Sunday, February 27, 2011

వేరే లోకపు బాలలం...మనోచైతన్య


వేరే లోకపు బాలలం అంటూ ఆ పిల్లలు చేసే నృత్యాలు, వాళ్ళ ఆటలు, పాటలు నిజంగా చూస్తుంటే ముచ్చటేస్తుంది. వీళ్ళంతా మానసిక వికలాంగులు. వాళ్ళను చూస్తె అలా అనిపించలేదు. మామూలు పిల్లల్లాగే కనిపించారు.  వాళ్ళ ముందు అన్నీ సరిగ్గా ఉన్న మనం వికలాన్గుల్లా    అనిపించింది.  ఎప్పటి నుంచో ఈ వికలాంగుల పాటశాల వెళ్లాలని మనసులో ఉన్నా , ఆ కోరిక చివరికి ఈ మధ్య ఆ పాటశాల వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ కుమార్ గారు పిలవగానే సంతోషంతో వెళ్ళా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కృష్ణకుమార్ గారు " మనోచైతన్య " పేరుతొ కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో ఏర్పాటు చేసి, మానసిక వికలాన్గులయిన  ఈ పిల్లలకు చేస్తున్న సేవ శ్లాఘనీయం.

 మానసికంగా  ఏదో ఒక లోపంతో వయసు ఎదిగినా, మనసు ఎదగక  చిన్న పిల్లలవలె తల్లి తండ్రులకు కూడా భారంగా ఉండే ఈ పిల్లలను  ఒక్క దగ్గర చేర్చి వారి మానసిక ఎదుగుదల కు తోడ్పడుతున్న కృష్ణ కుమార్ గారు అబినందనీయులు.   ఇక్కడ ఈ విద్యార్థులకు చదువే కాక, ఆట పాటలు , శాస్త్రీయ నృత్యాలు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు , ఇవే కాకుండా ఈ పిల్లలకు  శిక్షణ ఇవ్వగా ఇప్పుడు వాళ్ళు లాంగ్  నోట్ బుక్స్, కవర్స్, ఫైల్ ప్యాడ్స్, క్లిప్ ఫైల్స్ , స్వీట్ బాక్స్ లు, మొదలగునవి  ఎన్నో వీళ్ళ చేతుల్లో తయారవుతున్నాయి. వీటిని తయారు చెయ్యటమే కాదు, డబ్బు రూపంలో దానికి దగ్గ ప్రతిఫలం కూడా పొందుతున్నారు.  మనో చైతన్యం అంటే స్తబ్దతగా  నున్న మనస్సును చైతన్యం చెయ్యడం.  స్తబ్దత తో  ఉన్న వీళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో  మార్పు తీసుక వచ్చి ఇలా చెయ్యడం నిజంగా నిర్వాహకులను మెచ్చుకోదగ్గ విషయం. " మనో చైతన్య"  గురించి ఈ వీడియో లు చూడండి. వివరాలకు http://www.manochaitanya.in/ సందర్శించండి.





Thursday, February 24, 2011

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

ఓ పాపా లాలి చిత్రంలో బాలు పాడిన "breath less song" మీరూ మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చెయ్యండి. బాలు మరియు ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ఓ చక్కని అందమయిన పాట ఇది.నాకు తెలిసి తెలుగు లో వచ్చిన breath less సాంగ్ ఇది ఒక్కటే అనుకుంటా.




మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా (2)

వెన్నెలల్లె పూలు విరిసి తేనేలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంట రా
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు


చిత్రం : ఓ పాప లాలి
గానం : ఎస్ పి బాలు 
సంగీతం : ఇళయరాజా 




Saturday, February 19, 2011

కళ జమునాయె.....కళ నిజమాయె

రచన మాస పత్రికలో " పిల్ల కోతి కిచ కిచలు" అని ఈ నెల మాస పత్రిక నుంచి " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచిక విశేషాలు పంచుకుంటున్నారు. మహా మహుల్లాంటి సంపాదక వర్గం తో తీర్చి దిద్దిన "జ్యోతి" కుర్ర కారునే కాక ఇంటిల్లిపాదిని ఆ రోజుల్లో ఆకట్టుకుందట. రచన "శాయి" గారు జ్యోతి రుచులను ఒక సంచికలో  కాకుండా  " పిల్ల కోతి కిచ కిచలు" అనే శీర్షికన ధారా వాహిక గా ప్రచురిస్తున్నారు. మంచి సాహిత్యం పట్ల జిహ్వ చాపల్యం ఉన్న వారందరినీ ఈ షడ్రుచులు తనివితీరా అలరిస్తాయని శాయి గారు తెలియ  జేస్తున్నారు. మరి మీరు ఆస్వాదించండి. 1963 లో ఆవిర్భవించిన " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితమయిన " కళ జమునాయె....కళ నిజమాయె" అన్న ఫోటో ఫీచర్ ఇక్కడ మీకోసం.. మీరూ చూసి ఆనందించండి.  చిత్రంలో ఉన్నది కూడా బాపు గారనుకుంటా.

                     ( రచన మాస పత్రిక సౌజన్యం తో మరియు శాయి గారికి ధన్యవాదాలతో )
















 


Friday, February 18, 2011

పడమటి కోయిల పల్లవి...యండమూరి



ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్, షెల్లీ , కీట్స్, కొలరిద్జ్  లాంటి  ఆంగ్ల మహా కవుల కవితల్ని తెలుగు లోకి అనువదించి మనకందించిన కవితా సంకలనం ఈ  " పడమటి  కోయిల పల్లవి " . ఇందులో యండమూరి అనువదించినవే కాకుండా " తీయ తెనుగు అనుపల్లవి" పేరున కొన్ని ఔత్సాహిక రచయితలూ రాసిన కవితలు కూడా " ప్రేమ" ముఖ్యాంశంగా ఉన్నవి చివర్లో అందించారు. ముందు మాట లో యండమూరి " ఈ కవితల్ని కళ్ళతో చదవకండి, మనసుతో చదవండి. కొన్ని  వాక్యాలు మనల్ని నిలబెట్టేస్తాయి..  ఆ కవులు ఎంత మథనపడి , ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్థమవుతుంది. వీటిని ఒంటరిగా ఉన్నప్పుడే చదవండి"  అని అంటారు. చదువుతుంటే అన్నీ  అల మనసుకు హత్తుకు పోయేవే. మచ్చుకి అందులోనుంచి కొన్ని మీకోసం.

" హేమంతాగమనానికి క్షీర సాగర మద్యాన శ్రీ హరి చలికి వణుకుతుంటే - శ్రీ కుచంబులు అభయమిచ్చాయట
 ఇక్కడ..
పూల మకరందం నీ పెదాల నడిష్టించి ఆ పీయూష దారాల్ని దోచుక పోతున్నాయి."// రెండాకుల మధ్య చినుకు పుట్టినట్లు//పరుచుకునే పెదాలపై నీ పల్చటి చిరునవ్వు// ముద్దు వద్దనే అబద్దానికి ఓ ఆకాశాన// ఆపై జరిగేది నీ బిదియంతో నా ఆవేశం  సంఘర్షణ//( వద్దనకు ఈ ముద్దు)

నిజమయిన ప్రేమ రగులుకునే జ్వాలైతే
హృదయ స్పందనను తర్జుమా చేసి
మనోగతాన్ని ప్రతిఫలిమ్పజేసే అగ్నికీల తృష్ణ  (పునాది)


భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవడమే ఆనందమైతే
జీవితం గతాన్ని పొగుడుతున్దేమి !
నా కంటే ముందు మేల్కొని నా తరువాత నిదురపోయే జ్ఞాపకం
నిత్యం నా ఆలోచనలతో ఆడుకుంటూనే వుంటుంది   (జ్ఞాపకమే ఆనందమా)

అద్బుతమయిన అందాలను చిందించే పర్వతపు అంచులలో
ఎర్రని జ్వాలలా.......
అమ్మ నుదుట మెరిసే కుంకుమ లా......
చెల్లి జడలోని గులాబి పువ్వులా
అలవోకగా విశ్రమిస్తుంది
సంధ్య    (సంధ్య)


రాటు తేలిన నీ కంటం // ప్రమాదం ఏమి లేదుగా అంటుంది// నెలని రెండు గా చీల్చటంలో అనుభవమున్న నేను //లేదు అని జవాబిస్తాను
రోజులు తమదైన పంథాలో దొర్లిపోతూ వుంటాయి//రోజులు కేవలం రోజులే // అవి దేనిని ఆశించవు//రుదిరాభిషేకంతో నిత్యం//పరిశుద్దమయ్యే వాహిక గుండా//
పవిత్రంగా పరుగెడుతూ గర్భ గుడి చేరాలని//..మనం చింపే దుప్పట్లు....చీరెలో// ఉయ్యాలలుగా మారాలని ,//వాటిలో తాము నివసిన్చాలనీ//ఉత్శాహించే నా సజీవాక్రుతుల్ని//నీరు కార్చేస్తూ మనం చెలరేగిపోతాం//రోజులు తమవైన పంథాలో దొర్లిపోతుంటాయి//అవి దేనిని ఆశిన్చావు// మనం మాత్రం మళ్ళీ//
నెలను రెండుగా చీల్చటం  కోసం// ఆవేశం తో ఉద్యమిస్తూ ఉంటాం  ( సేఫ్ పీరియడ్)

అతనిని లొంగ దీసుకోవదమేలాగో// ఆమె నేర్చేసుకుంది// అసంకల్పితంగానైన అసంగాతంగానైన // జీవితాంతమూ ఆమె దగ్గర ఏడుస్తూ అతను// (ఈవ్)

హృదయాన్ని  రాగ రంజితం చేసే స్వరాలాపన మరణించినా//జ్ఞాపకాల్లో అది కంపిస్తూనే వుంటుంది.//మొగలి పూలు వడలిపోయినా//
గుండెల నిండుగా ఆ సౌరభాలను పీల్చుకున్న// అనుభూతి నిత్యం ఓ పారిజాత పుష్పమై వికసిస్తూనే వుంటుంది//
మరణించిన గులాబీ పూల రేకులు కూడా//ప్రేమికుల పానువులుగా అమరుకున్తున్నాయి// నీవు నశించినా నీ ఆలోచనలు
నా ప్రేమకు పీటాన్ని వేసి కూర్చో బెడుతున్నాయి//  (అజరామరం)

 ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువ్వు లేనప్పుడు  నవ్వుని
నువ్వున్నప్పుడు కాలాన్నీ
పారేసుకోవటం   ( అంటే కదా మరి)

ఒక తల్లి చెంపమీద
జీవనదిలా ప్రవహించే కన్నీటిని
గాలి తెమ్మెర సుతారంగా స్పర్శించి అన్నది
ఎందుకమ్మా ఈ దుక్కం
పదేళ్ళ కరటం ఊపిరి పోసుకున్న కొడుకు కోసమేగా
అతనికేం స్వర్గంలో రారాజులా ఉన్నదే అని
అప్పుడా కన్నీరంది
" ఓ పిచ్చి తెమ్మెర! ఈమె
దుక్కం పదేళ్ళ క్రితం ఊపిరి పోసుకున్న కొడుకు గురించి కాదు,
అదే సమయాన పుట్టిన ఒక తల్లి గురిచి అని  


అందరి మధ్యా వున్నప్పుడు
అకస్మాత్తుగా నువ్వు గుర్తొచ్చినప్పుడు
మరీ మరీ గుర్తొచ్చినప్పుడు
గుర్తొచ్చి దిగులేసినప్పుడు
ఆ దిగులుకి కారణం
వాళ్లకి చెప్పటం కోసం
వెతుక్కోవటం ఎంత కష్టం  (నీ కేం తెలుసు)
 

జీవించు - నేర్చుకో- అందించు ....తుమ్మేటి రఘోత్తం రెడ్డి




ఆంగ్లంలో కొటేషన్ల పై అనేక పుస్తకాలు వచ్చాయి . అలాగే తెలుగులో కూడా వున్నాయి .కానీ ఒక తరంలో ప్రోది చేయబడ్డ జీవన జ్ఞానాన్ని  సాహితి సృజనలో పాల్గొన్న వ్యక్తి తన జీవిత అనుభవాల సారాన్ని, క్లుప్తంగా రాసిన వాక్యాల్లో , ముందు తరాలకు అందించాలన్న దృక్పధంతో రాసినది "జీవించు-నేర్చుకో- అందించు (యువతకోసం) " అన్న ఈ చిన్ని పుస్తకం.  తన తరువాత తరంకోసం,  మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, తన కెదురైన జీవిత అనుభవం లోనుంచి  అలాగే కొన్నివేరెవరో  చెప్పినవి, తన ద్రుక్పదానికి అనుగుణ మయిన మార్పులు చేర్పులతో రచయిత మనకు అందించారు.

ప్యాకెట్ సైజులో సుమారు 20 అంశాలపై అంటే జననం నుండి మరణం వరకు అనేక అంశాలపై చాల చక్కటి వాక్యాలు క్లుప్తంగా రాసారు. వరుసగా చదవాల్సిన అవసరం లేదు.ఎ పేజి అయిన తెరిచి ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు.ఎక్కడైనా ఆపవచ్చు.కాలక్షేపానికి అనుకొండి  లేదా మనసు బాగోలేనప్పుడు ఓ సారి  అలా  ఏదోఒక పేజీ  తెరిచి ఆ వాక్యాలు చదివితే ఏదో ఒక ఇన్స్పిరేషన్ , మన మనసులో ఏదో మార్పు కలగక మానదు .దీన్ని "టీ పాయ్ " బుక్ అనవచ్చు. మనకు తోచనప్పుడల్లా ఓ  పేజి తెరిచి చదవచ్చు.ఎన్ని  సార్లు  చదివినా సమయాన్ని బట్టి ఓ కొత్త ఆలోచన,  కొత్త భావం కలిగిస్తాయి

గత ౩౦ ఏళ్లుగా తెలంగాణా జీవితాన్ని,పోరాటాల్ని,విభిన్న ద్రుక్పధం తో తన అనుభవాలతో  మనకు కధలుగా అందించిన రఘోత్తం గారు , నేనేవరికోసం రాయాలి అని సూటిగా ప్రశ్నించుకొని, కొడుకు తిలక్ కోసం ఈ తరం యువత కోసం , తన అనుభవాలతో  తన సాహితి జ్ఞానంలోనుంచి  ముందు తరానికి పుస్తకరూపంలో ఇచ్చిన సలహాల కూర్పు ఈ పుస్తకం. "నేనేరిగినంత మేర  జీవితం గురించి సూక్షంగా , నాఅనుభవం లోనుంచి  నేను రూపొందిన్చుకొన్న అభిప్రాయాలు" అంటారు చివర్లో రచయిత .

పాటశాల విజ్ఞానాన్ని  నేర్పితే, సాహిత్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది  అంటారు, ఈ పుస్తకంలో రఘోత్తం  గారు ఒకచోట, నిజమే ఈపుస్తకం మన జీవితం పై  మనకు కొంత అవగాహన, మరియు  జ్ఞానం  ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మనకు జ్ఞానాన్నే   కాదు అక్కడక్కడ కొన్ని చురకలు కూడా అంటిస్తారు. అందరు తప్పకుండ చదివి దగ్గర ఉంచుకోవాల్సింది ,ఈ చిన్న అమూల్యమైన  పుస్తకం.

Tuesday, February 1, 2011

మంచుపూవు....కాశీభట్ల వేణుగోపాల్



నేనే..హంతో భారత్ నారీ హై...ఈజింటిట్ రీమాజీ..? యాంటి కాలంలో ఆంటీ కామెంట్లు..డే..డే..శోభాడే..భాడే..బాదుడే..ఒక్కో కాలంకెంతిస్తారో...కుశ్వన్తసింహ  పేరు కంటేనా? బూతెక్కువైతే అంకెలెక్కువైతాయి...అంకెలు సంకెళ్ళు..బందీ..భవానీ విడుదలౌతాడా ! భవానీ ఎరుపా? ఎర్ర మల్లెలు ..మల్లెలు..మల్లెలు..మళ్ళీ మల్లిక ఈ రోజు కనిపించిందా  ? ....రామదాసూ ...అయామ్సారీ...నువ్వా జైల్లో..మేమీ జైల్లో..లో..లోహలో..లోయలో...లోయలో జైలుందా...ఎత్తైన ఎతాసుకొండ కిన్దుంది  జైలు శ్రీ శ్రీ మోహబ్బత్ ఖాన్ కథ లోని రాజుగారి శాసనం అక్కడ అమల్లో వుంది... బాగోతుల తిక్క శంకర శాస్త్రి కేం తెల్సూ..శ్రీ రంగాన్ని ఛీ అంటం తప్పా..? ఛీ ఛీ కోటి లాఫ్టింగ్ హ్యుగ్ డూలిట్టిల్...ఛీ ఛీ డ్యాబ్ డ్యాబ్ , గబ్ గబ్,పుష్మీ పుల్యూ...ముందు వెనక తలలే అయితే ఎలా?...నిజంగా జంతువులన్నీ మాట్లాడితే ఎలా వుంటుందో....నే మాట్లాడుతున్నాగా...? ష్..ష్...ష్.....

చైతన్య స్రవంతి...  స్ట్రీం ఆఫ్ కాన్షియస్ ... ఆధునికత లో భాగంగా కాల్పనిక నవలా రచనలో ఇదొక ముఖ్య ప్రయోగంగా విమర్శకులు గుర్తించారు. ఈ తరహా సాహిత్యం అంటే .. ఒక పాత్ర మనసులో వచ్చే ఆలోచనా స్రవంతి, అది ఎలా వస్తే  అలాగా ఒక ప్రవాహంలా చిత్రించే రచనా పద్ధతి . మనిషి మెదడులో మెదిలే ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాల దొంతరలు, అడ్డూ అదుపు లేని అక్షరాల ప్రవాహం. మనసుకు ఏది తోస్తే అది , ఏది గుర్తుకు వస్తే అది, ఇలా ఒక లెక్చరర్ పాత్ర చెప్పే కథే ఈ మంచుపూలు నవల. కాశీభట్ల  రాసిన ,ఒక విలక్షణ  శైలితో సాగిన ఈ నవల  నేను చదివాననడం కంటే చదివించింది అంటే సబబేమో..  ఇంకా చెప్పాలంటే ఆ మనసుతో,  ఆ పాత్రతో,  ఆ పాత్ర ఆలోచనలతో,  ఆ అక్షర ప్రవాహంలో కొట్టుకొని,  ఆ ఝరిలో మనమూ పరుగెడ్తూ, అలసి సొలసి ఊపిరి తీసుకోకుండా నవల చివర అక్షరం వద్ద మాత్రమె ఆగుతాం. ఎప్పుడో కొన్ని సంవత్చరాల క్రింద ఇండియా టుడే లో కాశీభట్ల గారి కథ ఒకటి చదివా. పేరు , కథ ఏది గుర్తు లేదు, గుర్తున్నదల్ల ఆ శైలి. అప్పడు అది చైతన్య స్రవంతి తరహా అని తెలీదు. ఆ తర్వాత నవీన్ అంపశయ్య చదివాక దాని గొప్పదనం తెలిసింది. ఆ తరహా శైలి లో రాసిన మంచుపూవు నవల గురించి నా ఈ పరిచయం. కథ ఉత్తమ పురుషలో కొనసాగుతుంది.  ఇక ఈ రచన గొప్పతనమేంటంటే నవల మొదలు పెట్టాక అది ముగించేదాకా మనం లేవం.

  మన కథానాయకుడు ( ఎక్కడా అతని పేరు లేదు) భార్య కావేరి ఏడేళ్ళ క్రింద చనిపోతుంది. అప్పడు అతనికి ఒక కూతురు ప్రియ వయస్సు అయిదేళ్ళు. కథ ప్రారంభమయ్యే సమయానికి ఆ అమ్మాయి వయస్సు పన్నెండేళ్ళు. ఆ పాప లో అతనికి భార్య పోలికలు, భార్య అలవాట్లు అనుక్షణం కనపడుతూ వుంటాయి. అమ్మాయి రజస్వల అయి బాల్యం లో నుండి యవ్వనపు చాయలు సంతరించుకుంటుంటే ఇతనికి ఆ పాప ఒక మినిఏచర్  కావేరి లా కనిపించి అతని ఆలోచనల్లో విశృంఖలత, ఒక వాంఛ, అతన్ని అతలాకుతలం చేసి అతన్ని డిస్ట్రబ్ చేస్తుంటాయి. కావేరి చని పోయాక అతను పెళ్లి చేసుకోడు. ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కూతురు భార్య పోలికలతో ఎదురుగా కనపడి అనుక్షణం  కావేరి ని గుర్తు చేస్తూ చివరికి తనకు తెలీకుండానే ఆమెపై వాంఛ కల్గుతుంటుంది. చివరికి తన ఆలోచనల పట్ల తనకే రోత పుట్టి, ఒక తోడు కావాలని, ఎన్నో రోజులుగా మనసులో ఉన్న ప్రియ టీచర్, మల్లికని  పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరడంతో కథ ముగుస్తుంది.

మనిషి కుండే చేతన, అచేతన స్తితి ల గురించి, ఇవి సముద్రం మీద తేలుతూ వుండే ఐసు బెర్గ్ తో పోల్చి చెబుతారు. ఐస్ బెర్గ్ సముద్రం లో తేలుతూ వున్నప్పుడు పదింట ఒక వంతు మాత్రమె పైకి కనపడుతుంది. మిగతా తొమ్మిది వంతులు కనపడకుండా నీటిలో వుంటుంది. ఆ విధంగా చేతన (conscious) ను బట్టి మనకు తెలిసేది మనిషి మనస్తత్వంలో అతి స్వల్పభాగం మాత్రమె. మిగిలిన చాలా భాగం అచేతనలో ఉండి పోయి మనిషికి అంతు చిక్కకుండా ఉండి పోతుంది.చేతన లో ఉండేవి హేతువాదానికి, సామాజిక కట్టుబాట్లకి సంబంధించిన భావాలు. వీటికి అచేతనకి సంబంధం లేదు.అందులో వుండే కోర్కెలు హేతు వాదానికి గాని , సామాజిక నీతులకు గానీ సంబంధించినవి కావు. మనిషి యొక్క ఆదిమ కాలం నాటి వాంఛలన్నీ అందులో చోటు చేసుకుంటాయట  . ఇదంతా ఎందుకంటీ దీనిలో మన కథా నాయకుడి మనసులో కలిగే ఆలోచనలు అలాంటివే అనుకుంటా. ఎందుకంటే వావి వరసలు మరిచి పోయి ఒక తండ్రి కూతుర్ని వాన్చిచడం జరుగుతుందా?  అస్సలు ఇదీ ఒక రచనేనా అంటే మనం రోజూ నిత్యం పత్రికల్లో చూస్తుంటాం. కూతుర్ని రేప్ చేసిన తండ్రి.  ఇలాంటివి ఎన్నో.  ఇలా మనసులో ఉన్నమనకే తెలీని  చీకటి కోణాలని   బయట పెట్టటమే రచయిత ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఇది మంచా చెడా దీన్ని మనం ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అన్నది  మీకే వదిలేస్తున్న.  ఈ నవలపై నేను ఎలాంటి అభిప్రాయం చెప్పబోవట్లేదు.  ముందు మాటలో గుడిపాటి గారు చెప్పినట్లు " మనిషి లోపలి ఇలాంటి పార్శాల్ని గురించి రాయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తారేమో. ఈ నవల అంతర్, బహిర్ ప్రపంచాల్లోని అలజడిని , సంక్షోభాన్ని,సంక్లిష్టతలని    చిత్రించింది.వీటిలోని వైరుధ్యాలున్నాయి, అన్నిటిని ఆమోదించలెం    , అన్నిటిని తిరస్కరించలెం  .కానీ మనం చూడడానికి ఇష్టపడని, అస్సలు మాట్లాడడానికి ఇచ్చగించని  వాస్తవాల్ని చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితపు చీకటి కోణాలపై ప్రసరించిన టార్చిలైట్ "మంచుపూవు". ఆ చీకటి కోణాలని దర్శించే తెగువ ఉన్నవారు మాత్రమె ఈ నవల లోకి వెళ్ళడం మంచిది.