Tuesday, May 31, 2011

ఈ సమస్యకి పరష్కారం ఏంటి?




ఓ నాల్గు రోజులక్రింద నా ముందు నా సీట్లో పనిచేసిన నా ప్రేడిసెస్సర్ నుండి నాకి ఫోన్ కాల్.  సారాంశమేమిటంటే అతనిక్కడ ఉన్నప్పుడు ఇక్కడే మా వద్ద పని జేసే ఓ ఉద్యోగి తన లేడి కొలీగ్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ భార్యని , ఇంటిని పట్టిచ్చుకోవట్లేదు, న్యాయం చెయ్యండి అని ఆ ఉద్యోగి భార్య వచ్చింది , అని అయితే ఇది వ్యక్తిగతమయిన గొడవ, మేమేమి చెయ్యలేమమ్మ అంటే మీరలా అంటే ఈ ఆఫ్ఫిస్ ముందే నేను చచ్చిపోతాను అందట. అప్పుడు ఇదే  విషయం మెన్షన్ చేస్తూ ఓ పోలీసు కంప్లేంట్ ఇచ్చారట. ఇక్కడేమన్న చేసుకుంటే మనం జవాబుదారి కావాల్సి వస్తుంది, చెప్పినా ఏమి పట్టిచ్చుకోలేదు  అంటారు అనే ఉద్దేశం తో.  పోలీసు వాళ్ళుపిలిపించి కౌన్సెలింగ్ చేద్దమనుకుంటే, బయట ఏమయ్యిందో ఏమో తెలియదు కాని, అప్పటికి ఆ సమస్య అక్కడితో ఆగి పోయింది. చివరికి చెప్పిందేమిటంటే ఆమె మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఏమి చెప్తుందో వినండి  అని.  నేనన్నాను మీరన్నట్టు ఇది వ్యక్తిగతమయిన గొడవ, దీంట్లో మనమెలా కల్పించుకుంటాం. అప్పుడు ఆయన, నిజమే, మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆమె ఇంతకుముందు అన్నట్లు ఆమె మన ఆఫీసు లో గాని లేదా ఆఫీసు ముందు గాని ఎమన్నా చేసుకుంటే మనకే సమస్య కదా, ఆమె  మనకేమన్న ఫిర్యాదు చేస్తే అతని పై చర్య తీసుకుంటాం అని చెప్పండి, ఉద్యోగం పోతుందేమో అని  సరిగా ఉంటాడని వాళ్ళ ఉద్దేశం,  అంటే సరే రమ్మనండి , మాట్లాడతాను అని అన్నాను. తెల్ల వారి నేను ఆఫీసు లో ఉండగా ఆమె వచ్చింది. రాగానే    ఏడుస్తూ వేగంగా వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని వదల కుండా ఏడుస్తూ మీరే నాకు న్యాయం చెయ్యాలి అంటూంటే, నేను కంగారు పడి చివరికి ఆమెను కూర్చోపెట్టి , ఓ గ్లాసు మంచినీళ్ళు  తాగించి, కొంత స్తిమితపడ్డాక, చెప్పమ్మా , నీ సమస్య ఏంటి అన్నాను. ఆమె సమస్య ఆమె మాటల్లో.......................

భార్య మాటల్లో.........

మా వివాహం అయి  పద్దెనిమిది ఏళ్ళు అయ్యింది. మాకు ఇద్దరు మొగ పిల్లలు. ఇద్దరూ హాస్టల్లో ఉంటారు. అతను నన్ను సరిగా చూసుకోవట్లేదు. నన్ను నా పిల్లల్ని  పట్టిచ్చుకోవట్లేదు. ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదు. ఓ ఏడెనిమిది నెల్ల క్రింద నుండి, ఆఫీసు లో ఉండే రమ (పేరు మార్చాను) తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏందని అడిగితె తాగి వచ్చి నన్ను ఇష్టమొచ్చినట్టు కొడుతున్నాడు. చివరికి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది, నా ఆరోగ్యం చెడి పోతుంది. సెలవు రోజు పొద్దున్నే బయటికి పోతాడు. ఎలా ఉన్నదాన్ని ఎలా అయ్యానో చూడండి ( అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పాతది చూయించింది) ,ఇంట్లో టిఫిన్ కూడా చెయ్యడు, అన్నం తినడు ,ఎక్కడికి అంటే ఇప్పుడే వస్తాను అని వెళ్లి ఓ రాత్రి వరకు రాడు. రోజూ కూడా ఎ అర్ద రాత్రో వస్తాడు. నాతొ మాట్లాడడు . ఎందుకిలా అంటే కొడతాడు. ఈ మధ్య ఫ్రెండ్స్ తో శ్రీశైలం పోతున్న అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ని తెలుసుకుంటే అవును అన్నాడు. సరేలే ఫ్రెండ్స్ తో కదా అనుకున్న. అక్కడ ఉండగా ఫోన్ చేస్తే, ఫోన్లో ఆడవాళ్ళ గొంతులు, పిల్లల గొంతులు వినపడ్డాయి. ఇక్కడ విచారిస్తే అందరూ కుటుంబాల తో వెళ్లారు. అని. అది కూడా లీవ్ పెట్టింది, అంటే ఈనే దాని తో వెళ్ళాడు. వచ్చాక అడిగితె, నా ఇష్టం నువ్వేమన్నా సంపాయించు తున్నావ, ఉద్యోగం చేస్తున్నావా  అని మళ్ళీ కొట్టాడు. ఇంకోసారి ఇంటికి ఇంకా రాలేదని వెళ్లి ఆ రాత్రి విచారిస్తే , దానింట్లో ఇద్దరూ నగ్నంగా దొరికారు. గొడవ చేసి వచ్చా. ఆ తర్వాత రూం ఖాళీ చేసి ఇంకో చోట ఉంటుందట.  అది భర్త చనిపోతే , అది కూడా ఈ అక్రమ సంబందాల వల్లే , భర్త ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేస్తూ ఇలా వెలగ పెడ్తూంది. ఇతనితో కాక ఇంకో ఇద్దరి ముగ్గురితో కూడా సంబంధం ఉంది అని తెలిసింది. ఈయనేమో నా ఇష్టం అంటాడు.  

నా అన్నలు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నాకు దగ్గరి వాళ్ళు ఎవ్వరూ లేరు. మా మామయ్యా కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నీ కొడుకిలా చేస్తున్నాడు అని చెబ్తే, వాడు మగాడు, వాడిష్టం, పడి ఉండాలి అన్నాడు. నాకు  ఎవ్వరూ లేరు. ఆఫీస్ లో తెలిసిన పెద్ద మనుషులు చెప్పినా వినట్లేదు. ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఎంత సేపూ దాని చుట్టూ తిరుగుతున్నాడు. నేను గొడవ పెట్టి వచ్చిన తర్వాత , అది తల్లిని తీసుకొని నా ఇంటి మీదకు వచ్చింది. నా ఇల్లు ఖాళీ చేయించావు, నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి , ఇక్కడే ఉంటాను అని గొడవ పెట్టింది. అప్పుడు ఈయన ఇంట్లోనే ఉన్నాడు. నేను ధైర్యం చేసి బాగానే గొడవ పెట్టుకున్నాను. నీ మొగుడు  నా దగ్గరికి వస్తే నన్నేం చేయమంటావ్, నీకు దమ్ముంటే వాణ్ని రాకుండా ఆపుకో, నా ఇష్టం, అని గొడవ పడింది, బాగా గొడవ పెట్టి మొత్తానికి దాన్ని వెల్లగోట్టాను. అది పోయిన తర్వాత నన్ను బాగా కొట్టాడు.

 మీకంటే ముందు ఉన్న సార్ దగ్గరికి వచ్చి చెబ్తే, పోలిస్ కంప్లేంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు రమ్మన్నారు.కౌన్సెలింగ్  చేయటందుకు, అందరూ అన్నారు,   అతని ఉద్యోగం పోతుంది రోడ్డున పడతాడు అని, ఉన్న ఉద్యోగం పొతే పిల్లలు, కుటుంబం ఎట్లా అని ఆలోచించి, దగ్గరి పెద్ద వాళ్ళు చెప్పినట్లు, అతను మంచిగా ఉంటానంటే అక్కడికి వెళ్లలే. నా భర్త ఏమి చేశాడో ఏమో గాని, చివరికి వాళ్ళు నన్నే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా  అన్నావు అని కేస్ పెడతాం అని బెదిరించారు. భయపడి మంచిగా ఉంటానన్నాడు కదా అని అప్పుడు ఊరుకున్న. నా కొడుకు నవోదయలో చదువుతాడు, వాడి మార్కుల ను బట్టి హర్యానా లో సీట్ వచ్చింది, పంపియ్యాలంటే బయమవుతుంది, ఇక్కడ నాకు ఎమన్నా అయితే ఎలా అని. ఇప్పుడు అతనిలో ఏమీ మార్పు లేదు. ఇప్పటికి అలానే ఉన్నాడు. నాకు న్యాయం చెయ్యండి, మీరే ఏదయినా చేయండి, లేకపోతె నేను బ్రతకను, చచ్చిపోతాను.నా పిల్లలు అన్యాయమైపోతారు. మీరు  పిలిపించి మాట్లాడండీ. ఉద్యోగం పోతుందని చెప్పండి. మీరే నాకు దిక్కు , ఏదయినా చెయ్యండి. అతనిపై కేస్ పెడదామంటే  ఉద్యోగం పోతుంది, రోడ్డున పడతాం, పిల్లలు అన్యాయమైపోతారు,  ఉద్యోగం పొతే బ్రతకడం ఎలాగా, ఎలా అయినా అతన్ని మార్చండి. 

భర్త చెప్పింది  తర్వాతి టపాలో.........

1 comments:

tnswamy said...

చాలా రోజుల తర్వాత మీ టపా (బ్లాగు) చూసాను.విషయం కంటే కథనం బాగుంది. తర్వాతి టపా కోసం ఎదురు చూస్తూ.......