Friday, April 8, 2011

అడోనిస్ - వీనస్



లైలా-మజ్నూ, దేవదాసు-పార్వతి, ఇలా ఎన్నో జంట పేర్లు. అవి నిర్మలమైన ప్రేమను అజరామరం చేశాయి. మన దేశంలోనే కాదు, విదేశాలలో సైతం ఇటువంటి జంట పేర్లు అనేకం. రోమన్ ఇతిహాసంలో ఇటువంటి ప్రేమ కథ ఒకటుంది. అది  "అడోనిస్-వీనస్". వీనస్ శృంగార దేవత. ఆమె ప్రియుడైన అడోనిస్ వేటగాడు. అతడొకనాడు వేటకు వెళ్లి మరణిస్తాడు. అతను వేటకు వెళ్లక ముందే వీనస్ మనస్సు కీడును శంకిస్తుంది. వేటకు వెళ్ళవద్దని అతన్ని పదే పదే వేడుకుంటుంది. అతని మరణానంతరం వీనస్ ప్రేమను మెచ్చిన దేవుడు అడోనిస్ ను సంవత్సరానికి ఆరు నెలలపాటు జీవించి ఉండేలా అనుగ్రహిస్తాడు. సగం విషాదం, సగం సుఖాంతమైన ఈ కథ పాశ్చాత్య సాహిత్యంలో, కళలో ప్రముఖ స్థానం వహించింది. పాశ్చాత్య క్లాసికల్ సిద్దాంత ధోరణిలో ఎంతో మంది తమ చిత్రాలలో ఈ అమర ప్రేమను చిత్రించి, ఆ ప్రేమజంటకు అమరత్వం సిద్ధింప జేసినారు. ఈ కథా వస్తువు ఆధారంగా  ఆంటానియో కనోవా శిల్పించిన చిత్రమిది. ఈ ప్రేమ కథను మలుపు తిప్పిన సంఘటనలో ఎంతో నాటకీయత ఉన్నా, దాన్ని సున్నితంగా మలచిన తీరు రసమయంగా ఉంటుంది. వీనస్ తన ప్రియున్ని గోముగా వేటకు వెళ్ళవద్దని అభ్యర్తిస్తుంది. అతను అంటే ప్రేమతో ఆమె అభ్యర్థనను నిరాకరించడం కనోవా లాలిత్యం తో మలిచాడు. సున్నితమైన భావప్రకటన కనోవా ప్రత్యేకత. ఇదీ అతనిని శిల్పిగా మైఖలాన్జిలో తరువాత స్థానంలో నిలబెట్టింది.

ఆంటానియో కనోవా ఇటలీ దేశంలోని పోసాగ్నో అన్నచోట 1757  వ సంవత్సరంలో జన్మించాడు. 1768  వ సంవత్సరం నాటికి పదేళ్ళు నిండి, శరీర ధారుడ్యం సంతరిన్చుకున్తున్నప్పుడే కష్ట సాధ్యమైన శిల్ప నిర్మాణంపై ఆసక్తి పెంచుకొని, దానిని వెనిస్ నగరంలో అధ్యయనం చేశాడు. ప్రప్రథమంగా తన పదిహేడవ ఏట (1744 ) తన తొలి శిల్పం "పండ్ల బుట్ట"ను ప్రదర్శించి ప్రపంచాన్ని అబ్బుర పరచాడు. ఆ విజయం అతన్ని వెనిస్ నగరాన్ని వదలి నేపుల్స్, రోం నగరాలకు తరలేలా చేసింది.
( మిసిమి మాస పత్రిక సౌజన్యం తో )

Thursday, April 7, 2011

" చేరా ! ఆత్మీకృత సుస్మేరా"




ఆచార్య చేకూరి రామా రావు గారు సుప్రసిద్ధ పండితులు, భాషా శాస్త్రవేత్తలు. వీరు చేరా  అని ఆధునిక తెలుగు సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. చేరా గారు మరియు కోవెల సంపత్కుమారాచార్య గారు గొప్ప స్నేహితులు. చేరా రచించిన కొన్ని వ్యాసాల్ని " రించోళి" పేరుతొ ఒక సంకలనంగా వెలువరిస్తూ సంపత్కుమరాచార్యను ముందు మాట రాయమన్నారట. ఎలా రాయాలా అని ఆలోచిస్తున్న సమయంలో సంపత్కుమార మదిలో " చేరా ! ఆత్మీకృత సుస్మేరా" అన్న ఒక చరణం పదే పదే ధ్వనిన్చిందట - అంతే ఆయన గొంతు లోంచి " చేరా ! ఆత్మీకృత సుస్మేరా" అన్న కంద పద్యం అప్రయత్నంగా వెలువడిందట. అప్పుడాయనకు " చేరా" అన్నమాటను మకుటం చేసుకొని ఓ వంద పద్యాలను రాసి చేరాకు ఆయన 70  వ జన్మదినం సందర్భంగా కానుకగా సమర్పించాలన్న భావం కల్గిందట - వెంటనే ఆయన

                 " చేరా! ఆత్మీకృత సుస్మేరా
                    మైత్రీ విచిత్ర మ్రుదుతాదారా
                    వారిత దురహంకార విచారా!
                    బందురవచో విసారా! చేరా!      
  

 అన్న పద్యంతో మొదలెట్టి 120  పద్యాల్ని రాసేసి " చేరాకు ఒక శతమానం" అన్న పేరుతొ వాటిని పుస్తంకంగా ప్రచురించి చేరాకు ఆయన జన్మదినోత్సవ సందర్భంగా కానుకగా సమర్పించారట. సంపత్కుమారాచార్య  గారు " చేరా" అన్న సంక్షిప్త నామం లాగే తెలుగు సాహిత్యంలోని కొందరు లబ్ద ప్రతిష్టుల పేర్లను మొదటి రెండక్షరాలతో చిత్రంగా సంక్షిప్తం చేసి రాసిన పద్యం చూడండి. 

                    " రారా, కారా, బూరా
                      సేరా, బేరా, తిరా, వసీరా, నారా
                      కోరా, తారా, కేరా
                      ఈ రాంతులతో వేగుటేట్లా చేరా"


ఈ పద్యం లోని "రారా" అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి అని, "కారా" అంటే కాశీపట్నం రామారావు అని, "బూరా" అంటే బూదరాజు రాధాకృష్ణ అనీ, "సీరా" అంటే పొట్లపల్లి సీతారావనీ, "బేరా" అంటే బేతవోలు రామబ్రహ్మం అనీ, "తిరా"  అంటే తిరుమల రామచంద్ర అనీ, " వసీరా" అంటే వక్కలంక సీతా  రామారావనీ  , "నారా" అంటే వెల్చేరు నారాయణ రావనీ, "కోరా" అంటే కోదాడ రామకృష్ణయ్య అనీ, "తారా" అంటే తాళ్ళూరి రామానుజస్వామి అనీ, "కేరా" అంటే కే. రామలక్ష్మి అనీ ఈ పద్యం కింద సంపత్కుమార  వివరణ కూడా ఇచ్చారట.

చేరా ఒక పత్రికలో చేరాతలు అని ఒక కాలం రాసేవారు. కొన్ని విమర్శలతో కొంత కాలం తర్వాత చేరాతల్ని ఆపాల్సి వచ్చిందట. ఈ ఉదంతాన్ని గూర్చి సంపత్కుమారాచార్య చెప్పిన ఈ పద్యాన్ని చూడండి.

                     " చేరాతలంతగా రాసీ రాసీ
                        ఏమి లబ్ది చేకురెను, మీవారు, మావారు
                        సాంబారులు చిమ్ముటలు తప్ప
                        మధుమతి చేరా! "                              

మీవారు, మావారు అంటే మీ లెఫ్టిస్టులు, మా రైతిస్టులు అనీ సాంబారులు  చిమ్ముకోవటం అంటే బురద చిమ్ముకోవటం అని అర్థమట. ఇక  పద్య ప్రేమికుడైన చేరా గారంటే సంపత్కుమార గారికి అమితమయిన ప్రేమట. ఇంకా  " శతకం" అన్నా శతక సాహిత్యం అన్నా చేరా గారికి ఎక్కడలేని అభిమానం. పైగా పద్యం అన్న ప్రక్రియ ఎంత కాలం ఉంటుందో అంతకాలం శతకం మనగలుగుతుంది అన్నదే చేరా గారి గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చెబుతూ  ఆచార్యులవారు ఒక పద్యం ఇలా వ్రాశారు.

                   "ఎందాక పద్యముండునో
                    అందాక శతకముండునంటివి కాదా
                    ఎందాక కవిత యుండునో
                    అందాకను పద్యముండునందును  చేరా! " 

చేరాగారి ఆలోచనకు తన ఆలోచన ను జోడించి పద్యం ఎప్పటికి నిలిచి ఉండే ప్రక్రియగా భావించి చెప్పాడు. చేరాకు  ఒక శతకం అనకుండా శతమానం అని ఎందుకన్నారో సంపత్కుమార గారు " చేరాకు ఒక శతమానం" గురించి చెప్పిన విషయాలు మరొక టపాలో!  అప్పటివరకు సెలవ్.