Saturday, January 8, 2011

తీరని కోరిక


తెల్లవారు ఝామున లేచి ఆరు బయటకు వచ్చా. ఒక్క   సారిగా చల్లటి గాలి రివ్వున ముఖాన్ని ఉక్కిరి బిక్కిరి  చేసింది. చల్లగా చలి వణికిస్తుంది.  ఇష్టం అయ్యింది ఏదీ కష్టం కాదనుకుంటా! కొద్దిసేపటి తర్వాత అది వణికిస్తున్నట్లు  లేదు. నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు....ఎన్నో రోజుల తర్వాత కలిసిన ఆప్త మిత్రుణ్ణి కౌగిలించుకున్నట్లు, తాదాత్మ్యతతో ....పక్కింటి లో నుంచి అలా గాల్లో తేలూతూ వస్తున్న నైట్ క్వీన్ల పరిమళాలు, ఇంటి ఎదురుగా గన్నేరు చెట్టు కిల కిల నవ్వులతో ,విరబూసిన గన్నేరు పూమొగ్గల పలకరింపులు....అప్ప్దప్పుడే తొలిగి పోతున్న  మంచు దుప్పటి......



                                           ప్రతి కుసుమముకుళ మ్మొక రక్త కణము 
                                           కోమలీ రాగ రంజితాంగులిక  వోలె

అని గాలిబ్ గుర్తొచ్చాడు. ప్రతీ పూల మొగ్గ, రక్త కణంగా  కనిపిస్తున్నదట, ఎర్రగా కనపడుతున్న  ప్రతీ కుసుమ ముకుళం ప్రియురాలి రాగ రంజితమయిన  వ్రేలి వలె ఉందిట. పూమొగ్గలు ఎరుపు రంగద్దిన కోమలమయిన అంగులికతో పోల్చిన గాలిబ్....... 

అల  మెట్లెక్కి , దాబాపైకెక్కి అక్కడే కూర్చున్నా..ఒక్క క్షణం కళ్ళు మూసుకొని , గట్టిగా ఒక్కసారి  ఊపిరి పీల్చుకుంటే ,   చల్లగా కడుపు నిండిన అనుభూతి. వర్ణించలేని అనుభూతి అంతేనేమో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా కనిపిస్తాయేమో. దూరంగా ఎక్కడో ఎవరో చలి కాగుతున్నారు. ఒక్కసారిగా జ్ఞాపకాలు  వెనక్కి....సంవత్సరాల వెనక్కి....

ధనుర్మాసం... తెల్లవారుఝామున  లేచి రాత్రి కప్పుకున్న చద్దరు వేడిగా అలాగే చుట్టుకొని, ఇంటిముందుకు వస్తే, నెగడు కాగుతున్న జీతగాళ్ళు, తాతయ్య, వాళ్లతో జత కల్సి వేడి వేడి గా చలి కాగుతూ.. ఓ పక్క నించి తాతయ్య వేపపుల్ల చేతికందిస్తే, నోట్లో వేపపుల్లతో, ఎదురుగా వేడి వేడి గా చలిమంట, దూరంగా గుడిలోనుండి వినపడుతున్న సుప్రభాతం,....పనివాళ్ళ నోట్లో నుండి వినపడుతున్న పల్లె పదాల మాధుర్యం......ఇంట్లో నుంచి అమ్మమ్మ మడితో  ఆ గోదా దేవి కి శ్రద్దగా పూజ చేస్తూ iశ్రావ్యంగా చదువుతున్న పాశురాలు ఓ పక్క చెవులకు ఇంపుగా వినపడుతుంటే....ఈ లోపల నేనున్నానంటూ సూర్య భగవానుడు తన లేలేత ,నును వెచ్చని కిరణాలతో మనల్ని, బాగున్నావా... ఎలా ఉన్నావ్ మిత్రమా అంటూ అందంగా పలకరిస్తుంటే......అద్వితీయమయిన  అనుభూతి.

ఒక్క సారిగా పక్షుల కిలా కిలా రావాలతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచా....పక్షుల కిలా కిలా రావాలు..అప్పుడే ఎర్రగా పైకి వస్తున్న భాల భానుడు, లేలేత కిరణాల నును వెచ్చదనం దేహాన్ని తాకుతుంటే...."భానోదయాన చంద్రోదయాలు" ఎవరో మన సినీ కవి అన్నాడు. విచిత్రం గా ఉంది కదా! సూర్యుడు కూడా గాల్లో దీపమంట...  వేర్లలోనించి  పుట్టుకొచ్చిన కొమ్మల్లా, నిశ్శబ్దంలో నించి అన్ని శబ్దాలు పుడతాయట...అలా నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి  ఒక్కసారిగా శబ్దం లోకి....ఓ పక్క నించి రజనీగంధ..లిల్లీ , వాటినుండి వెలువడే కమ్మని వాసన, రజనీ గంధ అంటే రాత్రికే సౌగంధమట.   "  సాస్ తేరే మదిర్ మదిర్, జైసే రజనీగందా//ప్యార్ తేరా మధుర్ మధుర్, చాందినీ కే గంగా " నీరజ్ అనుకుంటా ఎక్కడో చదివిన జ్ఞాపకం చుట్టుముట్టింది. అలా కళ్ళు మూసుకొని ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో మెదులుతుంటే, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ అనుభవించాలని  ఓ వెర్రి కోరిక....రోజూ అందులో తాదాత్మ్యత చెందాలన్న ఓ తీరని కోరిక......అంతే మన జీవితాలు, యాంత్రికత కి అలవాటుపడ్డ జీవితాలు....అలా వెళ్ళ దీస్తున్నాం అంతే కదా..

అన్నీ కృత్రిమ ఉదయాలే....సెల్ ఫోన్ మోతలతో కళ్ళు నులుముకొని  , ఎవరు చేశారో , ఆ నిద్ర మత్తులో సరిగా కనపడక హలో..హలో అంటూ పలకరింపులతో ప్రారంభమయి  ..  పడక పయినే వార్తా పత్రికల శోధన, టి.వి. లో నిన్నేమయ్యింది, ఈ రోజున ఎం జరుగుతుందో.. బ్రేక్ న్యూస్ ల పరంపర, జీవితమే ఓ బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఎన్నో అనుభూతుల్ని కోల్పోతున్నాం ఈ యాంత్రిక ప్రపంచం లో పడి.  అందుకే ఆ వెచ్చటి ఉషోదయాలు. ఆ తెల్ల వారుఝామున అందాలు , ఆ రజనీ గంధ సౌరభాలు రోజూ ఆస్వాదించాలని,  ఓ వెర్రి కోరిక.. ఓ  తీరని  కోరిక. 

8 comments:

మురళి said...

చక్కని టపా... ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నన్ను...

భాను said...

@మురళి గారూ
నిజంగానా.... ధన్యవాదాలు మురళి గారూ

tnswamy said...

మీ అనుభూతిని చదివి మా జీవితం లొ కూడా ఇలాంటి అనుభూతులు ఎక్కడైనా ఉన్నాయేమోనని వెదికాను. ప్చ్

అశోక్ పాపాయి said...

అవునండి నిజంగానే కోల్పోతున్నాం. మరోలోకం చూపెట్టిన మీ అందమైన ఆలోచనలు ఉషోదయనికి చక్కని రూపాలతో దర్శనమిస్తాయి.బాగుంది

Hima bindu said...

బాగుందండీ .ప్రతిరోజు కనీసం పది నిమిషలయినాఇలాటి అధ్బుతాన్ని రోజుకి సరిపడా పదిలపరుచుకుంటానండీ

భాను said...

@స్వామి
ఈ అనుభూతులు వాటంత అవి వచ్చేటివి కావనుకుంటా, మనం వాటిని వెతుక్కుంటూ వెళ్ళవలసిందే. ఏమంటావ్ :)
@ అశోక్
నిజంగా మీకు మరో లోకం చూయిస్తే అంతకన్నాన. ధన్యవాదాలు
@ చిన్ని
మీరు అదృష్టవంతులు, ఎప్పుడూ అనుకోవడమే కానీ బద్ధకం, అలసట, వత్తిడి, వీటిని అధిగామించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు

Anonymous said...

భానూ
చాలా బాగుందండి. అలా ఒంటరిగా కూర్చుని, వేడి వేడి కాఫీ తాగుతూ (నాకు), ఎక్కడికో జ్ఞాపకాలలోకి వెళ్ళిపోవటం ఎంత బాగుంటుందో కదా.. కానీ, మీరన్నట్టు మనవి ఇపుడు ఉరుకులు పరుగుల జీవితాలు. ఒక్కసారి మనసుని ఎక్కడికో లాక్కుని వెళ్ళింది మీ టపా.
పద్మవల్లి

భాను said...

@ పద్మవల్లి
ఔనండి మీరన్నట్లు, వేడి వేడి కాఫీ తాగుతూ , ఉషోదయాలను ఆస్వాదించడం ఒక చక్కని అనుభూతి. నిజంగా నా టపా మిమ్మల్ని ఎక్కడికో లాక్కెల్లితే నా మనస్పూర్తిగా ధన్యవాదాలు