Sunday, October 4, 2015

అప్పుడు మరణం


సారంగ సాహిత్య పత్రికలో  నా కవిత  "అప్పుడు మరణం "

జీవించడం
నేను నా అనుభూతులూ, నా స్పందనలూ, నా అనుభవాలూ
ఆరాటాలు , పోరాటాలూ, ప్రేమలూ, ద్వేషాలూ, సుఖాలూ, దుఖాలూ సమస్త జ్ఞాపకాలూ !
ఇదేగా జీవితం…జీవించడం-
మరణం
మనకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం
శాశ్వతమని మనం తలపోసే వాటికి దూరంగా
రెప్పపాటులో  ఎక్కడికో తెలియని లోకాల్లోకి పయనం-
చేతనలో…..అచేతనలో
మరణమన్న  భయాన్ని ముక్కలు  చేస్తే
లోలోన….
అచేతన జారీ చేస్తున్న ఆజ్ఞలను
పక్కకి నెట్టేసి
బ్రతుకు భయం..చావు భయం
ఈ ఆరాటాలూ, పోరాటాలూ, సంఘర్షణలూ
అన్నీ మాయమయ్యి
అన్నీ శాశ్వతంగా కొనసాగాలనే ఆలోచన ఆపి వేసిన మనస్సు
ఖాళీ కుండలా
జీవించటం, మరణించటం ఒక్కటయినా  ఆ అనుభూతి
అద్బుతమయిన ఆ క్షణం
అజేయమయినది నా ఉనికి లోకి వచ్చిన ఆ క్షణం
అప్పుడు మరణం
ఒక అద్బుతమయిన ఘడియ !
ప్రాణంతో ఉండటమంత  శక్తివంతమయినది!!

Sunday, December 15, 2013

తిరుప్పావై....ధనుర్మాస వ్రతం


తిరు అంటే శ్రీ,  పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం. అన్ని  సంపదలను ఇచ్చేది సిరి నోము దీనినే ధనుర్మాస వ్రతం అంటాం.చాంద్ర  మానం ని బట్టి మార్గశీర్శమైతె సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. "మాసానాం మార్గశీర్షోహం" , మాసములలో ఉత్తమమైన మార్గాశీర్శమును నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశిరం లో ప్రారంభమయ్యే ధనుర్మాసమంటే ఇష్టమట. 

మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు, మలిపున్నామి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు, ఇదే మన  జీవితం! ఎప్పుడూ భగవంతునితో కలిసి వుంది, ఇహ పరములలో  మనకు కావలిసినన్నీ పొందడానికి ఈ సిరినోము చెయ్యాలట.

ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లె లో గోపికలు కృష్ణున్ని పొందాలని కోరి కాత్యాయిని వ్రతం గా చేశారు. తర్వాత కలియుగం లో శ్రీవిల్లిపుత్తూర్ లో  గోదా దేవి అచటి అర్చామూర్తి శ్రీ వటపత్రశాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా. వారి ఆలయాన్ని నందగోప భవనంగా, తన తోటి చెలికత్తేలన్దరినీ గోపికలుగా, తనూ ఒక గోపికగా త్రికరణ శుద్దిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది. శ్రీ రంగ నాథున్ని పొందింది.

శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల వారికి, పుబ్బ నక్షత్రం లో తులసి వనం లో లభించింది. శ్రీ విష్ణు చిత్తులు (పెరియాళ్వార్) ఆ బాలిక ను అల్లారుముద్దుగా పెంచిరి. వటపత్రశాయికి నిత్యమూ పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమయిన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమెకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. ఆమె  తండ్రి తో బాటే మాలలు కట్టి, అవి తానూ  ముందు ధరించి తరువాత స్వామికి ఇచ్చేది.తండ్రి అపచారమని మన్దలించినా, స్వామి ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలలే నాకు ఇష్టం అని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను "ఆముక్త మాల్యద" అని తమిళంలో "శూడి కొడుథ్థ నాచ్చియార్"అని అంటారు. పాశురములను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి " పాడి కొడుత్త నాచ్చియార్" అని కూడా అంటారు. "తిరుప్పావై" ప్రబందమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాళ్. అండాళ్ అనగా కాపాడే తల్లి , రక్షకురాలు. ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ఆ రంగ నాథున్నికొలిచినది . రంగనాథ స్వామి కి విరుల సౌరభాల కన్నా, గోదాదేవి కురుల పరిమళమె నచ్చింది. విష్ణు చిత్తుడి కి కలలో కనిపించి గోదా కల్యాణానికి ఆనతిచ్చాడు.ఆండాళమ్మ  ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమై పోయింది . పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్!. 

భక్తులు సూర్యోదయానికి ముందే ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తిచేసుకుంటారు. గోదా దేవి పాడు కున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు.వయో లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు అంటారు.ఓ వైపు వణికించే చలి, వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఆ మత్తును జయించి, తెల్లవారుజామునే మేల్కొనాలి.ఆహార మియమాల్ని పాటించాలి. మిత భాషణ, ప్రియ భాషణ కూడా అవసరమే.దాన ధర్మాలకు ప్రాదాన్యం ఇవ్వాలి.భోగాలకు దూరంగా ఉండాలి.ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం.

ఆ బ్రహ్మాండ నాయకుని చేరిన ఆండాళ్ కోరిన కోరిక ఇది "సర్వ విధముల నీకే చెంది, నీదే అయిన ఈ ఆత్మ అనర్థము నందకుండా కాపాడుము. ఈ ఆత్మ స్వరూపమునకు తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యము చేయు భాగ్యమ్ము నిమ్ము.  ఈ ఆత్మ ఉన్నంత కాలము నీ సేవ చేయునట్లు అనుగ్రహింపుము"...ఇదే తిరుప్పావై సారం.

జై శ్ర్రేమన్నారాయణ!                        జై శ్రీమన్నారాయణ!                          జై శ్రీమన్నారాయణ!           

Tuesday, October 8, 2013

ఎర్ర జాబిళ్ళ ఎరీన


పాటిబండ్ల రజని గారి "ఎర్ర జాబిళ్ళ ఎరీన"..కవితా సంకలనం లో కొన్ని కవితల గురించి
..మొదటి కవితే కదిలించేది గా వుంది."అబార్షన్ స్టేట్మెంట్". ఈ కవితలో తన అజాగ్రత్త వల్ల జరిగిందని రాస్తూ 
"భద్రతా వలయాన్ని ఎగతాళి చేసి//అక్రమంగా సరిహద్దును దాటే ఆకతాయల్లె//ఆ పద్నాలుగో రోజుకు అటో ఇటో//వద్దు వద్దు అనుకుంటూనే//అజాగ్రత్తగా //నేననుమతించిన అసమ్మతి కణాలతో//మరో సగభాగమై నువ్వెందులు కలిసావురా కన్నా?
 కానీ తానూ ఎందుకు వద్దనుకుందో రాస్తూ....పంచేందుకు రక్తం లేకే కదా//పెంచేందుకు తీరిక లేకే కదా// , తల్లడిల్లుతూనే , తప్పొప్పుల మధ్య తడబడుతూనే చేసుకొన్న అబార్షన్!, ఇక్కడ ఒక్కటి అర్థం కాలేదు. తాను వద్దనుకుని చేసుకున్న అబార్షన్ విదానాన్ని విమర్శిస్తూ "ఇంత సుఖంగా నిన్ను చంపుకొనే మార్గం కనిపెట్టిన వీళ్ళ ముఖాలపై //ఉమ్మ నీళ్ళ తో ఉమ్మేయ్యలని వెర్రి ఆవేశంగానూ// అంటుంది. తన   కడుపులో ఉన్న ఆ పిండానికి జన్మ నివ్వవద్దు అనుకొని , తన ఇష్టంగా చేసుకొనే ఈ అబార్షన్ ని విమర్శించడం అర్థం కాలే? చివరి పదాలు చూడండి " అయ్యో! //పాలింకి పొవాడానికి కున్నట్లు //మనసింకి పోవడానికీ మాత్రలుంటే ఎంత బావున్ను//

చోళీ కీ పీచె అన్న కవిత లో శరీరాదారంగా జరుగుతున్నా కుట్ర  ఎలా అవాంచనీయ కనజాలంగా పెరిగి పెరిగి క్యాన్సర్ గడ్డ గా మారిందో, దానికి రేడియో తెరపీ కి త్వర పడాల్సి వుంది అంటూంది. చోలీలు ఓణీ లు లేనప్పుడు //హృదయం వెన్నెలారబోసినంత పారదర్శకమై వుండేదేమో// జోడీలంతా వెన్ను విరుచుకొనే తిరిగే చోట//తన హృదయం విలాస వస్తువి చోళీలో కుంచిన్చుకోవలసి// అంటూంది. బడి పిల్ల నుంచి మొదలు కొని బామ్మగారి వరకు ఎంత వేదనో రాస్తూ బడిపిల్ల సర్డుకోక తప్పని యునిఫారం వెనుకా//పసితననుండీ పాపిట నేరిసిన్దాకా పాతివ్రత్యాన్నే నమ్మిన బామ్మ గారూ// కప్పుకోక తప్పని రవిక వెనుకా//ఉమ్మడి భాద్యతల కావడి కుండలూ,పాల సలుపులూ// అని ఎంత వేదన అనుభవిస్తున్నారో రాస్తుంది.

 ఉద్యోగిని ఆదివారం అనే కవితలో వ్యాపార ప్రకటనల్లో ఆదర్శంగా తీసుకోమనే గృహిణి వెనుక ఆమె పడే కష్టం ఎంతో హృద్యంగా వర్ణిస్తుంది. అందరికీ ఆదివారం , మరి తన ఆదివారం ఎలా ఉంటుందో ఈ కవితలో చెప్తుంది.పొంగిన పాలూ వలికిన చారు మరకలతో వంటిల్లు అందించే వారాంతపు రిపోర్ట్.తెగిన ఖాజాలు, ఊడిన గుండీలతో చింపిరి గంపి ఝాడిపించే  బట్టల స్టాండ్, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ కవితలో చివరికి ఇద్దరి జీతాలని ఈర్ష పడే వారెవరూ గృహిణి కి వుండే రెండు భాద్యతల పట్ల జాలి చూపరంటూంది. అన్ని భాద్యతల్నీ సమానంగా పంచుకునే మనం//మన బరువు దించేందుకు చేయి అందించారేమని నిలదీయాలి అని అంటుంది. ఇంకా మన పిల్లల నుంచైనా// ఇంటి పనంటే  ఇంతులది కాదని నేర్పాలి// అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చెయ్యాలి అని ముగిస్తుంది.

రెప్ప కాటేసిన పాప కథ అన్న కవితలో విద్యార్తినులపై లైంగిక వేదింపులు చేసే ఉపాద్యాయుల గురించి రాస్తూ. అయ్య వారికి చాలట అమ్మాయిల మానాలు//ఆడ పిల్లల కిపుడు కొత్త పాటాలు//భారత దేశం మన పితృ భూమి//భారతీయులందరూ మన బావ మరుదులు//గురు బ్రహ్మ// బ్రహ్మ కైనా తప్పదు రిమ్మ తెగులు// అంటూంది.చివరికి సిల్లబాస్ సవరించండి అంటూ కప్పల్ని కబళించే పాముల్ని గురించే కాక//కను "పాప"ల్నే కాటేసే రెప్పల విపరీతాన్ని కూడా ఒప్పులకుప్ప వయసున్నప్పటి నుంచే హెచ్చరించండి //అంటూ హెచ్చరిస్తుంది.

ఎర్ర జాబిళ్ళ ఎరీన అన్న కవితలో బాల వేశ్యల సంఖ్యలో రెండవ స్తానంలో ఉన్న దేశ దౌర్బగ్యాన్ని కేవలం బాల వేశ్యల కోసమే మన దేశానికి వచ్చే విదేశీ వింత పశువుల గురించి వాళ్ళ విక్రుతానందం  గురించి రాస్తుంది. గంగా తీరే రాక్షస రాతి సుఖ సారే//యమునా తీరే యమకూప విహారే//తాజాగా తల్లిపేగు తెంచిన తడిబొడ్లను తట్టలతో పేర్చం// మీ సెక్సీ బాత్ కోసం మా గోవా బీచ్//తడి దేరని పసి తనువుల ఇసుక పర్రలతో తయారుగా పక్క పరచి ఉంచింది//మీ దొరసాన్ల పాపలు// ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని//మురిసే ఆ పొద్దుకే వేళ//ఈ పాపసానులు//అయామ్ యువర్ నైట్మేర్ అంటూ// అధిరోహనకు అంగ చాస్తాయ్//కేవలం పర్యాటక మారకం చెల్లించి నంతనే దక్కే // పసి గాయాల ఫలహారాలు//ఇంకెక్కడైనా మీకు చిక్కెన ? అయ్యా అందుకే ఇది ఎర్ర జాబిళ్ళ ఎరీనా అంటుంది.కొన్ని కవితలు కదిలించేవిగా కొన్ని ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.

Monday, July 29, 2013

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు....
ఓ మెరుపులా తటిల్లున మెరుస్తూ
ఆకాశంలో  రంగు రంగుల గాలిపటాల్లా
వినీలాకాశం లో విచ్చుకున్న మెరిసే నక్షత్రాల్లా
ఎన్నో...ఎన్నెన్నో,

అకస్మాత్తుగా
చిరుజల్లులా హృదయాన్ని తడిపేవి
తుఫానులా మున్చేత్తేవి
చూరు నుంచి కారే ఒక్కొక్క బొట్టులా
మెరుస్తూ...ఒక్కొక్కటే
పాయలుగా ..కాల్వలై..అలలు అలలుగా
ఎగిసిపడుతూ
ఎన్నో...ఎన్నెన్నో ,

ఒక నవ్వు
ఒక దుఖం
ఒక స్నేహం
ఒక బాధ 
ఒక అందం
ఒక చిరు స్పర్శ
ఒక హృదయం
ఎన్నో...ఎన్నెన్నో
జ్ఞాపకాలు ..అలల్లా ఎగిసి పడుతూ





Sunday, July 28, 2013

ఒంటరిగా




 పడమటి చెరువులోకి ఇంకుతున్న పగటి జ్ఞాపకాలు
మలి సంధ్య రాత్రి లోకి కరిగిపోతుంటే
రాలిపోయిన ఉల్కలా నువ్వు ఈ విశాల విశ్వంలో కలిసిపోయి ...
నీలాకాశంలో పురివిప్పుకున నక్షత్రాల్లా కోరికలు
ప్రేమ లేని వాంఛ
వాంఛ లేని ప్రేమ 
ఆ రెంటిఅపూర్వ  కలయికలను దోసిళ్ళతో త్రాగిన ఆ మధుర స్మృతులు
నన్ను గతం లోకి నేట్టేస్తుంటే
మనస్సులోని ప్రేమ
శరీరం లో జనించే కోర్కెలు
నిశ్శబ్దంగా నిశీధి లో కరిగిపోతుంటే
ఈ నిశి రాత్రిలో నిన్ను వెతికి వేసారి
ఒంటరిగా...
నిరాశా నిస్పృహలతో
తొలిసంధ్య వెచ్చని కిరణాల్లోకి
మళ్ళీ ఇంకో రోజులోకి నా పయనం నువ్వు లేకుండా




ఒంటరిగా...

Sunday, April 7, 2013

ఓ బొంత సృష్టించిన తుఫాను




ఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది. పాత్రలన్నీ చాలా కాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అని అంటారు. కథలు ఉర్దూ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి సత్యవతి గారి అనువాదం చక్కగా తెలుగు రచన లాగే ఉండడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి.
ఈ సంకలనం లో “లిహాఫ్” మొదలుకొని మొత్తం 15 కథలున్నాయి. ఇక్కడ “లిహాఫ్” అనే వివాదాస్పద కథ గురించి మీతో పంచుకుంటా. లిహాఫ్ అంటే రజాయి. దూదితో బాగా దళసరిగా కుట్టిన బొంత-బాగా చలిరోజుల్లో కప్పుకుంటారు. ఈ కథ ఓ స్త్రీ చిన్ననాటి స్మృతుల రూపం లో మనకి చెబుతూ ఉంటుంది. ఆమె స్మృతుల్లో రజాయి లో వెచ్చగా పడుకున్నప్పుడల్లా దాని నీడ గోడ మీద ఒక ఏనుగులా కదులుతూ ఆమెను గత స్మృతుల్లోకి లాక్కెళుతుంటాయి.
 సారంగ వెబ్ వార పత్రిక లో నా కథా పరిచయం పూర్తిగా ఇక్కడ చదవండి

Sunday, March 17, 2013

ఒకే ఆత్మగా .......


ఒకే ఆత్మగా .......


మత్తుగా నిద్దరలోంచి
కళ్ళు తెరచి చూసి
ప్రక్కన నిన్ను వెతుక్కుంటే నీవు లేవు కాని
గది నిండా నీ జ్ఞాపకాలు, నీ పరిమళాలు
నాతో గుసగుసలాడుతున్నాయి

రాత్రంతా
నా ఆర్ద్ర నేత్రాల్లో జలకాలాడిన నీవు

కిటికీ వద్ద అప్పుడే తల స్నానం చేసి తడిసిన వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ నువ్వు
మంచులో తడిసి ముద్దయిన ప్రక్రుతి ని  చూసినట్టు
అన్ని రంగులు కలబోసుకున్న హరి విల్లు లా
ఎవరో చిత్రకారుడు గీసిన అస్పష్ట చిత్రంలా...


ఎందుకో ఒక్కసారి గా
మనస్సు గతం పుటల్లోకి వెళ్ళింది
మన తొలి పరిచయం
మనస్సు తో స్ప్రుశించుకున్న మధుర భావనలు
కళ్ళతో కౌగిలించుకొన్న ఆ క్షణాలు
ఎన్నాళ్లయినా ఇంకా తాజాగా!

పదిలంగా దాచుకున్న నా
హృదయాన్ని దోచుకున్నావు
నాది అన్నది ఏమీ లేదు
నువ్వే నేనయి....
నేనే నువ్వై..
ఇద్దరం ఒకటై....ఒకే ఆత్మగా

(17.3.2013)