Monday, July 29, 2013

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు....
ఓ మెరుపులా తటిల్లున మెరుస్తూ
ఆకాశంలో  రంగు రంగుల గాలిపటాల్లా
వినీలాకాశం లో విచ్చుకున్న మెరిసే నక్షత్రాల్లా
ఎన్నో...ఎన్నెన్నో,

అకస్మాత్తుగా
చిరుజల్లులా హృదయాన్ని తడిపేవి
తుఫానులా మున్చేత్తేవి
చూరు నుంచి కారే ఒక్కొక్క బొట్టులా
మెరుస్తూ...ఒక్కొక్కటే
పాయలుగా ..కాల్వలై..అలలు అలలుగా
ఎగిసిపడుతూ
ఎన్నో...ఎన్నెన్నో ,

ఒక నవ్వు
ఒక దుఖం
ఒక స్నేహం
ఒక బాధ 
ఒక అందం
ఒక చిరు స్పర్శ
ఒక హృదయం
ఎన్నో...ఎన్నెన్నో
జ్ఞాపకాలు ..అలల్లా ఎగిసి పడుతూ





Sunday, July 28, 2013

ఒంటరిగా




 పడమటి చెరువులోకి ఇంకుతున్న పగటి జ్ఞాపకాలు
మలి సంధ్య రాత్రి లోకి కరిగిపోతుంటే
రాలిపోయిన ఉల్కలా నువ్వు ఈ విశాల విశ్వంలో కలిసిపోయి ...
నీలాకాశంలో పురివిప్పుకున నక్షత్రాల్లా కోరికలు
ప్రేమ లేని వాంఛ
వాంఛ లేని ప్రేమ 
ఆ రెంటిఅపూర్వ  కలయికలను దోసిళ్ళతో త్రాగిన ఆ మధుర స్మృతులు
నన్ను గతం లోకి నేట్టేస్తుంటే
మనస్సులోని ప్రేమ
శరీరం లో జనించే కోర్కెలు
నిశ్శబ్దంగా నిశీధి లో కరిగిపోతుంటే
ఈ నిశి రాత్రిలో నిన్ను వెతికి వేసారి
ఒంటరిగా...
నిరాశా నిస్పృహలతో
తొలిసంధ్య వెచ్చని కిరణాల్లోకి
మళ్ళీ ఇంకో రోజులోకి నా పయనం నువ్వు లేకుండా




ఒంటరిగా...

Sunday, April 7, 2013

ఓ బొంత సృష్టించిన తుఫాను




ఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది. పాత్రలన్నీ చాలా కాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అని అంటారు. కథలు ఉర్దూ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి సత్యవతి గారి అనువాదం చక్కగా తెలుగు రచన లాగే ఉండడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి.
ఈ సంకలనం లో “లిహాఫ్” మొదలుకొని మొత్తం 15 కథలున్నాయి. ఇక్కడ “లిహాఫ్” అనే వివాదాస్పద కథ గురించి మీతో పంచుకుంటా. లిహాఫ్ అంటే రజాయి. దూదితో బాగా దళసరిగా కుట్టిన బొంత-బాగా చలిరోజుల్లో కప్పుకుంటారు. ఈ కథ ఓ స్త్రీ చిన్ననాటి స్మృతుల రూపం లో మనకి చెబుతూ ఉంటుంది. ఆమె స్మృతుల్లో రజాయి లో వెచ్చగా పడుకున్నప్పుడల్లా దాని నీడ గోడ మీద ఒక ఏనుగులా కదులుతూ ఆమెను గత స్మృతుల్లోకి లాక్కెళుతుంటాయి.
 సారంగ వెబ్ వార పత్రిక లో నా కథా పరిచయం పూర్తిగా ఇక్కడ చదవండి

Sunday, March 17, 2013

ఒకే ఆత్మగా .......


ఒకే ఆత్మగా .......


మత్తుగా నిద్దరలోంచి
కళ్ళు తెరచి చూసి
ప్రక్కన నిన్ను వెతుక్కుంటే నీవు లేవు కాని
గది నిండా నీ జ్ఞాపకాలు, నీ పరిమళాలు
నాతో గుసగుసలాడుతున్నాయి

రాత్రంతా
నా ఆర్ద్ర నేత్రాల్లో జలకాలాడిన నీవు

కిటికీ వద్ద అప్పుడే తల స్నానం చేసి తడిసిన వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ నువ్వు
మంచులో తడిసి ముద్దయిన ప్రక్రుతి ని  చూసినట్టు
అన్ని రంగులు కలబోసుకున్న హరి విల్లు లా
ఎవరో చిత్రకారుడు గీసిన అస్పష్ట చిత్రంలా...


ఎందుకో ఒక్కసారి గా
మనస్సు గతం పుటల్లోకి వెళ్ళింది
మన తొలి పరిచయం
మనస్సు తో స్ప్రుశించుకున్న మధుర భావనలు
కళ్ళతో కౌగిలించుకొన్న ఆ క్షణాలు
ఎన్నాళ్లయినా ఇంకా తాజాగా!

పదిలంగా దాచుకున్న నా
హృదయాన్ని దోచుకున్నావు
నాది అన్నది ఏమీ లేదు
నువ్వే నేనయి....
నేనే నువ్వై..
ఇద్దరం ఒకటై....ఒకే ఆత్మగా

(17.3.2013)

Sunday, February 17, 2013

వాకిలి లో నా కవిత ..నిశ్శబ్దంగా






నిశ్శబ్దంగా
ఈ ప్రపంచమంతా నిదుర పోతున్న వేళ..

.పూర్తిగా వాకిలి లో 

నా కవిత ప్రచురించిన వాకిలి పత్రిక వారికి కృతజ్ఞతలతో ......



Monday, February 11, 2013

నీ జ్ఞాపకాలు


ఉదయం తలుపు తెరవగానే
బాల్కనీ లో నన్ను తాకిన ఓ చిరుజల్లు 
నువ్వు నన్ను ఆత్రుత తో
నా ముఖాన్ని నీ దోసిట్లోకి తీసుకొని ముద్దాడినట్లు
నీ దేహ పరిమళం లో నేను ఉక్కిరి బిక్కిరి అవుతుంటే
నన్ను చూసి

తల ఊపుతూ కిలకిలమని
నిన్ను తలపిస్తూ నువ్వు పెంచిన గులాబీలు
దగ్గరికి వెళ్ళా!
మృదువుగా నన్ను తాకింది  ఓ గులాబి
నీ చెక్కిలి ఎమో అని అనుకున్నా
మళ్ళీ ఒక్కసారి పక్కున నవ్వింది
పరిహాసంగా

గులాబీ రెమ్మలపై చిరుజల్లు నీటి తుంపరలు
అప్పుడే స్నానించిన నీ దేహం పై  పరుచుకున్న
నీటి ముత్యాల్లా మెరిసిపోతూ

అన్నీ కలిసి నువ్వై
నువ్వు నా నుంచి దూరంగా ఉన్నా
నీ సాన్నిధ్యాన్ని తలపిస్తూనే ఉన్నాయి








Saturday, January 19, 2013

ఒక కవిత నిదురిస్తుంది నా ఎదలో.....జమీలా నిషాత్



(అలజడి మా జీవితం  , మౌఖిక కార్య శాలలో మహిళలు చెప్పిన ఆత్మ కథల సంకలనం నుంచి ....అనువాదం రెంటాల కల్పన)

ఆడ పిల్లలు నాట్యం చెయ్య కూడదు అంటే నాట్యం వదిలేసి, పెయింటింగ్ లోకి మళ్ళి రహస్యంగా, అదీ ఆగి పోయి , అణిచివేత లోనుంచి కవిత్వం లోకి మళ్ళి ,  ఆ కవిత్వం కూడా తన కోసం కాకుండా నిషాత్ అనే స్నేహితురాలికోసం , ఆమెతో కలిసే స్వేచ్చ లేక....నిషాత్ అంటే సంతోష మట  కాని ఆ సంతోషం తో కలయిక ఎప్పుడూ స్వప్నమే ..  ఆ బాధ , దిగులు ఇవన్నీ తన రక్తం లోనుంచి కవిత్వం లోకి ప్రవహించి కవిత్వంగా....

                 "రక్తం లో ఆలోచనల కెరటం ఉబుకుతుంది

                   నా కలం నుంచి
                   రక్తం పడటం మొదలవుతుంది"

తెరల మాటున వుండి, తండ్రి సాహిత్య చర్చల్లో పాల్గొనలేక  నిరాశ తో " నన్ను ప్రతీ రంగులోన ముంచెత్తావు  నువ్వు. కావీ ఇవన్నీ  రంగులే: నేను కాదు" అని రాసుకున్న జమీల....ఛందస్సులో లయలో రాసే కవిత్వం త్రుప్తినివ్వక వచన కవిత్వం లోకి వచ్చి.....పెళ్ళయి, ఆ తర్వాత మృత్యువు కి చేరువయిన తండ్రి తో....మృత్యువుని  చూసినట్టే, ఆ మరణం తర్వాత మారిన తన జీవితం...రాయటమే విముక్తి అనుకోని తిరిగి రాయటం మొదలుపెట్టిన జమీల.గత కొన్నేళ్లుగా ముస్లిం ఉనికికి సంబంధించిన వివిధ అంశాల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీల...స్త్రీల గురించిన పనుల్లో నిమగ్నమయిన జమీలా...స్త్రీల కష్టాలు అణిచివేత చూసి తనకున్న అనుభవంతో ముస్లిం బాలికలల్లో కొత్త చైతన్యం.. ఓ కొత్త ఆత్మ విశ్వాసం మొలకేత్తటానికి జమీల కృషి చేస్తున్నారు. ఒక భాష గా ఉర్దూ ఎప్పటికీ సజీవంగా ఉండాలని ఆకాంక్షించే జమీలా మొదిఅతి నుంచి  ఉర్దూ లోనే కవిత్వం రాస్తున్నారు.ఆమె కవిత్వం లోంచి కొన్ని.....

పొద్దు వాలింది/అన్నివైపులా/ఒక దుఖ్హం కమ్ముకొస్తుంది/కారు చీకటి నీడ పాకింది/సాయంత్రపు కళ్ళు కూడా మూత పడ్డాయి/

ఎర్రెర్రని  వస్త్రాలలో చుట్టి / నీ ఇంటి అందానివిగా నన్ను అలంకరించావు/...అప్పుడు నాకేం తెలుసనీ/తలాక్, తలాక్,తలాక్ అంటూ పిడచ కట్టుకుపోయిన నాలుకతో నీ గొంతు నన్ను రోడ్డున పడేస్తుందని/

కన్రెప్పల తీగల్ని మీటుతున్న/ఈ వాయిద్యం పేరేమిటి/ఈ తెరపైన  వెలుగుతూ, చెదిరిపోతున్న/ఆ దృశ్యం ఏమిటి?/మదిపైన  మబ్బుల్లా కమ్ముకొస్తున్న ఈ నీడ ఏమిటి?/నీకు తెలుసా, నేను నీడల్ని ప్రేమిస్తాను/కాని నీడ నా పైన రెక్కలు చాచినప్పుడల్లా/ ఆలోచనల వెల్లువ/రక్తంలో పోటేక్కుతుంది/అప్పుడిక కలంలోంచి/నెత్తురే  కారుతూ వుంటుంది/

ఏకాంత సముద్రంలోంచి బయటపడి/జీవితం/జన సముద్రంలో మునిగిపోతుంది/

నువ్వూ నేనూ/కలిసి పంచుకున్న ఆ క్షణం.../ఎంత అద్బుతమో/.....అదొక్క క్షణమే/ఒక ఉన్మాద క్షణం/ ప్రేమో కామమో/ఏదో తెలియదు/అదొక ఉద్వేగం/బిందువు/బిందువుగా/రాలిన ఉద్వేగం/

నేనొక బిందువుని/విశ్వానికి కేంద్రాన్ని/వలయవలయాలుగా నువ్వు నీ చుట్టూ నువ్వు/నా లోపల పరిబ్రమిస్తున్టావు/నేను యోనిని/జీవన దారని/నేను వేరుని/ఈ లింగారన్యమన్తా/ నా చుట్టూరా పుట్టుకొచ్చిందే/

నా లోపల/హృది లోపల/నిద్రిస్తోందొక కవిత/ఓ మసక అద్దం/దాన్ని ప్రతిబిబించాలన్న కోరిక కొద్ది/ఓ గజల్/ఓ రేఖ/ఓ మాట/ఒకలా అవునో/కదూ/రాత్రీ పగలు/తనవైపు లాక్కుంటుంది నన్ను/సంగీతం లేదు/ఒక్క ధ్వనీ లేదు/

కాగితానికీ కాలానికీ మధ్య యుద్ధం చెలరేగింది/అక్షరాలూ రక్తం లో స్నానించాయి/కాగితం రెండు ముక్కలైంది/ఒకటి నువ్వు ఇంకోటి నేను రెండు ముక్కలు/గదిలో రెండు మూలల్లో ఇంతలో తపన దేవతలా దిగి వచ్చింది కిటికీ లోంచి/కాగితంముక్కల్ని ఎరుకోచ్చింది మంచంమీద ఉంచింది/ఆత్మీయత పవిత్ర జలాల్ని కురిపించింది/అప్పుడు పుట్టింది ఓ కవిత// చివరికి నిశ్శబ్దం కూడా నన్ను ఊరు కొనివ్వదు / ఈ కవిత పేరేమిటి?నాలోపల నిద్రపోతూ నన్ను నిద్రపోనివ్వని ఈ కవిత ఏమిటి?/