Tuesday, August 31, 2010

నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్

    ఆంద్ర భూమిలో రతీంద్రనాథ్ టాగూర్( రవీంద్ర నాథ్ టాగోర్ గారి కుమారుడు) రాసిన నేనెరిగిన మా నాన్న కు, జానమద్ది హనుమచ్ఛాస్ర్తి గారి అనుసరణ .....నాకు నచ్చి,  చదవని వారి కోసం , మీ కోసం.......




రవీంద్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, అశేష శేముషీ ధురంధరుడుగు నాతడు కవి, తత్త్వవేత్త, దార్శనికుడు. అతడు ఆనంద రసామృతమూర్తి.
బాల్యములోనే పెల్లుబుకుచున్న తన పుత్రుని ప్రతిభా విశేషమునకు, మా తాతగారు మిక్కిలి మురిసిపోయేవారు. పుత్రులందరికంటే మా నాన్నగారిపై వారికి మిక్కిలి ప్రేమ. అందరికంటె యితనిపట్ల మిక్కిలి ఉదారముగ వుండేవారు. అన్ని వసతులుగల రెండు గదులను, మా నాన్నగారికి ప్రత్యేకించి ఇచ్చారు. మా నాన్నగారి కోసం ప్రత్యేకమైన ఒక భవమునే నిర్మింపజేశారు. అదియే ‘లాల్‌బారి’ అన్న పేరుతో ప్రసిద్ధమైనది. మా నాన్నగారికి ఒకేచోట వుండడమంటే విసుగు. నిత్య నూతనత నాకాంక్షించే ఆ కవి హృదయానికి పాత ప్రాసాదాలలో పొద్దుపుచ్చడమంటే పడేది కాదు. నాన్నగారికి బాగా వయసువచ్చేటప్పటికిగాని ప్రపంచం, వారి ప్రజ్ఞ్భావాలను గుర్తింపలేదు. వారు యువకులుగనున్నప్పుడే ప్రజానురాగాన్ని చూరగొనగల్గారు. అసమాన సౌందర్యరూపము, కమనీయమైన కంఠమాధుర్యము వారి ప్రజారంజకత్వమున పాలుపంచుకొన్నవి. ఒకమారు ప్రసిద్ధ నవలా రచయిత బంకించంద్ర చటర్జీ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ యొకదానిలో నాన్నగారు ఉపన్యసించారు. కిక్కిరిసిన ఆ సభాభవనము సుదీర్ఘమైన ఉపన్యాసమిచ్చేసరికి నాన్నగారి గొంతుక బొంగరుపోయింది. ఉపన్యాసానంతరం నాన్నగారినొక పాట పాడవలసిందిగా సభ్యులు కోరారు. తుదకు బంకింబాబుగారు పాడమని కోరేసరికి నాన్నగారు కాదనలేకపోయారు. మొదటే అలసినవారి ధ్వనిపేటిక దెబ్బతింది. విశ్రాంతికోసం సిమ్లా వెళ్ళారు. ఆ సుమధుర గాత్రము మాత్రం కరిగిపోయింది.
నాన్నగారికి మంచి వస్తమ్రులన్న మిక్కిలి యిష్టము. యువకులుగా వున్నపుడు పట్టులాల్చీ, ధోవతి, పట్టువుత్తరీయము ధరించేవారు. వదులుగా వూగులాడుతువుండే వంగీయ దుస్తులపై వారికి మిక్కిలి మోజు. వదులైన పట్టులాల్చీ ధరించి ఈతోత్తరీయము వేసుకొను తీరు, చూపరుల మనమోహకముగ వుండేవి. వారి వేషాలంకరణ ననుకరించేవారు. ప్రయాణము చేస్తున్నపుడు పంట్లాము, విలువైన కోటు, చిన్న కుళ్ళాయి ధరించేవారు. మా చిన్నాయనగారైన జ్యోతీంద్రనాథ్‌గారి ‘పిరాలీ పగ్రీ’ అనబడు తలపాగాకట్టు అందముగా ఉండేది.
యాభైయ్యోయేడు దాటిన తర్వాత జుబ్బాలు మెత్తని టోపీ ధరించేవారు. లేత ఆరంజి రంగు దుస్తులంటే వారికి ఇష్టము. వృద్ధాప్యములో వారిని చూచిన వారెవరూ, వారి లేత గులాబీ రంగు దుస్తులను మరచిపోయేవారు కారు.
ఈ సందర్భముననే మరొక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తేదలచాను. నాన్నగారు గాంధీజీ ఆప్తస్నేహితులు. బహిర్దృష్టికి వారిరువురిలో వ్యత్యాసము అపారము. కొల్లాయిగట్టిన గాంధీజీతో అందమైన దుస్తులు ధరించునట్టి మా నాన్నగారు సమావేశమైనపుడు, ఆ దృశ్యము విచిత్రముగ తోచెడిది. నాన్నగారు ధరించే దుస్తులు అతిమూల్యమైనవి కావు. సామాన్య వస్తువులను కూడా అత్యంత సుందరముగ వుంచుటలోను, అత్యమూల వస్తమ్రులను అతి నిరాడంబరముగా ప్రదర్శిచుటలోను వారి కళాకుశలత స్పష్టమయ్యేది. గాంధీజీ యొక్క కొల్లాయిగుడ్డ లక్షలాది భారత ప్రజల దారిద్య్ర ప్రతీకము. ఈ వ్యత్యాసములోనే వుంది వైశిష్ట్యమంతా. గాంధీజీ వుద్దేశించారో లేదో కాని వారి జీవితమే నిరాడంబరతకు ప్రతీకము. నాన్నగారికి అతినిరాడంబరమంటే అంతగా నచ్చేదికాదు. సదా కొరతతోనే కాలం వెళ్ళబుచ్చే రుూ దేశీయులకు నిరాడంబరం పొదుపరితనం ఒక ఆదర్శం అంటే అంత సమంజసము కాదేమోనని వారి అభిప్రాయము. దురదృష్టవశమున భావసంకీర్ణతకులోనై అసహ్యమైన దుస్తులు, వెగటు పుట్టించు అలవాట్లు; యివే మంచి సాంఘికాచారములుగా పాటించే రోజులు వచ్చినవి. ఈ మార్పు నాన్నగారి కళాహృదయాన్ని కంపింపజేసింది.
నాన్నగారు శాంతినికేతనమున సాగించిన విద్యావిషయిక పరిశోధనలలో గల కష్టనష్టాలను గుర్తించినవారు కొందరు మాత్రమే. శాంతినికేతనము ఒక విప్లవాత్మక విద్యా సంస్థయని గుర్తించుటకు కొన్ని యేళ్ళు పట్టినవి. పైపెచ్చు బ్రిటీష్ ప్రభుత్వము రహస్య పత్రముల ద్వారా పెద్ద ఉద్యోగులెవరూ తమ పిల్లలను ఈ విద్యాలయమునకు పంపకుండునట్లు తెలియజేసినది. లౌకికదృష్ట్యా అప్పటి స్థితిలో నాన్నగారు యిట్టి ప్రయత్నమునకు పూనుకొనడం ఉచితమైనదిగా నాకు తోచినది కాదు. కుష్టియాలో సాగించిన వ్యాపారమునకు పెద్ద నష్టము కల్గినది. పాఠశాల ప్రారంభించుటకుగాను వారు తమ స్వంత వస్తువులను, గ్రంథాలను ఎన్నిటినో అమ్మివేశారు. తల్లిగారి నగలను కూడా అమ్మివేశారు. తమ వివాహ కాలమున మిత్రులొకరు మైత్రీపురస్సరముగా సమర్పించిన బంగారు గడియారమును, గొలుసును కూడా అమ్మివేశారు. మా చిన్నతనములో రుూ గడియారమును మేమెంతో ముచ్చటగా చూచేవారము. మా నాన్నగారి నుండి ఆ గడియారమును కొన్నట్టి యువతీమణి, దానిని 1910లో నాకు పెళ్ళికానుకగా యిచ్చేసరికి విస్మయానంద భరితుణ్ణయ్యాను. నాటినుండి నా వంశ పారంపర్యముగా సంక్రమించిన వస్తువులలో ఆ బంగారు గడియారమును అతి ముఖ్యముగా పరిగణిస్తున్నాను.
విద్యాలయమున విద్యార్థుల సంఖ్య హెచ్చుకొలది వ్యయభారము పెరుగుచుండినది. నాన్నగారు తమ మిత్రులైన లోకేన్ పాలిట్‌గారి తండ్రిగారైన సర్ తారకనాథ్ పాలిట్‌గారినుండి అప్పుతీసుకొన్నారు. ఈ ఋణాన్ని సర్ తారక్‌నాథ్‌గారు జీవంతులుగా వున్నప్పట్లో తీర్చలేకపోయారు. సర్ తారక్‌గారు తమ సర్వసంపదలతో పాటు నాన్నగారినుండి రావలసిన అప్పు కూడా కలకత్తా విశ్వవిద్యాయునకే చెల్లవలసినదంటూ వీలునామా వ్రాసి పరమపదించారు. ఈ ఋణబాధ వారినెప్పుడూ ఒక కోశాన కోస్తూ వుండేది. విద్యాధిదేవత చిరునవ్వుతో సాక్షాత్కరిస్తూ వుండేది కాని భాగ్యాధిదేవత పెడముఖం పెట్టి పరుగెత్తిపోయేది. దౌర్భాగ్యముతోపాటు దురదృష్టం చేరి వారి ప్రగతిని నిరోధించుచుండేవి.
1916-17లో సాగించిన అమెరికా ఉపన్యాస సంచార యాత్ర అత్యంత దిగ్విజయంగా సాగింది. అప్పులన్నీ తీరి, తమ శాంతినికేతనం అతి విస్తృతమై వర్థిల్లేందుకు వలసిన పైకం సమకూరుతుందనీ, మరెక్కడా యాచింపనవసరంలేదనీ, అతి శ్రమకు గురియయ్యారు నాన్నగారు. కాని దురదృష్టం మరల దాపరించింది. వారి సంచార కార్యక్రమమును కొనసాగించుచున్న సంస్థచివరికి దివాలా తీసింది. లక్షలు వస్తాయని ఆశిస్తున్నందుకు బదులుగా, విల్లీసియర్సన్‌గారు ఎంతో కష్టసాధ్యముగా కొన్నివేల పైకం మాత్రం రాబట్టగల్గిరి. ఆ పైకం అంతా కలకత్తా విశ్వవిద్యాలయమునకు చెల్లించవలసిన బాకీకి చెల్లుకాబడినది. యూరప్‌లోని వివిధ దేశాలలో ప్రకటితమైన నాన్నగారి పుస్తకాలవల్ల ఎంతో డబ్బు రావలసి వుండినది. ఈ యశోవ్యాప్తి వారికి రావలసిన రాయల్టీ పైకము చాలా తగ్గిపోయినది. నాన్నగారు తరచు తమ విద్యాలయ నిర్వహణ కోసం యాచకుడై యాత్ర చేయవలసి వచ్చెడిది. 1920లో జరిపిన అమెరికా యాత్రలో నేనూ వారి వెంబడి వెళ్ళాను. శ్రీ మార్గెంథో మరియు శ్రీమతి విల్లర్డ్‌స్ట్రేట్ అను కోట్లాధీశ్వరుల నాయకత్వాన వాల్‌స్ట్రీట్‌లోని కోట్లాధీశ్వరులతో గొప్ప మొత్తాల చందా పట్టీ ప్రారంభమయింది. అప్పట్లో టర్కీ దేశమున అమెరికా రాయబారిగ వున్న శ్రీ మార్గంథో గొప్ప ధనికుడు. ఈ కార్యక్రమమును ప్రారంభించేందుకు ముందు వందపైచిలుకు లక్షాధీశులను తమ యింట విందుకు ఆహ్వానించారు. నాన్నగారు కొన్ని మిలియన్‌ల పైకం లభిస్తుందని ఆశించారు. కాని అమెరికా వదలివచ్చేటప్పటికి కొన్ని వేలు కూడా లభించినవి కావు. నాన్నగారు తీవ్ర నిరాశతో స్వదేశాన్ని చేరారు. న్యూయార్క్ నగర హోటలులో వున్న కొన్నివారాలు డబ్బుకోసం పడిన యాతన, వారి మనస్సుకెంతో కష్టం కలిగించింది. తమ మనోవ్యధనంతటినీ చార్లీ ఆండ్రూస్ గారికి వ్రాసిన లేఖలలో వెళ్లగ్రక్కారు. ఇది నాకు కూడా విచారకరంగా పరిణమించింది. హృదయ విదారకరమైన ఈ పరిణామానికి నేనే కారకుణ్ణి. నాన్నగారిని పర్యటనకు పురికొల్పింది నేనే కాబట్టి చాలా నొచ్చుకున్నాను. నాన్నగారిలాంటి సుకుమార హృదయుడు, కవిపుంగవుడు, కళాతపస్వి విశ్వభారతికై విరాళాలు సేకరించుటకు అవిశ్రాంతంగా తిరుగుటలోగల యాతనను విషాద స్థితిని గమనించిన గాంధీజీ చాలా విచారించారు. 1936లో నాన్నగారు తమ తమ విశ్వభారతి విద్యార్థుల బృందంతో ‘చిత్రాంగద’ నాటక ప్రదర్శన ద్వారా విరాళాల సేకరణ పూనుకున్నట్టు అప్పుడు ఢిల్లీలో వున్న గాంధీజీకి తెలిసింది. నాన్నగారు అప్పట్లో జ్వరపీడితులై వుండేవారు. నాన్నగారికి ఎంత పైకం లోటుగా వున్నది తెలుపవలసిదిగా గాంధీజీ మమ్ము కోరారు. ఢిల్లీ వదలి వచ్చేలోపుగా తాము సేకరించిన మొత్తమునంతటినీ సమర్పించి ఇంక ముందు యాచనార్ధము తిరగనని నాన్నగారివద్ద వాగ్దత్తం కావించుకొన్నారు.
మహాత్ముని ద్వారా అనాయాసముగా లభించిన ఆ విరాళము మాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాని నాన్నగారు మిక్కిలి వ్యధ చెందారు. వారి మనస్థితిని గ్రహించుటకు నాకు అట్టే కాలం పట్టలేదు. అప్పటి ఆర్ధిక మాంద్యంనుండి గట్టెక్కుటకు గాంధీ గారి విరాళమెంతో తోడ్పడినప్పటికీ తమ వాగ్దానం ఆ విరాళానికంటే అధికమైనదని వారి భావన. విరామమెరుగక సాగించుచున్న ఈ సంచార ప్రదర్శనా కార్యక్రమము ప్రయాస పూర్ణమైనప్పటికీ తమ విద్యార్థి బృందము ననుసరించుచు తమ రచనలు రూపముదాల్చి సంగీత, నాటక, నృత్యములో ప్రత్యక్షమైనప్పుడు వారనుభవించుచుండిన ఆత్మానందము అవర్ణనీయమని నాకు తెలియును.
నాన్నగారు ఆశావాదులు. హాస్యభరితమైన ప్రవన్న చిత్తము కలవారు. హాస్యగర్భిత ప్రవృత్తియే వారిని, జీవితాంతము వెంటాడుతూ వచ్చిన విషాద సంఘటనలను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని సమకూర్చినది. ఆర్ధిక దుస్థితి వారినెప్పుడు కుంగదీసేది కాదు. వారి నలుబది ఒకటవ ఏడుననే సంభవించిన నా మాతృవియోగమ వారి సృజనాత్మక కృషికి పెద్ద దెబ్బ. ఆమె గతించడంతో అయిదుగురు పిల్లలు పెంచు బాధ్యత నాన్నగారిపై పడింది. అప్పటికి నా యిరువురు చెల్లెళ్ల వివాహమై వుండినది. నా సోదరుడు సమీంద్రుడప్పటికి ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన సంతానముతోపాటు వందలాది శాంతినికేతన విద్యార్థులను పెంచుభారము కూడా వారే వహించుయుండిరి. విధి వారినెన్నో విషమ పరీక్షలకు గురి చేసింది. నా తాతగారు, వివాహితులైన నా చెల్లెళ్లు, నా ప్రియ సోదరుడు ఒకరి వెంట ఒకరు గతించారు. నాన్నగారు అతి వాత్సల్యంతో పెంచిన బలేంద్ర, నితీంద్రలను నా పెత్తండ్రి కొడుకులు మంచి వ్వనమలోనే అకాల మృత్యువుకు గురియగుట వారికి మిక్కిలి దుఃఖము కలిగించింది. వీటికితోడు శాంతి నికేతనము మీద తనకెంతో సైదోడు వాడోడుగమన్న సతీశ్‌రాయ్ మరియు మోహిత్ చంద్రసేనుల అకాల మరణమునకు పరితపించారు. తాను అమితంగా ప్రేమించి పెంచిన వారొకరి వెంబడి నొకరు తమ జీవిత యాత్ర సాగించి వెళ్లుతూ ఉండు వారు ప్రదర్శించిన మనోధైర్యము ప్రశంసనీయము. ఎంతటి అసాధ్య పరిస్థితులలోనైనను నిర్వికారముతో అచంచలుడై తన కృషిని కొనసాగించే స్థితప్రజ్ఞుడాయన. వారికి విశ్రాంతి కావలసినపుడు వారు రచించిన గేయాలకు స్వరరూపముల కల్పించెడివారు. చిత్రలేఖనము కూడా వారి విశ్రాంతి కాలసాధనము. మా ముత్తాతగారైన ప్రిన్స్ ద్వారకనాధ్ టాగూర్‌గారు 1814లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు వారి మేనల్లుడగు నవీన్‌బాబు వారి ఆంతరంగిక కార్యదర్శిగా వెళ్లి యుండిరట. తనమామగారు తరచుగా తమ కార్యక్రమమును మార్చుకొనుచు తనకెంతో విసుగు కలిగించేవారని తమ యింటికి వ్రాసిన జాబులలో పేర్కొనేవారు. నవీన్‌బాబుగారి రుూ ఆరోపణ టాగూర్ వంశీయులందరికీ వర్తిస్తుందనుకొంటాను. నాన్నగారుకూడా అమాంతంగా తమ కార్యక్రమమును ఆఖరు ఘడియలలో మార్చివేసేవారు. ఈ మార్పులను గురించి ముందుగా తన కోడలికి(నా భార్యకు) తెలియజేసేవారు. ఆకస్మికంగా కార్యక్రమమును తారుమారు చేసినప్పటికీ మేము ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్లము. మార్పు వారికి అభిలషణీయమ. సృజనాత్మకమైనది వారి శీలము అన్యాయాలను అక్రమాలను అవి సంఘంలో కానివ్వండి, సాహిత్య రంగంలో కానివ్వండి నిర్భయంగా ఎదిరించేవారు. అన్యాయాన్ని, వ్ఢ్యౌన్ని ఎదుర్కొనే విప్లవాత్మక శక్తికి తోడు నూతన సమస్య పరిష్కారానే్వషణకు కావలసిన కర్తవ్య దీక్షా దక్షుడాయన
అసాధారణమైన వారి మేధాశక్తి నాకచ్చరువు కలిగించేది. నిత్యనూతనోత్సాహంతో కొత్తపుంతలు తొక్కేది ఆయన అనన్య కల్పనాశక్తి. వారు తమ డెబ్బదవ యేట ప్రాసబద్ధమైన గీతికారచనలో గంభీర సంవేదన భావోద్వేగము నూతన పంథాతో వెలువడినది. అప్పట్లో రాసిన ఆయన కథానికలు కామప్రబోదకములని సాంప్రదాయ వాదులు అలజడి చేసారు. నాన్నగారు గతించుటకు కొన్ని రోజులు ముందు చెప్పి వ్రాయించిన గీతములు శైలిలోను, పోకడలోను నవ్యతను సమకూర్చుకొన్నవి. వారిననుకరింప యత్నించిన యువరచయితలు విఫలులయిరి. ఎంత శ్రమించి వ్రాసినప్పటికీ వారి జీవిత చిత్రణ మసంపూర్ణమే. ఆత్మ సంతోపనశీలమైన వారి రచనలే వారి జీవిత భాష్యాలు. మరే జీవిత చరిత్ర తెలియజేయని పనిని వారి రచనలు చాటగలవు. వారి గేయ కవితయే వారి జీవిత గాధ. ఆయన జీవితమే ఒక మహత్కావ్యమని చెప్పి ఇక మగిస్తాను

1 comments:

తృష్ణ said...

ఆ రోజు మీరు లింక్ ఇచ్చినప్పుడు చూసాను కానీ టపా ఓపెన్ అవ్వలేదు. అమ్ళ్ళి కుదరలేదు. ఇప్పుడే చూసాను. Thanks for the link.