Tuesday, November 23, 2010

ఆకాశ వాణి ప్రసారాల నిలిపి వేత...రేడియో ఉద్యోగుల సమ్మె

మద్యాన్నం రేడియో విందామని ట్రై చేస్తే రాలేదు. ఇప్పుడే తెల్సిన వార్త ఏమిటంటే అల్ ఇండియా రేడియో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారట.  వివరాలలో కి వెళ్తే ఈనాడు నెట్ లోని వార్త ప్రకారం   " దేశ వ్యాప్తంగా అల్ ఇండియా రేడియో ఉద్యోగులు రెండు  రోజుల సమ్మె చేపట్టారు.. ప్రసార భారతిని రద్దు చేసి తమను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా ఆకాశవాణి కార్యక్రమాలు   నిల్చి పోయాయి. విజయ వాడ ఆకాశవాణి కేంద్రం ముందు ఉద్యోగులు భైటాయించి ధర్నా చేపట్టారు "  రేడియో ప్రియులకు విచారకరమయిన వార్త అయిన వారి కోరికలూ న్యాయ సమ్మతమే కదా.

ఈ వార్తను  ఇక్కడ చూడవచ్చు

7 comments:

మనసు పలికే said...

ఓహ్.. ఇదా సంగతి.. రేడియో రాకపోతే నాకు అర్థం కాలేదు ఎందుకో.. :(

ranjani said...

ఎఫ్.ఎమ్ ఫ్రీక్వెన్సీలని వేలంపాటలలో అమ్మి సొమ్ము
చేసుకున్న పెద్దలకి - అలనాటి ఆకాశవాణి కోసం కృషి
చేస్తున్న ఉద్యోగుల గోడు పట్టదెందుకనో :(

సుజాత వేల్పూరి said...

నిన్న ఆకాశవాణి మీదుగా వెళ్తుంటే చూశానండీ! ఉద్యోగులంతా గేటు లోపల తెంట్ వేసి కూచుని నిరసన కొనసాగిస్తున్నారు! చాలా బాధ వేసింది.

ఇంకా కలుషితమై పోకుండా మిగిలినా ఒక్క శాఖనీ కలుషితం చేసే మార్గం ప్రభుత్వానికి తట్టిందన్నమాట. వీరి సమ్మెకు కళాభిమానులంతా మద్దతు ప్రకటించాలి.

కొన్నాళ్ళకి ప్రభుత్వం తనను తానే ప్రైవేటైజ్ చేసుకుంటుందేమో!

భాను said...

@అపర్ణ గారు
అదండీ సంగతి:))
@రంజని గారు
నిజమే మీరన్నది. వెంకట్రామయ్య గారు ఎక్కడో అన్నారు ప్రసార భారతి ఏర్పడి 15 ఏళ్ళు గడిచినా పేరు మార్పు తప్ప సంస్థ ల పనీ తీరులో చెప్పుకో దగ్గ మార్పు లేవీ జరగలేదు. ఇంకా తమ వృత్తిలో ఎంతటి ప్రావీణ్యం కనబర్చినా ఉద్యోగంలో చేరినప్పుడు ఎ హోదాలో వున్నారో అదే హోదా లో రిటైర్ అవుతున్నారు.జీత బత్యాల్లో కొద్దిపాటి పెంపుదల ఉండొచ్చు గాని మరే విదంగాను ఎదుగు బొదుగు వుండదు. "పేరు గొప్ప ఉరు దిబ్బ" అనే సామెత ఆకాశవాణి కళాకారులకి వర్తుస్తుందివర్తిస్తుంది . అని అంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుండు. ధన్యవాదాలు
@సుజాత గారు
ధన్యవాదాలు

భాను said...

@సుజాత గారు
కళాభిమానులంతా మద్దతు ప్రకటించాలన్న ఆలోచన బాగుంది. మీరింతకు ముందు "రాజీవుని పేరు" మీద చేసినట్లు ఏదయినా చేస్తే బాగునుతుందేమో ఒకసారి ఆలోచించడి

కల్పనరెంటాల said...

ఈ ప్రసార భారతి రద్దు డిమాండ్ చాలా కాలం గా ఉంది. ప్రభుత్వం ఇప్పటికయినా ఆకాశవాణి ఉద్యోగుల డిమాండ్ తీర్చి సమ్మె ను విరమింప చేస్తే బావుంటుంది.

Saahitya Abhimaani said...

ఆకాశవాణి ఉద్యోగుల సమ్మె. ఇది వారు చేజేతులా చేసుకున్న దురదృష్టం. ఆకాశవాణిని ప్రసార భారతిగా మారుస్తున్నాప్పుడు వీళ్ళ యూనియన్లు ఏమైపోయినాయి. అప్పుడే సమ్మె, సత్యాగ్రహం వంటివి చేసి అడ్డుకుంటే బాగుండేది. అప్పుడు ఏవో ప్రమోషన్లు వస్తాయి, దాదాపు ప్రవైటు అయిపోతుంది, భవిష్యత్ అంతా అద్భుతం అనుకుని ఊరుకున్నారు. ఇప్పుడు ఆలశ్యం అయిఫొయినాక, వద్దు వద్దు మళ్ళి మాకు పాతరోజులే కావలంటే ఎక్కడనుంచి వస్తాయి? అవకాశం ఉండి వస్తే బాగానే ఉండును. కాని, ఇప్పటి రోజుల్లో అకాశవాణివారు సమ్మె చేస్తే ఎవరికన్నా తెలుస్తుందా అని నా అనుమానం.

ఎప్పటికప్పుడు, ఆకాశవాణి ఉద్యోగులు, వారికన్నా ముందు అక్కడే పనిచేసిన ఉద్యోగులను, వారు చేసిన అద్భుత కార్యక్రమాలను విస్మరించి, అలనాటి కార్యక్రమాలను ఎక్కడ పారేశారో కూడ తెలియని స్థితి కల్పించారు. అప్పటి కార్యక్రమాలు దొరకక, ఆకాశవాణి ఈ రోజున వీధినపడి, మీరా-మీరా అని అభ్యర్ధన మొదలుపెట్టి వారివే అయిన పాత కార్యక్రమాల కోసం వెంపర్లాడే దుస్థితికి కారణం ఎవరు?

టేపులు దాయటానికి బడ్జెట్ లేదు, అలా ఎన్నాళ్ళు దాయాలో మాకు చెప్పలేదు వంటి కుంటి సాకులు చెప్పుకుని లాభంలేదు. ఒక మంచి పని చెయ్యాలని ఉంటే, ఏమైనా చెయ్యవచ్చు. అసలు మనకి అటువంటి సదుద్దేశ్యం కలిగితేకదా. ఆ మధ్య ఆకాశవాణి హైదరాబాదు కళాకారులు, ఒక ఊరేగింపు చేసి పాత తరం కళాకారులని స్మరించుకుని, కొంతమందిని సన్మానించారు. ఆ సందర్భంగా, ఒక పుస్తకం విడుదల చేశారు. కాని అందులో హైదరాబాదు ఆకాశవాణి కేద్రంలో పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్న నడూరి విఠల్ గారి ఫొటోనే లేదు. కారణం? వారి స్టేషన్లో అలనాటి కళాకారుల ఫొటోలు కూడా భద్రపరుచుకోలేకపొయ్యారన్నమాట. ఎప్పుడో 1940లు 1950లలో తీసిన కాసిని ఫొటోలు మాత్రం వారి ధర్మాన ప్రదర్శనలో ఉంచారు. అవన్న దొరికినందుకు సంతోషించాము. నా పక్కనే నుంచుని ఒకాయన ఫొటోలు చూస్తూ, ఎ బి ఆనంద్ గారి ఫొటో చూపిస్తూ, "ఈయన్ని చూడటానికి ఒక రోజల్లా ప్రయాణం చేసి వెళ్ళి చూసొచ్చామండి" అని ఆనందంగా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఏదీ ఈనాడు కళాకారులకి అటువంటి ఫాలోయింగు?

మరొక చక్కటి కార్యక్రమం , "నవలా స్రవంతి" ఊసే లేదు. కారణం, ఇప్పటి కళాకారులకి ఆ విషయమే తెలియదు!!

ఈ విధంగా తమ సంస్థను తామే చేజేతులా పాడుచేసుకున్న వారికి సానుభూతి ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరు చూపిస్తారు. ఉన్నంతలో పనిచేసుకుని తమ ప్రతిభను చాటుకోవటం మళ్ళి మొదలుపెట్టి ఆకాశవాణి పూర్వపు ప్రాభవాన్ని తీసుకు రాగలిగితేనే ఆకాశవాణీ ఉద్యోగులకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ సమ్మెలు, అల్లరి, వల్ల ఒరిగేది ఏమీలేదు. ప్రజలు దాదాపుగా అకాశవాణిని మర్చిపొయ్యారు అనిపిస్తున్నది.