ఆలూరి భుజంగ రావ్ రాసిన "సాహిత్య బాటసారి - శారద " లో నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదని ఎంతో వేదన తో రాసిన శారద మనోగతం మీ కోసం ...
"నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని, కాని హోటల్ చాకిరీ తప్పదు, చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు. పోనీ ఈ కథలు వ్రాయటం మానేద్దామా అనుకుంటాను. అదీ సాధ్యం కావటం లేదు. తెలుగు మాత్రు భాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గానీ, రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపికా లేదు. ఏ పున్యాత్ముడయిన ఇస్తాడనుకుందాం. కోరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పని వాళ్లకి తెనాలి లో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన వచ్చిందో తెలియదు గానీ, నాతొ సహా నూటికి తొంబయి అయిదు మందిమీ పది పన్నెండు గంటల ఎద్దు చాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణం లో చదువెక్కడ, రాత ఎక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తుంది కానీ, అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు లేబర్ ఆఫీస్ ఉంది. ఓ లేబర్ ఆఫీసరూ ఉన్నాడు.
హోటల్ సర్వరు కి చదువు ఎందుకు అనే పెద్దమనుషులూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరయిన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరుగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పయిగా ఈ ఉద్యోగం ఊడిపోవటం, రోజుల తరబడి పస్తులున్డటం జరిగింది. ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుంది అనడంలో సంశయమేమి లేనప్పుడు మిగిలి ఉన్న జీవిత కాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తుంది. స్వతంత్రం వచ్చాక ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం నా జీవిత ప్రయాణం వెనకటికన్న నూటికి ఇరవై పాల్లన్నా పెరుగుతున్దనుకున్నాను.
పత్రికల వారు కథలు వ్రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్చల రోగాన్ని నయం చేసుకోవడానికన్న సరిపోతాయేమో అని సంతోషించాను. అదీ వట్టిదయిపోయింది. ఈ పద్దతిలో నేను స్వతంత్ర భారత పౌరున్ని అని భావించ లేక పోవటంలో తప్పేమీ లేదనుకుంటాను.
( ఇది :తెలుగు స్వతంత్ర లో ఫిబ్రవరి 18 , 1949 లో ప్రచురితమయ్యింది)