బాలాంత్రపు రజనీకాంతరావు, గారిచే ఆంద్ర భూమి లో ప్రచురితమయిన వ్యాసం రేడియో ప్రియులకోరకు :
భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సంవత్సరం 1947 (ఆగస్టు 15)- అది జరిగి ఈనాటికి సుమారు యాభై, అరవై యేళ్ళకు పైబడింది. కడిచిన పదేళ్ళలో మన శాస్ర్తియ సంగీతాన్ని ప్రజలకు సన్నిహితం చేయడానికి ప్రభుత్వం ఆకాశవాణి, దూరదర్శన్ విభాగాలను రెండింటినీ సమైక్యంచేసి, ‘ప్రసారభారతి’ సంస్థగా రూపొందించి రాజధానియైన ఢిల్లీలోను, వివిధ రాష్ట్రాలలోని ప్రధాన కేంద్రాలలోను సంస్థకి విస్తృత వ్యాప్తి కలుగజేస్తూ, క్రియాత్మకంగా పనులు జరిపించే ఏర్పాట్లు ఎక్కువగా జరిగాయి.
రాష్ట్ర రాజధాని ప్రధాన కేంద్రం అయిన హైదరాబాదూ, విజయవాడా, విశాఖపట్టణాల ద్వారా ఎఫ్.ఎం కేంద్రాలు నెలకొల్పి ప్రసారాలు కానిస్తున్నారు. వీటిని రెయిన్‌బో కేంద్రాలూ, లేక ఇంద్రధనుష్ కేంద్రాలుగా పేర్కొన్నారు.
ఆదిలాబాద్ కేంద్రం ఎ.ఎం. ప్రసారమూ, కొత్తగూడెంలో ఎఫ్.ఎం ప్రసారం, అనంతపూర్, కర్నూల్, తిరుపతి, వరంగల్, నిజామాబాద్, మార్కాపురం కేంద్రాలలో సి.ఎం ప్రసారాలూ వెలువడుతున్నాయి.
ఢిల్లీ, హైదరాబాదులో ఆర్చైవ్స్ తయారుచేసి,సరఫరా చెయ్యడానికి ఢిల్లీలోని ట్రాన్స్కిప్షన్ అండ్ ప్రోగ్రాం ఎక్స్ఛేంజ్ సర్వీస్ ద్వారా ఢిల్లీలో 60 ఆల్బమ్‌లూ, రికార్డింగ్‌లూ విడుదల చేసి, కావలసిన శ్రోతలకు సరసమైన ధరలకు అందుబాటు అయ్యే ఏర్పాట్లు జరిగాయి.
శ్రోతలకు కుతూహలమూ, కోరికా పుట్టించే సీడీలు- బేగం అఖ్తర్, మల్లికార్జున్ మన్సూర్, బిస్మిల్లాఖాన్ (షహ్నారుూ), హరిప్రసాద్ చౌరాసియా (వేణువూ), సూఫియానా కలాం (కవ్వాలీ), కర్ణాటక సంగీత పంచరత్నకృతులూ, మణి కృష్ణస్వామి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, ఎం.డి.రామనాథన్, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, వోలేటి వెంకటేశ్వర్లు శాస్ర్తియ కచేరీ సంగీతమూ, ద్వారం వారి వయొలిన్, మైసూర్ టి.చౌడయ్య, ఎం.ఎల్.వసంత కుమారీ, అరియకుడి రామానుజయ్యంగార్ తెలుగు, కన్నడ, తమిళ మళయాళ భాషలలో లలిత సంగీతము సి.డిలూ, ఎస్.జానకి పాటలూ, జేసుదాసు పాటలూ, స్వాతి తిరునాళ్ రచనలూ, కాళింగరావు అనే కన్నడ లలిత సంగీత కళాకారుని సి.డిలూ, పురందరదాసు కృతులూ, మదురై మణి అయ్యర్ శాస్ర్తియ సంగీత కచ్చేరీ సి.డిలూ, పాల్ఘాట్ కె.వి.నారాయణస్వామి, వోలేటి వెంకటేశ్వర్లూ, నేదునూరి, శ్రీపాద పినాకపాణిగార్ల సిడీలూ, రజని లలితగేయాలూ, అన్నమాచార్యుల కీర్తనల ఆల్బమ్ సి.డిలూ వీటన్నిటినీ ప్రసారభారతి హైదరాబాదు ఆర్చైవ్స్ కేంద్రం ద్వారా విడుదల చేశారు.
ఈ శతాబ్దపు తొలి దశాబ్దాలలో దక్షిణ భాషా ప్రాంతాల సమైక్య సాంస్కృతిక కేంద్రమయిన మద్రాసుకు వెళ్ళి కచ్చేరీలు చేసి మెప్పు పొందిన గాయకులకే దేశం అంతటా గౌరవం లభించేది.
ఆంధ్ర జిల్లాలలోని విజయనగరం, బొబ్బిలీ, పిఠాపురం వంటి జమీందారీలు ఆస్థాన సంగీత విద్వాంసులను పోషించీ, వారి కచ్చేరీలు ఏర్పాటు చేసీ, సన్మానించడం జరుగుతూండేది. ఈ బాధ్యతలను తరువాత తరువాత జిల్లాలోని సాంస్కృతిక కేంద్రాలలోని రసికులైన సంగీత సభల నిర్వాహకులు తమ చేతులలోకి తీసుకున్నారు.
ఆయా జిల్లా కేంద్రాలలో సంగీత సభలు ఏర్పాటు అవుతూ వుండేవి. అటువంటి సభా నిర్వాహకులలో కాకినాడ సరస్వతీ గానసభ 1960లో స్వర్ణ ఉత్సవం జరుపుకొంది.
పురందరదాసుకంటే ఏభై ఏళ్లు ముందరివాడయిన తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తలను 1940లో తిరుపతి దేవస్థానం సంకీర్తన భాండాగారంలో వేటూరి ప్రభాకరశాస్ర్తీగారి శిష్యులు కనుగొన్నారు. వీటిలో అన్నమాచార్యులవీ, ఆయన కుమారుడైన పెదతిరుమలాచార్యులవీ, అల్లుడయిన రేవణూరి వారి రచనలూ, మనుమడైన తిరువెంగళనాధుడూ మొదలగువారి రచనలను కనుగొన్నారు.
మద్రాసు కాక, అదనంగా విజయవాడ రేడియో కేంద్రం- 1948లో పూర్తిగా తెలుగు భాషా ప్రసారాలకై ఏర్పడింది. 1953లో ఆంధ్ర రాష్టమ్రూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా హైదరాబాద్‌లో రేడియో కేంద్రమూ ఏర్పడ్డాయి. ఆ వెంటనే, కడప, విశాఖపట్టణ రేడియో కేంద్రాలు నెలకొన్నాయి.
ప్రతి సంపూర్ణ స్వతంత్ర రేడియో కేంద్రమూ వారం వారమూ ఒక సంగీత కచేరీ, వారం వారమూ ఒకసారి ఒక ప్రాంతీయ కళాకారుణ్ణి, మిగిలిన దక్షిణాత్య కేంద్రాలన్నింటికీ వినిపించే సంగీత సభా, అన్ని రాష్ట్రాలకీ వినిపించే కచేరీలు ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో శాస్ర్తియ సంగీతం ప్రసారం అయ్యే సౌకర్యాలకు అభివృద్ధి కలిగింది.
విద్యార్థులకూ విద్యార్థినులకూ సంగీత నృత్యాలను నేర్పే పాఠశాలలూ కళాశాలలూ ఎక్కువయ్యాయి. విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడ వంటి పట్టణాలలో సమర్థులైన విద్వాంసులు గురువులుగా కొనసాగే గురుకుల కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ కేంద్రాలనుంచి అయిదారేళ్లకు గాయక విద్వాంసులు నేర్పరులుగా సుశిక్షితులుగా వెలువడుతూండేవారు. విశ్వవిద్యాలయాలలో కళాశాలల్లో పట్ట పరీక్షలకూ, ఉన్నత పరీక్షలకూ సంగీతం ముఖ్యవిషయంగా స్వీకరించిన విద్వాంసులు తయారవుతూ వచ్చారు.
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలోను మారుమూల గ్రామాలలోను త్యాగరాజ గానసభలు ఏర్పాటుచేసి, ప్రతిఏటా, గణపతి నవరాత్రులూ దసరా నవరాత్రులూ రామనవమి సప్తాహాలూ జరిపించి, మదరాసు, బెంగుళూరు, తిరువేండ్రం వంటి దక్షిణాది కేంద్రాల నుంచి గాయక విద్వాంసులను ఆహ్వానించి, సంగీత సభలు ఏర్పాటుచేసి, వారిచేత కచేరీలు జరిపించేవారు.
అటువంటి విద్వాంసులలో ప్రసిద్ధుడు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి. సంగీతంలో తనకు తానే ఒక సంస్థ అనదగిన గౌరవాదరాలకు పాత్రుడయిన విద్వత్శిరోమణి. ఘనులైన మన విద్వాంసులకు నలుగురైదుగురికి స్వయం గురువూ!
దక్షిణాది- అంటే మద్రాసులో పేరుకెక్కిన నల్గురైదుగురు విద్వాంసుల- బాణీలను ఆ విద్వాంసులకంటె ఆదర్శప్రాయముగా తన బాణీగా మద్రాసులోని విద్వాంసులే విని, మెచ్చుకొనేలాగ పాడగల విద్వత్తాయకవౌళి పినాకపాణిగారు. కీర్తిశేషులు వోలేటి, శ్రీరంగం గోపాలరత్నం గార్లకు, మిగిలిన సజీవ గాయకులలో నేదునూరి, నూకల వంటి మన ప్రథమ శ్రేణికి చెందిన గాయక విద్వాంసులకు ఆ శ్రేణికి వారు చెందేటట్లు చేయగలిగిన శిక్షణాదక్షుడు పాణీగారు.
రాగం, కృతీ, నెరవలూ స్వరమూ పాడడంలో రాగ రూప ప్రదర్శనలో ఇతరులకు ఎవ్వరికీ దొరకని సంకేతాలనూ ప్రదర్శించగల సామర్థ్యం ఆయన గాత్రధర్మంలో నిభృతమై ఉంది. పాణీగారి బాణీకి కర్ణాటక శైలీ స్వచ్ఛతను పాటించే అనుంగు శిష్యుడు నేదునూరి కృష్ణమూర్తిది పుష్టికరమైన పురుషగాత్రం! అభిమాన శ్రోతలకు ఆదర్శపాత్రుడైన నేదునూరి- సభా సంప్రదాయాలను ఎరిగిన సమర్థ విద్వాంసులలో అత్యంత విజయశీలి! కడచిన 20, 30 ఏళ్ళలో అతడు విజయనగరం, సికింద్రాబాదు, తిరుపతి, విజయవాడ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయపు గౌరవ ఆచార్యుడుగా పనిచేసి రిటైర్ అయిన ఘనాపాఠి!
కీర్తిశేషుడయిన వోలేటి వెంకటేశ్వర్లు ప్రపంచంలోని ఏ దేశపు సంగీతమైనా రాగమైనా ఒక్కసారి వింటే చాలు. ఆ రాగాల స్వరస్థానాలను పట్టుకొని, ఆ రాగాల బాణీని సొంత బాణీయా అనిపించేలాగ పాడగలిగేవాడు. అలా పాడగలగడం చాలా అరుదూ అపురూపమూ! బడేగులాం ఆలీఖాన్, గజల్సు పాడే గులాం ఆలీ, నజాకత్ అలీ, సలామత్ అలీ వంటి వివిధ దేశాల ప్రప్రథమ శ్రేణి గాయకులు ఎటువంటి శైలిలో పాడినా ఆ బాణీని, సొంతంగా చేసుకొని పాడగలిగేవాడు. ఏ దేశపు ఉత్తమ గాయకులయినా ఏ క్లిష్టమైన శైలిలో పాడినా, ఆ పద్ధతులన్నిటినీ సొంతం చేసుకుని స్వంత శైలి ఏర్పరచుకున్నాడాయన. మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ -ద్వారం, మంగళంపల్లి పట్ట్భారామయ్య వంటి గురువుల ప్రభావంతో తన వ్యక్తిత్వం విశిష్టంగా కనబడేలా పాడగల చతురుడు! మహామహోపాధ్యాయుడని ఊరికే అన్నారా? కచ్చేరీ గాయకుడికి కావలసిన శ్రోతలను ఆకర్షించే విన్యాసాలకు అవసరమైన గాత్ర సంపదా అన్నీ సిద్ధించిన కొద్దిమందిలో ఒకడు. గతించిన 30 ఏళ్ళలో, సికిందరాబాద్, విజయవాడ, హైదరాబాద్ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్‌గా సేవ చేసి, 1994లో తిరుపతి సంగీత కళాశాలలో తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఆచార్య పదవీ నిర్వహించారు.
నాగస్వర విద్వాంసుడయిన కీర్తిశేషులు పైడిస్వామి శిష్యుడుగా రాటుదేలిన కీ.శే. ఎమ్.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ రాజమండ్రిలోను, ఆ తర్వాత తిరుపతిలోను గంభీరమూ గౌడమూ అనిపించుకున్న ధ్రుతకాలపు బిరకాలను తన గాత్రంలో అప్రయత్న సౌలభ్యంతో పలికించగలిగేవాడు.
బాలప్రాయంలోనే ప్రథమశ్రేణి గాయక విద్వాంసుడిగా సంగీత సభా ప్రఖ్యాతీ, పండిత ప్రశస్తీ పెద్దల ముద్దూ సంపాదించి, అపురూప గాన యోగిగా విఖ్యాతిపొంది, మధ్యవయస్సు దాటుతూంటే సర్వకళా సంపూర్ణత్వమూ సాంప్రదాయిక జ్ఞానంలో విద్వత్కళా ప్రదర్శనలో అధ్యాపకత్వంలో వాగ్గేయకారత్వంలో కొరతలేవీ లేని గురుపీఠంగా నిలదొక్కుకున్నవాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. వేర్వేరు ఆకాశవాణి నిలయాలలో సంగీత ప్రయోక్తగా పనిచేసి, లలిత శాస్ర్తియ రేడియో నాటక సంగీతాలను పెంచి, పోషించి, విజయవాడలో సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పదవి నిర్వహించి, తరువాత మదరాసులో తన పేరనే మురళీరవళి అని వెలయించిన సంస్థకు నిర్వాహకుడయి, నాద మాధురీ సమ్మోహకుడుగా, సభారంజక కళారహస్యాలను ఎరుకగలిగి ప్రయోగించగలిగిన వేత్తగా ఒకనాడు సమ్యక్ సంప్రదాయజ్ఞుడుగాను, మరోనాడు సొంత వాగ్గేయ రచనలను స్వయంగా కనుక్కొని పెంపు వహింపజేసిన నూతన రాగాలతో దేశీయ శ్రోతలను దాదాపు నాలుగు స్థాయిలను అశ్రమంగా ఆడుతూ పాడుతూ పలికించగల సంగీత కళానిధిగా గౌరవ బిరుదం సంపాదించి మద్రాసు మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షత 80లలోనే నిర్వహించగలిగిన మేధాశాలి బాలమురళీకృష్ణ!
ఆకాశవాణి సంగీత నాటకాలలోను, కూచిపూడి యక్షగానాలలోను ప్రఖ్యాతి పొందిన గానవాల్లభ్యంతో విజయవాడ ఆకాశవాణిలోను, తదుపరి కుమారి శ్రీరంగం గోపాలరత్నం సికింద్రాబాదు, హైదరాబాదు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ నిర్వహణ చేసి, పేరు ప్రఖ్యాతులు పొంది, అకాల మరణం పాలయినా, శక్తిమంతమైన ఘంటలాగా నినదించే కంఠారావంతో ప్రదర్శన చాతురీ క్రియాత్మకతా సాహసికతా విశదమయే గాన చాతుర్యం గోపాలరత్నానిది! ఆమె అకాల మృతి తీర్చలేని లోటు సంగీత పిపాసువులకు!
లలిత హరిప్రియలూ, జోగులాంబా, శిష్టా వసుంధరా, అరుంధతీ సర్కార్, ఇందిరా కామేశ్వర్రావు తమ తమ సంగీత సభలలో నానాటికీ పేరుకెక్కుతున్నారు. రేవతీ రత్నస్వామి తన తండ్రి చిత్తూరి పేరు మరింత నిలబెడుతోది. జయలక్ష్మీ సంతానం, మణికృష్ణస్వామి, టి.టి. సీత, వింజమూరి లక్ష్మి శ్రోత్ర హృదయాలలో స్థిరముద్ర వేసుకుంటున్నారు.
తమ లలిత ప్రదర్శనా చాతుర్యాలవల్ల పాకాల సావిత్రి, వి.బి.కనకదుర్గ, వేదవతీ ప్రభాకరరావు, జొన్నలగడ్డ శారద, కోవెల శాంత తమ సీనియారిటీని నిలబెట్టుకుంటున్నారు. కచ్చేరీలను, సంగీత నాటకాలను చక్కగా నిర్వహించుకుంటూ పేరు చేసుకుంటున్న శిష్టా శారద అకాల మరణం విజయవాడ శ్రోతలకు తీర్చలేని లోటు.
మన సంగీత వాద్యాలన్నింటిలోను తనకు విశిష్ట స్థానం సంపాదించుకున్నది వీణ! వీణను మీటుతున్న వైనం పైకి తెలియకుండా సంతతనాదాన్ని పలికించడంలో తుమరాడ సంగన్న శాస్ర్తీగారి వారసత్వంలో ఈమని శంకర శాస్ర్తీ, చల్లపల్లి చిట్టిబాబు, వాసా సంప్రదాయానికి చెందిన వైణిక విద్వాంసులూ మన దేశంలోను ప్రపంచ దేశాలలోను వీణకీ, తమ పిఠాపురపు సంప్రదాయానికీ చాలా ఘనతను చేకూర్చారు.
వాసా కృష్ణమూర్తి, కంభంపాటి అక్కాబీరావు, అయ్యగారి సోమేశ్వరరావు, మంచాళ జగన్నాధరావు, వి.ఎల్.జానకీరాం కొడుకు లక్ష్మీ నారాయణ, పుదుక్కోట కృష్ణమూర్తి, రిటైరైన విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యగారి శ్యాంసుందర్, అతడి భార్య జయలక్ష్మీ, పప్పు సోమేశ్వర్రావుగారి కొడుకు చంద్రశేఖరూ అంతా వీణా గౌరవాన్ని నిలబెట్టి వ్యాపింపజేసిన వారే.
లాల్గుడి జయరామన్, పరూర్ సోదరులు అనంతరామన్, గోపాలకృష్ణలూ, చాతుర్య సామర్థ్య ప్రదర్శనలలో వారిని మరపించగల అన్నవరపు రామస్వామీ, ద్వారం వెంకటస్వామిగారి ఔరసపుత్రుడయి, కచేరీ చెయ్యబోతూ దివంగతుడైన ద్వారం సత్యనారాయణ, ద్వారం గురు సంప్రదాయానికి ఘనతని ఇతోధికం చేస్తున్న నరసింగరావు గారి సంతానమైన మనోరమ, దుర్గాప్రసాదరావు, సత్యనారాయణరావు, ఆ సంప్రదాయానికి చెందిన పుల్లెల పేరి సోమయాజులు, నేతి శ్రీరామశర్మ, పేరి శ్రీరామమూర్తీ, ప్రోటిపల్లి ప్రకాశరావూ, ఆకెళ్ల మల్లికార్జున శర్మా ఇంకా నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారింట్లో మూడు తరాల గాత్ర గాయకులూ, వయొలిన్ వాదకులూ బుచ్చయచార్యులు, ఎన్.సి.కౌశిక్, కృష్ణమాచార్య ప్రణవ్, తమిళనాటి కలైమామణి బిరుదాన్ని సంపాదించిన కన్యాకుమారి- చెప్పుకోదగ్గ వయొలిన్ వాదకులు.
ఎన్.సి.శ్రీనివాసన్, కణ్ణన్, మాలీ బదులు- ఆంధ్ర శ్రోత్ర లోకాన్ని తమ వేణువుతో ఆనందింపచేస్తూండినవారు.
ఆకాశవాణి వాద్యగోష్ఠి నిర్దేశకులలో చివరితరం వాడయిన ప్రపంచం సీతారాం, వేణువు వాయించే హిందుస్థానీ చౌరాసియా కంటె ఒక్కాకు ఎక్కువ చదివినవాడుగా పాంచ్‌రాసియా అని నా చేత పొగడ్త పొందాడు.
కోలంక వెంకటరాజు తర్వాత ఆంధ్రదేశంలో మృదంగ విద్వాంసులుగా గణనీయుడిగా పేరుకెక్కిన వాడు దండమూడి రామమోహనరావూ, సుమతీ రామమోహనరావూ, మహదేవు రాధాకృష్ణరాజూ, పాల్ఘట్ మణి సంప్రదాయ విస్తారకుడయిన వి.కమలాకర్‌రావు, మృదంగానికి సోలో కచేరీ ఖ్యాతి చేకూర్చిపెట్టిన విశ్వవిద్యాలయ మాన్యుడు, శాఖాధిపతిగా గౌరవం పొందిన డీన్ యెల్లా వెంకటేశ్వరరావు, మృదంగ లయ వాదక కుటుంబానికి చెందిన్నీ, తెలుగు వాఙ్మయంలో ఎం.ఏ పట్టాని సాధించి సంగీత సాహిత్య స్తన్యద్వయ పోషితుడైన భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రశంసాపాత్రుడు.
నాగస్వరం డోలు వాద్యాలకు ఘనతా గౌరవాలు చేకూర్చిన ఒంగోలు రంగయ్యా, దోమాడ చిట్టి అబ్బాయి, రంగయ్యకు చెల్లెలయిన హైమవతీ, ఆమె భర్త మారుటేరు వెంకటేశ్వర్లు హైదరాబాదు, తిరుపతి సభాసదులను తమ నాగస్వరం డోలు సంగీతంతో ఆనంద తరంగాలలో ఓలలాడించారు.
చెంబై వైద్యనాధయ్యర్‌కు శిష్యుడైన రుద్రరాజు సుబ్బరాజు గురుత్వంలో విఖ్యాతికి పాత్రుడయిన ప్రజ్ఞావంతుడు మాండోలిన్ వాదకుడు శ్రీనివాస్!
జంట విద్వాంసుల సంగీత సభలకు కారకులయి, ప్రఖ్యాతి పొందుతున్న కొందరు సోదర గాయకులు-
హైదరాబాద్ సోదరులు- శేషాచార్లు, రాఘవాచార్లూ, విజయవాడలో సీనియర్ మల్లాది సోదరులు మల్లాది సూరిబాబు, నారాయణ శాస్ర్తీ, మల్లాది జూనియర్ సోదరులు మల్లాది శ్రీరాంప్రసాదు, రవికుమార్ -వీళ్లు కర్ణాటక సంగీత కచ్చేరులకే కాక, యక్షగానాలలో పాత్రధారణకూ ప్రఖ్యాతివహిస్తున్నారు. యక్షగానాలలో నేపథ్యగానం చేయడంలో పేరుపడిన వారిలో మండాకృష్ణమోహన్, అమలాపురం కన్నారావులు, చిరంజీవి రామాచార్యులు- బాలగాయకులను తయారుచేసి ప్రదర్శనలు ఇప్పిస్తుంటాడు.
ఎస్.బి.పి.పట్ట్భారామారావుగారి సోదరుడయిన ఎస్.బి.పి.సత్యనారాయణగారు (కపిలేశ్వరపురం, తూ.గోదావరి) నిర్వహిస్తున్న హరికథ పాఠశాలలో తయారయి సంస్కృతంలో హరికథ చెప్పగల కథకురాలు, సంగీతమూ సంస్కృతమూ చక్కగా కలిపి వినిపించగల కథకురాలు కుమారి ఉమామహేశ్వరి!
ఆకాశవాణిలో లలిత సంగీత ప్రయోక్తలుగా పనిచేసి రిటైరైన వారు పాలగుమ్మి విశ్వనాథం, మాడభూషి చిత్తరంజన్.
ప్రస్తుతం కార్యకర్తలుగా ఆకాశవాణిలో పనిచేస్తున్నవారిలో మోదుమూడి సుధాకర్, లలిత సంగీత నిర్వహణ చేస్తున్న కళాకారిణి కౌతాప్రియంవద. రాజమండ్రిలో ఆంధ్ర దేశ సంస్థానాలూ సంగీత వాఙ్మయం అనే విషయంపైని డాక్టరేట్ పొందిన చల్లా విజయలక్ష్మి రాజమండ్రిలో అంతకుముందు నా (రజని) పర్యవేక్షణలో పరిశోధన చేసి ఎంఫిల్ పొందింది.
వీరంతా శాస్ర్తియ సంగీత సంప్రదాయ ప్రగతిని ముందంజ వేయించినవారే అని నిస్సంశయంగా చెప్పవచ్చు! *