Friday, December 31, 2010

నయీ సాల్ ముభారక్

నమస్తే అన్నలూ  ..అక్కలూ  ...చేల్లెమ్మలూ. తమ్ముళ్ళూ    అందరికి పెడతాండ....దండం.  అందరు బాగున్నారే.  చూత్తాంటే చూత్తాంటే  పాత సంవత్చరం ఖతం అయిపొయింది. కొత్త ఏడాది వత్తాండే.  ఇప్పుడే గీడ కూసోని సొంచాయించిన,  గీ ఏడాదిల    ల మనం ఎం గొప్ప పని జేసినం అని..ప్చ్ ఎం కానోస్తలే. ఏదో దినాలు, నెలలు, అయిపోతాండే. ఏడ యేసిన గొంగళి గాడనే ఉన్నట్లు మనం ఏడ ఉన్నమో ఆడనే ఉన్నాం. సంవత్చరం అయిపోవచ్చే. గప్పుడు కే.సి.ఆర్. చచ్చుడో, తెలంగాణా వచ్చుడో అని ఆయన అన్నం గిన్నం  ఎం తినకుంటే అదేంది" ఆమరణ నిరాహార దీక్ష "శురూ జేసే. చూత్తాంటే ఈడ జేసిన్ద్రని ఆడ , ఆడ జేసిన్ద్రని ఈడ లొల్లి మీద లొల్లి, బస్సులు  తగులబెట్టిరి. ఆఖరికి  పాపం అభం శుభం తెల్వని పోరగాండ్లు వాళ్ళను వాళ్ళు  తగలబెట్టుకోనిరి. గట్ల చూత్తాంటే కొత్త సంవంత్చారం జై తెలంగాణా , జై ఆంధ్రా అంటూ మొదలాయే. ఆడికి మన చిదంబరం ఏదో మంత్రమేసి కృష్ణ కమిటీ ఎసి ఆడికి ఆ ముచ్చట ఖతం జేసిండు గదా. నాకు జర్ర గబ్రాయించింది లే ఎందుకంటే  అరె గీ లోల్లిల మన పోరగాండ్ల చదువులు ఏడ ఖరాబ్ అయితఎమోనని. ఏదో మొత్తానికి మనకి టైం కల్సి వచ్చి ఆ గండం గట్టెక్కింది. 

నడిమిట్ల ఏమయ్యిందంటే.....ఏమయ్యిందే.  ఆ నేనయితే గీ తెలుగులా బలాగ్గింగ్ శురూ జేసినా. ఏదో అట్లా నడిపిస్తాన. ఆడ ఒకళ్ళు  ఈడ ఒకళ్ళు  దోస్తులయ్యిండ్రు. మొన్న గాడ పట్నం ల ఈ-తెల్గు అని పెడ్తే  ఆడికి గుడక పోయోచ్చిన. చిన్నంగ చిన్నంగ ఏదో ఈ బ్లాగ్గింగ్ చ్జేస్తాన. ఆ ఇదేమ గొప్పతనం లే. 

కోసకోచ్చేసర్కి కృష్ణ కమిటీ రిపోర్ట్ గోర్మేంట్ కి పాయె ఇంకా ఆరు రోజులట ఎమొస్తాదో ఏమో, మల్ల గీ కొత్త సంవత్చరం లోల్లులు, గడ్బడ్లు, బందులు ధర్నాలతో శురూ అయేటట్టు కన్పద్తాంది, మల్ల పోరగాండ్ల చదువులు అటుకేక్కేతట్టుంది గాదె.  మా కాడ ఏమంటారంటే "రెడ్డొచ్చె మొదలాడే" అని గట్లుంది కథ మళ్ళీ మొదలాయే.  ఎం జేస్తం మనం చూస్కుంట కూసున్డుదేనాయే. కాని ఇదే మా తాతగారి జాగీర్..ఇది మా అయ్య  సొమ్ము...ఇది మా తల్లిగారిల్లు...ఇది మా ఇలాకా.. మాది మాక్కావాలి అంటే తప్పెందే. ఏడికి పోతం. ఈడనే ఉంటాం . సరే ముచ్చట ఏడికో పోతాంది. అది ఒగ్గెయ్యి.  యాది మరిచిన.  అస్సలు గీ కొత్త ఏడాదిల ఎమన్నా జేద్దమంటే  ఎంత సొంచాయిన్చినా ఎం మనసులకి రాట్లే. ఎవురన్న ఎమన్నా కొత్త ఇవిడియాలు ఇస్తారా మరి.  సరే మరి గీడకి ఇగ ఆపేస్త గాని...  అందరకి  ఈ కొత్త సంవత్చరం మంచిగుండాలె , అందరికి నయీ సాల్ కీ ముభారాక్ చెబ్తాండా.    మీరంతా గా సమ్మక్క సారలమ్మ దీవెనలతో చల్లగుండాలే.   మరి నాతొ ఉంటె ఎట్లనే. పోయి ఎంజాయ్ చేయార. మల్లోక్కసారి అందరికి నయీ సాల్ ముభారాక్..  ఇగ ఉంటానే మరి.

Thursday, December 30, 2010

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ , మగధీర లోని ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట. ఈ సినిమా వచ్చాక ఏ  ఇంట్లో చూసిన, ఏ  సెల్ ఫోన్ రింగ్ విన్న  ఇదే పాట అంటే అతిశయోక్తి కాదేమో.  కొన్ని వేల సెల్ ఫోన్లలో ఉండి ఉండవచ్చు.  మంచి  మెలోడీ  తో , మంచి సాహిత్యం తో ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది.  హీరో హీరోయిన్ను పంచదార బొమ్మ..నన్ను ముట్టుకోవద్దంటే ఎట్లా, నీ కోసమే పుట్ట నేను ,నువ్వు అందకపోతే ఈ జన్మ వృధా ,  నీకొరకు వరదయిన వరమని వరిస్తా, మునక కూడా నీ కోసం సుఖంగా భరిస్తానని అంటాడు.  ఈ పాట లో నాకు నచ్చిన చరణాలు, చూడండి.  

 గాలి నిన్ను తాకింది.. నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పేంది అని అతడు అడిగితె, ఆమేమో గాలి నాకు ఊపిరి అయ్యింది, నేలేమో నన్ను నడిపించింది మరి నీలోని  గోప్పెంటి ని అడుగుతుంది. అయినా అతడు ఊరుకోకుండా వెలుగు నిన్ను తాకింది, చివరికి చినుకు కూడా తాకింది, నేనేం చేశాను, నా మీద ఎందుకు  ఇంత  పక్షపాతము అంది అడిగితె, ఆమె ఏమంటుందో చూడండి. వెలుగేమో నాకు దారి చూపింది , చినుకేమో నాకు లాల పోసింది, వీటితోటి నీకేం పోలిక అని అడుగుతుంది. దీనికి అతడు ఎంత అందంగా, ఎంత బాగా చెప్తాడో చూడండి...." అవి బ్రతికున్నప్పుడే తోడున్టాయమ్మ....నీ చితిలో నే తోడయి నేనోస్తానమ్మ...." జీవితంలో నువ్వు అనుకోనేవన్నీ అంటే గాలి, నేల, వెలుగు, చినుకు ఇవన్నీ నువ్వు బ్రతికున్నంత వరకే నీ తోడుంటాయి, కాని నేను మాత్రం చివరికి నీ చితిలో కూడా అంటే నీ మరణం లో కూడా నీతో ఉంటా.. దీన్నేమనాలి మాటల్లో....ఎంత అందమయిన భావన, ఆమెకు అంతకన్నా ఇంకేం కావాలి.  మరణంలో కూడా నీ తోడుంటా అంటే అతడికి ఆమెపై ఎంత ప్రేమ ఉండాలి...ఆ ప్రేమను వ్యక్త పరచటానికి ఇంతకన్నా  గొప్ప మాటలు లేవేమో..ఇది రాసింది చంద్రబోసు అనుకుంటా..  అనూప్ గొంతులో  ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది. .

పంచదార బొమ్మ బొమ్మా .. పట్టుకొవద్దనకమ్మా..మంచుపూల కొమ్మ కొమ్మా .. ముట్టుకొవద్దనకమ్మా ..
చేతినే తాకొద్దంటే .. చెంతకే రావద్దంటే .. ఏమవుతానమ్మా
 ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
పువ్వు పైన చెయ్యిస్తే .. కసిరి నన్ను తిట్టిందే .. పసడి పువ్వు నువ్వని పంపిందే ..నువ్వు రాకు నా వెంటయే .. ఈ పువ్వు చుట్టు ముళ్ళంట .. అంటుకుంటే వళ్ళంతా మంటేనంట ..
తీగ పైన చెయ్యిస్తే .. తిట్టి నన్ను నెట్టిందే .. మెరుపు తీగ నువ్వని పంపిందే ..మెరుపు వెంట ఉరుమంట .. ఉరుము వెంట వరదంట .. నే వరద లాగ మారితే ముప్పంట ..
వరదైన వరమని వరిస్తానమ్మా ..అ ఆ .. మునకైన సుఖమని ముడేస్తానమ్మా .. అ ఆ ..నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
ఆ అ ఆ అ అ అ …
గాలి నిన్ను తాకింది .. నేల నిన్ను తాకింది .. నేను నిన్ను తాకితే తప్పా ..గాలి ఊపిరి అయ్యింది .. నేల నన్ను నడిపింది .. ఏమిటంట నీలోని గొప్ప ..
వెలుగు  నిన్ను తాకింది .. చినుకు కూడా తాకింది .. పక్షపాతమెందుకు నాపైన ..
వెలుగు దారి చూపింది .. చినుకు లాల పోసింది .. వాటితోటి పొలిక నీకెలా …
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ .. నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

Thursday, December 23, 2010

వంశీ అండ్ గోదారి గట్టు...వంశీ అభిమానులకు శుభ వార్త..మా టీవీ లో మా పసలపూడి కథలు



వంశీ అంటే గోదావరి, గోదావరి అంటే వంశీ, వంశీ కథలు చదివే వారికి, వంశీ సినిమాలు చూసేవారికి, వంశీ తెలిసిన వాళ్లకి వేరే చెపాల్సిన అవసరం లేదనుకుంట. "వంశీ.. మధుర కథల కంచీ...మధుర భావాల  విపంచీ...కథ సుధా విరించీ"  అన్నారు బాపు- రమణ గార్లు. ఎప్పుడో సితార సినిమా , చిరంజీవి ,సుహాసిని ల మంచుపల్లకీ చూసినప్పటినించి   వంశీ అభిమానినైపోయా .  ఇది అంతకుముందు మహల్లో కోకిల అని సీరియల్ గా వచ్చినట్లు జ్ఞాపకం. సినిమాల్లో గోదావరి నేపధ్యం లో పాటల చిత్రీకరణ, భారీ సెట్టింగ్ లు లేకుండా దృశ్యాల చిత్రీకరరణకు వంశీకి ఎవరూ సాటి రారు. "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" చూడండి. ఎంత అందంగా తీశాడు.నలుపు తెలుపులను కూడా రంగుల్లో చూపించడం వంశీ ప్రత్యేకత. 

వంశీకి గోదావరి అంటే ఒక అక్క, అమ్మ, చెల్లి, స్నేహితురాలు, ప్రియురాలు, పక్కింటి అమ్మాయి సర్వం గోదావరే అన్నట్లుగా ఉంటుంది. ప్రతీ సినిమా లోనూ అలా మన చెయ్యి పట్టుకొని గోదారి గట్టు వెంట నడిపిస్తూ, పక్కనున్న పల్లెటూళ్ళు చూపిస్తూ, సందులు, గొందులు, తిప్పుతూ,బల్ల కట్టు మీద కాలువలు దాటిస్తూ, పడవ ప్రయాణం చేయిస్తూ, మనల్ని ఆ గోదావరి అందాలలో లీనమయ్యేలా చేయడం వంశీ ప్రత్యేకత. వంశీ కథల్లో పాత్రలు ఎక్కడో ఊహల్లో నించి పుట్టుక రావు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో నుంచి పుట్టినవే, అందుకే అవి చూస్తుంటే, మనం ఇదివరకే ఎక్కడో కలిసినట్టు , మనం మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళంతా మన కళ్ళ ముందు తిరిగేవాల్లె అనిపిస్తుంది.  ఇక వంశీ సినిమాల్లో, కథల్లో హాస్యం గురించి చెప్పక్కర్లేదు. కొన్ని క్యారెక్టర్స్ అలా మన మనసులో ఉండి పోతాయి. హాస్యం అక్కడక్కడ శృతి  మిన్చినట్టనిపించినా ఎబ్బెట్టుగా అనిపించదు,  

అస్సలు ఈ టపా రాసే ఉద్దేశం రాయాలని,  వంశీ అనగానే ఏదేదో చెప్పేస్తున్నా  , అదే వంశీ ప్రత్యేకతేమో!. నిన్ననే మా టీవీ లో ఆడ్ చూశా " మా పసలపూడి కథలు " త్వరలో అని  అందమయిన బాపు బొమ్మలతో  ఓ ఆహ్లాదకరమయిన  పాట.... . అదీ సంగతి. ఎప్పుడన్నది ఇంకా ఇవ్వలేదు. వంశీ అభిమానులందరికీ ఇది శుభ వార్తే కదా , ఆనందమినిపించి   మీతో పంచుకుందామని ఈ టపా.

"మా పసలపూడి కథలు" నేను ఇంకా చదవలేదు. సీరియల్ గా వచ్చేటప్పుడు అక్కడక్కడ చదివిందే తప్ప, మొన్నే పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం తెచ్చా. అది చదవాల్సుంది. ఆ కథల్లో మట్టివాసన , అక్కడి నీరు, గాలి, అందులో నిజంగా తాదాత్మ్యత చెందుతాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకుంటా. కానీ నాదో చిన్న అనుమానం . ఇంతకుముందు యండమూరి నవలలు చదివే రోజుల్లో అవి సినిమాలుగా వస్తే, అనిపించేది అవి నవలలు ఉన్నంత బాగా లేవని, తెర మీదికి వచ్చేటప్పటికి వాటి అందం కోల్పోయాయని అనిపించేది. అలాగే మరి వంశీ గోదావరి అందాలు, గోదావరి యాస,ఏటివాలు గాలిపాట పల్లెల్లో పరాచికాలటలు, బల్లకట్టూ , పొలం గట్లూ,కాలువ మీద గాలి, మాటల నుడి , పలుకు బడీ, ఇవి అన్నీ తెర మీదికి ఎలా వస్తాయో చూడాలి. ఎంతయినా అక్షరాల్లో ఉన్న అందం తెర మీది దృశ్యం లో కనపడడం అనుమానమే. తీసేది వంశీ అయితే పర్లేదు.  నిజంగా అక్షరాల్లోని అందం తెర మీదికి వస్తే అది ఒక దృశ్య కావ్యమే అవుతుంది అనడంలో  ఎటువంటి సందేహం లేదు.  విచారకరమయిన వార్త ఏమిటంటే , ఇకపై వంశీ గోదావరి, కోనసీమ ల గురించి కథలు రాయడట. సిటీ బేస్డ్ కథలు రాస్తాడట. ఈ  సందర్భంగా "యు గొట్టం" లో దొరికిన " వంశీ అండ్ గోదారి గట్టు" వీడియో లు చూడండి



వంశీ అండ్ గోదారి గట్టు -1

">

వంశీ అండ్ గోదారి గట్టు - ౨


Wednesday, December 22, 2010

నా తోబుట్టువులు వేశ్యలు


ఏమి తోచక ఓ పుస్తకం చేతిలో తీసుకుంటే కనపడ్డ కవిత " నా తోబుట్టువులు వేశ్యలు"  Maureen Duffy కవిత కి యండమూరి తెలుగు అనువాదం

అరణం కోసమో - భరణం కోసమో
నియాన్ లైట్ల వెలుగుల్లో
చిరునవ్వు ఆభరణాలు ధరిస్తారు వాళ్ళు ,
వీధిమలుపుల్లో
రంగులు వెదజల్లే వాళ్ళ యవ్వనాలకు ధర
సందు చివర చీకట్లో
నువ్వు అంచనా కడతావు.

కాలం కాలువలో పెరిగిన
తనువు తరువుకి
బరువుగా కాసిన పెద్ద పెద్ద ఫలాలు
రుచి చూస్తె కుళ్లిపోయి వుంటాయి
నువ్వు విసుగ్గా పారేస్తావు

అందమయిన ఓ సాయంకాలం ఆ
అనుభవం గుర్తు తెచ్చుకొని విసుక్కొంటావు

కొనుగోలుదారుల ఆత్రపు తడి ఆర్చేశాక
రాత్రి పొత్తి కడుపు మీద ప్రత్యూష నిశ్శబ్దం మొగ్గ తొడుగుతుంటే
వాళ్ళు ఇళ్ళకు చేరి,
నీ వాసన ఉడుపులు విప్పెసుకుంటూ
నజరానాలను లెక్కబెట్టుకుంటారు,
నీ బండ చేతుల్లో నలిగిన వాళ్ళు,
తమ బలహీనమయిన చేతులు
ఒకరి చుట్టూ ఒకరేసుకొని
నిద్రకుపక్రమిస్తారు 

"మిసిమి " పత్రికకి ఆ పేరెలా వచ్చింది


మిసిమి సంస్థాపక సంపాదకులు శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ గారు. వీరిది గుంటూరు  జిల్లా గోవాడ గ్రామం. చదువు ఉన్నత పాటశాల విద్య మాత్రమె. తమ తండ్రి గారు వారి గ్రామంలో 1918 లో ప్రారంబించిన రాజ రాజ నరేంద్ర గ్రందాలయంలోని పుస్తకాలను ఔపోసన పట్టారు. అభిరుచి గల అంశం పై స్వేచ్చా జీవితం కొన సాగించాలనే ఉద్దేశ్యం తో సొంత పెట్టుబడితో, తెనాలి లో జాకోబిన్ ప్రింటర్స్ 1943 లో ప్రారంభించి, ఇందులో పుస్తకాలు ముద్రించడంలో నేర్పు సంపాదించారు. 1946 లో తెనాలి నుంచే "జ్యోతి" పక్ష పత్రిక ను తదుపరి రేరాణి, కినిమా మాస పత్రికలను నిర్వహించి పత్రికా రంగం లో కొత్త ఒరవడి ని సృష్టించారు. 1990 లో వీరు మిసిమి మాస పత్రిక ను స్తాపించారు.  ఆ మిసిమి నామ కరణ ఎలా జరిగిందట అంటే  మిసిమి అన్న పేరు సూచించిన వారు డాక్టర్ బూదరాజు రాధ కృష్ణ గారట. ఇదివరలో ఎ పత్రికకి లేనటువంటిది, కుడి ఎడమల ఎటువేపు నుంచి చదివిన తేడా రానిది ఆయన సూచించారు. " మిసిమి" అంటే నూతన కాంతి, నవనీతం(వెన్న) అని రెండర్థాలు.  ఆ పదం, దాని అర్థం సప్రమాణంగా చూపనిదే ఆయనకు సంతృప్తి కలిగింది  కాదట. 
            
            "మిసిమి పరసీమ పల రాజు మేనమామ
             నే వెలుంగుల దొర జోడు రే వెలుంగు"


అని బూదరాజు గారు అల్లసాని పెద్దన రాసిన "మనుచరిత్ర" లో నుంచి పై చరణాలు ఉతంకిన్చారట . అలాగే నవనీతం అన్న అర్థంలో ఎవరు, ఎక్కడ వాడారో ఉదహరించారు .
       
           "మినుకు  టూర్పులవాని 
           "మిసిమి" మేతల వాని
            మెరుగు చామన ఛాయా మేనివాని...."



అని తెనాలి రామకృష్ణ కవి ప్రనీతమయిన "పాండురంగ మహత్యం" నుండి తీసుకున్నారట. ఈ విధంగా " మిసిమి" పత్రికకి నామకరణం బూదరాజు రాధ కృష్న   గారు చేసారు.

మిసిమి అంటే ఆసక్తి కల వారు ఆన్ లైన్లో ఇక్కడ చూడవచ్చు .

Tuesday, December 21, 2010

పుస్తక ప్రదర్శన కు నేను వెళ్ళా


ఈ 25 వ పుస్తక ప్రదర్శన ప్రారంభం అయినప్పటినించి వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటున్న.  హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎంచక్కా రోజూనో, వీలున్నప్పుడో అలా వెళ్లి ఇలా వస్తారు. బయట ఉండేవాళ్లకు  అలా కాదాయె. పుస్తక ప్రదర్శన ఒక్కటే కారణం కాదు, అందులో ఉన్న e- తెలుగు స్టాల్  లో పాల్గొనాలని మరియు  బ్లాగ్గర్స్  ని కలుసుకోవడం. అందుకని ఆదివారం పోవాలని అనుకుంటే వీలు కాలేదు. సోమ వారం ఏదో ఓ పని పెట్టుకొని స్వామి కార్యం , స్వ కార్యం చక్క పెట్టుకోవచ్చని హైదరాబాద్ వచ్చేశ. పుస్తక ప్రదర్శన శాల చేరేవరకు 7 .30 అయ్యింది. సమయం చాల తక్కువ, రాక రాక వస్తే ఇంత తక్కువ సమయమా అని మనస్సు కాస్త బాధపడింది. సరేలే అనుకోని మొదట e  తెలుగు స్టాల్ ని సందర్శించా. నా దురదృష్టం ఒక్క కౌటిల్య గారు తప్ప ఎవరూ లేరు. వారిని పరిచయం చేసుకొని, నన్ను నేను పరిచయం చేసుకొని, కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని, అన్నీ విపులంగా సందర్శించే వీలు లేక, ముఖ్యంగా తెలుగు పుస్తకాలున్నా స్టాల్ల్స్ మాత్రమె చూడడం జరిగింది. తెలంగాణా. ఎమెస్కో., ప్రజాశక్తి, నవయుగ, నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్ ఇంకా కొన్ని స్టాల్ల్స్ మాత్రమె చూశా. 



 పుస్తక ప్రదర్శన లో రోజూ సాయంత్రం ఏదో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు  తనికెళ్ళ భరణి గారి నాటకాలు ఆవిష్కరణ జరుగుతుంది. భరణి , హేమ, రాళ్ళపల్లి, ఇంకా కొందరు సినీ కళాకారులు పాల్గొన్న ఈ సభ లో   భరణి " మా చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ" అని కురిపించే నవ్వుల జల్లు లో ఓ రెండు నిమిషాలు తడిసి , అక్కడి నించి విశాలాంధ్ర స్టాల్ కి వెళ్తే అప్పటికే సమయం తొమ్మిది కావటం తో స్టాల్ల్స్ తెరలు దించే కార్యక్రమం మొదలై పోయింది. నిరాశ తో వెను తిరిగి వస్తుంటే చివర్లో "ఆర్ట్స్ అండ్ లెటర్స్" కనిపించింది. అందులో మిసిమి కనిపించింది. లేటెస్ట్ ఇష్యూ కొనుక్కొని రెండు మూడు చోట్ల కనపడని బాపిరాజుగారి "గోన గన్నారెడ్డి" కనపడితే అది కూడా కొనుక్కొని బయట పడ్డాము. అంతకు ముందు విశాలాంద్ర స్టాల్ లో గోన గన్నారెడ్డి గురించి అడిగితె నిర్లక్ష్యంగా ప్రింట్ లో లేదు అని సమాధానం వచ్చింది. ఇదీ వారి వరస. ఏవయిన కొత్త కథా సంకలనాలు కొనాలనుకున్న, కాని ఈ రోజే (సోమ వారం) ఆంద్ర జ్యోతి లో వచ్చిన వ్యాసాలూ చదివాక ,  తర్వాత చూద్దాం లే అని  ఊరుకున్న. ఎమెస్కో స్టాల్లో కాస్త గడిపా. కాశీబట్ల పుస్తకాల గురించి అడిగితె ఎక్కడా దొరకలేదు. మొత్తానికి  నాకు సమయం లేక కొంత నిరాశతో వెనక్కి వచ్చా. మళ్ళీ వీలు చూసుకొని రావాలి.  :

నేను కొన్న పుస్తకాలు

గోన గన్నారెడ్డి .....అడవి బాపిరాజు
కథా భారతి బెంగాలి కథానికలు
మహి.....కుప్పిలి పద్మ
మంచుపూల  వాన ....కుప్పిలి పద్మ
విసుర్రాయి...ముదిగంటి సుజాత రెడ్డి
గాలిబ్ గీతాలు ...దాశరథి
మా పసలపూడి కథలు....వంశీ
మనుచరిత్రము.....అల్లసాని - ఎమెస్కో ప్రచురణ

Saturday, December 18, 2010

తన్హాయి....నా అభిప్రాయాలు

ఎన్నో రోజులుగా మనల్ని అలరిస్తున్న తన్హాయి " అయిపొయింది" అన్న  అక్షరాలు చూసే సరికి ఒక్క సారి మనసు నిజంగా భారమయిపోయింది.. ఎప్పుడో అప్పుడు అయిపోతుందని మనసుకు తెలిసినా ఒక్క సారిగా అయిపొయింది అని చదివే సరికి, మన ఆప్త మిత్రులు   లేదా దగ్గరి వాళ్ళు మన నుంచి దూరమయిన ఫీలింగ్.
నేను మొదటిసారిగా బ్లాగ్లోకంలో  నా మొదటి అడుగు వేసినప్పుడు  మొదటి కామెంట్ కల్పనా గారిదే.  అప్పటికి నాకు కల్పనగారెవరో తెలీదు. ఆ కామెంట్ ని పట్టుకొని వారి బ్లాగ్ లోకి వెళితే   నాకు తన్హాయి ఎనిమిదో భాగమనుకుంటా కనిపించింది. ఏముందా అని చదివితే ఆసక్తిగా అనిపించింది. ఇలా కాదని ఇంకా వెనక్కి వెళ్ళ. .ఏక పల్  దగ్గరికి.  అలా చదువుతుంటే రచయిత మన చెయ్యి పట్టుకొని ఒకటి  రెండు ఎపిసోడ్ లు  నడిపించి వదిలేస్తే, అంతే మనం ఆ తన్హాయి సుడిగుండం లో పడి అందులోనే తిరుగుతుంటాం. అలా తన్హాయి ఇన్ని రోజులు మన జీవితం లో ఒక భాగమయింది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తన్హాయి గురించి నా అభిప్రాయం, అయితే నేనేమి దీని గురించి సమీక్ష రాయబోవడం లేదు. అంత స్తాయి నాకు లేదు. ఏదో నా మనసుకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకుందామని ఈ ప్రయత్నం అంతే. 
తన్హాయి గురించి ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే, ఇది ఒక (అ)సహజమయిన ఒక అందమయిన ప్రేమ కావ్యం. అసహజం ...సహజం అని ఎందుకంటున్నానంటే. మనం మొదట్లో చదువుతుంటే మనకి కలిగే  మొదటి అభిప్రాయం ఇది అసహజం , ఇదంతా మనం ఎలా ఒప్పుకుంటాం రచయిత ఇలా రాస్తున్దేమిటి అని వీరావేశ పడతం.
ఎందుకంటే ఇదంతా మన దృష్టి లో అసహజమే  కదా!. ఔను మనం పెరిగిన వాతావరణం, మన సంస్కృతి, మనకి పెద్దలు చెప్పింది...మనం చూసేది (?), ఇవ్వన్నీ మనకు ఇద్దరు వివాహితుల మధ్య ఏర్పడే ప్రేమ ,బంధం అసహజమనిపించడం లో ఎటువంటి తప్పులేదు. కాని మనం ఒక్క సారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని , వ్యక్తులను చూస్తె మనకి అలాంటి క్యారెక్టర్స్ కనిపించడం లేదా. మనకి ఆ భగవంతుడు ఎదుటి వ్యక్తుల హృదయాల్లోకి తొంగి చూసి వాళ్ళని చదివే శక్తి ఇస్తే, మనకి ఇలాటివాళ్ళు ఎంతమంది కనపడరు. కాదంటారా. మన మనస్సులో ఎం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు కాబట్టి  అంతా సవ్యంగానే ఉన్నట్లు అందరూ మంచిగానే కనిపిస్తారు. ఎవ్వరి మనసులో ఎం జరుగుతుందో? మనకి కనిపించేదంతా మనం చదివేదే మన సంస్కృతి అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అని నా ఉద్దేశ్యం.  మనం రోజు ఎన్నో పత్రికల్లో సమస్యలు  ప్రశ్నలు, జవాబులు చదువుతుంటాం. అందులో చూడండి. పెళ్ళయిన  వాళ్ళు, పెళ్లి కానివాల్లూ , జీవిత భాగ స్వాములకు తెల్సి, తెలియకుండా ఏర్పరుచుకొనే భందాలు, అనుభందాలు, కొన్ని సరదాగా, కొన్ని పర్మనెంట్గా, ఇలా రక రకాల వ్యక్తులు  మన సమాజంలో ఎందఱో కనకి కనపడుతుంటారు. ఉన్నారు. లేరనుకొని ఈ ప్రేమలు , ఈ బంధాలు అసహజం అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకొన్నట్లే.

మన సమాజంలో మన చుట్టూ జరిగేదే రచయిత తన సొంత శైలి లో రాసింది. మన చుట్టూ జరుగుతుంటే మనం చూస్తూ ఉరుకుంటాం.కాని రచయిత దాన్ని ఒక కథ వస్తువుగా తీసుకుంటే అది అసహజమెట్ల అవుతుంది, అక్రమసంబంధాలు గురించి రాసినట్లు ఎట్లా అవుతుంది. ఒక అసహజమయిన  సబ్జెక్టు ని చాల  సహజంగా పాటకులను సంమోహపరిచెంతఃగా   చదివించి  అందరిచేత ఆమోద ముద్ర వేయించడం ఇక్కడ  రచయిత గొప్పదనం. ఇలా ఎందుకు అంటున్నానంటే  పాటకులు అక్కడక్కడ రచయిత అభిప్రాయాలతో విభేదించినా...ఈ ప్రేమికుల  మధ్య బంధాన్ని , ప్రేమని ఇష్టపడ్డారు. అందులో లీనమయ్యారు. పాత్రలకు ఎం జరుగుందోనని వాళ్ళను సప్పోర్ట్ చేశారు, బాధపడ్డారు, ఆవేదన చెందారు.పాత్రలని ఆరాదించారు.మొత్తంగా  పాత్రలను తమ ఆప్త మిత్రులుగా   , తమ కి ఇష్టమయిన వ్యక్తులుగా భావించారు. వాళ్ళకేమి కాకూడదని టెన్షన్ కి లోనయి, పాత్రలతో మమేకమయిపోయారు. ఈ పోస్ట్ లు  పబ్లిష్ అవుతున్నప్పుడు రీడర్స్ రాసిన కామెంట్స్ దీనికి నిదర్శనం. ఇది సహజమా , అసహజమా   ఇది తప్పా, ఇది ఒప్పా,  అని రచయిత మనకి ఎలాంటి సందేశం ఇవ్వట్లేదు. మనం తేల్చుకోవాల్సిందే. 
ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు వివాహితులు , "కల్హార" మరియు "కౌశిక్" ఒక ఎయిర్పోర్ట్ లో ఏర్పడ్డ పరిచయం స్నేహం....ప్రేమగా...మారి దగ్గరయి ఒకరిని విడిచి ఒకరు విడిపోలేనంత దగ్గరయి, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో  ఏర్పడ్డ పరిణామాలు, వాళ్ళ మానసిక సంఘర్షణలు.  ఇక్కడ ఎవ్వరేమనుకున్న రచయిత వాళ్ళ మధ్య స్నేహం, ప్రేమ ఒక అందమయిన దృశ్య కావ్యం లా  మన కళ్ళకి చూపిస్తుంది. ఎంత బాగా అంటె మనం కల్హార తో ప్రేమలో పడేంత. వాళ్ళ మధ్య ఈ ప్రేమ ఎలా ఏర్పడింది అంటె సరి అయిన కారణాలు ఏవి కనిపించవు ,  it just happens ... అంతే, నిజమే మన అభిప్రాయాలకు మన ఇష్టాలకి దగ్గరి వాళ్ళు మన సమీపం కి వస్తే,  కాన్స్టంట్ గ  కలుస్తుంటే,  స్నేహం   , ఇష్టంగా ఆపై ప్రేమగా మారుతుంది దీనికి ఎ కారణాలు అవసరం లేదనుకుంటా. ఇక్కడ జరిగింది అదే, కల్హార , కౌశిక్ ల పరచయం  అలా అలా కొనసాగి ఒకరి ఇష్టాలు ఒకరు ఇష్టపడి స్నేహం ఘాడమాయి  ఇష్టంగా మారి,  అది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా,  మెయిల్స్, ఫోన్ కాల్స్,  కొనసాగుతుంటే ఇవ్వన్ని వాళ్ళని మానసికంగా దగ్గరికి చేర్చి వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. కథలో ఇదంతా ఒక అందమయిన ప్రేమ కావ్యంలో కొనసాగుతే,   మిగతా కథంతా ఒక  ఎత్తు. ఈ భాగం లో నాలుగు పాత్రల మధ్య మానసిక సంఘర్షణలు రచయిత అతి సహజంగా చక్కగా, వారి మనస్సుల్లోకి తొంగిచూసి  రాసినట్లు అనిపిస్తుంది.  వివిధ ఎపిసోడ్ లలో రచయిత రాసిన ఆ మానసిక సంఘర్షణల విశ్లేషణలు అర్థవంతంగా , కన్విన్సింగా గా మనకి నచ్చుతాయి. ఎవ్వరి గురించి రాసినా వాళ్ళదే కరెక్ట్ అనిపించేతగా రచయిత రాసిన తీరు శ్లాగనీయం.  రచయిత కూడా ఎవ్వరిని సప్పోర్ట్ చేసినట్లు కనపడదు. పాత్రలు అల సహజంగా ప్రవర్తిన్చినట్లు  మనకి కనిపిస్తుంది. అందుకే అందరూ అంత ఇస్తాపద్దరనుకుంటా. 
చివర  ముగింపులో ఒక ప్రశ్న  రాక మానదు. విడి పోదామని వాళ్ళు నిర్ణయించుకొన్న తర్వాత , వాళ్ళు ఒకళ్ళ కౌగిల్లో ఒకళ్ళు ఒదిగి పోవడం లాంటివి ...మళ్ళీ వాళ్ళ మధ్య బంధం ఇంకా డెవలప్ కావటానికి దోహదపదతాఎమో  అనిపించింది. ఇదంతా ఒక కల , ఇక తీయటి జ్ఞ్యాపకంగా వాళ్ళు అనుకున్నా, వాళ్ళ జీవిత భాగస్వాములు ఎంత బాగా వీరిని అర్థం చేసుకొని వీళ్ళని స్వీకరించినా, ఈ సంఘటనలు  వాళ్ళ భవిష్యత్తు  జీవితాల్లో గుర్తు రావా. ఎక్కడో ఏదో విషయాలపై వాళ్ళ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళ మధ్య అనుకోవతందుకు  , అభిప్రాయ బేదాలు రావటందుకు పాత జ్ఞ్యాపకాలు కారణాలు కాకుండా ఉంటాయ?  అలాగే కల్హార , కౌశిక్ ల మధ్య వాళ్ళ మనస్సులో ఒకరి పట్ల ఒకరి పై ప్రేమ అలాగే ఉంటుంది కదా. ఎంత మరిచిపోయిన వాళ్ళ కి ప్రతీ క్షణం ఒకరికొకరు గుర్తు రాక మానరు కదా. వాళ్ళ జీవిత భాగస్వాములతో ఉంటూ ఇలా వాళ్ళు గుర్తుకు వస్తే అప్పడు వాళ్ళ పరిస్థితి  ఏంటి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగుతాయి అన్నవి ప్రశ్నలే.  బహుశా ఈ విషయాలతో ఈ నవలకి ఇంకో  సీక్వెల్ రాయొచ్చేమో. అయిన  ఈ ప్రశ్నలకి   సమాధానాలు ఉండవు  కావచ్చు. కామెంట్లలో మిత్రుడు అన్నట్లు " ప్రతీ  కథకి ముగింపులు , కంక్లూజన్లు ఉండవు....జీవితాలకి అస్సలు  ఉండవు. ఈ కథ జీవితం లోని  ఒక భాగం " నిజమే ఈ జీవితం ఇలానే  కొనసాగుతుంది. ఇలాంటి కథలకి ముగింపు ఇదేనేమో. 
ఏది ఏమయినప్పటికీ ఇది ఒక అందమయిన ప్రేమ కావ్యం  మన మనసుల్ని అలా హత్తుక పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Thursday, December 16, 2010

ప్రాణహిత పుష్కరాలు

ఇప్పుడు ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. రెండు రోజుల క్రింద అలా సరదాగా వెళ్లి చేసిన పుష్కర స్నానం, మరియు ఆ విశేషాలు మీతో పంచుకోవాలని ఈ టపా.  ప్రాణహిత గురించి తెలియని వాళ్లకోరకు....ప్రణీత నది వ్యవహార నామమే ప్రాణహిత. ఇది మహారాష్ట్ర లో ఉన్న సాత్పురా పర్వత కనుమలలో జన్మించి (అక్కడ దీనిని పెనుగంగా లేక వైన్య నది అంటారు) అక్కడి నించి వచ్చేటప్పుడు మహారాష్ట్రా లోని ఆస్తీ అనే ఊరి దగ్గర వరదా అనే మరొక నది వచ్చి వైన్య లో కలిసిపోయి తరువాత ప్రాణహిత అనే నదిగా ముందుకు సాగి ఆదిలాబాద్ జిల్లాలో కౌటాల తమ్మిది హేత్తి, వేమనపల్లి, కోటపల్లి మండలం అర్జున గుట్ట మీదుగా కాళేశ్వరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది. మేం పుష్కర స్నానాలకు ఆదిలాబాద్ జిల్లా లోని ఈ అర్జున గుట్ట వద్ద ఉన్న ప్రాణహిత నదీ తీరం వద్దకు వెళ్ళాం.  చెన్నూర్ కు సుమారు 22 కి.మీ. దూరం లో ఉన్న ఇక్కడికి వెళ్ళాలంటే నిర్మాణం లో ఉన్న జగదల్పూర్ NH16 మీదుగా వెళ్ళాలి. ఆర్ టి సి వాళ్ళు ప్రత్యెక బస్సులు ఏర్పాటు చేశారు. మేం కార్లో వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అభయారణ్యం గుండా కొంత దూరం పోయాక ఎడమ పక్క నించి దీనంగా , నీళ్ళు లేని గోదావరి మనతో పాటు చాలా దూరం వస్తుంది. అది చూస్తుంటే " గల గలా గోదావరి పరుగులిడుతుంటే"  అని పరవళ్ళు తొక్కుతున్న గోదావరి అన్నవి ఒక్కసారి గుర్తుకొచ్చాయి,   ఎక్కడ ఆ పరవళ్ళు  ఏవి ఆ పరుగులు,  అక్కడక్కడా ఉందీ లేనట్లుగా ఉన్న నీళ్ళతో ఉన్న గోదావరి తల్లి ని చూసి కాసేపు బాధ అనిపించింది. అర్జున గుట్ట వద్ద ప్రాణహిత సమృద్దిగా ఉన్న జల సంపదతో ముందుకు సాగుతుంది. ఇక్కడ లోతు బాగున్టుదట. వేసవి లో ఆవలి తీరం పోవాలంటే పడవల్లో వెళ్ళ వలసిన్దేనత. ప్రాణహిత కవతల మహారాష్ట్రా లోని శిరోంచ గ్రామం కనపడుతుంది. ఇలాగే  ముందుకు వెళ్ళిన ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది.అక్కడే సరస్వతి కూడా అంతర్వాహిని గా గోదావరిలో కలవడం వల్ల కాళేశ్వరం క్షేత్రానికి   త్రివేణి సంగమం  అని పేరొచ్చింది.  ఇలా సరదాగా వెళ్లి పుష్కర స్నానం చేసి వచ్చాం. సరదాగా  తీసిన చిత్రాలు మీకోసం ... 














 

ధనుర్మాసం... మా అమ్మమ్మ ..పొంగలి

ధనుర్మాసం అనగానే నాకు గుర్తుకు వచ్చేది పొంగలి. నా చిన్నప్పటినించి జ్ఞాపకం. మా అమ్మమ్మ ఈ మాసం అంతా తెల్లవారు ఝామున లేచి చన్నీళ్ళ  స్నానం చేసి పూజ చేసుకొని ప్రతీ రోజు తిరుప్పావై, పాశురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాశురాలు వింటూ నిద్ర లేచే వాణ్ని. అవి నేర్చుకుందామని ప్రయత్నించా కాని మనకు అవి నోరు తిరగలేదు. ఆ తర్వాత వీలు కాలేదు.
శ్రీ రంగనాథుని మనోరదుడిగా   భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమ తో ఆరాధనతో ఆ స్వామి ని తన  స్వామి ని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభం లో భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసం లో శ్రీ రంగని కోసం ఆచరించిన వ్రతమే " ధనుర్మాస వ్రతం". ఈ వ్రతం భక్తీ , ఆరాధన  మార్గాలే కాదు ప్రేమ మార్గాన్ని చూపుతుందట. ఈ పదహారవ తేది నుండి ధనుర్మాసం ప్రారంభం  కానుంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి  ముప్పయి రోజుల  కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని    భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని  ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా  రచించి గానం చేసిన " తిరుప్పావై" పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత  .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.

చిన్నప్పుడు తెలీదు కాని ఈ కథంతా తెలుసుకొన్న తర్వాత మా అమ్మమ్మ ను నేను ఆట పట్టిచ్చేవాని. గోదా దేవి ప్రేమకోరకు, ప్రియుడి తలుస్తూ రోజు పాటలు ,  విరహగీతాలు పాడుకుంటే , మీరెందుకే పెళ్ళయిన వాళ్ళు ఇవి   చదవడం అని సరదాగా ఆట పట్టిచ్చేవాన్ని. రోజు ఉదయమే స్నానం చేయగానే రెడీ గా ఉండే "పొంగలి" . మళ్ళీ  కొంత శర్కర , నేయి కలిపి ముద్దగా చేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.అల తినడం ఓ ఇష్టం.ఇప్పుడంటే కోల్లెస్త్రాల్ భయం కాబట్టి కాస్త తగ్గించి కట్టే  పొంగలి తినటం లెండి. పెద్దవయసయినా కూడా మా అమ్మమ్మ ఇప్పటికీ రోజూ శ్రద్దగా తెల్లవారు ఝమునె లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని పాశురాలు చదువుతుంటుంది. ఆ పాశురాలు వినడం , ఆ పొంగలి తినడం ,అందుకే నాకు ఈ ధనుర్మాసం అంటే ఇష్టం. 

Tuesday, December 14, 2010

సియస్త ...మధ్యహ్న నిద్ర

.
సియస్త ..అంటే మధ్యాహ్న నిద్రకి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకొన్న పేరట. నాకూ ఇప్పుడే తెల్సింది. అర్థం చూస్తె "a midday or afternoon rest or nap, esp. as taken in Spain అండ్ Latin America. అని ఉంది.  " After lunch sleep a while" అన్నది ఆంగ్ల ఆర్యోక్తి అట. భలేగుంది. ఈ మధ్యాహ్న నిద్ర పోవటానికి  ఎంత అదృష్టం ఉండాలి. అయినా ఈ ఆఫీస్ లకి వెళ్ళే  వాళ్ళకి ఎక్కడ కుదుర్తుంది, అది అందని ద్రాక్షేగా. ఆఫీస్ లో ఎంచక్కా నిద్ర పోవచ్చుగా అంటారా, మా బాసు నేను నిద్ర పోను మిమ్మల్ని నిద్ద్రపోనివ్వను అని చంద్రబాబు నాయుడు టైపు లెండి. కాబట్టి అంత అదృష్టం లేదు. రాత్రి నిద్రే సరిగ్గా పట్టదు,   ఇక మధ్యాహ్న నిద్ర సంగతి దేవుడెరుగు.   ఇదేమి  జబ్బు  అనుకునేరు అదేమీ  లేదు లెండి.  

ఇక ఇంట్లో ఆడవాళ్లకేం  మీరు హాప్పీ గా , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , భర్త ఆఫీస్ కి వెళ్ళాక సంతోషంగా, ఆనందంగా తలుపులేసుకొని ఎంచక్కా నిద్రా దేవత ని ఆహ్వానించి అందమయిన కలలు కంటూ మధ్యాహ్న నిద్ర లోకి  జారుకుని ఆ అలౌకిక ఆనందాన్ని ఆ సుఖాన్ని ఎంచక్కా అనుభవిస్తారు , దేనికయినా పెట్టి పుట్టాలి , ఎంతైనా  మీ ఆడాళ్ళు అదృష్ట వంతులు , మీకు ఏమి పని అని మా ఆవిడతో అంటే కోపంగా ఓ కథ తీసి నా మున్దేసింది.  అది చదివాక నా అభిప్రాయం గోదాట్లో కలిసిపోయింది. ఆ కథ పేరు "సియస్త"  రాసింది సౌమ్య నిట్టల గారు. వచ్చింది ఈనాడు లో.ఈ కథ చదివాక హమ్మో ఆడాళ్ళ మద్యాహ్న నిద్రకి ఇన్ని కష్టాల, మనం ఎంత వీజీ గా ఊహించుకున్నాం. మా బావగారున్నారు, ఎంత అదృష్టవంతులండి. కాస్తంత కునికే అవకాశం దొరికితే చాలు, అది కుర్చీ అయిన, మంచం అయినా, రాత్రయినా, పగలయినా, బస్సు అయిన, రయిలు అయినా, చివరికి నీళ్ళల్లో అయిన సరే అయిదు నిమిషాలు దొరికితే చాలు గురక పెట్టేస్తారు. మనమేమో ఆయనతో మాట్లాడుతున్నాం అని  అనుకుని మాట్లదేస్తుంటాం , ఆయనేమో ఓ పక్క గురక పెట్టేస్తుంటారు.  నీళ్ళల్లో నిద్ర ఎంట అనుకుంటున్నారా, ఆయనకీ  జల స్తంబన విద్య తెలుసు. అదేంటంటే ఎంచక్కా ఎ ఆధారం లేకుండా నీళ్ళ మీద తేలి ఆడడం.  అంతే అనుకున్నార అలాగే నీళ్ళ మీద గుర్రు పెట్టి నిద్ర పోతాడు.  నేను  చూసేదాకా నమ్మలే. కళ్లారా చూసా. ఎక్కడో ఆ ఫోటోలు ఉండాలి సమయానికి అవి దొరకలేదు. లేకపోతె మీకూ చూపించేవాన్ని. ఈ సుత్తంతా ఏంటి అస్సలు ఆ కథేంటి అని అనుకుంటున్నారా, సరే కథలోకి వెళదామా మరి. 

 కథలోకి వెళ్తే  ఈ కథ లో ఆవిడకి పేరు లేదు, కాబట్టి మన సౌలభ్యం కొరకు కాస్సేపు ఆవిడ అని అనుకుందాం. ఆవిడకి  చిన్నప్పటి నుంచి  మధ్యాహ్న నిద్ర పోవాలనే ఒక బలమైన  కోరిక. ఎ వయసులోనూ అది తీరదు. చిన్నప్పటినుంచి చివరికి కోడలు వచ్చినా కూడా ఆ కోరిక అలాగే ఉంటుంది. "రాత్రి నిద్ర యాంత్రికం, బడి గంట కొట్టినట్టు పదవ్వగానే టి.వి. కట్టేసి లైటార్పేసి అదేదో డ్యూటీ లాగ పడుకుండి  పోతం కాని మద్యాహ్నం నిద్ర అలౌకికం. ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి భావుకత్వం కావాలి. ఎక్కాల  పుస్తకానికి, పద్య కావ్యానికి ఉన్నంత తేడ ఉంది రెండింటికి. నాకు భావుకత అయితే ఉంది కాని ఆ సుఖాన్ని అనుభవించే అదృష్టం మాత్రం లేదు, ఇది నిరాశావాదం కాదు యధార్ద  వాదం అంటుంది ఆవిడ". చిన్నప్పుడు ఆటల సంబరంలో పడి వాళ్ళ నానమ్మ పడుకోబెడితే ,  పడుకోక ఆ తర్వాత జీవితాంతం విచారించని రోజు లేదంటుంది. తర్వాత స్కూల్లో మద్యాహ్న నిద్ర ని స్కూల్ కి ఎదురు ఫీజు ఇచ్చి మరీ రాసిచ్చేశారట. కాలేజి  బస్సులో ఫ్రెండ్స్ నవ్వుతారేమోనని, మెళ్ళో బంగారు గొలుసు ఒకటి భయంతో  పడుకోనివ్వలేదని అంటుంది. పెళ్ళయ్యాక అత్తగారు  " పగటిపూట నిద్ర మేమేరుగమమ్మా, ఇంట్లో ఇల్లాలు చలాకీగా బొంగరంలా తిరుగుతూ ఆపనీ ఈ పనీ చూసుకోవాలి తప్పితే ఇలా బద్దకంగా పండి నిద్ర పోకూడదు" అని ఫత్వా జారీ చేసిందట. ఇంకే ఎన్నో కలలు కన్న  ఆ మద్యాహ్న నిద్ర అలా హుష్ కాకి.

 ఆ తర్వాత వేరే వూరు ట్రాన్స్ఫర్ అయ్యిందని ఇంటికి తనే మహా రాణి , అత్తగారు లేదు అనేవాళ్ళు ఎవ్వరు  లేరు ఎంచక్కా నిద్ర పోవచ్చు అనుకుందే కాని అక్కడే మొదలయ్యాయి ఆమె కస్టాలు. సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, పాత చీరలకు స్టీల్ సామాన్లు అమ్మే ఆడవాళ్ళు, పక్కింటివాళ్ళు, కొరియర్ వారియర్లు,... అడ్రస్ వెతుక్కుంటూ పొరపాటున ఇంటి తలుపు తట్టేవాళ్ళు,  ఆడబిడ్డల ఫోన్లు  చివరికి ఏదో మర్చి పోయాను  అని వాళ్ళ ఆయన ఫోన్లు ఇలా నిద్రా భంగానికి ఇంద్రుడు పంపిన అప్సరసలు ద్యుతీలేసుకున్నాట్లు  నా కంటి మీద కునుకు లేకుండా చేశారు అని వాపోతుంది ఆ ఇల్లాలు. ఇవే అనుకునేరు ఆమె పాలిట నిద్ర పోకుండా చేసినవి, మద్యాహ్న దొంగతనాలు, ఎక్కడో టి,వి లో చూసిన జ్ఞ్యాపకంతో , మద్యాహ్నం నిద్ర పొతే లావేక్కుతారని తెలిసిన  నిజాలు నిద్రకు దూరం చేశాయట ఆమెని.

 ఇలా కాదని ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంటే, పట్టుకొన్న కొన్ని లిప్తల్లోనే అక్షరాలూ మసకై పోవడం, పై వరసలో ఉన్న అక్షరాలూ కింది వరసలో కలిసిపోవడం, కళ్ళు అక్షరాల వెంబడించినా భావం అర్థం కాకపోవడం, ఆఖరికి పుస్తకం చెయ్యి జారి పోవడం వంటి పరిణామాలు సంబవిన్చాయత  .  పోనీ లోపలికెళ్ళి పడుకుందామ అంటే  ఊభ కాయం మరియు చోర భయం.  చివరికి కొడుకుతో సినిమా కెళ్ళి  ఎ.సి. హాల్లో కునుకు తీయొచ్చు అనుకుంటే అది మాయ బజార్ సినిమా. నిద్ర సంగతి దేవుడెరుగు, కను రెప్పలార్పితే ఒట్టు అంటుంది. ఇలా చివరికి కోడలు వచ్చిన తరవాత పడుకుందామంటే , అత్తయ్య మీకు మనవడో, మనవరాలో పుట్టపోతుంది అంటూ ఆమెను ఇలా నిద్ర పోకుండా చేసిన కస్టాలు నవ్వు పుట్టిస్తాయి. టి.వి కయిన స్లీప్ మోడ్ ఉంటుంది నాకు అంత అదృష్టం  లేదే, నేను యంత్రం కంటే అద్వాన్నమ  అని వాపోతుంది. 

కథ ఆసాంతం సరదా, ఆసక్తి గా సాగింది. ఎంత సరదాగా ఉన్న అంతర్లీనంగా ఒక స్త్రీ పడే ఆవేదన ఓ మూల హృదయాన్ని  కలిచి వేస్తుంది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకొనే  వరకు శరీరం పడే శ్రమ, నిద్ర, విశ్రాంతి కి కరువై ఎంత ఆవేదన పడతారు అన్నది ఈ కథ లో స్పష్టంగా కనపడుతుంది. ఈ కథ చదువు తుంటే ఇదే కథాంశం తో ఈ మధ్యే చదివిన  రెండు కథలు గుర్తుకు రాక మానవు.  ఒకటేమో అబ్బూరి ఛాయా దేవి గారి సుఖాంతం అనే కథ. ఈ కథ లో ఆ ఇల్లాలు అడిగేది మణులు మాణిక్యాలు కాదు , కంటి నిండా కాసింత నిద్ర. ఆ నిద్ర కూడా పోయే తీరిక లేక పాపం ఆ ఇల్లాలు, నిద్ర మాత్రలన్ని మింగి భర్త కు చీటీ లో  ‘ఏమండీ... ఆత్మహత్య చేసుకున్నానని భయపడకండి. నిజంగా నిద్ర కోసం నిద్రపోతున్నానంతే’ అని రాసి పెట్టి శాశ్వత నిద్రలోకి జారిపోతుంది. ఇక రెండో కథ సత్యవతి గారి "సూపర్ మాం సిండ్రోం "  మంచి తల్లిగా ఆమె సక్సెస్స్ అయినా దాని వెనక ఆమె పడిన వేదన, కష్టం ,  ఆ కష్టాన్ని మర్చిపోవటందుకు, ఆమె అనుక్షణం జీవితాంతం వాడిన టాబ్లెట్లు.  చివరికి  ఆమె శరీరం ఒక టాబ్లెట్ గా మారెంతగా .  చదువుతుంటే  కళ్ళు చెమర్చక మానవు.  ఇదీ  చదివాక మనలో ఉన్న అపోహలు తొలిగితే సంతోషమే. ఇదండీ సంగతి. ఎలా ఉందొ మీరూ  చెప్పాలి. 

Thursday, December 9, 2010

మాయా దుప్పట్లు ...నా పాట్లు

పాత పుస్తకాలు పోస్ట్ రాసాక నా మనసు  ఏమి తోచక ఇంట్లో ఉన్న మాయ దుప్పట్ల మీదికి మళ్ళింది.  అవేనండి పాత పుస్తకాలు.  అలా ఒక్క సారి పైనున్నవి తీసి దుమ్మంతా దులుపుతుంటే నా కస్టాలు ఏమని  చెప్పను. చదవండి. 

ఇలా ఓపెన్ చేశానో లేదో   ఓ పక్క నుంచి " గురుజాడ " గారు ఏవయ్య నీకిది న్యాయమా ఇంత పెద్ద మనిషిని నన్నిలా పైకెక్కించి ఉంచడం నీకు తగునా అని నన్ను గుక్క తిప్పుకోకుండా వాయిస్తూ ఇలా కాదు గాని నన్నిలా చేసినందుకు నేను రాసినట్లు పొగ తాగని వాడు కాదోయ్ నన్నిలా దుమ్ము పాల్జేసిన నువ్వు దున్నపోతై పుట్టున్ అంటుంటే లోపల్నించి "ఏమివాయి, మై డియర్ భాను, ముఖం వేల వేసినావ్?" అంటూ మెల్లగా సిగార్స్ కి నా చేతిలో కొంచెం డబ్బు ఉంచవోయ్ ఆ ముసలాయన్ని నేను చూసుకున్టాలేవోయ్  అని గిరీశం అంటే  సరే అని గిరీశం చేతిలో ఇంత చమురు వదిలించుకొని ,   హమ్మయ్య బ్రతుకుజీవుడా అనుకుంటుంటే , మరో పక్క నుంచి కుటుంబ రావు గారు అదేనండి మన కొడవటిగంటి కుటుంబ రావు గారు నీకేమైనా బుద్దుందా, అస్సలు మమ్మల్ని ఇలాగేనా ఉంచేది, మా కిచ్చే గౌరవం ఇదేనా ఎన్నో సంవత్చారాలుగా తెలుగు సాహిత్యా ప్రపంచానికి దిగ్గజాన్ని, అబ్యుదయ సాహిత్యానికి ఇన్స్పిరేషన్ ని, ఆదునిక వచన వికాసానికి పట్టుగొమ్మను, కథానికా రచయితలకు మార్గదర్శకున్ని,  నాకిచ్చే మర్యాద ఇదేనా, గౌరవం ఇంతేనా అంటూ చడా మడా ముఖం మీద తిట్టేస్తుంటే బిక్క మొగమేసుకొని ఎం చెయ్యాలో అర్థం కాక అలానే దిక్కులు చూస్తూ , నాకు నేనే దైర్యం చెప్పుకొని " అయ్యా క్షమించండి"  అంటూ ఓ తువ్వాలు తో వారి మీదున్నదుమ్మంతా దులిపేసి ఓ ప్రక్క కూర్చుండబెట్టి క్షమించమని అడిగేయగానే పాపం పెద్ద మనిషి సరేలేవోవ్ ఇప్పటికైనా  జాగ్రత అని అంటూండగానే  మూల నుంచి పెద్ద ముండా వాణ్ని నన్ను పట్టించుకోవా  అంటూ విశ్వనాథ గారు ఏకవీర లోనుంచి కేకేశారు , మెల్లగా వారిని ఓ చెయ్యి ఆసరాగా ఇచ్చి  బయటికి తీసుక వచ్చి ఓ పక్క కూర్చుండబెట్ట.

బండారు సదాశివ గారు మెల్లగా బయటకు వస్తూ స్వాతంత్రం రాకముందు అంటే జైళ్లకు పోయాం. ఇప్పుడెం ఖర్మయ్యా బాబూ! ఏదో మీ జిల్లా వాణ్ని కనీసం ఆ ఇంగితం కూడా లేకపోతె ఏలనయ్య నన్నిలా జైల్లో ఉంచినట్టు ఉంచావు అంటూ ఆయనా బయటికి వచ్చేసారు. ఆయన వెనకే ఎవరో శోభన్ బాబు లాగున్నాడు అని ఈ సాహిత్యం వాళ్ళతో ఈయన ఎప్పుడు జత కలిసాడా అనుకుంటూ సరిగ్గా చూస్తె శోభన్ బాబు కాదు , ఆయన అంపశయ్య నవీన్ గారు నిజం చెప్పాలి అప్పుడు ఎంత అందంగా ఉన్నాడు అచ్చు శోభన్ బాబు లానే ఉన్నాడు.  నేనూ మీ జిల్లా వాణ్ని ఏవయ్య ఆ లోపల ఉంటె " అబ్బబ్బ ఏమిటో ఆలోచనలు, ఎడతెగని ఆలోచనలు , ఇక ఆలోచించను  i am tired of this habbit , చలో ఏక్  భార్  ఫిర్ సే అజనబీ బంజాయ్ హం దోనో, ఇదేమిటి ఈ పాట  ఇలా రింగ్ ఔతుంది, హంటింగ్ సాంగ్ అంటే ఇదేనేమో అంటూ,నవీన్  ఒక్కసారి ఊపిరి పీల్చుకొని "యెంత హాయి ఈ రేయి యెంత మధురమీ హాయి" అంటూ నన్ను వదిలేసి  పాడుకుంటూ అయన వెళ్ళిపోయారు. హమ్మయ్య అనుకునే లోగా ఎదురుగా ఓ కుర్చీలో  టీవిగా  కూర్చొని జాషువా గారు "నాడు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు" అంటూ  (గబ్బిలం) బయట పడ్డారు. 

ఇక లాభం లేదండి. వీళ్ళ తిట్లు బరించే  ఓపిక లేదు. అని మెల్లగా జారుకున్దామనుకున్దామని ఎందుకైనా మంచిదని ఓ సారి ఇంకెవరున్నారని లోపలికి  తొంగి చూసా. తెలుగు వాళ్ళు అయిపోయినట్టున్నారు, ఇంగ్లీష్ వాళ్ళంతా ఇదేమీ  పట్టనట్టు ఓ రౌండ్ టేబుల్ సమావేశం లో ఉన్నారు. ఎవరబ్బా అని పరికించి చూస్తె అమ్మో మహా మహులు , అబ్రాహం లింకన్, ఆకియో మొరిటా, ఆర్థర్ హెలీ,  ఎమిల్ జోలా అందరూ సీరియస్ గా చర్చించుకుంటున్నారు. ఆ పక్కనే టాగూరు రాగ యుక్తంగా గీతాంజలి పాడుకుంటున్నారు. .  ఇప్పుడు వీళ్ళని కదిలిస్తే ఇంకేమన్నా ఉందా .  ఆ దైర్యం చెయ్యలేక మెల్లగా తప్పుకున్దామని అనుకుంటుంటే   లోపల్నించి మెల్లగా "ఈ ఎద లోని బాధ లేటులేమని చెప్పెద సన్నజాజి పూ రేకులు చెప్ప నేర్చునటే మెల్లన కాల్చు నిశాత సూర్య కీ లానల తప్తమై వదిలి వాడి దొరంగును గాక ఎప్పుడో నేనును గూడ నంతియ పరీమళ లేశమునే మిగుల్పకున్ " అంటూ రాగ యుక్తంగా వినపడుతూ ఆ గొంతు నాకు దగ్గరవుతుంటే గుర్తుపట్టా అమ్మో మన బాల గంగాధర్ తిలక్ గారు చాలా అందంగా , ఆర్ద్రంగా పాడుకుంటూ  బయటికి వచ్చారు  మనసెక్కడికో పోయింది.  అయన గోరువంకలు నన్నేమీ అనకుండా " నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమయిన ఆడ పిల్లలంటూ" ఆయన ఆ అందమయిన ఆడ పిల్లల వెంబడి  వెళ్లి పోయాడు.  నేనూ  తెరపిన పడ్డ మనస్సు తో  తిలక్ గీతం

నువ్వు లేవు నీ పాట ఉంది; ఇంటి ముందు
జూకా  మల్లె తీగల్లో  అల్లుకొని
లాంతరు  సన్నని వెలుతురులో క్రమ్ముకొని
నా గుండెల్లో చుట్టుకొని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో
దాక్కొని నీరవంగా నిజంగా ఉంది
జాలిగా హాయిగా వినపడుతూ ఉంది....
అలా వినపడుతుంటే హాయిగా నిద్ర పోయా. ఇదండీ నా మాయ దుప్పట్ల అనుభవం. మీకెలా ఉందొ చెప్పండి మరి.

Wednesday, December 8, 2010

Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం..సాహిత్యం....ఆకాశవాణి ప్రసారం...అంపశయ్య నవీన్ తో చర్చ

 సామాజిక, ఆర్ధిక , రాజకీయ జీవిత మూలాలలోకి వెళ్లి బడుగు జీవుల వ్యధలను అక్షర బద్దం చేసిన అరుదయిన రచయిత Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం మరియు సాహిత్యం అనే ఈ చర్చ కార్యక్రం  వరంగల్ ఆకాశవాణి ప్రసారం.  ఈ చర్చ లో పాల్గొన్న వారు డా.శ్రీ అంపశయ్య నవీన్ గారు మరియ శ్రీ మెట్టు రవీందర్ గారు. అనుసంధానం వీరాచారి గారు. క్రింద ఈ కార్యక్రమం   వినండి.

Sunday, December 5, 2010

పాత పుస్తకాలు



ఈ వారం ఆంద్ర జ్యోతి  ఆదివారం అనుబందం లో చదివిన మరియ నాకు నచ్చిన కవిత." పాత పుస్తకాలూ కొత్త వెల్తురూ"  ఇది దర్బషయనం  శ్రీనివాసాచార్య గారు రాసారు.  ఎన్నో సార్లు ఫుట్ పాత్ లపై పాత పుస్తకాలు అమ్మేవాల్లను చూస్తుంటాం.  కాని ఇంత మంచి భావాలు,   చదువుతుంటే  "  ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలివచ్చాయో గాని ఇల్లు పక్కనే ఇల్లు ఉన్నట్లు...అంటూ  ఇంకా ప్రేమతో బహుమానంగా ఇచ్చిన పుస్తకాలు కూడా రోడ్డెక్కడం గురించి రాస్తూ " ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయింది " ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేది తో సహా- తడై   పోయాను- బహుమానాలు సైతం ఇలా బజార్న పడినందుకు. అంటుంటే హృదయం  తడై పోతుంది. పాత పాత అంటుంది బాహ్య స్వరూపాన్ని చూసే సుమా అంటాడు. నిజమే లోపల కావ్యాలూ, కథలూ  , సాహిత్యం ఇంకా ఎన్నెన్నో దాచుకున్న పుస్తకాలకు పాతదనమేక్కడిది చదివినప్పుడల్లా కొత్త దనమే  .ఫుట్పాత్ లపై పుస్తకాలు చూసినప్పుడల్లా  మనసు అటు లాగుతుంది. మన పాదాలు  అప్రయత్నంగా అటు అడుగులేస్తాయి.  చేతులు ఆప్యాయంగా వాటిని తడుముతూ,  ఆ పుస్తకాల్లోనించి వచ్చే ఆ పాత వాసనలు ఆస్వాదిస్తూ,  ఏదో మనకు ఇష్టమయిన   వాళ్ళను కలిసిన స్పర్శించిన   అనుభూతి . మనం కొన్న కొనకపోయినా ఒకసారి చూడడం. అయినా కొనకుంటా ఉంటామా చెప్పండి. ఎక్కడో మనకు ఇష్టమయిన  రచయిత పుస్తకమో, లేకపోతె ఎక్కడ మనకు దొరకని ఓ పాత పుస్తకం మన కళ్ళ కెదురుగా కనపడుతుంటే మనసు ఊరుకుంటుందా. అది మనచేతుల్లోకి మన స్వంతం అయిపోదూ!    మీరు చదవండి ఈ కవిత ( ఆంద్ర జ్యోతి సౌజన్యం తో)

ప్రతీ ఆదివారం అతను బరువు బరువుగా వొచ్చి
ఈ గరుకైన రాతి ఫుట్పాత్ ను
మెత్తనైన పాత పుస్తకాలతో అలంకరిస్తాడు
అమ్మకానికి అనువైన అరమరికలో

ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలి వచ్చాయో గాని
ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఇల్లు వున్నట్లు
ఇక్కడ పుస్తకం పక్కన పుస్తకం - ఇలా సిలసిల!

గడిచిన కాలపు దాఖలాగా దుమ్మొకింత పట్టి
పుస్తకాలు కొంచెం దుబ్బపట్టి మసకబారి మాసినట్లున్నాయి
అతను వస్త్రంతో ఒద్దికగా తుడుస్తూ దులుపుతున్నాడు
పాతదనం సాంతంగా  పోతూందని కాదు గానీ
ఇంకా ఇంకా పాతగా కనపదోద్దని అంతే!

పాతవే గానీ అన్నీ ఒకేలా పాతబడలేదు
మరీ మరీ పాతవి, కొంచెం పాతవీ, ఇటీవలి పాతవీ....
పాతా పాతా అంటున్నది బాహ్య స్వరూపాన్ని చేసే సుమా!

కళ్ళముందు ఎన్నెన్ని శాస్త్రాలు ఎన్నెన్ని భాశ్యాలూ
ఎన్నెన్ని కల్పనలూ కావ్యాలూ అంతరంగాలూ
ఎందరెందరి లోకంటి చూపుల ఊహల లిఖిత ముద్రలివి
ఎట్లా అంచనా వేసేది వీటిని, ఇట్లా పైపైనే చూస్తూ....

ఆ పుస్తకంలోకీ ఈ పుస్తంలోకీ తొంగి చూస్తుంటే...
ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయ్యింది
"ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేదీ తో సహా-
తడై పోయాను - బహుమానాలు సైతం ఇలా
బజార్న పడినందుకు  - ఆప్యాయతలెక్కడ?
కొన్ని కాగితపు నోట్లూ, మరికొన్ని కృతజ్ఞతలూ ఇచ్చి
ఆ పుస్తకాన్ని కొనుక్కున్నా, సంతకపు తడితో సహా.....

ఇక్కడ చేరిన వాళ్ళంతా కొంటారని కాదు కానీ
అక్షరాగారాల చుట్టూ ఇందరు కొలువుతీరడం
అక్షరాలా అపురూపం కదా
ఒకడి బతుకు తెరువు ఎందరికో నేత్రోత్చవం!

ఇక పొద్దు వాలిపోతుండగా మెల్లగా అతను
పుస్తకాల్ని పాత పెట్టెల్లోకి సర్దడం మొదలెడతాడు
సర్దుతూ సర్దుతూ లెక్కలేసుకుంటూ చూసుకుంటూ
పొద్దటి  బరువు ఎంత తగ్గిందని అనుకున్టాదనుకుంటాను

అతనూ పుస్తకాల వెల్తురూ వెళ్ళిపోయాక
ఖాళీ అయిన ఫుట్పాత్
ఇప్పుడు నిజానికి తెరుచుకున్నట్లా
ఒంటరి చీకట్లో ముసుకున్నట్లా

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం-సాహిత్యం


ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం...సాహిత్యం చర్చా కార్యక్రమం ...ఆకాశవాణి ప్రసారం  ఇక్కడ వినండి.


Friday, December 3, 2010

తెలంగాణా సాయుధ పోరాటం (౩)

Thursday, December 2, 2010

తెలంగాణా సాయుధ పోరాటం (2 )





Wednesday, December 1, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ....టంగుటూరి సూర్య కుమారి


మా తల్లికి మల్లె పూదండ అనగానే  మనకు గుర్తుకు వచ్చేది టంగుటూరి సూర్యకుమారి.ఈ పాటకి ఆవిడ ప్రాణం పోశారు.  ఆ అద్బుతమయిన గళం లో శంకరంబాడి సుందరాచార్య  రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ మీరూ ఆస్వాదించండి .


    Get this widget |     Track details  | eSnips Social DNA    

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి  || మా|| 

గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి  ||మా||

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
 రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం  నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ !  జై తెలుగు తల్లీ ! 



తెలంగాణా సాయుధ పోరాటం (1 )




Monday, November 29, 2010

సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది



శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు ఆంధ్రప్రభ లో తమ " స్వీయ జీవన కథాకథనం" లో సూర్య రాయంధ్ర నిఘంటువు గురించి మరియి మరికొన్ని  ఆసక్తికరమయిన విషయాలు తెలియ జేశారు. వారి మాటల్లో

" నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని దర్శించేవాన్ని. ఆయన గొప్ప పండితుడు. సాదు శీలి. అమలాపురంలో కొంత కాలం హైస్కూల్ లో పని చేసి తర్వాత కాకినాడ లో కూడా ఉన్నత పాటశాల లో పనిచేశారు. కాకినాడ లో స్తిర పడ్డారు  రామారావు పేట లో ఉండేది ఇల్లు. కొంత కాలం ఆంద్ర సాహిత్య పరిషత్తు నిఘంటువు కార్యస్తానంలో పనిచేశారు. ఆ నిఘంటువు " సుర్యరాయాంద్ర నిఘంటువు". ఇది పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది. అయినా ఈ నిఘంటువు లో ఆధునిక తెలుగుభాషా స్వరూపం ఏ కొంచెము లేదు. వ్యవహారిక పదాలు అంటే నేడు వాడుకలో ఉన్నవి ఏ అయిదు శాతమో చెరాయేమో!. అర్థాలు చాలా వినోదం కలిగిస్తాయి.ఆ మహాపండితులను ఆక్షేపించడం  నిజానికి చాలా అపచారమే. అయితే వాళ్ళ సాహిత్య లోకం వేరు. సంప్రదాయ సాహిత్యం. సంస్కృతాంధ్రాల పరిపూర్ణ అధ్యయనం , లక్ష్యలక్షణ గ్రంధాల పట్ల అభినివేశం   వారి పరమ ప్రామాణిక నిష్ఠకు కొలబద్దలు. 20 వ శతాబ్దపు తెలుగు అభివ్యక్తితో వారికి పనిలేదు. కాబట్టి ఆమోదము అంటే పరిమళ మనీ, ఆయాసం అంటే ఇనుము సంబందమయినదనీ అర్థాలు మాత్రమె ఇస్తారు. కాని నేటి వాడుక అర్థాలు ఇవ్వరు. వాళ్లకు శతకాలు కూడా గుర్తుండవు.

 ఒక ఆసక్తికరమయిన ఉదంతం చెప్పారు వెంపరాల వారు. తాము నిఘంటు కార్యస్తానంలో పని చేస్తున్నప్పటిది. ఒకరోజు తాము ఊరి నుండి వస్తూ రైల్వే స్టేషన్ పక్కనే కదా ఆంద్ర సాహిత్య పరిషత్తు ఉన్నది, దారే కదా అని నిఘంటు కార్యస్తానం లోకి తొంగి చూశారుట.  మళ్ళీ ఇంటికి వెళ్లి  స్నాన సంధ్యానుస్తానాలు తీర్చుకొని రావడానికి ఎట్లానూ ఆలస్యమవుతుంది కదా అని. అప్పుడు చాలా పెద్ద పండితులక్కడ    "ఎద్దు" అనే ప్రయోగానికి ఆకారం కోసం అంటే ఆధారం కోసం చర్చిస్తున్నారట. బహు వచన ప్రయోగం కూడా అన్వేషిస్తున్నారట. అప్పుడు శాస్త్రి గారు సద్యః స్ఫురణంగా  ' వడి గల ఎద్దుల కట్టుక, మడి దున్నక బతకవచ్చు మహిలో సుమతీ' అనే ప్రయోగం గుర్తు చేశారట. అప్పుడా మహా పండితులంతా శాస్త్రి గారిని మెచ్చు కొన్నారుట. మా సమయం వృధా కాకుండా రక్షించావు అన్నారుట. శాస్త్రి గారు ఇక అప్పుడు ఇంటికి వెళ్లారు. ఎద్దును గూర్చి ఎన్నో నుడి కారాలున్నాయి.  సామెతలున్నాయి. అయినా అవి వాళ్లకు గుర్తు రావు. ' ఎద్దనవలె, మొద్దనవలె,గద్దనవలె కుందారపు  కవి చౌడప్ప' అని వాళ్లకు గుర్తు రాదు. కవి చౌడప్ప శతకం వాళ్లకు ప్రమాణం కాదు కాబట్టి ' ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి' అనే సామెత వాళ్లకు జ్ఞాపకం రాదు.

 ఇంకో చాలా ఆసక్తి కరమయిన సన్నివేశం చెప్పారు శాస్త్రి గారు. ఖండవల్లి నరసింహ శాస్త్రి గారని తమ  గురువు గారు చాలా గొప్ప వారు. ఇందుపల్లి లో ఆయన దగ్గర చదువుకుంటుండగా ఊళ్ళో  అప్పుడే కవిత్వ మల్లడం నేర్చుకుంటున్న ఒక భట్టుకవి గురువుగారి దగ్గరకు ఒక సమస్య తీసుకొని వచ్చారుట. ఒక ప్రయోగం అర్థం చెప్పల్సిందని అర్తిన్చాడుట.  ఏమిట్రా ప్రయోగం? ' ఔరగాకేయూర సహిత హతమౌరజితా ' అని. గురువుగారూ , ఆయన దగ్గర చదువుకొంటున్న తనవంటి శిష్యులూ తెల్లబోయారట.ఎవరికీ అర్థం తోచలేదు. 'మౌరజితా ' అనే పదం దగ్గరే అసలు చిక్కు 'హతమౌరజితా' ఏమిటని తలలు పట్టుకున్నారట. తరవాత చాలా కాలానికి ఆ సమస్య విడవదిందని చెప్పారు శాస్త్రి గారు. అది పరమ శివుడికి సంబందించిన సంబోదన అని మొదటి వర్ణన పదాల వల్ల తెలుస్తున్నది . ఉరగకేయూరుడు-పాములే దండ కడియాలు - భుజాలకు అలంకారాలు - ఇక రెండో వర్ణన ఏమిటంటే మురజిత్ అంటే  విష్ణు మూర్తి కదా . (మురారి) (నారీ నారీ నడుమ మురారీ...) మురజిత్ అంటే  విష్ణుమూర్తి  తద్దితాపత్యం - ఆయన కొడుకు మౌరజిత్ - అంటే మన్మథుడు -అంటే పరమశివుడు.- మన్మతున్ని హతం చేశాడు కదా! ఇది శివస్తుతి. మౌరజిత్ - శివుడు - ఓ శివహత మౌరజితా! అని సంబోదన వినడానికి చాలా ఆసక్తి కరంగా ఉంది. 

( ఆంద్ర భూమి ఆదివారం అనుబందం సౌజన్యంతో )

Tuesday, November 23, 2010

కవితా కాదంబిని.....దాశరథి రంగాచార్య


దాశరథి రంగాచార్య ...ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తరాల అంతరాలకు అతీతంగా అయిదు దశాబ్దాలుగా తెలుగువారు వారి రచనలను అభిమానిస్తున్నారు , ఆదరిస్తూనే ఉన్నారు. చరిత్ర లో తొలిసారిగా నాలుగు వేద సంహితాలను వచనంలో అందించిన ఆద్యుడు.  వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భారత, భాగవతాలను తేట తెనుగున అందించిన రచన శిల్పి. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని  తెలంగాణా జన జీవన స్పందనలను నవలలుగా మలిచిన విప్లవ శిల్పి. దాశరథి వచనమే కాదు కవిత్వం కూడా రాసారు. మా అన్నయ్య దాశరథి క్రుష్ణమాచార్ర్యులకు కవిత వదిలి నేను వచనం చేపట్టాను అని అంటారు దాశరథి. అట్ల అన్న దాశరథి, వచనంలో వయ్యారాలు పలికించి నానని, ఉద్యమాలు రగిల్చినానని చెప్పి ఎందుకో నా మనసు కవిత కుహూ అనమన్నది. అందుకే కవిత రాసానంటాడు." మా అమ్మ చదువుల  రాణి /చనుబాలు నాముఖాన పితుకుతుంది/  ఎంత అందమయిన భావన. దాశరథి రాసిన ఈ కవితా కాదంబిని లో మానస కవిత పేరిట దాశరథి మానస సరోవరంలో విరిసిన  163 అందమయిన కమలాలు, 1962 -63 లో జన-రంగం పేరిట రాసిన శతకం. అలాగే 63 -64    లో రచించిన ఉర్దూ కవితలు "ఉర్దూ మదిర" పేరుతొ ఇందులో చేర్చారు. ఇవే కాకుండా భారత సూక్తం ఇంతకూ ముందు ఆంద్ర ప్రభలో వచ్చిన దానిని కూడా ఇందులో చేర్చారు. 

ఈ కవిత లన్ని మనసులోనించి దూకి వచ్చినవి కాబట్టి  వీటికి " మానస కవిత" అని పేరు పెట్టానంటారు. ఆసుపత్రి లో ఉండి రాసిన కవితలే ఇవి. ఆ తర్వాత రాయమని అడిగితె " కవిత కురియలేదు నేను రాయలేదు" అని అంటారు. ఇది కవితా కాదంబిని  - మబ్బుల వరస - మేఘమాలను మీకు అందిస్తున్నాను. జల్లు కురిపించుకోవడం మీ పని అంటారు.  మరి ఆ మేఘ  మాల నుంచి జాలు వారిన  జల్లులు ,  చదువుతుంటే నా మదిని హత్తుక పోయిన   ఎన్నో కవితలు. అందులో నించి కొన్ని కవితా జల్లులు చూడండి. 

స్వామి పాదాల సవ్వడి విన్నాను/వెదకు చున్నాను/వెర్రివాన్ని/అది నా ఎడద సవ్వడియని ఎరగకున్నాను/ 
విశ్వాసం ఉంటె శిల శివుడవుతాడు/  విశ్వాసం లోపిస్తే శివుడు శిల అవుతాడు/
కవిత ఒక వారథి/ఒక సారథి/అది సాగరాలు దాటుతుంది/మనసులను మొలిపిస్తుంది మురిపిస్తుంది/
నరుడు శ్వాస మీదనే జీవించటం లేదు/ విశ్వాసపు  శ్వాస మీద జీవిస్తున్నాడు /విశ్వాసం మీద జీవిస్తున్నాడు/
మనసుకు ఎ కులాలు లేవు/ కులాలన్నీ మనుషులకే/ మాయలకే మనసుకు కులాలు లేవు/
ఆకాశంలో మల్లెల మాల ఏమిటి/అది కొంగల దండ ఆకాశంలో/
అందనిదే అందం / అందితే ఏమున్నది శూన్యం/
జీవితం ఒక విహంగం/ఏదో కొమ్మ మీద వాలుతుంది/కిచకిచ మంటుంది/తుర్రుమంటుంది జీవిత విహంగం/
ఆమె కురులు విరియ బోసింది/కారు మబ్బులు కమ్ముకున్నాయి/ఆమె చూపు విసిరింది/ కమలాలు  వికసించాయి /ఆమె కురులు మబ్బులు/
అద్దం మలినమవుతే ముఖం కనిపించదు/మనసు మలినం అవుతే తాను కనిపించడు/లోకం కనిపించదు/
నెలలు నిండనిది  బిడ్డ రాదు/గుండె నిండనిది కవిత రాదు/


ఇలా ఎన్నో కవితా జల్లులు. కొన్ని ఆ భగవంతుని తో సంభాషణ,  ఓ బాధ్యతతో , ఓ బాధతో , ఓ వేదనతో భగవంతునికి నివేదించిన వినతిపత్రం, అంతే కాదు కొంత భావుకత్వం, ఒక చోట అంటాడు. " కష్టపడితే కవిత రాదు/ గుండె నిండాలే/పొంగి పొరలాలే/ కవిత జలపాతం అవుతుంది/కవితా జలపాతం పొర్లుతుంది" నిజమే దాశరథి గుండె నిండి పొంగి పొరలిన అందమయిన కవితా జలపాతం. ఆస్వాదించండి. ఆ కవితా జల్లుల్లో తడిసి ముద్దయి ఆ ఆనందాన్ని మీరు అనుభవించండి. ఆంద్ర ప్రభ  సంపాదకులు శ్రీ వల్లూరి రాఘవ రావు మాటల్లో" సాహిత్యమనే తూరుపు వేదిక పై కవిత్వమనే వేకువ నర్తకి చేసిన చైతన్యపు శ్రీకారం హృదయ రవళి ఓంకారం దాశరథి మానస కవిత్వం