అందరికి సరస్వతి దేవాలయం అనగానే " బాసర" గుర్తొస్తుంది. మీకిప్పుడు ఇంకో సరస్వతి దేవాలయం గురించి పరిచయం చేస్తాను. ఇదే "శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయము ". ఇది హైదరాబాద్ నకు సుమారు 45 కి.మీ. దూరములో రాజీవ్ రాహదారి పై , కరీంనగర్ వెళ్ళు దారిలో , మెదక్ జిల్లా నందు వర్గల్ అను ఊళ్ళో (మండలం) కలదు. రాజీవ్ రహదారి పై వర్గల్ x రోడ్ నుండి ఈ ఆలయం సుమారు ౩ కి.మీ. దూరం లో ఓ చిన్న గుట్టపై ఉంది. గుట్టపై చాలా ప్రశాంత మయిన వాతావరణంలో నిర్మిపబడిన ఆలయం కనులకు విందుగా ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయం కాకుండా, లక్ష్మీ సమేత గణపతి ఆలయం, శని దేవాలయం కూడా ఒకే ప్రాంగణం లో కలవు. హైదరాబాద్ కి దగ్గరగా ఉండుట వల్ల , సెలవు రోజులలో ,ముఖ్యంగా ఆదివారాలు ఇక్కడ రద్దీగా ఉంటుందట. మిగతా రోజుల్లో అంతగా రద్దీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నట్లు ఇక్కడ బస చేయాలనుకునే వాళ్ళ కొరకు వసతి గదులు కూడా ఉన్నాయి.
ఈ ఆలయం గురించి , అక్కడ ఉద్యోగులను విచారించగా, శ్రీ చంద్ర శేకర శర్మ అనబడే సిద్దాంతి ( ఇతను రైల్వే లో ఉద్యోగ విరమణ చేశారట) గారి కల్లో కి అమ్మవారు వచ్చి ఈ ప్రదేశం లో ఆలయం నిర్మింప జేయమని చెప్పారట. అప్పుడు వారు 1992 లో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని దీన్ని అభివృద్ధి చేశారట. ఈ ఆలయం ఇప్పుడు కంచి కామకోటి పీటం వారి ఆధ్యర్యంలో ఉంది. ఇంకా ఆలయ పూజారులు తెలియజేసిన ప్రకారం, గత నాలుగేళ్ళుగా ఈ ఆలయం గురించి జనం లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే భక్తులు ఎక్కువయ్యారట. ఇక్కడ అక్షరాభ్యాసం, ఇంకా అనేక రకాల పూజలు చేస్తారు. ముఖ్యంగా రాత్రి ఆలయం మూసివేసే ముందు అమ్మవారికి అయిదు హారతులతో చేసే హారతి చూడవలసిందే, మాటల్లో చెప్పలేము. ఇది తప్పకుండా దర్శించవలసిన ఆలయం. మీ కొరకు ఆలయ చిత్రాలు చూడండి. ఈ ఆలయం వెబ్సైట్ " www.srivargalvidyasaraswathi.org" . మెయిల్ అడ్రస్ " info@srivargalvidyasaraswathi.org".
0 comments:
Post a Comment