ఎక్కడో తమిళ దేశం లో జన్మించి, చిన్నప్పుడే బ్రతుకు తెరువు కోసం తెనాలి వచ్చి పొట్ట నింపుకోవడానికి హోటల్ సర్వర్ గా పని చేస్తూ, తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసి ౩౦ సం.ల చిన్న వయస్సులో ఫిట్స్ వ్యాధి తో మృత్యు వాత పడిన " శారద" జీవితం గురించి ఎన్నో విషయాలు ఆనాటి తెనాలి లో శారద తో సన్నిహితంగా ఉన్న సహచరుడయిన శ్రీ ఆలూరి భుజంగ రావ్ గారు "సాహిత్య బాట సారి - శారద (ఎస్.నటరాజన్)" స్మృతి శకలాలు పేరిట మనకందించారు.ఎందరో తమ కీర్తి, తమ రచనకు ప్రాచుర్యమూ కలగాలన్న కోరికతో శారద జీవితానికి చిలువలు, పలువలూ కల్పిస్తారన్న భయం కల్గి , ఆనాటి జీవిత పరిస్తితుల్ని వ్రాసి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చి ఈ రచన చేసినట్టుగా భుజంగ రావ్ గారు తన ముందు మాటలో తెలిపారు.
1937 లో మద్రాసులో బతకలేక వ్రుద్దుడయిన తన తండ్రి ని తీసుకొని నటరాజన్ తన పన్నెండేళ్ళ వయసులో ఆంధ్రా ప్యారిస్ తెనాలి లో అడుగు పెట్టి తన బావ అయిన భీమారావ్ హోటల్లో పనికి కుదిరి ప్రతిపలంగా ఇచ్చే పావులో-ఆర్తో సంపాదనతో ఓ చిన్న వూరింటిని అద్దెకు తీసుకొని తెనాలి లో తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పటికి అతనికి తమిళ సాహిత్యంతో పరిచయముంది. ఇక్కడ తెనాలి తో తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్తితి వచ్చి తెలుగు నేర్చుకొన్నాడు.రోజుకు పదహారు గంటలు అతి దుర్భరమయిన హోటల్ చాకిరీ చేస్తూ సాహిత్యం వైపు ఆకర్షితులయినాడు. 1946 లో ప్రజాశక్తి లో "ఎస్.నటరాజన్ " పేరిట " ప్రపంచానికి జబ్బు చేసింది" అన్న ఓ వ్యంగ్య రచన ప్రచురితమయ్యింది. ఇదే అతడి అచ్చయిన మొదటి రచన. మిత్రులతో కలిసి "ప్రజావాణి" అనే రాత పత్రిక ను ప్రారంభించాడు. 1946 -47 లలో నటరాజన్ తన సాహిత్య పరిజ్ఞ్యానాన్ని విషయ పరిజ్ఞ్యానాన్ని పెంచుకొన్నాడు. అదే రోజుల్లో ఆలపాటి రవీంద్రనాథ్ చౌదరి తెనాలి లో "జ్యోతి" అనే పక్ష పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక కారణంగా తెనాలి ఓ సాహిత్య కేంద్రంగా వెలసిన్దంటారు.అంతక్రితమే చక్రపాణి "యువ" కూడా తెనాలి నుంచే ప్రారంభించారు.1948 సం.జనవరి ౩౦ వ తారీకు జ్యోతి పత్రికలో " గొప్పవాడి భార్య" అనే ఒక వ్యంగ్య రచన శారద పేరున అచ్చయ్యింది, శారద పేరున అచ్చయిన మొదటి రచన ఇదే. నటరాజన్ సహజంగా సౌందర్యోపాసట అందుకే "శారద" అన్న మూడక్షరాల స్త్రీ నామం తనకు నచ్చి దాన్నే కలం పేరుగా పెట్టుకొన్నాడట. అక్కడి నించి శారద శర పరంపరలుగా రచించాడు. తను చూచిన ఎందరో అభాగ్యజీవుల్ని , దురాశాపరుల్నీ తన సాహిత్యంలో చిరస్మరనీయంగా చిత్రించాడు. ఇలా సుమారు ఓ వంద కథలూ, కొన్ని నవలలూ రాశాడు. అతని కథలు విరివిగా ప్రచురితమయ్యి పేరు సంపాదించే రోజుల్లో కూడా పొట్ట పోసుకోవతందుకు బస్ స్టాండ్లో పాత పుస్తకాలూ , చల్లని మజ్జిగా అమ్మే వాడు.ఇలా చివరి క్షణం వరకూ కష్టపడే బ్రతికాడు. కస్టపడి బ్రతికే మానవుల జీవితాల్ని తన రచనల్లో చిత్రించాడు.
కథ గురించి శారద ఎం చెప్పాడట అంటే " కథకుడు ఎ చిత్రాన్నయినా సమగ్రంగా చిత్రించాలి, కథ చెప్పడంకూడదు, కథని కెమెరా సినిమాని చూపించినట్లు చూపించాలనేవాడు.కథ చెప్పడం నాయనమ్మ పని అని , రచయిత తన ఆదర్శాన్ని ఊక దంపుడు ఉపన్యాసంగా చెప్పడాన్ని అంగీకరించేవాడు కాదు.కథలలో గానీ, నవలలో గానీ మనం చెప్పదలచుకున్న ఆదర్శం పూసలలో దారంలా ఉండాలంటాడు . కథ సాంతం చదివేసరికి పాటకుడు మన ఆదర్శాన్ని అంగీకరించే స్థితి కి రావాలంటాడు.ఆదర్శాన్ని విడిగా చెప్పడం అతడికి నచ్చదు. కథాకతనంలోనే తానూ చెప్పదల్చుకున్నది ఇమిడి ఉండాలి , ఆదర్శామూ రావాలి అనేవాడట.
ఇలా తెనాలి లో అడుగుపెట్టి హోటల్ వర్కర్ గా పనిచేస్తూ పర భాష అయిన తెలుగు నేర్చుకొని ఆకలి, దారిద్ర్యం ,కన్నీళ్ళ గురించి తన కలం నుంచి ఎన్నో రచనలు చేస్తూ , తండ్రి మరణంతో వచ్చిన మూర్చ వ్యాధి జీవితాంతం వెన్నంటి చివరికి ఆ మూర్చ తోనే జీవితం ముగించిన శారద జీవితం గురించి ఎన్నో విషయాలు, శారద వ్యక్తిత్వం గురించి , రచయిత ఈ రచనలో మనతో పంచుకుంటారు. శారద జీవితం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం.
ప్రచురణ: చైతన్య వేదిక- తెనాలి
వెల : రూ. ౩౦.౦౦
2 comments:
శారద"గురించి రాసినందుకు ధన్యవాదాలు.ఎప్పుడో చాలా కాలంకిందట ఆంధ్రపత్రిక లో "మంచి -చెడు "అనే అతని సీరియల్ నవల చదివాను.అధోజగతి జనుల గురించి చాలా బాగా వాస్తవికంగా రాసేవాడు.అప్పట్లో అతని గురించి ,విషాదకర జీవితం గురించి నాకు తెలియదు. అతని మరణానంతరం తెలిసింది.ప్రతిభావంతుడైన అతని జీవితం అలా ముగియడం ఇప్పటికీ బాధ కలిగిస్తుంది.==రమణారావు.ముద్దు
Sarada is my all time fav writer..thanks for writing about him..
I have created a blog with most of his works..ua can read them there....
link: http://sahithyabatasarisarada.blogspot.in/
Post a Comment