యం గురించి చెప్పక్కర్లేదు. కొన్ని క్యారెక్టర్స్ అలా మన మనసులో ఉండి పోతాయి. హాస్యం అక్కడక్కడ శృతి  మిన్చినట్టనిపించినా ఎబ్బెట్టుగా అనిపించదు,  

అస్సలు ఈ టపా రాసే ఉద్దేశం రాయాలని,  వంశీ అనగానే ఏదేదో చెప్పేస్తున్నా  , అదే వంశీ ప్రత్యేకతేమో!. నిన్ననే మా టీవీ లో ఆడ్ చూశా " మా పసలపూడి కథలు " త్వరలో అని  అందమయిన బాపు బొమ్మలతో  ఓ ఆహ్లాదకరమయిన  పాట.... . అదీ సంగతి. ఎప్పుడన్నది ఇంకా ఇవ్వలేదు. వంశీ అభిమానులందరికీ ఇది శుభ వార్తే కదా , ఆనందమినిపించి   మీతో పంచుకుందామని ఈ టపా.

"మా పసలపూడి కథలు" నేను ఇంకా చదవలేదు. సీరియల్ గా వచ్చేటప్పుడు అక్కడక్కడ చదివిందే తప్ప, మొన్నే పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం తెచ్చా. అది చదవాల్సుంది. ఆ కథల్లో మట్టివాసన , అక్కడి నీరు, గాలి, అందులో నిజంగా తాదాత్మ్యత చెందుతాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకుంటా. కానీ నాదో చిన్న అనుమానం . ఇంతకుముందు యండమూరి నవలలు చదివే రోజుల్లో అవి సినిమాలుగా వస్తే, అనిపించేది అవి నవలలు ఉన్నంత బాగా లేవని, తెర మీదికి వచ్చేటప్పటికి వాటి అందం కోల్పోయాయని అనిపించేది. అలాగే మరి వంశీ గోదావరి అందాలు, గోదావరి యాస,ఏటివాలు గాలిపాట పల్లెల్లో పరాచికాలటలు, బల్లకట్టూ , పొలం గట్లూ,కాలువ మీద గాలి, మాటల నుడి , పలుకు బడీ, ఇవి అన్నీ తెర మీదికి ఎలా వస్తాయో చూడాలి. ఎంతయినా అక్షరాల్లో ఉన్న అందం తెర మీది దృశ్యం లో కనపడడం అనుమానమే. తీసేది వంశీ అయితే పర్లేదు.  నిజంగా అక్షరాల్లోని అందం తెర మీదికి వస్తే అది ఒక దృశ్య కావ్యమే అవుతుంది అనడంలో  ఎటువంటి సందేహం లేదు.  విచారకరమయిన వార్త ఏమిటంటే , ఇకపై వంశీ గోదావరి, కోనసీమ ల గురించి కథలు రాయడట. సిటీ బేస్డ్ కథలు రాస్తాడట. ఈ  సందర్భంగా "యు గొట్టం" లో దొరికిన " వంశీ అండ్ గోదారి గట్టు" వీడియో లు చూడండి



వంశీ అండ్ గోదారి గట్టు -1

">

వంశీ అండ్ గోదారి గట్టు - ౨


Wednesday, December 22, 2010

నా తోబుట్టువులు వేశ్యలు


ఏమి తోచక ఓ పుస్తకం చేతిలో తీసుకుంటే కనపడ్డ కవిత " నా తోబుట్టువులు వేశ్యలు"  Maureen Duffy కవిత కి యండమూరి తెలుగు అనువాదం

అరణం కోసమో - భరణం కోసమో
నియాన్ లైట్ల వెలుగుల్లో
చిరునవ్వు ఆభరణాలు ధరిస్తారు వాళ్ళు ,
వీధిమలుపుల్లో
రంగులు వెదజల్లే వాళ్ళ యవ్వనాలకు ధర
సందు చివర చీకట్లో
నువ్వు అంచనా కడతావు.

కాలం కాలువలో పెరిగిన
తనువు తరువుకి
బరువుగా కాసిన పెద్ద పెద్ద ఫలాలు
రుచి చూస్తె కుళ్లిపోయి వుంటాయి
నువ్వు విసుగ్గా పారేస్తావు

అందమయిన ఓ సాయంకాలం ఆ
అనుభవం గుర్తు తెచ్చుకొని విసుక్కొంటావు

కొనుగోలుదారుల ఆత్రపు తడి ఆర్చేశాక
రాత్రి పొత్తి కడుపు మీద ప్రత్యూష నిశ్శబ్దం మొగ్గ తొడుగుతుంటే
వాళ్ళు ఇళ్ళకు చేరి,
నీ వాసన ఉడుపులు విప్పెసుకుంటూ
నజరానాలను లెక్కబెట్టుకుంటారు,
నీ బండ చేతుల్లో నలిగిన వాళ్ళు,
తమ బలహీనమయిన చేతులు
ఒకరి చుట్టూ ఒకరేసుకొని
నిద్రకుపక్రమిస్తారు 

"మిసిమి " పత్రికకి ఆ పేరెలా వచ్చింది


మిసిమి సంస్థాపక సంపాదకులు శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ గారు. వీరిది గుంటూరు  జిల్లా గోవాడ గ్రామం. చదువు ఉన్నత పాటశాల విద్య మాత్రమె. తమ తండ్రి గారు వారి గ్రామంలో 1918 లో ప్రారంబించిన రాజ రాజ నరేంద్ర గ్రందాలయంలోని పుస్తకాలను ఔపోసన పట్టారు. అభిరుచి గల అంశం పై స్వేచ్చా జీవితం కొన సాగించాలనే ఉద్దేశ్యం తో సొంత పెట్టుబడితో, తెనాలి లో జాకోబిన్ ప్రింటర్స్ 1943 లో ప్రారంభించి, ఇందులో పుస్తకాలు ముద్రించడంలో నేర్పు సంపాదించారు. 1946 లో తెనాలి నుంచే "జ్యోతి" పక్ష పత్రిక ను తదుపరి రేరాణి, కినిమా మాస పత్రికలను నిర్వహించి పత్రికా రంగం లో కొత్త ఒరవడి ని సృష్టించారు. 1990 లో వీరు మిసిమి మాస పత్రిక ను స్తాపించారు.  ఆ మిసిమి నామ కరణ ఎలా జరిగిందట అంటే  మిసిమి అన్న పేరు సూచించిన వారు డాక్టర్ బూదరాజు రాధ కృష్ణ గారట. ఇదివరలో ఎ పత్రికకి లేనటువంటిది, కుడి ఎడమల ఎటువేపు నుంచి చదివిన తేడా రానిది ఆయన సూచించారు. " మిసిమి" అంటే నూతన కాంతి, నవనీతం(వెన్న) అని రెండర్థాలు.  ఆ పదం, దాని అర్థం సప్రమాణంగా చూపనిదే ఆయనకు సంతృప్తి కలిగింది  కాదట. 
            
            "మిసిమి పరసీమ పల రాజు మేనమామ
             నే వెలుంగుల దొర జోడు రే వెలుంగు"


అని బూదరాజు గారు అల్లసాని పెద్దన రాసిన "మనుచరిత్ర" లో నుంచి పై చరణాలు ఉతంకిన్చారట . అలాగే నవనీతం అన్న అర్థంలో ఎవరు, ఎక్కడ వాడారో ఉదహరించారు .
       
           "మినుకు  టూర్పులవాని 
           "మిసిమి" మేతల వాని
            మెరుగు చామన ఛాయా మేనివాని...."



అని తెనాలి రామకృష్ణ కవి ప్రనీతమయిన "పాండురంగ మహత్యం" నుండి తీసుకున్నారట. ఈ విధంగా " మిసిమి" పత్రికకి నామకరణం బూదరాజు రాధ కృష్న   గారు చేసారు.

మిసిమి అంటే ఆసక్తి కల వారు ఆన్ లైన్లో ఇక్కడ చూడవచ్చు .

Tuesday, December 21, 2010

పుస్తక ప్రదర్శన కు నేను వెళ్ళా


ఈ 25 వ పుస్తక ప్రదర్శన ప్రారంభం అయినప్పటినించి వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటున్న.  హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎంచక్కా రోజూనో, వీలున్నప్పుడో అలా వెళ్లి ఇలా వస్తారు. బయట ఉండేవాళ్లకు  అలా కాదాయె. పుస్తక ప్రదర్శన ఒక్కటే కారణం కాదు, అందులో ఉన్న e- తెలుగు స్టాల్  లో పాల్గొనాలని మరియు  బ్లాగ్గర్స్  ని కలుసుకోవడం. అందుకని ఆదివారం పోవాలని అనుకుంటే వీలు కాలేదు. సోమ వారం ఏదో ఓ పని పెట్టుకొని స్వామి కార్యం , స్వ కార్యం చక్క పెట్టుకోవచ్చని హైదరాబాద్ వచ్చేశ. పుస్తక ప్రదర్శన శాల చేరేవరకు 7 .30 అయ్యింది. సమయం చాల తక్కువ, రాక రాక వస్తే ఇంత తక్కువ సమయమా అని మనస్సు కాస్త బాధపడింది. సరేలే అనుకోని మొదట e  తెలుగు స్టాల్ ని సందర్శించా. నా దురదృష్టం ఒక్క కౌటిల్య గారు తప్ప ఎవరూ లేరు. వారిని పరిచయం చేసుకొని, నన్ను నేను పరిచయం చేసుకొని, కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని, అన్నీ విపులంగా సందర్శించే వీలు లేక, ముఖ్యంగా తెలుగు పుస్తకాలున్నా స్టాల్ల్స్ మాత్రమె చూడడం జరిగింది. తెలంగాణా. ఎమెస్కో., ప్రజాశక్తి, నవయుగ, నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్ ఇంకా కొన్ని స్టాల్ల్స్ మాత్రమె చూశా. 



 పుస్తక ప్రదర్శన లో రోజూ సాయంత్రం ఏదో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు  తనికెళ్ళ భరణి గారి నాటకాలు ఆవిష్కరణ జరుగుతుంది. భరణి , హేమ, రాళ్ళపల్లి, ఇంకా కొందరు సినీ కళాకారులు పాల్గొన్న ఈ సభ లో   భరణి " మా చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ" అని కురిపించే నవ్వుల జల్లు లో ఓ రెండు నిమిషాలు తడిసి , అక్కడి నించి విశాలాంధ్ర స్టాల్ కి వెళ్తే అప్పటికే సమయం తొమ్మిది కావటం తో స్టాల్ల్స్ తెరలు దించే కార్యక్రమం మొదలై పోయింది. నిరాశ తో వెను తిరిగి వస్తుంటే చివర్లో "ఆర్ట్స్ అండ్ లెటర్స్" కనిపించింది. అందులో మిసిమి కనిపించింది. లేటెస్ట్ ఇష్యూ కొనుక్కొని రెండు మూడు చోట్ల కనపడని బాపిరాజుగారి "గోన గన్నారెడ్డి" కనపడితే అది కూడా కొనుక్కొని బయట పడ్డాము. అంతకు ముందు విశాలాంద్ర స్టాల్ లో గోన గన్నారెడ్డి గురించి అడిగితె నిర్లక్ష్యంగా ప్రింట్ లో లేదు అని సమాధానం వచ్చింది. ఇదీ వారి వరస. ఏవయిన కొత్త కథా సంకలనాలు కొనాలనుకున్న, కాని ఈ రోజే (సోమ వారం) ఆంద్ర జ్యోతి లో వచ్చిన వ్యాసాలూ చదివాక ,  తర్వాత చూద్దాం లే అని  ఊరుకున్న. ఎమెస్కో స్టాల్లో కాస్త గడిపా. కాశీబట్ల పుస్తకాల గురించి అడిగితె ఎక్కడా దొరకలేదు. మొత్తానికి  నాకు సమయం లేక కొంత నిరాశతో వెనక్కి వచ్చా. మళ్ళీ వీలు చూసుకొని రావాలి.  :

నేను కొన్న పుస్తకాలు

గోన గన్నారెడ్డి .....అడవి బాపిరాజు
కథా భారతి బెంగాలి కథానికలు
మహి.....కుప్పిలి పద్మ
మంచుపూల  వాన ....కుప్పిలి పద్మ
విసుర్రాయి...ముదిగంటి సుజాత రెడ్డి
గాలిబ్ గీతాలు ...దాశరథి
మా పసలపూడి కథలు....వంశీ
మనుచరిత్రము.....అల్లసాని - ఎమెస్కో ప్రచురణ

Saturday, December 18, 2010

తన్హాయి....నా అభిప్రాయాలు

ఎన్నో రోజులుగా మనల్ని అలరిస్తున్న తన్హాయి " అయిపొయింది" అన్న  అక్షరాలు చూసే సరికి ఒక్క సారి మనసు నిజంగా భారమయిపోయింది.. ఎప్పుడో అప్పుడు అయిపోతుందని మనసుకు తెలిసినా ఒక్క సారిగా అయిపొయింది అని చదివే సరికి, మన ఆప్త మిత్రులు   లేదా దగ్గరి వాళ్ళు మన నుంచి దూరమయిన ఫీలింగ్.
నేను మొదటిసారిగా బ్లాగ్లోకంలో  నా మొదటి అడుగు వేసినప్పుడు  మొదటి కామెంట్ కల్పనా గారిదే.  అప్పటికి నాకు కల్పనగారెవరో తెలీదు. ఆ కామెంట్ ని పట్టుకొని వారి బ్లాగ్ లోకి వెళితే   నాకు తన్హాయి ఎనిమిదో భాగమనుకుంటా కనిపించింది. ఏముందా అని చదివితే ఆసక్తిగా అనిపించింది. ఇలా కాదని ఇంకా వెనక్కి వెళ్ళ. .ఏక పల్  దగ్గరికి.  అలా చదువుతుంటే రచయిత మన చెయ్యి పట్టుకొని ఒకటి  రెండు ఎపిసోడ్ లు  నడిపించి వదిలేస్తే, అంతే మనం ఆ తన్హాయి సుడిగుండం లో పడి అందులోనే తిరుగుతుంటాం. అలా తన్హాయి ఇన్ని రోజులు మన జీవితం లో ఒక భాగమయింది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తన్హాయి గురించి నా అభిప్రాయం, అయితే నేనేమి దీని గురించి సమీక్ష రాయబోవడం లేదు. అంత స్తాయి నాకు లేదు. ఏదో నా మనసుకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకుందామని ఈ ప్రయత్నం అంతే. 
తన్హాయి గురించి ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే, ఇది ఒక (అ)సహజమయిన ఒక అందమయిన ప్రేమ కావ్యం. అసహజం ...సహజం అని ఎందుకంటున్నానంటే. మనం మొదట్లో చదువుతుంటే మనకి కలిగే  మొదటి అభిప్రాయం ఇది అసహజం , ఇదంతా మనం ఎలా ఒప్పుకుంటాం రచయిత ఇలా రాస్తున్దేమిటి అని వీరావేశ పడతం.
ఎందుకంటే ఇదంతా మన దృష్టి లో అసహజమే  కదా!. ఔను మనం పెరిగిన వాతావరణం, మన సంస్కృతి, మనకి పెద్దలు చెప్పింది...మనం చూసేది (?), ఇవ్వన్నీ మనకు ఇద్దరు వివాహితుల మధ్య ఏర్పడే ప్రేమ ,బంధం అసహజమనిపించడం లో ఎటువంటి తప్పులేదు. కాని మనం ఒక్క సారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని , వ్యక్తులను చూస్తె మనకి అలాంటి క్యారెక్టర్స్ కనిపించడం లేదా. మనకి ఆ భగవంతుడు ఎదుటి వ్యక్తుల హృదయాల్లోకి తొంగి చూసి వాళ్ళని చదివే శక్తి ఇస్తే, మనకి ఇలాటివాళ్ళు ఎంతమంది కనపడరు. కాదంటారా. మన మనస్సులో ఎం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు కాబట్టి  అంతా సవ్యంగానే ఉన్నట్లు అందరూ మంచిగానే కనిపిస్తారు. ఎవ్వరి మనసులో ఎం జరుగుతుందో? మనకి కనిపించేదంతా మనం చదివేదే మన సంస్కృతి అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అని నా ఉద్దేశ్యం.  మనం రోజు ఎన్నో పత్రికల్లో సమస్యలు  ప్రశ్నలు, జవాబులు చదువుతుంటాం. అందులో చూడండి. పెళ్ళయిన  వాళ్ళు, పెళ్లి కానివాల్లూ , జీవిత భాగ స్వాములకు తెల్సి, తెలియకుండా ఏర్పరుచుకొనే భందాలు, అనుభందాలు, కొన్ని సరదాగా, కొన్ని పర్మనెంట్గా, ఇలా రక రకాల వ్యక్తులు  మన సమాజంలో ఎందఱో కనకి కనపడుతుంటారు. ఉన్నారు. లేరనుకొని ఈ ప్రేమలు , ఈ బంధాలు అసహజం అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకొన్నట్లే.

మన సమాజంలో మన చుట్టూ జరిగేదే రచయిత తన సొంత శైలి లో రాసింది. మన చుట్టూ జరుగుతుంటే మనం చూస్తూ ఉరుకుంటాం.కాని రచయిత దాన్ని ఒక కథ వస్తువుగా తీసుకుంటే అది అసహజమెట్ల అవుతుంది, అక్రమసంబంధాలు గురించి రాసినట్లు ఎట్లా అవుతుంది. ఒక అసహజమయిన  సబ్జెక్టు ని చాల  సహజంగా పాటకులను సంమోహపరిచెంతఃగా   చదివించి  అందరిచేత ఆమోద ముద్ర వేయించడం ఇక్కడ  రచయిత గొప్పదనం. ఇలా ఎందుకు అంటున్నానంటే  పాటకులు అక్కడక్కడ రచయిత అభిప్రాయాలతో విభేదించినా...ఈ ప్రేమికుల  మధ్య బంధాన్ని , ప్రేమని ఇష్టపడ్డారు. అందులో లీనమయ్యారు. పాత్రలకు ఎం జరుగుందోనని వాళ్ళను సప్పోర్ట్ చేశారు, బాధపడ్డారు, ఆవేదన చెందారు.పాత్రలని ఆరాదించారు.మొత్తంగా  పాత్రలను తమ ఆప్త మిత్రులుగా   , తమ కి ఇష్టమయిన వ్యక్తులుగా భావించారు. వాళ్ళకేమి కాకూడదని టెన్షన్ కి లోనయి, పాత్రలతో మమేకమయిపోయారు. ఈ పోస్ట్ లు  పబ్లిష్ అవుతున్నప్పుడు రీడర్స్ రాసిన కామెంట్స్ దీనికి నిదర్శనం. ఇది సహజమా , అసహజమా   ఇది తప్పా, ఇది ఒప్పా,  అని రచయిత మనకి ఎలాంటి సందేశం ఇవ్వట్లేదు. మనం తేల్చుకోవాల్సిందే. 
ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు వివాహితులు , "కల్హార" మరియు "కౌశిక్" ఒక ఎయిర్పోర్ట్ లో ఏర్పడ్డ పరిచయం స్నేహం....ప్రేమగా...మారి దగ్గరయి ఒకరిని విడిచి ఒకరు విడిపోలేనంత దగ్గరయి, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో  ఏర్పడ్డ పరిణామాలు, వాళ్ళ మానసిక సంఘర్షణలు.  ఇక్కడ ఎవ్వరేమనుకున్న రచయిత వాళ్ళ మధ్య స్నేహం, ప్రేమ ఒక అందమయిన దృశ్య కావ్యం లా  మన కళ్ళకి చూపిస్తుంది. ఎంత బాగా అంటె మనం కల్హార తో ప్రేమలో పడేంత. వాళ్ళ మధ్య ఈ ప్రేమ ఎలా ఏర్పడింది అంటె సరి అయిన కారణాలు ఏవి కనిపించవు ,  it just happens ... అంతే, నిజమే మన అభిప్రాయాలకు మన ఇష్టాలకి దగ్గరి వాళ్ళు మన సమీపం కి వస్తే,  కాన్స్టంట్ గ  కలుస్తుంటే,  స్నేహం   , ఇష్టంగా ఆపై ప్రేమగా మారుతుంది దీనికి ఎ కారణాలు అవసరం లేదనుకుంటా. ఇక్కడ జరిగింది అదే, కల్హార , కౌశిక్ ల పరచయం  అలా అలా కొనసాగి ఒకరి ఇష్టాలు ఒకరు ఇష్టపడి స్నేహం ఘాడమాయి  ఇష్టంగా మారి,  అది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా,  మెయిల్స్, ఫోన్ కాల్స్,  కొనసాగుతుంటే ఇవ్వన్ని వాళ్ళని మానసికంగా దగ్గరికి చేర్చి వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. కథలో ఇదంతా ఒక అందమయిన ప్రేమ కావ్యంలో కొనసాగుతే,   మిగతా కథంతా ఒక  ఎత్తు. ఈ భాగం లో నాలుగు పాత్రల మధ్య మానసిక సంఘర్షణలు రచయిత అతి సహజంగా చక్కగా, వారి మనస్సుల్లోకి తొంగిచూసి  రాసినట్లు అనిపిస్తుంది.  వివిధ ఎపిసోడ్ లలో రచయిత రాసిన ఆ మానసిక సంఘర్షణల విశ్లేషణలు అర్థవంతంగా , కన్విన్సింగా గా మనకి నచ్చుతాయి. ఎవ్వరి గురించి రాసినా వాళ్ళదే కరెక్ట్ అనిపించేతగా రచయిత రాసిన తీరు శ్లాగనీయం.  రచయిత కూడా ఎవ్వరిని సప్పోర్ట్ చేసినట్లు కనపడదు. పాత్రలు అల సహజంగా ప్రవర్తిన్చినట్లు  మనకి కనిపిస్తుంది. అందుకే అందరూ అంత ఇస్తాపద్దరనుకుంటా. 
చివర  ముగింపులో ఒక ప్రశ్న  రాక మానదు. విడి పోదామని వాళ్ళు నిర్ణయించుకొన్న తర్వాత , వాళ్ళు ఒకళ్ళ కౌగిల్లో ఒకళ్ళు ఒదిగి పోవడం లాంటివి ...మళ్ళీ వాళ్ళ మధ్య బంధం ఇంకా డెవలప్ కావటానికి దోహదపదతాఎమో  అనిపించింది. ఇదంతా ఒక కల , ఇక తీయటి జ్ఞ్యాపకంగా వాళ్ళు అనుకున్నా, వాళ్ళ జీవిత భాగస్వాములు ఎంత బాగా వీరిని అర్థం చేసుకొని వీళ్ళని స్వీకరించినా, ఈ సంఘటనలు  వాళ్ళ భవిష్యత్తు  జీవితాల్లో గుర్తు రావా. ఎక్కడో ఏదో విషయాలపై వాళ్ళ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళ మధ్య అనుకోవతందుకు  , అభిప్రాయ బేదాలు రావటందుకు పాత జ్ఞ్యాపకాలు కారణాలు కాకుండా ఉంటాయ?  అలాగే కల్హార , కౌశిక్ ల మధ్య వాళ్ళ మనస్సులో ఒకరి పట్ల ఒకరి పై ప్రేమ అలాగే ఉంటుంది కదా. ఎంత మరిచిపోయిన వాళ్ళ కి ప్రతీ క్షణం ఒకరికొకరు గుర్తు రాక మానరు కదా. వాళ్ళ జీవిత భాగస్వాములతో ఉంటూ ఇలా వాళ్ళు గుర్తుకు వస్తే అప్పడు వాళ్ళ పరిస్థితి  ఏంటి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగుతాయి అన్నవి ప్రశ్నలే.  బహుశా ఈ విషయాలతో ఈ నవలకి ఇంకో  సీక్వెల్ రాయొచ్చేమో. అయిన  ఈ ప్రశ్నలకి   సమాధానాలు ఉండవు  కావచ్చు. కామెంట్లలో మిత్రుడు అన్నట్లు " ప్రతీ  కథకి ముగింపులు , కంక్లూజన్లు ఉండవు....జీవితాలకి అస్సలు  ఉండవు. ఈ కథ జీవితం లోని  ఒక భాగం " నిజమే ఈ జీవితం ఇలానే  కొనసాగుతుంది. ఇలాంటి కథలకి ముగింపు ఇదేనేమో. 
ఏది ఏమయినప్పటికీ ఇది ఒక అందమయిన ప్రేమ కావ్యం  మన మనసుల్ని అలా హత్తుక పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.