Thursday, December 16, 2010

ధనుర్మాసం... మా అమ్మమ్మ ..పొంగలి

ధనుర్మాసం అనగానే నాకు గుర్తుకు వచ్చేది పొంగలి. నా చిన్నప్పటినించి జ్ఞాపకం. మా అమ్మమ్మ ఈ మాసం అంతా తెల్లవారు ఝామున లేచి చన్నీళ్ళ  స్నానం చేసి పూజ చేసుకొని ప్రతీ రోజు తిరుప్పావై, పాశురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాశురాలు వింటూ నిద్ర లేచే వాణ్ని. అవి నేర్చుకుందామని ప్రయత్నించా కాని మనకు అవి నోరు తిరగలేదు. ఆ తర్వాత వీలు కాలేదు.
శ్రీ రంగనాథుని మనోరదుడిగా   భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమ తో ఆరాధనతో ఆ స్వామి ని తన  స్వామి ని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభం లో భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసం లో శ్రీ రంగని కోసం ఆచరించిన వ్రతమే " ధనుర్మాస వ్రతం". ఈ వ్రతం భక్తీ , ఆరాధన  మార్గాలే కాదు ప్రేమ మార్గాన్ని చూపుతుందట. ఈ పదహారవ తేది నుండి ధనుర్మాసం ప్రారంభం  కానుంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి  ముప్పయి రోజుల  కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని    భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని  ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా  రచించి గానం చేసిన " తిరుప్పావై" పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత  .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.

చిన్నప్పుడు తెలీదు కాని ఈ కథంతా తెలుసుకొన్న తర్వాత మా అమ్మమ్మ ను నేను ఆట పట్టిచ్చేవాని. గోదా దేవి ప్రేమకోరకు, ప్రియుడి తలుస్తూ రోజు పాటలు ,  విరహగీతాలు పాడుకుంటే , మీరెందుకే పెళ్ళయిన వాళ్ళు ఇవి   చదవడం అని సరదాగా ఆట పట్టిచ్చేవాన్ని. రోజు ఉదయమే స్నానం చేయగానే రెడీ గా ఉండే "పొంగలి" . మళ్ళీ  కొంత శర్కర , నేయి కలిపి ముద్దగా చేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.అల తినడం ఓ ఇష్టం.ఇప్పుడంటే కోల్లెస్త్రాల్ భయం కాబట్టి కాస్త తగ్గించి కట్టే  పొంగలి తినటం లెండి. పెద్దవయసయినా కూడా మా అమ్మమ్మ ఇప్పటికీ రోజూ శ్రద్దగా తెల్లవారు ఝమునె లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని పాశురాలు చదువుతుంటుంది. ఆ పాశురాలు వినడం , ఆ పొంగలి తినడం ,అందుకే నాకు ఈ ధనుర్మాసం అంటే ఇష్టం. 

4 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగుందండి.

భాను said...

thanks venu

ఇందు said...

బాగా వ్రాసరండీ ఈ ధనుర్మాసం విశిష్టత.నాకు ఒక డౌట్. నిన్న ప్రారంభమైన ఈ ధనుర్మసం....సంక్రంతికి ముగుస్తుంది కదా!

తృష్ణ said...

బాగున్నాయండీ మీ ధనుర్మాస జ్ఞాపకాలు.