తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం. అన్ని సంపదలను ఇచ్చేది సిరి నోము దీనినే ధనుర్మాస వ్రతం అంటాం.చాంద్ర మానం ని బట్టి మార్గశీర్శమైతె సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. "మాసానాం మార్గశీర్షోహం" , మాసములలో ఉత్తమమైన మార్గాశీర్శమును నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశిరం లో ప్రారంభమయ్యే ధనుర్మాసమంటే ఇష్టమట.
మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు, మలిపున్నామి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు, ఇదే మన జీవితం! ఎప్పుడూ భగవంతునితో కలిసి వుంది, ఇహ పరములలో మనకు కావలిసినన్నీ పొందడానికి ఈ సిరినోము చెయ్యాలట.
ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లె లో గోపికలు కృష్ణున్ని పొందాలని కోరి కాత్యాయిని వ్రతం గా చేశారు. తర్వాత కలియుగం లో శ్రీవిల్లిపుత్తూర్ లో గోదా దేవి అచటి అర్చామూర్తి శ్రీ వటపత్రశాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా. వారి ఆలయాన్ని నందగోప భవనంగా, తన తోటి చెలికత్తేలన్దరినీ గోపికలుగా, తనూ ఒక గోపికగా త్రికరణ శుద్దిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది. శ్రీ రంగ నాథున్ని పొందింది.
శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల వారికి, పుబ్బ నక్షత్రం లో తులసి వనం లో లభించింది. శ్రీ విష్ణు చిత్తులు (పెరియాళ్వార్) ఆ బాలిక ను అల్లారుముద్దుగా పెంచిరి. వటపత్రశాయికి నిత్యమూ పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమయిన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమెకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. ఆమె తండ్రి తో బాటే మాలలు కట్టి, అవి తానూ ముందు ధరించి తరువాత స్వామికి ఇచ్చేది.తండ్రి అపచారమని మన్దలించినా, స్వామి ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలలే నాకు ఇష్టం అని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను "ఆముక్త మాల్యద" అని తమిళంలో "శూడి కొడుథ్థ నాచ్చియార్"అని అంటారు. పాశురములను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి " పాడి కొడుత్త నాచ్చియార్" అని కూడా అంటారు. "తిరుప్పావై" ప్రబందమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాళ్. అండాళ్ అనగా కాపాడే తల్లి , రక్షకురాలు. ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ఆ రంగ నాథున్నికొలిచినది . రంగనాథ స్వామి కి విరుల సౌరభాల కన్నా, గోదాదేవి కురుల పరిమళమె నచ్చింది. విష్ణు చిత్తుడి కి కలలో కనిపించి గోదా కల్యాణానికి ఆనతిచ్చాడు.ఆండాళమ్మ ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమై పోయింది . పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్!.
భక్తులు సూర్యోదయానికి ముందే ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తిచేసుకుంటారు. గోదా దేవి పాడు కున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు.వయో లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు అంటారు.ఓ వైపు వణికించే చలి, వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఆ మత్తును జయించి, తెల్లవారుజామునే మేల్కొనాలి.ఆహార మియమాల్ని పాటించాలి. మిత భాషణ, ప్రియ భాషణ కూడా అవసరమే.దాన ధర్మాలకు ప్రాదాన్యం ఇవ్వాలి.భోగాలకు దూరంగా ఉండాలి.ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం.
ఆ బ్రహ్మాండ నాయకుని చేరిన ఆండాళ్ కోరిన కోరిక ఇది "సర్వ విధముల నీకే చెంది, నీదే అయిన ఈ ఆత్మ అనర్థము నందకుండా కాపాడుము. ఈ ఆత్మ స్వరూపమునకు తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యము చేయు భాగ్యమ్ము నిమ్ము. ఈ ఆత్మ ఉన్నంత కాలము నీ సేవ చేయునట్లు అనుగ్రహింపుము"...ఇదే తిరుప్పావై సారం.
జై శ్ర్రేమన్నారాయణ! జై శ్రీమన్నారాయణ! జై శ్రీమన్నారాయణ!