Tuesday, September 28, 2010

నాకు నచ్చిన పాత పుస్తకం

నాకు ఈ పుస్తకాలు చదివే అలవాటు నా హై స్కూల్ రోజులలో అలవాటయ్యింది. మా బాబాయి గారు బాగా పుస్తకాలు  చదివే వారు, నాకు గుర్తుంది, 75 మరియు 80 లలలో మాట    అప్పుడు నాలుగు వీక్లీలు, ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంద్ర భూమి, ఇంకోటి ఆంధ్ర  సచిత్ర వార పత్రిక అనుకుంటా,చందమామ  ఇవి రెగ్యులర్ గా కన్పించేటివి.   ఎదురుగా కనపడితే మనసు ఊరుకోదు కదండీ.  నాకు బాగా గుర్తు ఆ కాలంలో యుద్దనపూడి ఇంకా పేర్లు సరిగా గుర్తుకు లేవు కాని వాళ్ళ  సీరియల్స్ వస్తుండేవి. ప్రతి వారం వాటిని కట్ చేసి, సీరియల్ అంతా అయిపోయాక వాటిని బైండింగ్ చేయించి బద్రంగా దాచేవాళ్ళం.   చాలా రోజులు అవి అలా అటుకు మీద కన్పించేవి.  అవి ఇంకా ఎందుకు అని అంటే మా అమ్మమ్మ సరదాగా  అంటుండేది, అరె అవి నీ పెళ్ళాం వస్తే చదువు కోటందుకు ఉంటాయి లేరా అని.  అలా సీరియల్స్ చదివే అలవాటయ్యింది. 

 మా బాబాయి గారు షాడో మధుబాబు గారివి ఇంకా  కొమ్మూరి సాంబశివ రావు అనుకుంటా డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివే వాడు.  అలా షాడో డిటెక్టివ్ నవలలంటే ఒక క్రేజీ ఉండేది.  ఎందుకనో ఆ కాలం లో చిన్నపిల్లలు ఈ డిటెక్టివ్ లు చదవొద్దు అనేవాళ్ళు, ఎందుకనేవాళ్ళో   ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికి షాడో మీద ఉన్న క్రేజ్ అలాగే ఉంది, ఎక్కడన్నా షాడో డిటెక్టివ్ కనపడితే చదివింది అయినా సరే మళ్ళి ఒక్క సారి చదవాల్సిందే.

ఇలా చదివే అలవాటు తో ఎనిమిదో తరగతిలో  ఓ చిన్న hand written magazine , తయారు చేసే వాడిని. దాని పేరు దీపిక. ఓ పది పేజీలతో చందమామ ల్లోని చిన్న చిన్న కథలు, నేను గీసిన బొమ్మలు (డ్రాయింగ్ లో కాస్త ప్రవేశముంది లెండి) , ఇంకా ఒక్కరిద్దరు ఫ్రెండ్స్ కల్లెక్ట్ చేసిన సూక్తులు, మొదలగు వాటితో వాటిని నింపి అందంగా కలర్ పెన్సిల్స్ తో అలంకరించి ,మా క్లాస్లో సర్కులేట్   చేసే వాణ్ని.   

నాకు నచ్చిన పుస్తకం అని ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా , దాని గురించి రాసే ముందు ఎందుకో దాని ఫ్లాష్ బ్యాక్ లా ఇదంతా గుర్తుకొచ్చింది. ఎంతయినా పాత జ్ఞ్యాపకాలు మధురంగా  ఉంటాయి కదండీ. ఆ కాలం  లో అంటే ఓ ముప్పయి ఏళ్ళ  కు ముందు చదివిన ఓ నవల ఇప్పటికి (అది  నవలగా చదివాన లేక సీరియల్ గా చదివానా సరిగా గుర్తుకు లేదు) నాకు లీల గా జ్ఞ్యాపకం వస్తూంటుంది. అది ఒక సోషియో ,ఫ్యాన్తసి నవల,  రచయిత ముదిగొండ శివప్రసాద్ గా గుర్తుంది.  

కథలో కొస్తే,  ఒక ప్రభుత్వ ఉద్యోగి  వరంగల్ కి బదిలీ పై కుటుంబం తో సహా వస్తాడు.  ఓ పౌర్ణమి నాటి సాయంత్రం ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కల్సి , వేయి స్తంబాల గుడి చూద్దామని వెళ్తారు. ఇక అక్కడ మొదలవుతుంది కథ. అక్కడినించి అతనికి గత జన్మ గుర్తుకు వస్తుంది. అతను పూర్వజన్మలో ఆ గుడి నిర్మించిన  శిల్పి.  ఆ జన్మలో అతని ప్రియురాలు   ఒక నాట్యకత్తే  ,ఆమె ఆత్మ ఇంకా ఇతన్ని వెతుక్కుంటూ పాపం ఆ గుళ్ళో నే ఉంటుంది. ప్రతి పౌర్ణమి రాత్రి బయటకు వస్తుంది. మొదటి సారి అతను వచ్చినప్పుడు ఇతన్ని గుర్తుపట్టి, ఆ తర్వాత  ప్రతి పౌర్ణమి రాత్రి అతన్ని  కలుస్తూ ఉంటుంది,  క్లుప్తంగా ఇది కథ. ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగుతుంది ఈ రచన.  నాకెందుకో ఇన్నేళ్ళయినా, ఇప్పటికి గుర్తుకు వస్తు ఉంటుంది. ఒకటి నవల బాగుండటం, రెండోది మా వరంగల్ కి సంబందించినది కాబట్టి అనుకుంటా. ఇదంతా ఎందుకు అంటే,  ఆ తర్వాత ఎన్నో సార్లు ప్రయత్నించా మళ్ళి చదువుదామని కాని ఆ నవల పేరు గుర్తుకు లేదు. రచయిత కూడా శివప్రసాద్ గారేనా , కాదా అని ఒక అనుమానం. ఇప్పటికి ఆ కోరిక అలాగే ఉంది.  మీకేవరికయినా  తెలిస్తే   చెబుతారని ఆశిస్తున్నా. ఇదండీ నాకు నచ్చిన పాత పుస్తకం కథ,  మళ్ళి ఒకసారి ఇది చదవాలని ఒక కోరిక. మిమ్మల్ని  కోరేదేమిటంటే , మీకు తెలిస్తే నాకు తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తక పటనం గురించి మిగతా జ్ఞ్యాపకాలతో మళ్ళి కలుద్దాం. 

5 comments:

మురళి said...

భానుగారూ మీరు చదివిన నవల పేరు 'ఆవాహన' ముదిగొండ శివప్రసాద్ గారిదే..
మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి..
http://sahiti-mala.blogspot.com/2009/11/blog-post_15.html

Anonymous said...

అనుపమ అనుకుంటాను. రచయిత ఆయనే. ఏదో మాసపత్రిక అనుబంధనవలగా వచ్చిన గుర్తు.

భాను said...

@మురళిగారు

థాంక్స్ అండి ఆవాహన పేరు తెల్పి మంచి సమాచారం ఇచ్చారు. సాహితి గారు కూడా పాపం బాగానే కష్టపడ్డారు. ఎనిమిది సంవసతరాలు వెతికానని రాసారు. వారికంటే శివప్రసాద్ గారే ఇచ్చారు .ఇప్పుడు నేను వెతకాలి దొరుకుతుందో లేదో .

@అనానిమస్ gaaru

థాంక్స్ అండి

జ్యోతి said...

ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుందిగా..

భాను said...

@జ్యోతి గారు

నాకు ఇప్పటివరకు పేరు తెలీదు. విశాలాంధ్రా లో వాళ్ళ ని రచయిత పేరు చెప్పి అడిగితె అక్కడ ఉన్నాయి చూసుకో మంటారు. అవి సరిగా దొరకవు. వాళ్ళు ఓ పద్దతిగా బుక్స్ పెట్టరు. , విశాలాంధ్ర లో అడగాలి.మీ సలహాకు థాంక్స్