Thursday, December 23, 2010

వంశీ అండ్ గోదారి గట్టు...వంశీ అభిమానులకు శుభ వార్త..మా టీవీ లో మా పసలపూడి కథలు



వంశీ అంటే గోదావరి, గోదావరి అంటే వంశీ, వంశీ కథలు చదివే వారికి, వంశీ సినిమాలు చూసేవారికి, వంశీ తెలిసిన వాళ్లకి వేరే చెపాల్సిన అవసరం లేదనుకుంట. "వంశీ.. మధుర కథల కంచీ...మధుర భావాల  విపంచీ...కథ సుధా విరించీ"  అన్నారు బాపు- రమణ గార్లు. ఎప్పుడో సితార సినిమా , చిరంజీవి ,సుహాసిని ల మంచుపల్లకీ చూసినప్పటినించి   వంశీ అభిమానినైపోయా .  ఇది అంతకుముందు మహల్లో కోకిల అని సీరియల్ గా వచ్చినట్లు జ్ఞాపకం. సినిమాల్లో గోదావరి నేపధ్యం లో పాటల చిత్రీకరణ, భారీ సెట్టింగ్ లు లేకుండా దృశ్యాల చిత్రీకరరణకు వంశీకి ఎవరూ సాటి రారు. "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" చూడండి. ఎంత అందంగా తీశాడు.నలుపు తెలుపులను కూడా రంగుల్లో చూపించడం వంశీ ప్రత్యేకత. 

వంశీకి గోదావరి అంటే ఒక అక్క, అమ్మ, చెల్లి, స్నేహితురాలు, ప్రియురాలు, పక్కింటి అమ్మాయి సర్వం గోదావరే అన్నట్లుగా ఉంటుంది. ప్రతీ సినిమా లోనూ అలా మన చెయ్యి పట్టుకొని గోదారి గట్టు వెంట నడిపిస్తూ, పక్కనున్న పల్లెటూళ్ళు చూపిస్తూ, సందులు, గొందులు, తిప్పుతూ,బల్ల కట్టు మీద కాలువలు దాటిస్తూ, పడవ ప్రయాణం చేయిస్తూ, మనల్ని ఆ గోదావరి అందాలలో లీనమయ్యేలా చేయడం వంశీ ప్రత్యేకత. వంశీ కథల్లో పాత్రలు ఎక్కడో ఊహల్లో నించి పుట్టుక రావు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో నుంచి పుట్టినవే, అందుకే అవి చూస్తుంటే, మనం ఇదివరకే ఎక్కడో కలిసినట్టు , మనం మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళంతా మన కళ్ళ ముందు తిరిగేవాల్లె అనిపిస్తుంది.  ఇక వంశీ సినిమాల్లో, కథల్లో హాస్యం గురించి చెప్పక్కర్లేదు. కొన్ని క్యారెక్టర్స్ అలా మన మనసులో ఉండి పోతాయి. హాస్యం అక్కడక్కడ శృతి  మిన్చినట్టనిపించినా ఎబ్బెట్టుగా అనిపించదు,  

అస్సలు ఈ టపా రాసే ఉద్దేశం రాయాలని,  వంశీ అనగానే ఏదేదో చెప్పేస్తున్నా  , అదే వంశీ ప్రత్యేకతేమో!. నిన్ననే మా టీవీ లో ఆడ్ చూశా " మా పసలపూడి కథలు " త్వరలో అని  అందమయిన బాపు బొమ్మలతో  ఓ ఆహ్లాదకరమయిన  పాట.... . అదీ సంగతి. ఎప్పుడన్నది ఇంకా ఇవ్వలేదు. వంశీ అభిమానులందరికీ ఇది శుభ వార్తే కదా , ఆనందమినిపించి   మీతో పంచుకుందామని ఈ టపా.

"మా పసలపూడి కథలు" నేను ఇంకా చదవలేదు. సీరియల్ గా వచ్చేటప్పుడు అక్కడక్కడ చదివిందే తప్ప, మొన్నే పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం తెచ్చా. అది చదవాల్సుంది. ఆ కథల్లో మట్టివాసన , అక్కడి నీరు, గాలి, అందులో నిజంగా తాదాత్మ్యత చెందుతాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకుంటా. కానీ నాదో చిన్న అనుమానం . ఇంతకుముందు యండమూరి నవలలు చదివే రోజుల్లో అవి సినిమాలుగా వస్తే, అనిపించేది అవి నవలలు ఉన్నంత బాగా లేవని, తెర మీదికి వచ్చేటప్పటికి వాటి అందం కోల్పోయాయని అనిపించేది. అలాగే మరి వంశీ గోదావరి అందాలు, గోదావరి యాస,ఏటివాలు గాలిపాట పల్లెల్లో పరాచికాలటలు, బల్లకట్టూ , పొలం గట్లూ,కాలువ మీద గాలి, మాటల నుడి , పలుకు బడీ, ఇవి అన్నీ తెర మీదికి ఎలా వస్తాయో చూడాలి. ఎంతయినా అక్షరాల్లో ఉన్న అందం తెర మీది దృశ్యం లో కనపడడం అనుమానమే. తీసేది వంశీ అయితే పర్లేదు.  నిజంగా అక్షరాల్లోని అందం తెర మీదికి వస్తే అది ఒక దృశ్య కావ్యమే అవుతుంది అనడంలో  ఎటువంటి సందేహం లేదు.  విచారకరమయిన వార్త ఏమిటంటే , ఇకపై వంశీ గోదావరి, కోనసీమ ల గురించి కథలు రాయడట. సిటీ బేస్డ్ కథలు రాస్తాడట. ఈ  సందర్భంగా "యు గొట్టం" లో దొరికిన " వంశీ అండ్ గోదారి గట్టు" వీడియో లు చూడండి



వంశీ అండ్ గోదారి గట్టు -1

">

వంశీ అండ్ గోదారి గట్టు - ౨


6 comments:

వేణూశ్రీకాంత్ said...

వార్త బాగానే ఉంది కానీ ఆ వర్ణనలను తెరకెక్కించడం చాలా కష్టమైన పనేనండి. టివిలో ఏమాత్రం ఆకట్టుకుంటారో చెప్పలేము.

Anonymous said...

I am waiting for the show.

Ennela said...

భానూ గారు, మీ బ్లాగ్ థరో గా చదివే అదృష్టం ఇవ్వాళ వచ్చిందండీ, చాల బాగుంది, అభినందనలు.
మీకు సుద్దాల సుధాకర్ గారు పరిచయమా అండీ?వారు మా దగ్గర కొన్ని రోజులు పని చేసారు. అప్పటికి వారి అన్నగారు ఇంకా సినీ పరిశ్రమకు రాలేదనుకుంటా....వారి పుస్తకాలు మాత్రం అచ్చయ్యాయి...ప్రథమ ప్రచురణలు కొన్ని మాకు బహుమతిగా పంపించారు సుధాకర్ గారితో....

Buchchi Raju said...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

భాను said...

@వేణు గారూ
మీరన్నట్లు తెరకి ఎక్కించడం కష్టమైన పనే. చూడాలి ఎలా ఉంటుందో . ధన్యవాదాలు
@భోనగిరి గారు
thanks , i am also waiting for the show
@ ఎన్నెల గారూ
ఆలస్యంగానైన చదివినందుకు ధన్యవాదాలు.నాకు సుద్దాల గారు పరిచయం లేదండీ , మీరెందుకు అడిగారో కూడా నాకు అర్థం కాలేదు.? ఏదయినా చెప్పాలంటే నాకు మెయిల్ చేయగలరు.

ఇందు said...

నాది వేణుగారి అభిప్రాయమే! ఒకసారి ఇలాగే సూర్యదేవర రామ్మోహనరావుగారి...నవల ఒకటి ఈటీవి వారు సీరియల్గా తీసారు.నేను ఆ నవల అప్పటికే చదివేసా! ఇక ఆ సీరియల్ చూసి నాకు తల తిరిగింది.ఎన్నో కల్పితాలు...అసలు లక్ష్యం వదిలేసి...పిచ్చి పిచ్చి పైత్యాలన్నీ జోడించారు.ఒకవేళ వంశీగారు డైరెక్ట్ చేస్తేనే అవి ఏమన్నా చూడబుల్ గా ఉంటయ్!లేదా..మనలాగ ఆ కథలని చదివినవాళ్ళు..చూడకపోవడం బెస్ట్ :)