Tuesday, November 23, 2010

కవితా కాదంబిని.....దాశరథి రంగాచార్య


దాశరథి రంగాచార్య ...ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తరాల అంతరాలకు అతీతంగా అయిదు దశాబ్దాలుగా తెలుగువారు వారి రచనలను అభిమానిస్తున్నారు , ఆదరిస్తూనే ఉన్నారు. చరిత్ర లో తొలిసారిగా నాలుగు వేద సంహితాలను వచనంలో అందించిన ఆద్యుడు.  వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భారత, భాగవతాలను తేట తెనుగున అందించిన రచన శిల్పి. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని  తెలంగాణా జన జీవన స్పందనలను నవలలుగా మలిచిన విప్లవ శిల్పి. దాశరథి వచనమే కాదు కవిత్వం కూడా రాసారు. మా అన్నయ్య దాశరథి క్రుష్ణమాచార్ర్యులకు కవిత వదిలి నేను వచనం చేపట్టాను అని అంటారు దాశరథి. అట్ల అన్న దాశరథి, వచనంలో వయ్యారాలు పలికించి నానని, ఉద్యమాలు రగిల్చినానని చెప్పి ఎందుకో నా మనసు కవిత కుహూ అనమన్నది. అందుకే కవిత రాసానంటాడు." మా అమ్మ చదువుల  రాణి /చనుబాలు నాముఖాన పితుకుతుంది/  ఎంత అందమయిన భావన. దాశరథి రాసిన ఈ కవితా కాదంబిని లో మానస కవిత పేరిట దాశరథి మానస సరోవరంలో విరిసిన  163 అందమయిన కమలాలు, 1962 -63 లో జన-రంగం పేరిట రాసిన శతకం. అలాగే 63 -64    లో రచించిన ఉర్దూ కవితలు "ఉర్దూ మదిర" పేరుతొ ఇందులో చేర్చారు. ఇవే కాకుండా భారత సూక్తం ఇంతకూ ముందు ఆంద్ర ప్రభలో వచ్చిన దానిని కూడా ఇందులో చేర్చారు. 

ఈ కవిత లన్ని మనసులోనించి దూకి వచ్చినవి కాబట్టి  వీటికి " మానస కవిత" అని పేరు పెట్టానంటారు. ఆసుపత్రి లో ఉండి రాసిన కవితలే ఇవి. ఆ తర్వాత రాయమని అడిగితె " కవిత కురియలేదు నేను రాయలేదు" అని అంటారు. ఇది కవితా కాదంబిని  - మబ్బుల వరస - మేఘమాలను మీకు అందిస్తున్నాను. జల్లు కురిపించుకోవడం మీ పని అంటారు.  మరి ఆ మేఘ  మాల నుంచి జాలు వారిన  జల్లులు ,  చదువుతుంటే నా మదిని హత్తుక పోయిన   ఎన్నో కవితలు. అందులో నించి కొన్ని కవితా జల్లులు చూడండి. 

స్వామి పాదాల సవ్వడి విన్నాను/వెదకు చున్నాను/వెర్రివాన్ని/అది నా ఎడద సవ్వడియని ఎరగకున్నాను/ 
విశ్వాసం ఉంటె శిల శివుడవుతాడు/  విశ్వాసం లోపిస్తే శివుడు శిల అవుతాడు/
కవిత ఒక వారథి/ఒక సారథి/అది సాగరాలు దాటుతుంది/మనసులను మొలిపిస్తుంది మురిపిస్తుంది/
నరుడు శ్వాస మీదనే జీవించటం లేదు/ విశ్వాసపు  శ్వాస మీద జీవిస్తున్నాడు /విశ్వాసం మీద జీవిస్తున్నాడు/
మనసుకు ఎ కులాలు లేవు/ కులాలన్నీ మనుషులకే/ మాయలకే మనసుకు కులాలు లేవు/
ఆకాశంలో మల్లెల మాల ఏమిటి/అది కొంగల దండ ఆకాశంలో/
అందనిదే అందం / అందితే ఏమున్నది శూన్యం/
జీవితం ఒక విహంగం/ఏదో కొమ్మ మీద వాలుతుంది/కిచకిచ మంటుంది/తుర్రుమంటుంది జీవిత విహంగం/
ఆమె కురులు విరియ బోసింది/కారు మబ్బులు కమ్ముకున్నాయి/ఆమె చూపు విసిరింది/ కమలాలు  వికసించాయి /ఆమె కురులు మబ్బులు/
అద్దం మలినమవుతే ముఖం కనిపించదు/మనసు మలినం అవుతే తాను కనిపించడు/లోకం కనిపించదు/
నెలలు నిండనిది  బిడ్డ రాదు/గుండె నిండనిది కవిత రాదు/


ఇలా ఎన్నో కవితా జల్లులు. కొన్ని ఆ భగవంతుని తో సంభాషణ,  ఓ బాధ్యతతో , ఓ బాధతో , ఓ వేదనతో భగవంతునికి నివేదించిన వినతిపత్రం, అంతే కాదు కొంత భావుకత్వం, ఒక చోట అంటాడు. " కష్టపడితే కవిత రాదు/ గుండె నిండాలే/పొంగి పొరలాలే/ కవిత జలపాతం అవుతుంది/కవితా జలపాతం పొర్లుతుంది" నిజమే దాశరథి గుండె నిండి పొంగి పొరలిన అందమయిన కవితా జలపాతం. ఆస్వాదించండి. ఆ కవితా జల్లుల్లో తడిసి ముద్దయి ఆ ఆనందాన్ని మీరు అనుభవించండి. ఆంద్ర ప్రభ  సంపాదకులు శ్రీ వల్లూరి రాఘవ రావు మాటల్లో" సాహిత్యమనే తూరుపు వేదిక పై కవిత్వమనే వేకువ నర్తకి చేసిన చైతన్యపు శ్రీకారం హృదయ రవళి ఓంకారం దాశరథి మానస కవిత్వం

1 comments:

Anonymous said...

bhanu sir ,DHAASHRADI gaaru kavithalu entha baaga raastaro vaari navala MODHUGU PULU navala antha goppaga vuntundi. thelangana sayuda poratam meeda raasina ee navala 25 years back chadivina eenaaiki gurthundi poindi.DHASARADI gaarini mario oka saari madi loniki thechi nanduku abhinandanalu.....benjimen