Thursday, September 30, 2010

అస్తమిస్తున్న భానుడు

రెండు రోజుల క్రింద మధ్యాహ్నం  సాయంత్రం లోకి మారబోతున్న సమయం....నేను ఓ నాలుగు రోడ్ల కూడలి లో (అదేనండి చౌరస్తాలో,) ఏదో పని మీద నిలబడి   ఎదురుగా చూస్తే  "భానుడు" అరుణ కాంతులతో  పశ్చిమానికి  , జారుతుంటే ఆ అందాలు కనువిందుగా కనిపించాయి. మేఘాలు చూడండి ఎప్పుడు జూసినా వింత వింత ఆకారాల్లో, చూసినప్పుడల్లా కొత్త కొత్తగా మనస్సుని ఆహ్లాద పరుస్తాయి.  ఆ దృశ్యాలను  నా సెల్ లో బందించిన చిత్ర రత్నాలు.    మీరూ ఆనందిస్తారని ............





.

Wednesday, September 29, 2010

నాన్నా.....ప్రేమతో

నాకు బుడిబుడి అడుగులు నేర్పిన  మీ  నడక తడబడుతుంటే 
నాకు మాటలు నేర్పిన మీ  మాటలు తడబడుతుంటే 
మాకు అ..ఆ...లు నేర్పిన మీరు రాయలేక పోతుంటే 
మాకు అన్నప్రాసన చేసిన మీరు తినలేకపోతుంటే
నా హృదయం మూగపోయింది 
బాద గుండెల్లోనించి 
కన్నీళ్లు బావిలో నీటి ఉటలా ఉబికి ఉబికి 

మీ  చేత్తో నా చిటికెన వేలు పట్టుకొని నడిపించిన జ్ఞాపకాలు మీకు గుర్తుండే ఉంటాయి
మీరు ముందుండి నడిపించి మమ్మల్ని ఇంత వాళ్ళను చేసిన మీకు 
మేము చేయి పట్టి నడిపించాల్సి వస్తుందని ఉహించలేదు

నేనెప్పుడు ఒకరికి బారం కాకూడదని
బహుశా అదే మీ కళ్ళల్లో మీ హృదయంలో అలజడి
జీవితంలో బరువు బాద్యతలు నేర్పిన మీరు
మాకెప్పటికి  భారం కారు
 మీరు మేం బరువనుకుంటే మేం ఇలా ఉండేవాల్లమా

మాకు నేనున్నానని ఎలా ధైర్యం చెప్పే వాళ్ళో అలాగే 
మీకు మేమున్నాం నాన్నా   మీతో  సదా మీతో
 ప్రేమతో......

Tuesday, September 28, 2010

నాకు నచ్చిన పాత పుస్తకం

నాకు ఈ పుస్తకాలు చదివే అలవాటు నా హై స్కూల్ రోజులలో అలవాటయ్యింది. మా బాబాయి గారు బాగా పుస్తకాలు  చదివే వారు, నాకు గుర్తుంది, 75 మరియు 80 లలలో మాట    అప్పుడు నాలుగు వీక్లీలు, ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంద్ర భూమి, ఇంకోటి ఆంధ్ర  సచిత్ర వార పత్రిక అనుకుంటా,చందమామ  ఇవి రెగ్యులర్ గా కన్పించేటివి.   ఎదురుగా కనపడితే మనసు ఊరుకోదు కదండీ.  నాకు బాగా గుర్తు ఆ కాలంలో యుద్దనపూడి ఇంకా పేర్లు సరిగా గుర్తుకు లేవు కాని వాళ్ళ  సీరియల్స్ వస్తుండేవి. ప్రతి వారం వాటిని కట్ చేసి, సీరియల్ అంతా అయిపోయాక వాటిని బైండింగ్ చేయించి బద్రంగా దాచేవాళ్ళం.   చాలా రోజులు అవి అలా అటుకు మీద కన్పించేవి.  అవి ఇంకా ఎందుకు అని అంటే మా అమ్మమ్మ సరదాగా  అంటుండేది, అరె అవి నీ పెళ్ళాం వస్తే చదువు కోటందుకు ఉంటాయి లేరా అని.  అలా సీరియల్స్ చదివే అలవాటయ్యింది. 

 మా బాబాయి గారు షాడో మధుబాబు గారివి ఇంకా  కొమ్మూరి సాంబశివ రావు అనుకుంటా డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివే వాడు.  అలా షాడో డిటెక్టివ్ నవలలంటే ఒక క్రేజీ ఉండేది.  ఎందుకనో ఆ కాలం లో చిన్నపిల్లలు ఈ డిటెక్టివ్ లు చదవొద్దు అనేవాళ్ళు, ఎందుకనేవాళ్ళో   ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికి షాడో మీద ఉన్న క్రేజ్ అలాగే ఉంది, ఎక్కడన్నా షాడో డిటెక్టివ్ కనపడితే చదివింది అయినా సరే మళ్ళి ఒక్క సారి చదవాల్సిందే.

ఇలా చదివే అలవాటు తో ఎనిమిదో తరగతిలో  ఓ చిన్న hand written magazine , తయారు చేసే వాడిని. దాని పేరు దీపిక. ఓ పది పేజీలతో చందమామ ల్లోని చిన్న చిన్న కథలు, నేను గీసిన బొమ్మలు (డ్రాయింగ్ లో కాస్త ప్రవేశముంది లెండి) , ఇంకా ఒక్కరిద్దరు ఫ్రెండ్స్ కల్లెక్ట్ చేసిన సూక్తులు, మొదలగు వాటితో వాటిని నింపి అందంగా కలర్ పెన్సిల్స్ తో అలంకరించి ,మా క్లాస్లో సర్కులేట్   చేసే వాణ్ని.   

నాకు నచ్చిన పుస్తకం అని ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా , దాని గురించి రాసే ముందు ఎందుకో దాని ఫ్లాష్ బ్యాక్ లా ఇదంతా గుర్తుకొచ్చింది. ఎంతయినా పాత జ్ఞ్యాపకాలు మధురంగా  ఉంటాయి కదండీ. ఆ కాలం  లో అంటే ఓ ముప్పయి ఏళ్ళ  కు ముందు చదివిన ఓ నవల ఇప్పటికి (అది  నవలగా చదివాన లేక సీరియల్ గా చదివానా సరిగా గుర్తుకు లేదు) నాకు లీల గా జ్ఞ్యాపకం వస్తూంటుంది. అది ఒక సోషియో ,ఫ్యాన్తసి నవల,  రచయిత ముదిగొండ శివప్రసాద్ గా గుర్తుంది.  

కథలో కొస్తే,  ఒక ప్రభుత్వ ఉద్యోగి  వరంగల్ కి బదిలీ పై కుటుంబం తో సహా వస్తాడు.  ఓ పౌర్ణమి నాటి సాయంత్రం ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కల్సి , వేయి స్తంబాల గుడి చూద్దామని వెళ్తారు. ఇక అక్కడ మొదలవుతుంది కథ. అక్కడినించి అతనికి గత జన్మ గుర్తుకు వస్తుంది. అతను పూర్వజన్మలో ఆ గుడి నిర్మించిన  శిల్పి.  ఆ జన్మలో అతని ప్రియురాలు   ఒక నాట్యకత్తే  ,ఆమె ఆత్మ ఇంకా ఇతన్ని వెతుక్కుంటూ పాపం ఆ గుళ్ళో నే ఉంటుంది. ప్రతి పౌర్ణమి రాత్రి బయటకు వస్తుంది. మొదటి సారి అతను వచ్చినప్పుడు ఇతన్ని గుర్తుపట్టి, ఆ తర్వాత  ప్రతి పౌర్ణమి రాత్రి అతన్ని  కలుస్తూ ఉంటుంది,  క్లుప్తంగా ఇది కథ. ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగుతుంది ఈ రచన.  నాకెందుకో ఇన్నేళ్ళయినా, ఇప్పటికి గుర్తుకు వస్తు ఉంటుంది. ఒకటి నవల బాగుండటం, రెండోది మా వరంగల్ కి సంబందించినది కాబట్టి అనుకుంటా. ఇదంతా ఎందుకు అంటే,  ఆ తర్వాత ఎన్నో సార్లు ప్రయత్నించా మళ్ళి చదువుదామని కాని ఆ నవల పేరు గుర్తుకు లేదు. రచయిత కూడా శివప్రసాద్ గారేనా , కాదా అని ఒక అనుమానం. ఇప్పటికి ఆ కోరిక అలాగే ఉంది.  మీకేవరికయినా  తెలిస్తే   చెబుతారని ఆశిస్తున్నా. ఇదండీ నాకు నచ్చిన పాత పుస్తకం కథ,  మళ్ళి ఒకసారి ఇది చదవాలని ఒక కోరిక. మిమ్మల్ని  కోరేదేమిటంటే , మీకు తెలిస్తే నాకు తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తక పటనం గురించి మిగతా జ్ఞ్యాపకాలతో మళ్ళి కలుద్దాం. 

Saturday, September 25, 2010

ఇది గెలవక తప్పని బతుకాట

సిరి వెన్నెల  సీత రామ శాస్త్రి గారి చే రచించబడి, శంకర్ మహదేవన్ పాడిన "ఆట" సినిమా లోని  ఈ పాట  మనల్ని inspire చేసే విధంగా ఉంది.  సిరివెన్నెల గారి సాహిత్యం నిరాశ , నిస్పృహల తో ఉన్నవారిని , కార్యోన్ముఖులుగా చేసేవిధంగా చాల  మనోహరంగా ఉంది.

 ఇది గెలవక  తప్పని బతుకాట అంటూ, అనుకొంటే బతకడమొక ఆట, లేదంటే నిత్యం జీవితం బరువే, విజయం సాధించడానికి ఏ మంత్ర దండాలు , అల్లదిన్ అద్బుత దీపాలు అక్కర్లేదు. జీవితం లో నిలబడి చూసేవారికి, చేద్దాం లే అనుకొనే వాళ్లకు కాదు, పనిని చేపట్టే వాళ్లకు, కస్టపడి పనిచేసే వాళ్లకు విజయం ఎప్పుడు వాళ్ళ చెంతనే ఉంటుంది.

గుండెల్లో నమ్మకముంటే , బెదురెందుకు, పదమంటా,  సంకల్పం ఉంటె చాలు, ఎ  అల్లదిన్ అద్బుత దీపాలు అక్కర్లేదు అంటాడు. ఎ పనిచేసిన ముందుగా దాని లోతెంతో తెలుసుకోమంటూ,  ఈ జీవితమనే ఏటిలో ఎదురీత  అంత సులభం కాదంటాడు. సాధించే  సత్తా   ఉంటె సమరం ఒక సైయ్యట, విజయం మన వెంబడి తల వంచుక రావాల్సిందే అంటాడు. ఎవ్వరు దివినుంచి ఈ భువికి రాలేదు, అందరు ఈ భూమ్మీద కష్టపడి పైకొచ్చిన వాళ్ళే, పై  కొచ్చిన వాళ్ళంతా మనలోనించి  వెళ్ళిన వాళ్ళే, కాబోయే ఘనులంతా మనలోనే ఉన్నారు, పైకొస్తే జై కొడతారు అభిమానులంతా అని ఎంత చక్కగా జీవితం , వ్యక్తిత్వ వికాసం గురించి  శాస్త్రి గారు చెప్పారు.  మీరు విని ఆనందించండి. 


">

Sunday, September 19, 2010

ఆ ఈస్టర్ ఆదివారం...నాకు నచ్చిన కథ


ఈ ఆదివారం ఆంద్ర జ్యోతి అనుబంధం లో ఈ వారం కథ శీర్షికన ప్రచురితమయిన " ఆ ఈస్టర్ ఆదివారం" కథ మన గుండెల్ని కదిలించేదిగా ఉంది. దక్షిణ ఆఫ్రికా పురుషాదిక్య సమాజం లో నల్ల జాతి స్త్రీలు ఎలా మోసపోతున్నారు. వాళ్ళు తమ బాల్యం, అమాయకత్వం ఎలా కోల్పోతున్నారు  అన్నది ఈ కథలో రచయిత్రి ఎంతో చక్కగా రాస్తుంది.  ఈ కథ "It was Easter Sunday The Day I went to Netreg" ,దక్షిణ ఆఫ్రికా రచయిత్రి  "సిన్దివే మంగోన"  రాయగా , తెలుగు అనువాదం శ్రీమతి డా. యార్లగడ్డ నిర్మల గారు చేశారు.

లిండా అనబడే పద్నాలుగేళ్ళ బాలిక వలస కూలీ గా వచ్చిన ఒక నల్ల జాతి వ్యక్తి డేలేలికి వల్ల గర్బవతి అవుతుంది. అక్కడ ఇలా నల్ల జాతి స్త్రీలు , వలస కూలీల చేతిలో ఎలా మోస పోతారన్నది , లిండా  తల్లి కూడా అలాగే పెళ్లి కాకుండా గర్బవతి అయి ఒంటరి మగాళ్ళ వాడలో  ఒక వ్యక్తి చేతిలో మోసపోయిన వైనం ద్వారా  రచయిత్రి చెబుతుంది. 

ఒంటరి మగాళ్ళ  వాడంటే పల్లెల నుండి వలస కూలీలుగా వచ్చే నల్లజాతి మగ వాళ్లకు తెల్ల ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి ఉంచే ప్రదేశం. ఆ మగాళ్ళు పల్లెల్లో, భార్య పిల్లలను వదిలి రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు  సమీపంలో ఉండే కాలనీల్లో ఆడవాళ్ళను  తమ శారీరక అవసరాలకు ఉపయోగించుకోవడం గురించి, ఆ ఆడవాళ్ళు ,బాలికలు  ఎలా మోసపోతున్నారు, వాళ్ళు బాల్యం ఎలా పోగొట్టుకుంటున్నారు అన్నది రచయిత్రి ఈ కథ ద్వార  తెలియ చేసింది. 

డేలేలికి అనే  వలస కూలీ  , లిండా తో సంబంధం పెట్టుకోవడం, ఆ సంబంధం గురించి ఆ అమాయకపు పిల్ల నమ్మి అతని గురించి" నాలాంటి లేత వయసు పిల్లలతో సంబంధం పెట్టుకొన్నందుకు అతను చాల గర్వపడుతూ ఉండేవాడు, అతని గర్వాన్ని చూసి నేను సంతోషించేద్దాన్ని, " అని అంటుంది, ఇంకా ఎంత అమాయకంగా అలోచిస్తుందంటే వయసు  ముదిరిన ఆడవాళ్ళతో మొగ వాళ్లకు మొహం మొత్తుతుంది తను అతనికంటే చిన్నది కాబట్టి అతను ఎప్పటికి తనను వదిలి పెట్టడు  అని ఆలోచిస్తుంది. ఇలా అతన్ని నమ్మి గర్బవతవుతుంది. 

చివర్లో లిండా తల్లి తన యజమానురాలు సహాయంతో, లిండాకు గర్భస్రావం చేయిస్తుంది.ఇక్కడ ఆ రోజుల్లో గర్బస్రావాలు ఎంత మొరటుగా చేస్తారన్నది అన్నది కూడా రచయిత మనకు తెలియచేస్తుంది. ఎక్కడో చదివాను, ఈ ప్రయత్నంలో ఒక్కోసారి తల్లి తన ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని. ఇకపోతే  దీనికి కారణం, ఈస్తర్ కు మూడు వారాల ముందు డెలేలి తో నష్టపరిహారం గురించి, లిండా ను భార్యగా చేసుకోవడం గురించి తన తెగవాళ్ళతో మాట్లడటందుకు పోయినప్పుడు తెలుస్తుంది. " పదిహేను సంవత్సరాల   ముందు, పదిహేడు సంవత్సరాల వయసులో డెలేలి కేప్ టౌన్ కు వలస కూలీగా వస్తాడు.  అప్పుడు పెళ్లికాకుండానే తనను తల్లి చేసిన వ్యక్తి మరియు ఇప్పుడు తన బిడ్డను తల్లిని  చేసిన వ్యక్తి ఒక్కడే అని గుర్తిస్తుంది. ఉహించేతందుకు  కూడా బాధగా ఉంది. ఎంత హృదయవిదారకం. ఆ తల్లి ఎం చెబుతుంది. అమాయకత్వంతో తల్లి, బిడ్డలు ఒకే వ్యక్తి చేతిలో మోసపోవటం, దానికి దారి తీసిన పరిస్థితులు అక్కడ సమాజంలో ఆడవాళ్ళు ఎంత దయనీయపరిస్తితులలో ఉన్నారు అన్నది రచయిత్రి చాలా విపులంగా చిత్రీకరిస్తుంది.  

చివరగా లిండా మాటల్లో ఆమె ఎం కోల్పోతుంది అన్నది చూడండి. " ఆ ఈస్తర్ ఆదివారం ఒక దొంగ రోజు. నేను నా బాల్యాన్ని శాశ్వతంగా కోల్పోయిన రోజు. కొన్ని సంవత్సరాల  తర్వాత నేనెప్పటికీ తల్లిని కాలేనని తెలుసుకున్నందుకే కాదు. నేను మగవాడితో సెక్స్ ఆస్వదిన్చలేనందుకే కాదు. నాలో ఉన్న భయంకరమయిన రహస్యం నన్ను భాదిస్తున్నందుకే   కాదు. ఆ రోజు నాలో ఏదో చచ్చి పోయింది. అందుకే అది నన్ను పూర్తిగా దోచుకున్న  దొంగరోజు".  " ఆ రోజు నేను పోగొట్టుకొన్న బాల్యం, అమాయకత్వం నాజీవితంలో తిరిగి రావు." 

Saturday, September 18, 2010

గోపి చంద్ గురించి ముగ్గురు మహాకవులు ....



గొప్ప గోపీచంద్ - విశ్వనాథ సత్యనారాయణ 

ఒక మర్యాదను కలిగిన కులమున పుట్టుటయే గొప్ప గోపీచంద్
ఒక మంచి వంశమందున జనియించుట మరియు గొప్ప గోపీచంద్ 
ఒక గొప్ప తండ్రి కడుపున పుట్టుట ఇంకొక్క గోపీచంద్
ఒక గొప్ప చదువు చదువుట మరయు నద్రుష్టమ్ము నువ్వె గోపీచంద్

శ్రద్ధాంజలి - జాషువా

నిజముపల్కు,  త్రిపురనేని తనూజుడై
కథక చక్రవర్తిగా రహించి
తెలుగు వాణి బిట్టు విలపింప కథయయ్యే
ధీ పయోంబురాశి, గోపీచందు.

ఒక ప్రశంస - నాయని సుబ్బారావు

నిరతాంతఃకరనున్డనై చదివితిన్ నీ 'వీలునామా' పరం 
పరగా మానసబుద్ది చిత్తము లహం భావమ్ము సజ్ఞ్యాన క
ర్బురమాయావలి  తాన్ధవాసనల్  నిర్మోకమ్ము చాలించి వి
స్త  రదివ్యత్వ వికాసవీచికల సంతానమ్ముపై తేలగన్.

Wednesday, September 8, 2010

మిలే సుర్ మేర తుమ్హారా

అప్పుడు ......

1988  లో ఆగస్ట్ 15 రోజున ప్రధాన మంత్రి స్పీచ్ తర్వాత మొదటిసారిగా దూరదర్శన్ లో  ప్రసారం చేయబడింది. రచయిత పీయూష్ పాండే,  ఈ పాట అప్పుడు టి.వి. లలో ఎప్పుడు. వచ్చేది. అది వినపడగానే , ఎక్కడున్నా ఒక్క సారిగా , టి.వి. ముందుకు  వచ్చే వాళ్ళం.  ఎంత మధురంగా ఉంది. ఇండియా అంతా ఒక్క సారి చుట్టి వచ్చిన ఫీలింగ్.....జాతీయ సమైక్యత మరియు భిన్నత్వం లో ఏకత్వం ఎంత చక్కగా చూయిన్చారు మళ్ళీ ఒక్కసారి పాత జ్ఞ్యాపకల్లోకి  వెళ్తే ...




ఇప్పుడు.....

అదే పాట మళ్ళీ ఇప్పుడు.......... ఎందుకో పాత పాట లో ఉన్న మాధుర్యం, కొత్త దాంట్లో కనిపించలేదు. ఇండియా అంటే సిని తారలెన, ఎంత మంది రియల్ హీరోస్ లేరు, ముంబాయి కాల్పులలో ఆసువులు బాసిన పోలీసు ఆఫీసర్స్,  దేశ ఖ్యాతిని  నిలబెట్టిన సచిన్ లాంటి వాళ్ళు,  దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన సైనికులు, ఇంకా ఎందరో..... missing in this vedio .  పాత విడియో  లో ఉన్న స్పిరిట్ , కొత్త దాంట్లో కన్పించలేదు. సల్మాన్ , దీపికా పాడుకొనే , గ్లామర్  పంటి కింద రాయిలా అనిపించింది. మీరు చూడండి.

అమితాబ్  చే విడియో రిలీజ్.(జనవరి 26 , 2010 )  .........

">

మొదటి భాగం.

">

రెండవ భాగం.

">

Friday, September 3, 2010

తుమ్మేటి వీడియో కథలు - 1

 తుమ్మేటి రఘోత్తం రెడ్డి గారు విజువలైస్   చేసిన ఏడు కథలను దశల వారిగా మీకందించే ప్రయత్నం లో ఇది మొదటి భాగం.  తుమ్మేటి చెప్పినట్లు ఈ పక్రియ బహుశ మన సాహితి ప్రపంచంలో రాలేదనుకుంటా. ఇది ఒక నూతన ప్రక్రియ. రచయితే మనకు తన కథను దృశ్య పరంగా మనకు చెప్పడం అనేది కథను మన మనసుకు హత్తుకు పోయేలా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రఘోత్తం  గారి కథలన్నీ  ఈ వర్తమాన సమాజంలో అతని అనుభవాల నుంచి ఉద్భవించినవే. రఘోత్తం  గారు కథ చెప్పే విధానం కూడా, ఎంతొ హృద్యంగా, సరళమయిన బాషలో, ఏదో కథలా కాకుండా, మనతో ఓ మిత్రుడు   కూర్చొని మాట్లాడుతున్నట్లు గా ఉంటుంది.

ముందుగా ఈ కథలకు ముందుమాటగా తుమ్మేటి మిత్రులయిన  శ్రీ అల్లం రాజయ్య గారు , మరియి శ్రీ  ముళ్ళపూడి సుబ్బా రావ్ గారి వ్యాఖ్యానాలు చూద్దాం.

శ్రీ అల్లం రాజయ్య గారి ముందుమాట క్లుప్తంగా :

"విలువలతో కూడిన జీవితన్వేషణలో రఘోత్తం  సాహిత్యం వైపు వచ్చాడు. విలువల కోసం బతకడం కాలుతున్న కాగడా లాంటిది. ఈ ప్రయాణం లోని తన అనుభవాలను కథలుగా  మలచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రఘోత్తం కు సాహిత్యం , జీవితం వేరు కాదు. తన జీవితాన్వేషణ  నుండి రూపొందిన విలువలను మౌఖిఖ కథలుగా మనకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వార మనకు అందిస్తున్నారు.ఇంతకుముందు తెలంగాణా ప్రాంతం లోని యుద్ధం, అందులోని హింస ను రాసిన రఘోత్తం నేడు ఇటువంటి ఇతివృత్తాలను ఎందుకోడానికి కారణం నేటి సందర్భం. కంట స్వరం రఘోత్తం దే అయినా, ఇది విలువల కోసం బ్రతికే అందరి కంట స్వరం. ఈ ఏడు కథలు మనుషులు తమకేమి కావాలో  ఎంత కావాలో తెల్చుకోమంటాయి".చూడండి   అల్లం రాజయ్య గారి వ్యాఖ్యానం.............

శ్రీ ముళ్ళపూడి సుబ్బా రావ్ గారి ముందు మాట క్లుప్తంగా:

రాతగా, లేదా అచ్చులో చదవటానికి ఇష్ట పడ్డ ఈ కథను కథకుడు చెప్పగా దృశ్య పరంగా చూడడం ఈ కాలానికి సంబంధించి ఓ ప్రయోగం. అయితే ఇది రాయబడ్డ కథకి ఎ రకంగా భిన్నం. అచ్చులో కథలు కనపడకుండానే రచయితఃకు సంబంధించిన ఒక టోన్ పాటకులకు గ్రహింపుకు వస్తుంది. అతని కంట స్వరం , అందులో కనిపించే ధ్వని, రచయితా హావ, భావాలతో కలిపి మనసులో ఒక భావ పరంపరను కలిపిస్తుంది. ఈ దృశ్య పరమయిన కథలకు అదే ప్రత్యేకత అని నా అభిప్రాయం. ఈ కథలను వీక్షించిన వాళ్ళ కి ఈ కథ చాలా దగ్గరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కథలలో చాలా చోట్ల పాత్రల పట్ల కథకుని యొక్క నిశిత విమర్శ కనపడుతుంది. అయితే ఇది ఆ పాత్ర పట్ల వ్యక్తిగత విమర్శ కాకుండా, ఆ పాత్ర ప్రాపంచిక దృక్పథం పట్ల కథకుని విమర్శగా మనం చూడాల్సి ఉంటుంది.   చూడండి ముళ్ళపూడి సుబ్బారావ్ గారి వ్యాఖ్యానం........

">